చిరంజీవి కొత్త సినిమా
posted on Nov 15, 2012 @ 3:01PM
చిరంజీవికి ఈ మధ్య కాలం బాగా కలిసొస్తోంది. 2014 మెగా నామ సంవత్సరంలా కనిపిస్తోంది. ప్రజారాజ్యం పూర్తిగా మునిగిపోయే స్థితిలో, అయినవాళ్లు, దగ్గరివాళ్లు అనుకున్నవాళ్లంతా హ్యాండిచ్చి ఓటి పడవ మునకేస్తుందనుకున్న స్థితిలో చిరు తెలివిగా కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి సోనియా గ్యాంగ్ తో డీల్ కుదుర్చుకున్నారు.
అప్పట్లో చిరంజీవి తిరిగి సరిదిద్దుకోలేనంత ఘోర తప్పిదం చేశాడని ఊరూవాడా కోడై కూసింది. తన మానాన తనని ఉండనీయకుండా రాజకీయంగా మటాష్ అయిపోయాడంటూ అంతా కాకుల్లా పొడుచుకు తిన్నారు. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదనే సామెతని రుజువుచేస్తూ చిరంజీవి ఓపిగ్గా ఎదురుచూసి ఇప్పుడు సోనియా కోటలో పాగా వేశారు.
ప్రజారాజ్యం పార్టీని ముంచేసి కాంగ్రెస్ మహాసాగరంలో కేంద్రమంత్రిగా తేలిన చిరంజీవి భుజస్కంథాలమీద పార్టీ భారం అంతకంతకూ మోపవుతోందని గల్లీ లీడర్లనుంచి ఢిల్లీ పెద్దలదాకా అంతా నమ్ముతున్నారు. ఇప్పటికే ఆనం సోదరులు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాబోయే ముఖ్యమంత్రి అంటూ చిరంజీవికి బాజా కొట్టడం మొదలుపెట్టారు.
రాజకీయాల్లో పీకల్లోతు మునిగిపోయారు కాబట్టి చిరంజీవి ఇక సినిమాల జోలికెళ్లరంటూ ఏపీలో ఇండస్ట్రీ వర్గాలుకూడా గట్టిగానే మాట్లాడుకున్నాయ్. పరుచూరి బ్రదర్స్ రాసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా త్వరలోనే తెరకెక్కబోతోందన్న వార్తల్లో పసలేదని తేలిపోయింది. చిరు 150వ చిత్రాన్ని తనే డైరెక్ట్ చేస్తానంటూ పూరీ జగన్నాధ్ ఇచ్చిన ఆఫర్ నచ్చలేదో మరేదైనా కారణమో తెలీదు కానీ.. ఆ ప్రసక్తే కనుమరుగైపోయింది.
కష్టాలన్నీ తీరిపోయి హాయిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు చిరంజీవికి సినిమాలగురించి ఆలోచించే ఓపికా తీరికా దొరికాయన్నది అభిమానుల కొత్త ఆలోచన. చిరు సినిమా ఛరిష్మా పార్టీకికూడా బాగా ఉపయోగపడుతుందన్న భావనతోఉన్న కాంగ్రెస్ వర్గాలుకూడా 2014 ఎన్నికలకల్లా చిరంజీవితో కొత్త సినిమా చేయిస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. రమేష్ చంద్ర మహర్షి రాసిన అధినేత నవల ఆధారంగా కొత్త సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యిందన్న వార్తలు వినిపిస్తున్నాయ్.
చిరంజీవి 150వ చిత్రాన్ని అటు రాజకీయ పరంగానూ, ఇటు దూరమైన ఓ వర్గం అభిమానుల్ని తిరిగి ఆకట్టుకోవడానిగ్గానూ ఉపయోగించుకుంటే బాగుంటుందని మెగాస్టార్ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తన లేటెస్ట్ సినిమాలో జనంలోకి చొచ్చుకుపోయే పొలిటికల్ క్యారెక్టర్ ని చేయడం ద్వారా చాలా తేలిగ్గా 2014 ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకోవచ్చని చిరు భావిస్తున్నారని ప్రచారం కూడా సాగుతోంది. అప్పటికి కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధి చిరంజీవే అన్న ప్రచారం గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలంగా జరుగుతోంది.