కాంగ్రేసుకి అఖిలంతోనే సఖలం

 

దేశానికి సమర్ధమయిన పరిపాలన అందించని కాంగ్రేసు పార్టీని ఎంతయినా తప్పుపట్టవచ్చును కాని, మిగిలిన విషయాలలో దానికున్న నైపుణ్యాలని ఎవరు వేలెత్తి చూపలేరు. ఎంత పెద్ద కుంభకోణాలలో దొరికిపోయినా టీవిగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, ప్రజలని మభ్యపెట్టి మరిపించేయగలదు. అందుకు తగ్గట్టుగానే, ప్రజలూ కూడా ఎంత పెద్ద కుంభకోణమయినా ఇదివరకులాగ అంతగా పట్టించుకోవడం మానేసిన సంగతి గుర్తించిన కాంగ్రెస్ నిర్భయంగా తనపని తానూచేసుకుపోతోంది.

 

ఇక, విషయాని కొస్తే హటాత్తుగా తన అమ్ముల పొదిలోంచి ‘అఖిల పక్షం’ అనే సమ్మోహనాస్త్రాన్ని తీసి సమయోచితంగా సందించి తెలంగాణా యమ్పీలను తన దారికి తెచ్చుకోవడమే గాకుండా, తెలంగాణాలో తనకున్నకాస్త పరువునీ కొల్లగొడుతున్న చంద్రబాబు, వైయ్యసార్ పార్టీలను ఒకేసారి కంగు తినిపించగలిగింది. ఒక దెబ్బకి రెండు...కాదు...కాదు...మూడు పిట్టల్ని కూల్చేసింది. ఒకేఒక దెబ్బకి తన తెలంగాణా యమ్పీలను దారికి తెచ్చు కోవడమే గాక తే.దే.పా., వైయ్యసార్ పార్టీలకూ అగ్ని పరీక్ష పెట్టి ఆలోచించుకోవడానికి సమయం లేకుండా ఈ నెల 28నే అఖిల పక్షం అని ముహూర్తం కూడా పెట్టేసింది. తన చాణక్యనీతి ఎంత గొప్పదో ఈ దెబ్బతో అందరికీ తెలియజేసింది.

 

ఆదెబ్బకి మొదట విలవిలలాడుతున్నది తే.దే.పా. అని వేరే చెప్పనవసరం లేదు. ఇంత వరకు తన ‘రెండు కళ్ళ సిద్దాంతము’తో ఎలాగో మెల్లగా నెట్టుకొచ్చేస్తున్న తే.దే.పా.ఇప్పుడు తప్పని సరిగా తన మనసులో మాట చెప్పవలసిన పరిస్తితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా తెలంగాణాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఇంతవరకు రోజు అక్కడి ప్రజలతో తానూ తెలంగాణా వ్యతిరేఖిని కానని నొక్కి జెప్పుతూ, ఒక వేళ కాంగ్రేసు గాని తెలంగాణా ఇచ్చేమాటయితే తానూ అడ్డు చెప్పబోనని కూడా పదే పదే ప్రజలకి వాగ్దానం చేస్తూ వచ్చేడు. అంతే గాక, తానూ ఈ విషయమై కాంగ్రేసుకి లేఖ వ్రాసినప్పటికీ తన దగ్గిరనుండి ఇంత వరకు ఎటువంటి సమాధానం రాలేదని, తెలంగాణా పట్ల తనకున్న చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేక పోవడం వల్లే అలాగ సాగాదీస్తోందనీ తెలంగాణా ప్రజలకి సవివరంగా చెపుతూ తనదయిన పద్దతిలో ముందుకు సాగిపోతున్నప్పుడు, కాంగ్రెస్, తన హట్టాత్ ప్రకటనతో చంద్రబాబుని తెలంగాణాలో ఉండగానే అతని మాటలతోనే అతనిని బంధించింది.

 

తెలంగాణా విషయంలో కాంగ్రెస్ ఏమి చేస్తుందనేది అప్రస్తుతం. గాని ఆ విషయంలో చంద్రబాబు ఏమి చెప్పబోతున్నడనేదదే ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. ఒకవేళ తెలంగాణాకి వ్యతిరేఖంగా మాట్లాడితే, ఇప్పటికే తే.రా.సా., తల్లీ పిల్ల కాంగ్రేసులు ప్రచారం చేస్తున్న ‘చంద్రబాబు నమ్మ దాగిన వ్యక్తీ కాడు” అనే మాటలు నిజం చేసిన వాడవుతాడు. తద్వారా కేవలం తెలంగాణాలోనే గాకుండా, రాష్ట్రం మొత్తం ఆ సంగతి ప్రచారం చేసుకొనేందుకు తే.రా.సా., తల్లీ పిల్ల కాంగ్రేసులకు చేతులారా అవకాశం ఇచ్చినట్లవుతుంది. అంతేగాక, ఆదెబ్బతో తెలంగాణాలో తే.దే.పా. తుడుచుపెట్టుకు పోయినా ఆశ్చర్య పోనక్కరలేదు. ఎందుకంటే, పార్టీలో ఇంతకాలం ఇబ్బందిగా కొనసాగుతున్న తెలంగాణా నేతలు, తమ రాజకీయ భవిష్యత్తు కోసమయినా పార్టీని విడువక మానరు. అప్పుడు, తే.దే.పా.కు తెలంగాణాలో పార్టీని మళ్ళీ పునర్ నిర్మించుకోవడం సాధ్యం కాని పని. గనుక, ‘అఖిలంలో’ చంద్రబాబు ‘జై తెలంగాణా’ అనక తప్పదు.

 

అప్పుడు, పార్టీలో రెండోవర్గాన్ని ఎలాగ సముదాయిన్చగలడు? అనే ప్రశ్నవస్తుంది. కానీ, తెలంగాణా సమస్యతో రాజకీయ అస్తిరత ఎలాగ ఉంటుందో, అది తమ రాజకీయ జీవితాలని ఎంతగా ఇబ్బంది పెడుతోందో అనుభవపూర్వకం గ్రహించిన సీమంద్ర నేతలను ఇప్పుడు మాత్రమె ఒప్పించడము సులువు అని చంద్రబాబుకి తెలిసే ఉంటుంది. చంద్రబాబు ‘జై తెలంగాణా’ అన్నపుడు మిగిలిన పార్టీలకి అంతకన్నా మరో దారి, అవకాశం, అవసరము లేదు, ఉండదు. అందువల్ల ‘అఖిలంలో’ తే.దే.పా. సై అన్నప్పుడు, తరువాత సహజంగా కాంగ్రేసు వంతువస్తుంది. ప్రస్తుత పరిస్తితుల్లో వెంటనే తెలంగాణా గాని ఇచ్చేసే అవకాశం ఎటూ లేదు గనుక, కోడి గుడ్లు పొదిగినట్లు కాంగ్రెస్ తెలంగాణా అంశాన్ని కూడా 2014 ఎన్నికలవరకూ వరకు పొదుగుతూ కూర్చొని, అప్పుడు ఎన్నికలముందు ఏదో ఒకసానుకూల ప్రకటన చేసేసి తెలంగాణా ఓట్లు తన ఖాతాలో జమ చేసుకొనే ప్రయత్నం చేయవచ్చు.

 

పనిలో పనిగా, ఇప్పటికీ సిద్దంగా ఉన్న తే.రా.సా.ను, తన పిల్ల కంగ్రేసునీ కూడా తనలో కలిపెసుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పుడు, మళ్లీ ఒక దెబ్బకి ఎన్ని పిట్టలో లెక్కబెట్టడం ఎవరితరమూ కాదు. కాకి లెక్కలు కట్టుకొన్నా, రాష్ట్రంలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం, తలనొప్పిగా మారిన తే.రా.సా. పిల్ల కాంగ్రేసులను లొంగదీసుని తన స్వంత ఆయుధాలుగా మార్చుకొని తే.దే.పా.ను తుడిచి పెట్టేసి రాష్ట్రాన్ని ఏక చత్రదిపత్యంగా పరిపాలిన్చేసుకోవడం, ‘తెలంగాణా ఇచ్చేది తెచ్చేది మేమే’ అన్న మాట నిలబెట్టుకొన్నఘనకీర్తీ, రాష్ట్రంలో మళ్లీ ప్రశాంతత తెచ్చమనే గొప్పలు చెప్పుకొనే అవకాశం పొందడం, ఆనక తాపిగా కావలిసినన్ని కుంభకోణాలు చేసుకొనే అవకాశం...ఇలాగ చెప్పుకుపోతే వాటికి అంతే ఉండదు.

 

ఇక, విభజనలో పీటముడి పడిన ఒకేఒక అంశం ‘హైదరాబాద్ ఎవరి సొంతం?” అనేది. ఒక పదేళ్ళో పదిహేనేళ్లో ‘కామన్ క్యాపిటల్’ చేసిపడేస్తే అప్పటి సంగతి అప్పుడు చూసు కోవచ్చుననే ఒక ‘ఆప్షన్’ ఎలాగు ఉంటుంది గనుక, ఆ సమస్యా ఇక తీరిపోయినట్లే! అయినా, అటు తెలంగాణాలోనూ ఇటు ఆంధ్రా ప్రాంతంలోనూ కాంగ్రేసే వడ్డిస్తున్నపుడు ఎవరికి మాత్రం సమస్యలుంటాయి? ‘వడ్డించేవాడు ‘మనోడయితే’ ఎక్కడ కూర్చున్నా అందవలసినవి అందుతూనే ఉంటాయని పెద్దలు ఊరికే చెప్పలేదు కదా!