లొంగిపోతానని భానుకిరణ్ ఫోన్?
posted on Apr 13, 2011 @ 4:26PM
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ బుధవారం హైదరాబాదు పోలీసులకు పోన్ చేసి తాను లొంగిపోతానని చెప్పినట్టు వార్తలు మీడియాలో వచ్చాయి. సూరి హత్య అనంతరం భానుకిరణ్ పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్నారు. జనవరి మొదటి వారంలో సూరిని హత్య చేసిన భాను ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారో కూడా పోలీసులు కనుక్కోలేకపోయారు. భాను డ్రైవర్ మధుసూదన్ తదితరులు చెప్పిన వివరాలు మాత్రమే ఇప్పటి వరకు పోలీసులకు తెలుసు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నట్టుగా పోలీసులు కనుగొన్నారు. అయితే బుధవారం స్వయంగా భానుకిరణ్ హైదరాబాద్ పోలీసులకు ఫోన్ చేసి తాను లొంగిపోతానని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. భాను తిరుపతి నుండి ఫోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించి వెనువెంటనే పోలీసుల బృందాన్ని తిరుపతికి పంపించింది. తాను రాయలసీమలో ఓ ప్రాంతంలో లొంగిపోతానని చెప్పినట్టు తెలిసింది. దీంతో పోలీసులు సీమ అంతటా పోలీసులను అప్రమత్తం చేసి గాలిస్తున్నారు. అంతేకాకుండా తిరుపతిలో భానుకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.
కాగా భానుకిరణ్ లొంగిపోతానని వచ్చిన కథనాలలో ఎలాంటి వాస్తవం లేదని డిసిపి సత్యనారాయణ అంటున్నారు. మాకు ఎక్కడినుండి ఎవరి నుండి ఫోన్ రాలేదని చెప్పారు. భానును త్వరలో పట్టుకుంటామని చెప్పారు. భాను నుండి ఫోన్ వచ్చిందనేది కేవలం మీడియా కథనాలే అని చెప్పారు. పోలీసులను తప్పుదారి పట్టించడానికే భాను కిరణ్ ఫోన్ చేశాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.