జగన్, విజయలక్ష్మి పేర్లతో నామినేషన్లు
posted on Apr 13, 2011 @ 5:06PM
కడప: కడప లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో జగన్మోహన రెడ్డి పేరు ఉన్న మరోవ్యక్తి, పులివెందుల శాసనసభ స్థానానికి విజయలక్ష్మి అనే పేరు గల మరో మహిళ నామిషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని, ఆ పార్టీ పులివెందుల అభ్యర్థి విజయలక్ష్మిలను ఓడించాలన్న ఉద్దేశంతో అధికార కాంగ్రెస్ పార్టీ వారు ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసిన చింతా జగన్మోహన రెడ్డి వీర శివారెడ్డికి దగ్గర బంధువు కాగా, విజయలక్ష్మి అనే ఆమె సింమాద్రిపురానికి చెందిన మహిళ. ఓటర్లని అయోమయానికి గురిచేయాలన్న ఉద్దేశంతో వారు ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఈ పేర్లు గల నలుగురైదుగురితో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నట్లు తెలుస్తోంది. వారు ఈ విధంగా ఎంతమందితో నామినేషన్లు వేయించినా ప్రజలు అంత అమాయకులు కాదని, తమ అభ్యర్థులదే విజయం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఇలాగే చేశారని, అయితా తమ అభ్యర్థే విజయం సాధించారని వారు గుర్తు చేశారు.