అవినీతి సొమ్మును రక్షించుకోవడానికే...
posted on Apr 13, 2011 @ 2:05PM
హైదరాబాద్: తన అవినీతి సొమ్మును రక్షించుకోవడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిఎం పదవిపై కన్ను వేశారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ ఆరోపించారు. జగన్ అత్యంత అవినీతిపరుడు అని ఆరోపించారు. తెలంగాణలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ జెండా ఎగురవేసే వారిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు. కడప ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లవద్దని హెచ్చరిస్తున్న టిఆర్ఎస్ ముందుగా తెలంగాణలో జగన్ పార్టీ జెండాలు ఎగురకుండా అడ్డుకోవాలన్నారు. మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ఎవరి ఒత్తిళ్లకు లొంగి జగన్‌ను పక్కన పెట్టారో బహిర్గతం కావాలన్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఆ విషయాన్ని బయట ప్రజలకు తెలియజేయాలన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ ఫ్రంట్‌గా ఏర్పడి పోరాటం చేయాలని సూచించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని ఎవరైనా విమర్శిస్తే మంత్రులు స్పందించాలని సూచించారు. కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.