అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ సంపాదించారు
posted on Apr 18, 2011 @ 3:06PM
కడప: తాను ముప్పయ్యేళ్ల నుండి కష్టపడి డబ్బు సంపాదించానని, కానీ మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా, అవినీతితో వందల కోట్లు సంపాదించారని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. అవినీతిపరుడైన జగన్ లా అత్యధిక ప్రాపర్టీ కలిగిన ఎంపీగా తనకు రికార్డులు అవసరం లేదని నామా నాగేశ్వరరావు కడప జిల్లాలో టిడిపి ఎంపీ అభ్యర్థిగా మైసూరారెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా చెప్పారు. మూడేళ్లలోనే జగన్ అంత ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తిని గెలిపించవద్దని ఆయన ఓటర్లను కోరారు. ప్రజలు అవినీతిపై స్పందిస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల అన్నాహజారే చేపట్టిన అవినీతి ఉద్యమమే అందుకు నిదర్శనమని చెప్పారు. కాంగ్రెసు పార్టీ అధికార దుర్వినియోగం, జగన్ ధన మదంతో వీర్రవీగుతున్నారని అన్నారు. టిడిపి అభ్యర్థి గెలుపొందడం ఖాయమన్నారు. బెంగుళూరు, హైదరాబాదులలో ఉన్న జగన్ రెండు ఇళ్ల విలువే వందల కోట్లని చెప్పారు. అఫిడవిట్‌లో తప్పుడుగా పేర్కొన్నారని ఆరోపించారు.
కాంగ్రెసు, టిడిపి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ప్రజలను తప్పుదారి పట్టించడానికే అని మరో నేత పయ్యావుల కేశవ్ అన్నారు. కాంగ్రెసు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ రాహుకేతువుల్లాంటి వారన్నారు. జగన్ ఉప ఎన్నికల్లో రూ.200 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. జగన్ నోట్లతో గెలుస్తానని భ్రమ పడుతున్నారని అన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఆయనకు ఓటర్లు బుద్ది చెప్పిన విషయం అర్థమవుతుందన్నారు. 20 సంవత్సరాలలో ఎప్పుడూ ఎన్నికలు ప్రశాంతంగా జరగలేదని, వైయస్ కుటుంబం నిత్యం రిగ్గింగ్‌కు పాల్పడిందన్నారు. ఈసారి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే టిడిపి ఖచ్చితంగా గెలుస్తుందన్నారు.