కెవిపి రాజీనామా ఆమోదం పొందేనా?
posted on Apr 19, 2011 @ 9:39AM
హైదరాబాద్: రాష్ట్ర భద్రతా సలహాదారు పదవికి రాజ్యసభ సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు కెవిపి రామచందర్ రావు రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆమోదిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐటి సలహాదారు సిఎస్ రావు, పారిశ్రామిక సలహాదారు సిసి రెడ్డి చేసిన రాజీనామాలను ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. వీరిద్దరు కూడా వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఈ నేపథ్యంలో కెవిపి రామచందర్ రావు రాజీనామాను కూడా ప్రభుత్వం ఆమోదించవచ్చుననే ప్రచారం జరుగుతోంది. కెవిపి రామచందర్ రావు రాజీనామాతో పాటు సలహాదారుల పదవులకు పీటర్ హసన్, సోమయాజులు చేసిన రాజీనామాలు కూడా పెండింగులో ఉన్నాయి. వైయస్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కెవిపి రామచందర్ రావు పదవిలో కొనసాగారు. రోశయ్యతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. అయితే, తాను ముఖ్యమంత్రి కాగానే ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తామని కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కెవిపి రామచందర్ రావుతో పాటు మిగతా ప్రభుత్వ సలహాదారులు పదవులకు రాజీనామాలు చేశారు.