ఇంతకూ అక్రమాస్తుల దోషులెవరు?
posted on Sep 25, 2012 @ 9:50AM
అక్రమాస్తులు, ఫెరా నిబంధనల ఉల్లంఘన వంటి కేసుల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి చంచల్‌గూడా జైలులో ఉన్నారు. భారతీయశిక్షాస్మృతి ప్రకారం తప్పుఎవరు చేసినా దానికి సహకరించిన వారూ దోషులే. కానీ, ప్రస్తుత వాతావరణం చూస్తుంటే జగన్ మాత్రమే దోషి. మిగిలిన వారందరూ నిజాయితీపరుల్లా బొంకుతున్నారు. నేరుగా నేరం చేసినది జగన్, ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఈ కేసుల్లో దోషులు చెబుతుండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంత పెద్ద నేరాలు చేయాలంటే సహకరించే పాత్రధారులూ ఎక్కువగా ఉంటారనేది జగమెరిగిన సత్యం. అయితే పాత్రధారులు మాత్రం తామేమీ చేయలేదని, తమకు తెలియకుండానే తప్పు జరిగిపోయిందని బొంకుతున్నారు. ప్రత్యేకించి ఎవరి మాట పరిశీలించినా అందరూ శ్రీవైష్ణవులే రొయ్యల బుట్టలో మాత్రం రొయ్యలు మాయమయ్యాయన్నట్లుంది పరిస్థితి. గతంలో మహిళా ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి మాటలు గుర్తు చేసుకుంటే తనపై ఒత్తిడి వల్లే ఇలా జరిగిందన్నారు. కనీసం ఆ తరహాలో కూడా మిగిలిన వారు మాట్లాడటం లేదు. తాజాగా దోషిగా సిబిఐ ప్రకటించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటలు గమనిస్తే తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఇదే విషయం రుజువు అవుతుందనే పూర్తి విశ్వాసం తనకుందని అన్నారు. న్యాయం పొందటానికి తనకున్న అన్ని అవకాశాలూ ఉపయోగించుకుంటానని తెలిపారు. తెలియక తప్పిదం, పొరపాటు కూడా చేయలేదని ధర్మాన నొక్కి చెబుతున్నారు. మరి తెలియక తప్పిదం చేయకపోతే వాన్‌పిక్ భూములు ఎలా విదేశీకంపెనీ, నిమ్మగడ్డ ప్రసాద్ పరమయ్యాయన్న రహస్యం మాత్రం అంతుబట్టడం లేదు. పోనీ, ఈ మంత్రి విచారణలో సహకరించేందుకు మానసికంగా సిద్ధమయ్యారా? అంటే అదీ అనుమానంగా కనిపిస్తోంది. ఎందుకంటే హైదరాబాద్‌లో రాజీనామా సమర్పించేసి ఢల్లీ పెద్దల ఒత్తిడితో, సిఎంను మెతకవైఖరి అవలంబించేలా చేసిన మేధావి కాబట్టి. ఇప్పటిదాకా ఏ మంత్రి ఇంత ఒత్తిడి సిఎంపై తీసుకురాలేదని పరిశీలకులూ అభిప్రాయపడుతున్నారు. ఏమైనా చివరికి జగన్ ఒక్కరే దోషిగా మిగిలే అవకాశం ఉంది అన్నట్లుంది ప్రస్తుత వాతావరణం.