స్థానిక ఎన్నికల సస్పెన్స్ వీడేదెన్నడు?
posted on Sep 27, 2012 8:16AM
స్థానికఎన్నికలు...ఈ మాట తరుచుగా కాంగ్రెస్ పెద్దల నోట మాత్రమే వినిపిస్తోంది...
ఎప్పుడైనా కార్యకర్తలను ఊరడిరచటానికి...ఇంకొంచెం ద్వితీయస్థాయి నాయకులకు ఆశలు కల్పించటానికి....మరికొంచెం ముందుకు వెళితే ప్రతిపక్షాల నోరు నొక్కటానికి కాంగ్రెస్ ఈ పదాన్ని ఓ అస్త్రంలా ఉపయోగించుకుంటోంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే పోకిరి సినిమాలో షిండే అన్నట్లు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా....అన్నట్లు బతికే ఓ రాష్ట్రపెద్ద రోజూ ఎవరికో ఒకరికి స్థానిక ఎన్నికలు వచ్చేస్తున్నాయ్ అని చెప్పేస్తుంటారు. చివరికి ఇదెంత పెద్ద జోక్‌గా మారిందంటే ఆ పార్టీలో ఎవరు కూడా ఆ పెద్ద అంటే నమ్మకం లేనంతస్థాయికి తీసుకువెళ్లింది. అఫ్‌కోర్స్! అందరికీ తెలిసిన ఆ పెద్ద సిఎం కుర్చీలో కూర్చుని తన పదవి కోసం ఈ మంత్రాన్ని పఠిస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మాట నిలుపుకోలేని సత్తా ఆయనకే చెల్లిందని కాంగ్రెస్ సీనియర్లు, పలుజిల్లాల్లోని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా చెప్పుకుంటున్నారు. నలుగురు ఏమంటే నాకేటీ సిగ్గు అన్నట్లు ఆయన మాత్రం ఎక్కడ ఏ సభ జరిగినా ఈ పదం వాడకుండా ముగించటం లేదు. తాజాగా ఏలూరు కాంగ్రెస్ సభలో కూడా ఒక నెలలో స్థానిక ఎన్నికలు అని హామీ ఇచ్చేశారు. నెలల తరబడి ఒక నెలలో ఎన్నికలు అని ఆయన చెప్పుకుంటూ పోవటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఉప ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ స్థానిక ఎన్నికలు కనుక జరిపించకపోతే ఖచ్చితంగా కేంద్ర నిధులు గ్రామపంచాయతీలకు ఆపేస్తామని కూడా హెచ్చరించారు. ఆ గడువు కూడా పూర్తయినా ఇప్పటికీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియటం లేదు. ఉప ఎన్నికల ప్రచారానికి తిరుపతి వచ్చి వెళుతూ ఎయిర్‌పోర్టులో తనను సాగనంపటానికి వచ్చిన కూతుహలమ్మ వంటి కాంగ్రెస్ నేతలకు కూడా సిఎం ఒకనెలలో స్థానిక ఎన్నికలు జరిపించేసి పార్టీని బలోపేతం చేసేద్దామని లేని ఉత్సాహాన్ని కల్పించారు. అంత తొందరగా సిఎం స్పందించారంటే ఇక ఎన్నికలే అనుకుని ద్వితీయశ్రేణి నాయకత్వానికి చిత్తూరు నేతలు ముందుగా వరాలు కురిపించారు. ఆ ద్వితీయశ్రేణి నేతలు ఇప్పుడు తిరుపతిలో ఎదురుతిరుగుతున్నారు. ఇదేమి పార్టీ అని కూడా నిలదీస్తున్నారు. మీ కన్నా మాట నిలుపుకునే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బావుందని తిరుపతి కాంగ్రెస్ కార్యకర్తలు తమ సమావేశాల్లో విరుచుకుపడుతున్నారు. ఇంతలా సిఎం ప్రకటనపై నిరసన వ్యక్తం అవుతున్నా ఆయన మాత్రం అస్సలు ఈ విషయం పట్టించుకోలేదు. అంతేకాకుండా కేంద్ర మంత్రి చంద్రదేవ్ చెప్పినట్లే స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రత్యేకించి 11వ ఆర్థిక సంఘం నిధులు అస్సలు రాష్ట్రంలోని పంచాయతీలకు విడుదలవుతున్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి రాష్ట్రప్రభుత్వానికి ఏర్పడిరది. దీంతో తాజాగా సీనియర్ మంత్రి జానారెడ్డి స్పందించి సుప్రీంకోర్టులో ఎన్‌ఎల్‌పీ వేసైనా నిధులను తెప్పించుకోవాలని భావిస్తున్నారు. నిధులు ఆపవద్దని కేంద్రాన్ని కోరుతామంటున్నారు. ముఖ్యమంత్రితో కూడా ఈ విషయమై చర్చిస్తామని తెలిపారు. అయితే ఎన్నికలు నిర్వహించటం అనేది ఇప్పట్లో జరగదని మాత్రం మంత్రి ప్రకటనను బట్టి అర్థమవుతోంది. ఇప్పటికే అధికారాలు కోల్పోయి ఖాళీగా తిరుగుతున్న ద్వితీయశ్రేణి నేతలు మాత్రం ఈ సస్పెన్స్‌కు తెరదించాలని డిమాండు చేస్తున్నారు. నేరుగా అధిష్టానం ఈ విషయంలో పూనుకోవాలని వారు కోరుకుంటున్నారు.