సమరానికి సిద్దమవుతున్న పోలీస్ శాఖ
posted on Sep 27, 2012 8:19AM
రాష్ట్రంలో భద్రత నానాటికీ కొరవడుతోంది. అసలు ఈ పదం ఉచ్చరించటానికే భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే ముందుగా కేంద్ర సంస్థలను హెచ్చరించగల స్థాయికి ఇంకా పోలీసువిభాగం ఎదగలేదు. ఓ గోకుల్‌ఛాట్, ఓ ఛార్మినార్ వంటి అనుభవాలు నుంచి రాష్ట్ర పోలీసు శాఖ ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోవటం లేదు. దీంతో కేంద్రశాఖలు ఎప్పటికప్పుడు స్పందించాల్సి వస్తోంది. పలానా కార్యక్రమాలకు ఎందుకు భద్రత లేదని ప్రశ్నించి హెచ్చరించాల్సిన స్థితి తప్పటం లేదు. ప్రత్యేకించి రాష్ట్రంలో నిర్వహించనున్న జీవవైవిధ్య సదస్సుకు విదేశాల నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలున్నాయి. విదేశీయులు అడుగుపెట్టినప్పుడే ఉగ్రవాదులు పంజా విసరటానికి ప్రయత్నిస్తుంటారు. హింసకు పాల్పడే అవకాశమున్న ఈ సదస్సు గురించి ఇంటలిజెన్స్ బ్యూరో స్పందించింది. ఈ సదస్సుకు వచ్చే వీవీఐపీలకు హైసెక్యూరిటీ కల్పించాలని ఇంటలిజెన్స్ కోరింది. విదేశీప్రతినిధులకు ఒక్కొక్కరికీ బాడీగార్డులను నియమించాలని పోలీసుశాఖను కోరింది. దీంతో పాటు సదస్సు జరిగే ప్రాంతాల్లో నిఘా పెంచాలని కూడా సూచించింది. ముందుగా అనుమానితుల జాబితా తయారీ చేసి పోలీసుశాఖ వారిని అదుపులోకి తీసుకుంటే కొంత వరకూ ప్రయోజనం ఉండవచ్చని కూడా ఇంటలిజెన్స్ సూచించింది. దీంతో పోలీసువిభాగం అప్రమత్తమైంది. ఒకవైపు తెలంగాణా మార్చ్, మరోవైపు జీవవైవిధ్యసదస్సు కూడా రాష్ట్రపోలీసు విభాగ పనితీరుకు పెద్దసవాళ్లుగా నిలుస్తున్నాయి. ఈసారైనా భద్రతలో భేష్ అనిపించుకోవాలని పోలీసువిభాగం కొంచెం సీరియస్ వర్కవుట్ చేసేందుకు సిద్ధపడుతోంది. అలా కనుక చేయకపోతే మాత్రం విమర్శలను ఎదుర్కోక తప్పదు. అంతేకాకుండా రాష్ట్రంలో భద్రతాసమస్య తీవ్రమవుతుంది కూడా.