ఆందోళన బాటలో పెట్రోలియం డీలర్లు
posted on Sep 25, 2012 @ 9:47AM
గతంతో పోల్చుకుంటే వ్యాపారం పెరిగినా లాభం తగ్గిందని పెట్రోలు డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలియం కంపెనీలు తమ షేర్ వాల్యూ పెంచుకుంటూ లాభాల బాటలో పయనిస్తుంటే తాము మాత్రం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి వెళుతున్నామని వారంటున్నారు. తాము బంకులు పెట్టి సిబ్బంది సహాయంతో పెట్రోలు అమ్మకాలు చేయకపోతే కంపెనీలు ఏమి చేయగలవని ప్రశ్నిస్తున్నారు. పైసల్లో ఉన్న లాభం కోసం తాము ఒక్కోసారి చిల్లర నష్టపోతున్నా పట్టించుకోవటం లేదని డీలర్లు వాపోతున్నారు. చిల్లరపైసలు చేరకుండా పెట్రోలియం ధరల్లో మార్పు ఉండదని, ఆ చిల్లరే తమకు ఇబ్బందిగా మారుతున్నందున రౌండ్ చేయాలని సూచించినా కంపెనీలు పట్టించుకోవటం లేదన్నారు. తమ ఉత్పాదనలు అమ్ముతున్నారా? లేదా? అన్నదే కంపెనీలు పరిశీలిస్తున్నాయి కానీ, లాభం తక్కువయి తాము పడుతున్న పాట్లు గమనించటం లేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో డీలర్లు అందరూ ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. అక్టోబరు 1,2 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లు పెట్రో ఉత్పత్తుల కొనుగోళ్లను నిషేధిస్తారని ఆ సంఘం భారత కమిటీ సంయుక్త కార్యదర్శి రాజీవ్ అమరం తెలిపారు. తమ ఇబ్బందులను గమనించి పెట్రో కంపెనీలు దిగిరాకపోతే వాటికి అర్థమయ్యేలా భవిష్యత్తులో మరిన్ని నిరసనకార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ రెండు రోజుల కొనుగోళ్ల నిలిపివేతకే కంపెనీలు తలొగ్గుతాయని తాము భావిస్తున్నామన్నారు. ఒక వేళ అప్పటికీ కంపెనీలు స్పందించకపోతే తీవ్రంగా పరిగణిస్తామని రాష్ట్రంలో పెట్రోలు బంకు డీలర్లు ‘తెలుగువన్.కామ్’కు తెలిపారు.