ఇంతకీ లేఖ ఇస్తారా? లేదా బాబూ..?
posted on Sep 26, 2012 @ 1:53PM
తెలంగాణకి అనుకూలంగా లేఖ ఇచ్చే విషయంలో తెలుగుదేశం పార్టీలో భారీ స్థాయిలో అంతర్మధనం జరుగుతోంది. అసలు లేఖ ఇవ్వాలా వద్దా అన్న విషయంలో చంద్రబాబు చాలా సందిగ్ధంలో పడిపోయారు. తెలంగాణ నేతలు లేఖ ఇవ్వాలని గట్టిగా పట్టుపడుతుంటే సీమాంధ్ర నేతలు మాత్రం లేఖ ఇస్తే పార్టీ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంమీద చంద్రబాబు చాలాసార్లు ఇరు ప్రాంతాలనేతలతో చర్చలు జరిపారు. ఫైనల్ గా ఓ సారి సీమాంధ్ర నేతల వెర్షన్ తీసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని బాబు గట్టిగా అనుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణపై లేఖ విషయంలో పార్టీలోని సీమాంధ్ర నేతల మధ్య పొరపొచ్చాలొచ్చినట్టు సమాచారం. టిడిపి సీమాంధ్ర నేతల్లో కొందరు ఇచ్చేస్తే పోలా అని బాబుకి సలహా ఇస్తుంటే, ఇన్నాళ్లూ పోరాటం చేసింది తేలిగ్గా ఇచ్చేయడానికేనా అంటూ కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా బుధవారం తిరిగే లోగానే లేఖపై ఓ నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారని గట్టి సమాచారం.