విస్తరిస్తున్న గుడుంబా వ్యాపారం?
posted on Sep 27, 2012 8:08AM
మొగుడు మొత్తేవాడైతే ఊరంతా ఊరుకుంటుందా అన్నట్లుంది నేటి వాతావరణం. ప్రభుత్వ చేతకానితనానికి అతిపెద్ద నిదర్శనం గుడుంబా తయారీ, వ్యాపారం. ఈ వ్యాపారం ఒకప్పుడు రాష్ట్రరాజధాని హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమై ఉండేది. పైపెచ్చు ఇతర ప్రాంతాలకు అస్సలు రవాణా కాకుండా పోలీసులు, ఎక్సయిజ్ రెండుకళ్లుగా కాపుకాసేవారు. ఇప్పుడున్న ఆమ్యామ్యాల సంస్కృతి వల్ల ఆ రెండు కళ్లు కూడా మూసుకుపోయాయి. దీంతో తెలంగాణా జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ గుడుంబావ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. ఈ వ్యాపారం వల్ల కల్లుదుకాణదారులైతే తమ దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. తమ వృత్తికే గుడుంబా పెద్ద శాపమైందని గీతకార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణాజిల్లాల్లో చీప్‌లిక్కర్ వ్యాపారం పడిపోయింది. దీనికి కారణం కూడా గుడుంబా అందుబాటులో ఉండటమేనని తెలుస్తోంది. సారాతో సమానంగా ఉండే ఈ గుడుంబా అంటే తెలంగాణా ప్రాంతవాసులు చెవి కోసుకుంటారనేవారు. తాజాగా కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి మండలం గోపయ్యపల్లిలో పోలీసులు దాడి చేస్తే 1700లీటర్ల గుడుంబా కోసం సిద్ధంగా ఉన్న పులిసిన బెల్లం పానకం, వెయ్యిలీటర్ల గుడుంబా దొరికింది. నిందితులను అన్వేషించే పనిలో పోలీసులున్నారు. ఇలానే వరంగల్‌జిల్లాలోనూ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ గుడుంబా తయారీ ఓ కుటీరపరిశ్రమలా సాగుతోందని తెలుస్తోంది. ఇకనైనా తమ నిద్రను వదిలి అధికారులు గుడుంబాను అదుపులోకి తేవాలని మహిళలు కోరుతున్నారు.