గ్రామస్థాయిలో పట్టుకోసం ‘దేశం’ ఆరాటం!....పాదయాత్రల వెనుక లక్ష్యం?
posted on Sep 25, 2012 @ 9:33AM
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 117 రోజుల పాదయాత్ర గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి దారి తీయాలని ఆ పార్టీ నేతలు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అందుకే చంద్రబాబు యాత్రతో పాటు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్‌ఛార్జి స్థాయిలో ఉన్న వారందరూ ఈ యాత్రతో పాటు కానీ, ముందుగా కానీ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పర్యటించాలని పార్టీ కేంద్ర పొలిట్‌బ్యూరో సూచిస్తోంది. ఈ పాదయాత్రల తీరుతెన్నులను పరిశీలిస్తున్న పొలిట్‌బ్యూరో ప్రతీ అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. గ్రామస్థాయిలో పార్టీ పట్టు కనుక పెరిగితే 2014 ఎన్నికలను ఎదుర్కొవటం పెద్ద పని కాదు అని భావిస్తోంది. అందుకే ముందుగా ఈ పాదయాత్ర జరిగే అన్ని జిల్లాల్లోని నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. అక్టోబరు 2న చంద్రబాబు పర్యటన అనంతపురం జిల్లా హిందుపురం నుంచి ప్రారంభమవుతోంది. దీంతో సమాంతరంగా గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం చేయటానికి పర్యటనలు ప్రారంభించాలని పొలిట్‌బ్యూరో జిల్లా నేతలను ఆదేశిస్తోంది. బాబు పర్యటించే హిందుపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులను రాష్ట్ర నేతలు ముందస్తుగా ప్రతీరోజూ సంప్రదిస్తున్నారు. అంతేకాకుండా పాదయాత్ర ప్రారంభమయ్యాక గ్రామాల వారీగా నియోజకవర్గ ఇన్‌ఛార్జిల పర్యటనల వివరాలు, బాబు పాదయాత్ర తీరుతెన్నులు రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. ప్రతీ సోమ, మంగళవారాల్లో ఈ సమావేశాలు జరుగుతాయి. ప్రత్యేకించి బాబు యాత్ర ఎలా ఉండాలన్న రూట్‌మ్యాప్ జిల్లా నేతల ఆలోచనలతో రూపుదిద్దుకోవాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. అందుకే బాబు కూడా ఆ జిల్లా నేతలతో కలిసి వారిచ్చిన సూచనల ప్రకారం పర్యటించేందుకు సిద్ధపడుతున్నారు. కొన్ని నినాదాల ఆధారంగా గ్రామీణులను తెలుగుదేశం పార్టీవైపు నడిపించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఎన్టీఆర్ హయాం నుంచి అచ్చొచ్చిన ‘నడుస్తోంది రాబందుల రాజ్యం...రాబోయేది రామన్న రాజ్యం’ అన్న నినాదానికి పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అసమర్ధపాలన అంతమొందిద్దాం అన్న నినాదానికి ప్రాధాన్యత ఇస్తోంది. బిసి డిక్లరేషను ప్రకటించినందున చట్టసభల్లో పెరగాలి బిసిల భాగస్వామ్యం అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అని నినాదమిస్తోంది. ఇలా నినాదాలు కొత్తఅంశాలతో బాబు పాదయాత్రను హుషారెక్కించేందుకు తెలుగుదేశం పార్టీ కసరత్తులు చేస్తోంది. ఏమైనా ఈ అవకాశం అధికారానికి ఉపయోగపడాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలగా ప్రయత్నిస్తోంది.