ఇసుక మాఫియాకు షాకిచ్చిన కొత్త పాలసీ ?
posted on Sep 25, 2012 @ 9:39AM
ఇసుక తవ్వకాలు, అమ్మకాలు విషయంలో అక్రమాలను ప్రభుత్వం కొత్తపాలసీని ద్వారా అదుపు చేయనుంది. ఈ పాలసీ వల్ల అక్రమాలు జరిగే అవకాశాలు తగ్గుతాయని రాష్ట్రప్రభుత్వం నమ్మబలుకుతోంది. రోజూ దాడులు చేసి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పట్టుకున్నామని చెప్పుకునే వాతావరణం స్థానంలో సామాన్యుడు కూడా స్వేచ్ఛగా ఇసుకను వినియోగించుకునే స్థాయికి చేరతాడని ఆశిస్తోంది. ముందుగా ప్రకటించినట్లే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా పంపిణీ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఈ ఇసుకను నిత్యవసరం కింద పరిగణించింది. రీచ్‌ల్లో రాజ్యమేలుతున్న మాఫియా పక్కకు తప్పుకునే పరిస్థితులను ప్రభుత్వమే కల్పించింది. ఇసుకరీచ్‌లకు టెండర్‌కమ్ పబ్లిక్ ఆక్షన్ పద్ధతిని ఆపేసి లాటరీల ద్వారా కేటాయింపులు చేయనున్నది. క్యూబిక్ మీటరు ఇసుక ధర రూ.325గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరకు 20శాతం మించకుండా జిల్లా అధికారులే ధరను శాసిస్తారు. తవ్వకాల్లో పరిమితి విధించే వాల్టా చట్టం అమలు చేస్తారు. యంత్రాల వాడకాన్ని నిషేధిస్తారు. పీసా చట్టం 1966 ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఇసుకరిచ్‌లను ఎపీఎండీసీ, ఐటీడీఏ సహకారంతో గ్రామసభల్లో ఆమోదం పొందిన సొసైటీలు నిర్వహిస్తాయి. నీటిలోపల ఇసుకతవ్వకాలను రిజిస్టర్డ్ బోట్స్, మైన్స్ సొసైటీలకు లాటరీ పద్దతిలో కేటాయిస్తారు. రిజర్వాయర్లతో డీసిల్టింగ్ ద్వారా ఇసుకను ఇరిగేషన్‌శాఖ వెలికి తీస్తుంది. ఈ ఇసుకను ప్రభుత్వపనులకు వినియోగిస్తారు. పట్టాభూముల్లో మేట వేసిన ఇసుక తొలగింపునకు సీనరేజి ఫీజు చెల్లించి రైతులే అనుమతి పొందాలి. మండల పరిధిలో ఉన్న చిన్నచిన్న నదులు, వాగుల్లో ఉన్న ఇసుకను స్థానిక అవసరాలకు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీనరేజీ ఫీజు లేకుండా ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా తరలించేందుకు ధృవీకరణతో ఇసుకను ఉచితంగా వినియోగించుకోవచ్చు. రాష్ట్ర సరిహద్దులకు ఇసుకరవాణా నిషేధించారు. ఇతరరాష్ట్రాలకు ఇసుకను రవాణా చేస్తే వాహనాలను సీజ్ చేస్తారు. ఇసుకసీనరేజీ ఫీజులు నూరుశాతం జిల్లాపరిషత్తు జనరల్ ఫండ్స్ ఖాతాలో జమ చేస్తారు. దీనిలో 25శాతం జిల్లా పరిషత్తు, 50శాతం మండలపరిషత్తులు, 25శాతం గ్రామపంచాయతీలు వాటాగా పొందుతాయి. ఇప్పుడు రాజధానికి తరలిస్తున్న పది ఘనపుమీటర్ల ఇసుక ధర 16నుంచి 18వేల రూపాయలు ఉంటే కొత్త పాలసీ ప్రకారం ఏడు నుంచి ఎనిమిదివేల రూపాయలకే అందుబాటులోకి వస్తుంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఐదు హెక్టార్లలోపు రీచ్‌లకు పర్యావరణ అనుమతులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 107 ఇసుకరీచ్‌లను తవ్వకాలకు అనుకూలమైనవని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అమలులో ఉన్నవి 77రీచ్‌లు మాత్రమే. నూతనవిధానంలోకి రావటానికి ఆసక్తి చూపకపోతే 42 రీచ్‌లకు గనులశాఖ డబ్బు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఏమైనా ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లు, టెండరుదారులు కొత్తపాలసీ పర్వాలేదంటూ ఊపీరిపిల్చుకుంటున్నారు. నిర్మాణాలు పూర్తి చేసేందుకు పాలసీని వెంటనే అమలులోకి తేవాలని వారు కోరుతున్నారు.