కొత్త మద్యందుకాణ యజమానులకు పాతయజమానుల ఇంటర్వ్యూలు?
posted on Jun 19, 2012 @ 12:04PM
కొత్త మద్యం దుకాణదారులకు ప్రస్తుత యజమానులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారినే కొత్తపాలసీ కింద ఎక్సైజ్ కు దుకాణదారులుగా పరిచయం చేస్తున్నారు. ప్రభుత్వం కొత్తపాలసీ ప్రకారం రూపొందించిన నిబంధనావళి కాపీలను ప్రస్తుత యజమానులు తమ దగ్గర పెట్టుకుని అర్హతలు కూడా పరిశీలిస్తున్నారు. పాన్ కార్డ్, మూడేళ్ళ రిటర్న్స్ దాఖలు చేయగలిగితే తెలివైన అమాయకుల కోసం ప్రస్తుత మద్యం దుకాణ యజమానులు వెదుకుతున్నారు. ప్రత్యేకించి తమ కాళ్ళదగ్గర పడుండే వారిలో నమ్మకస్తులను ఎంపిక చేసుకుంటున్నారు. అలా లేకపోతే కొత్తవారిని పిలిపించి ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. వారి కుటుంబ నేపథ్యం తెలుసుకున్న తరువాతే ఇంటర్వ్యూలు, ఎంపిక పూర్తి చేస్తున్నారు. తమకు నచ్చితే దరఖాస్తు నింపేసి వారిని నేరుగా ఎక్సైజ్ కార్యాలయం ముందు దింపుతున్నారు. ఇలా తమవారినే ఎక్సైజ్ శాఖ లాటరీ ద్వారా ఎంపిక చేసేందుకు పైరవీలకూ సిద్ధమవుతున్నారు. దుకాణం శాంక్షన్ అయితే పెట్టుబడి తమది కాబట్టి 70 శాతం లాభం వదిలేయాలని ఒప్పందం చేసుకుంటున్నారు. తాము పంపించే వారిలో ఎవరు ఎంపికవుతారో తెలియదు కాబట్టి ముందస్తుగా ప్రతీ యజమాని తమ తరుపున ముగ్గురిని లాటరీకి పంపిస్తున్నారు. తక్కువ జీతంతో కుటుంబ అవసరాలు తీరని ప్రయివేటు ఉద్యోగులు ఈ దుకాణాల కోసం ఆశపడుతున్నారు.
ప్రస్తుత మద్యం షాపుల యజమానులు కూడా వీరిపైనే కన్నేశారు. వీరికైతేనే పాన్ కార్డ్, మూడేళ్ళ రిటర్న్స్ ఉంటాయి. అందుకే ముందుగా బంధువుల్లో ఈ తరహా ఉద్యోగులను వెదుకుతున్నారు. దొరక్కపోతేనే కొత్తవారికి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ నిర్వహించే ఇంటర్వ్యూల కన్నా ప్రస్తుత మద్యం దుకాణదారుల ఇంతర్వ్యూలకే డిమాండు ఉంటోంది. అప్ సెట్ ధరలో మూడోవంతు ముందుగానే చెల్లించటానికి ప్రస్తుత యజమానులు సిద్ధంగానే ఉన్నారు. ఏడాదిలో సత్ప్రవర్తన ఉంటేనే మద్యం దుకాణం మరో ఏడాది కొనసాగుతుంది కాబట్టి ఆ తరహాలో కనిపించే వారినే ప్రస్తుత యజమానులు పంపుతున్నారు. కొత్తగా వచ్చే యజమానులు కూడా సిండికేట్ అయ్యేందుకు వీరు ముందునుంచే ప్రతిపాదనలు చేస్తున్నారు. ముందుగా దరఖాస్తులో భాగస్వామి పెరుండాలన్న నిబంధన ప్రకారం తమ పేర్లయితే ఎక్సైజ్ అధికారులు గుర్తుపదతారు కాబట్టి ఇంట్లో మరొకరి పేరును భాగస్వామిగా రాయిస్తున్నారు. అంటే మొత్తానికి ఎన్ని కేసులు పెట్టినా మద్యం దుకాణాలను వదలటానికి ప్రస్తుత యజమానులకు ఇష్టం లేదు. లాభానికి అలవాటుపడ్డ ప్రాణం కాబట్టి తమ తరుపువారి పేరుతొ దుకాణాలను సొంతం చేసుకోవాలని ప్రస్తుత యజమానులు ఆరాటపడుతున్నారు. ఈ తెరవెనుక భాగోతం అంతా తెలిసినా ఎక్సైజ్ శాఖ మౌనంగా ఉంటోంది. తాము లాభపడే అవకాశాలను కాలదన్నుకోకుండా ఆ శాఖ ఉద్యోగులు కొత్త దరఖాస్తులను లాటరీ కోసం స్వీకరిస్తున్నారు. ఈ తతంగం రాష్ట్రంలోని తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వెలుగుచూసింది.