ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్న ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల మాఫియా
posted on Jun 19, 2012 @ 10:11AM
రాష్ట్రంలోని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు మాఫియా ముఠాగా మారి ప్రభుత్వానికే సవాల్ గా మారారు. నిబంధనలకు విరుద్ధంగా వీరు కార్యకలాపాలు నిర్వహిస్తూ కోట్లాదిరూపాయలు ఆర్జిస్తున్నారు. అటు ప్రభుత్వంలోని పెద్దలను ఇటు అధికారులను మేనేజ్ చేస్తూ యథేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఒకే పర్మిట్టు, ఒకే నెంబరుతో రెండేసి వాహనాలను ప్రైవేట్ ఆపరేటర్లు నడుపుతున్నారు. షిర్డీ వెళ్ళే కాళేశ్వర్ ట్రావెల్స్ బస్సుకు ఒస్మాబాద్ వద్ద ప్రమాదం జరగటంతో అప్రమత్తమైన రవాణాధికారులు అసలు ప్రైవేట్ ఆపరేటర్ల పనితీరుపై దృష్టిసారించారు. రెండువేల మందిప్రైవేట్ ఆపరేటర్లు అసలు నిబంధనలు పాటించటం లేదు. కాంట్రాక్టు క్యారియర్ల కింద అనుమతి పొందటానికి ప్రతిసీటుకు 2,625రూపాయల చొప్పున రవాణాశాఖకు చెల్లించాలి. దేశవ్యాప్తంగా నడుపుకోవాలంటే సీటుకు 3,675రూపాయలు చెల్లించాలి. అంటే 54సీట్లున్న బస్సుకు మూడు నెలలకు లక్షా 25వేల రూపాయలు అనుమతికి ఖర్చు చేయాలి. దేశవ్యాప్త అనుమతికి రెండు లక్షల రూపాయల చొప్పున కట్టాలి. ఇలా అనుమతులు పొందుతున్న సర్వీసులు అతితక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. సగటున 75 బస్సులు నడిపే సంస్థలు రాష్ట్రంలో 40కు పైనే ఉన్నాయి. అలానే చిన్నసంస్థలు 50ఉన్నాయి. ఈ వివరాలన్నీ రవాణాధికారులు తెలుసుకున్నందున వారిని మేనేజ్ చేసేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు సిద్ధమయ్యారు.