బాబు ఆదేసిస్తే పరిటాల శ్రీరామ్ పోటి

      తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటి చేస్తాడని పరిటాల సునీత పేర్కొన్నారు. పరిటాల రవీంద్ర ఎనిమిదో వర్ధంతి సంధర్బంగా వెంకటాపురంలోని ఆయన సమాధి వద్ద కుటుంబసభ్యులు ఘనంగానివాళులర్పించారు. అటు టీడీపీ జిల్లా కార్యాలయంలో నేతలు పరిటాల రవికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరిటాల రవి సతీమణి ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే 2014 ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెడతానన్నారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న శ్రీరామ్‌ను కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్ని కేసులో ఇరికించారని సునీత ఆరోపించారు.  

రాహుల్ ది ఐరన్ లెగ్గు:మైసూర

  ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడుతుంటే, ఆ పార్టీ నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ తీవ్రంగా విమర్శిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిని జైలు నుంచి విడుదల చేయడం గురించి ముందు మాట్లాడి, ఆ తరువాత పొత్తుల గురించి కాంగ్రెస్ మాట్లాడి ఉంటే వారు కొంత సానుకూలంగా స్పందించే అవకాశం ఉండేదేమో. నిన్నజగన్ బెయిలు పిటిషనుపై జరిగిన విచారణలో, ప్రభుత్వం తమకు సహకరించడం లేదనే నెపంతో సిబిఐ జగన్ బెయిలు రాకుండా చేయడంతో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ దురుదేశ్యం బయటపడిందని యస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆ పార్టీకి చెందిన మైసూరా రెడ్డి వంటి నేతలు తమ నాయకుడిని జైల్లో బందించి పొత్తుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నారు.   రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నుకోవడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూర రెడ్డి స్పందిస్తూ, “వరుసగా మూడు రాష్ట్రాలలో పార్టీని ముంచిన రాహుల్ గాంధీని ఇప్పుడు నాయకుడిగా చేసుకొని, మళ్ళీ ఎన్నికలకి సిద్దమవుతున్న కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే నిజంగా జాలేస్తోంది. ఆయనది ఐరన్ లెగ్గని తెలిసీ కూడా కాంగ్రెస్ ఆయనకు నాయకత్వం కట్టబెట్టడం చూస్తుంటే, ఆ పార్టీ తానూ మునగడమే గాకుండా ఏకంగా దేశాన్నికూడా ముంచేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ పరిస్థితికన్నా దారుణంగా ఉందని” మైసూరా అన్నారు.   ఇక మజ్లిస్ పార్టీతో స్నేహం కోరుకొంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతల అరెస్ట్ పై సానుభూతిగా స్పందిస్తూ “కాంగ్రెస్ పార్టీకి వారు మద్దతు ఉపసంహరించినందుకే ఇటువంటి వేధింపులకి పాల్పడుతోందని” మైసూరా అన్నారు.

గడ్కారి పాయసం గిన్నెలో పిడక వేసిన కాంగ్రెస్

  మేధోమధనంలో కాంగ్రెస్ పార్టీ చెప్పే నీతులు అక్కడివరకే పరిమితం అని మరోసారి ఆపార్టీ నిరూపించింది. భారతీయపార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారి ఈరోజు మళ్ళీ రెండోసారి పార్టీ అధ్యక్షపదవి చేపట్టనున్న తరుణంలో, మహారాష్ట్ర ఆదాయపన్ను శాఖ ఆయనకి నోటీసులు జారీచేసింది. ఆయన తన నామినేషను పత్రాలు సమర్పించే రోజునే అంటే బుదవారంనాడే, ఆయనని తమ ముందు హాజరయి ఆయనకు చెందిన పూర్తీ పవర్ ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకల గురించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిన్న మద్యాహ్నం వరకూ కూడా తానే మళ్ళీ అధ్యక్ష పదవి చేపడతానని కలలుగన్న నితిన్ గడ్కారి కాంగ్రెస్ దెబ్బకి వెనక్కి తగ్గక తప్పలేదు.   అయన రెండో సారి అధ్యక్ష పదవి చెప్పట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నమరో సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తానూ కూడా బరిలో దిగుతానని ప్రకటించడంతో, పోటీ వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావించిన భారతీయపార్టీ అధిష్టానం, అందరికీ ఆమోదయోగ్యుడయిన మాజీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పేరును నిన్న రాత్రి ప్రతిపాదించడంతో పరిస్థితి సద్దుమణిగింది.   కాంగ్రెస్ పార్టీ తమ అంతర్గత వ్యవహారాలలో ఈవిధంగా వేలు పెట్టి ఆడుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నిరసించింది. సరిగ్గా సమయం చూసుకొని పావులు కదిపి తమ పార్టీని రచ్చ కెక్కించినందుకు భారతీయపార్టీ కాంగ్రెస్ పై తీవ్రంగా మండిపడుతోంది.   అయితే, ఇల్లు కాలుతోందని భారతీయ జనతా పార్టీ ఏడుస్తుంటే, చుట్టకి నిప్పు దొరికిందని సంతోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ ఆరోపణలు యధావిధిగా ఖండించడమే గాకుండా, ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొట్టినందుకు చంకలు గుద్దుకొట్టుకొంటోంది.   గడ్కారి మాత్రం తన పాయసం గిన్నెలో కాంగ్రెస్ ఈ విధంగా పిడక వేయడంతో విలవిలలాడుతూ తాను నిర్దోషినని నిరూపించు కోనేంతవరకు పార్టీలో ఏపదవి చేపట్టనని, తన వల్ల పార్టీ ప్రయోజనాలకు భంగం కలగరాదనే ఉద్దేశంతోనే తానూ అధ్యక్షపదవికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు మీడియాకు తెలిపారు. మొన్న జైపూరులో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చెప్పటిన తరువాత ఉద్రేకంగా నీతులు చెప్పిన రాహుల్ బాబు ఇప్పుడు దీనిని ఏ నీతి అంటారో ఆయనే వివరించాలి.  

24న షిండే నివేదిక, 27న ప్రకటన?

  తాజా సమాచారం ప్రకారం 25వ తేదీన బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరనున్న హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే,24వ తేదీనే తెలంగాణా అంశంపై తన మంత్రిత్వ శాఖా సూచనలు పొందుపరచిన తుది నివేదికను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేతిలోపెట్టి బయలుదేరుతున్నారు. హోం మంత్రిగా తన అభిప్రాయాలు తెలియజేసినా, తుది నిర్ణయం మాత్రం సోనియా గాంధీయే తీసుకొంటారు. మరో రెండు రోజుల తరువాత అనగా 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోటనుండి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసే ప్రసంగంలో రాష్ట్ర విభజనపై ప్రకటన వెలువడవచ్చును. ఏ కారణం చేతనయినా ఆ రోజు ప్రకటించకపోయినట్లయితే ఆ మరునాడు అంటే 27వ తేదీన ఖచ్చితంగా ప్రకటన వెలువడవచ్చును. అంతకు రెండు రోజుల ముందే పారా మిలటరీ బలాలు రాష్ట్రం చేరుకొంటాయి. వాటిని మోహరించిన ప్రాంతంబట్టి కేంద్రం ఏమి నిర్ణయం తీసుకోబోతుందో స్పష్టమయిన సంకేతం గ్రహించవచ్చును. ఒకవేళ తెలంగాణాలో మొహరిస్తే, కేంద్రం తెలంగాణాకి వ్యతిరేఖంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు భావించవచ్చును. ఆంధ్రా ప్రాంతాలలో మొహరించినట్లయితే తెలంగణా రాష్ట్రం ప్రకటించబోతున్నట్లు భావించవచ్చును. ఈ నూతన సంవత్సరంలో విడుదల కానున్నఅతి గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ ఇదేనని చెప్పక తప్పదు.

“తెలంగాణా కోసం 101 అబద్ధాలు”

  ఈ రోజు ప్రధాని మాజీ సలహాదారు డా.సంజయ్ బారు డిల్లీలో విశాలాంధ్ర వారు నిర్వహించిన ఒక పుస్తకా విష్కరణ సభలో పాల్గొన్నారు. యన్. చక్రవర్తి రచించిన ఆ పుస్తకం పేరు “తెలంగాణా కోసం 101 అబద్ధాలు, అర్ధరహిత వాదనలు.” ఆ పుస్తకంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన తెలంగాణావాదులు, తెలంగాణాకు చెందిన సంజయ్ బారు ఆ సభలో పాల్గొనడంపై మరింత ఆగ్రహంతో ఉన్నారు.   పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న సంజయ్ బారు మాట్లాడుతూ, తనని ఆ సభలో పాల్గొనవద్దని హెచ్చరిస్తూ తనకు అనేక ఈ మెయిల్స్ వచ్చినట్లు తెలిపారు. అయినా కూడా వ్యక్తుల భావప్రకటన స్వేచ్చను గౌరవిస్తున్న కారణంగా అయన ఈ సభకు హాజరయినట్లు తెలిపారు. పుస్తకంలో వివిధ అంశాలతో తానూ పూర్తిగా ఏకీభవించకపోయినా, పూర్తిగా నిరాకరించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణా ప్రజలలో రాష్ట్రం ఏర్పడాలనే బలమయిన కాంక్ష ఉందని పేర్కొంటూనే కేవలం సెంటిమెంటు కారణంగానే రాష్ట్రాలు విభజించుకుపోవడం మంచిదికాదని అయన అన్నారు.   వెనకబాటుతనం, నీటి సమస్యల గురించి ప్రస్తావిస్తూ దానికి కారణం రాష్ట్రాన్ని పరిపాలించిన మంత్రులు, ముఖ్యమంత్రులదే బాధ్యత అన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుండి కూడా మంత్రులు, ముఖ్య మంత్రులు పాలన చేసినా వారి నిర్లక్ష్యం, అలసత్వం కారణంగానే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు వెనకబడిపోయున్నాయని అయన అన్నారు. అందువల్ల, కొత్త రాష్ట్రాల ఏర్పాటు కన్నా, రాష్ట్రాభివృద్దే ముఖ్యమని అయన అన్నారు. తమవల్లే హైదరాబాదు అభివృద్ధి చెందిందని వాదించే వారిని విమర్శిస్తూ ముంబై, గుజరాత్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత, హైదరాబాదులో భారీ ప్రభుత్వ సంస్థల స్థాపన జరగడంవల్లనే అందరూ హైదరాబాదు వైపు ఆకర్షితులయ్యి చిన్న పరిశ్రమల స్థాపనకు దోహదపడ్డారని అయన అన్నారు.   అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణాలోను వ్యాపించి ఉన్న తమ కుటుంబం రెండు ప్రాంతాల మద్య వారధి వంటిది కనుక, తానూ నిర్ద్వందంగా మాట్లాడేందుకు అన్ని విధాల అర్హుడినని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన సమస్యపై సలహా ఇచ్చేందుకు నియమించిన జస్టిస్ శ్రీ కృష్ణా కమిటీ సర్వోతమయిన సూచనలు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

హర్యానా మాజీ సీఎం కు పదేళ్ళ జైలు శిక్ష

      ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ చౌతాలాలకు పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించి చౌతాలాను పోలీసులు వారం రోజుల క్రితం అరెస్టు చేశారు. ఈ కేసులో చౌతాలా, ఆయన తనయుడితో పాటు 53 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ రోజు నిందితులకు శిక్షను విధించింది.   అంతకముందు దక్షిణ ఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలోని కోర్టు వద్ద చౌతాలా మద్దతుదారులు ఆందోళనకు దిగారు. పోలీసుల పైకి వారు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల పైకి భాష్పవాయువు ప్రయోగించారు. లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు. చౌతాలాకు శిక్షను ఖరారు చేయడానికి ముందు కోర్టు వద్ద ఆయన మద్దతుదారులు భారీగా తరలి వచ్చి ఆందోళన చేపట్టారు. చౌతాలా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హర్యానాలో 3000 మంది ఉపాధ్యాయులను అక్రమంగా నియమించారనే ఆరోపణలున్నాయి. ఒక్కో అభ్యర్థి తమ ఎంపిక కోసం రూ.3, 4 లక్షలు లంచంగా ఇచ్చినట్లు తేలింది.

"హైదరాబాద్'' ప్రత్యేక రాష్ట్ర నినాదం వెనక రహస్యం!

-డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]         "ఆలూ, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం'' అని ముందుగానే పెళ్ళిగాని ఓ ఉత్సాహవంతుడు పేరు పెట్టుకున్నాడట! అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్య ఒక కొలిక్కి రాలేదు, వచ్చే లక్షణాలు కూడా కనిపించడం లేదు. దానికితోడు జైపూర్ సమావేశాల్లో కాంగ్రెస్ అధిష్టానవర్గం చర్చలలో కూడా తెలంగాణా సమస్యే ఒక ప్రధానాంశంగా ప్రస్తావనకు సహితం రాలేదని పత్రికలూ వార్తలు మోసుకొచ్చాయి. ఈ సందర్భంలోనే రాష్ట్ర మంత్రివర్గంలో హైదరాబాద్ మంత్రులయిన దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ ఒక సంచలన ప్రకటనతో ముందుకొచ్చారు. " ఆంధ్రప్రదేశ్ ను విభజించే పక్షంలో హైదరాబాద్ నగరాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి'' అని ప్రకటించారు [16-01-2013]! ఒక రకంగా వారు తమ వాదనకు చెప్పిన కారణం కూడా చూడ్డానికి సబబుగానే ఉన్నట్టుతోస్తుంది. రాష్ట్రానికి రాజధానిగా గత 56 ఏళ్ళనుంచి ఉన్న మహానగరాన్ని ఇలా "ప్రత్యేక రాష్ట్రం''గా గుర్తించాలన్న ఈ మంత్రుల కోర్క వెనక ఓ వాస్తవం దాగి ఉంది. తెలంగాణాలోని వేర్పాటువాదులుగా మారిన కొందరు రాజకీయ నిరుద్యోగులు - "తెలుగువారైన ఆంధ్రులంతా తెలంగాణా నుంచి హైదరాబాద్ నుంచీ వెళ్ళిపోవాలి, హైదరాబాద్ మాది, సీమాంధ్రుల శ్రమతోనూ, పెట్టుబడులతో నిర్మించింది కాదు, తెలంగాణా ప్రజల కష్టార్జితం హైదరాబాద్'' అంటూ ఇటీవల కొంతకాలంగా నినాదాలు వల్లిస్తున్నారు. కాని పెడమార్గం పట్టిన ఈ రాజకీయ నిరుద్యోగుల వాదనలోని డొల్లతనాన్ని తెలంగా బిడ్డలే అయిన ఆ ఇరువురు మంత్రులూ ఇలా బయటపెట్టారు. "హైదరాబాదు, సికింద్రాబాదు జంటనగరాల్లో భారతదేశంలోని అన్నివర్గాలు, మతాలు, కులాలు, వివిధ ప్రాంతాలకు చెందినవారు నివసిస్తున్నారు. అందువల్ల ఒకవేళ రాష్ట్రాన్ని విభజించవలసివస్తే నగరవాసులకు సకల ప్రయోజనాలు చేకూరేలా చర్యలు తీసుకోవాలి. అందుకే హైదరాబాదు మహానగరాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి'' [16-01-2013 నాటి ప్రకటన]! నాగేందర్, ముఖేష్ గౌడ్ ళ ప్రకటన పూర్వరంగంలో, తెలుగుజాతి ఐక్యతను భగ్నం చేసే రాజకీయ నిరుద్యోగులు తమ వేర్పాటువాదం చాటున పచ్చిఅబద్ధాలూ, విషప్రచారంతోటి తెలుగు ప్రజల పైననే చేస్తున్న సందర్భంలో ఒక ముఖ్యవిషయం మరుగున పడుతోందని గమనించాలి. మొత్తం ఉభయప్రాంతాలలోని తెలుగుజాతికి బద్ధశత్రువులుగా రాజ్యాలు ఏలిన పాలనావ్యవస్థలు రెండూ [నిజం, బ్రిటిష్ రాజ్యవ్యవస్థలు] పరాయివాళ్ళవే, ఆ పాలనల కింద నలిగిపోయిన వారిలో తెలుగువారితో పాటు మహారాష్ట్రులూ, కన్నడిగులు కూడా ఉన్నారు. కాగా, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కన్నడిగులూ, మహారాష్ట్రీయులూ తమతమ భాషా రాష్ట్రాలలో విలీనమైపోయారు. అదే ప్రాతిపదికపైన ఆంధ్రప్రదేశ్ భాషా రాష్ట్రంలో విలీనమైపోయిన వారు పరాయి పాలనలలో మగ్గిన ఇరుప్రాంతాల (ఆంద్ర, హైదరాబాద్ సంస్థానంలోని తెలుగుప్రజలంతా)ప్రజలూ, రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాదును అభివృద్ధి చేయడంలో నాగేందర్, ముఖేష్ గౌడ్ లు చెప్పినట్టుగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారినేగాక, పంజాబీలు, రాజస్థాన్, మహారాష్ట్ర మార్వాడీలు, సింథీలు, కాశ్మీరీలు, తమిళులూ, అన్ని ప్రాంతాల ఎన్.ఆర్.ఐ.లూ కూడా బహుళసంఖ్యలో ఉన్నారు. అయినప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న కొందరు 'వేర్పాటు'వాదం చాటున దాటి తోటి తెలుగువారిపైనే విరుచుకుపడడం దేనికి? ప్రతి విషయాన్నీ వివాదాస్పదం చేయవలసిన అవసరం ఏమొచ్చింది. హైదరాబాద్ అభివృద్ధిలో తెలంగాణాలోని మోతుబరులుసహా ఇతర ప్రాంతాలలోని సంపన్నులైన సోదర తెలుగు మోతుబరులు కూడా ఉన్నారు. వాటితోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన, ఉపాధికోసం పొట్టచేత పట్టుకుని జంటనగరాలలో అంతే స్థితిలో ఉన్న పేదబడుగువర్గాలతో కలిసి రెక్కలు ముక్కలు చేసుకుని బతుకులీడుస్తున్నవారు బహుళ సంఖ్యలోనే ఉన్నారు. అయినా, తెలుగువారి రాజధానీ నగరంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న తెలుగేతర రాష్ట్రాలకు చెందిన వారిని మినహాయించి వేర్పాటువాదులు సోదర తెలుగువారిపైన కాలుదువ్వడానికి సాహసించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పగలరా? ఈ బాపతు ప్రచారకులు చరిత్రను మరిచిపోతున్నారు. మాహారాష్ట్ర, కర్నాటక యుద్ధాలలో దక్కన్ యుద్ధాల్లో దేశీయ రాజుల మధ్య కుమ్ములాటల్లో తలదూర్చి అస్తవ్యస్థ పరిస్థితులను దేశంలో సృష్టించిన ఫ్రెంచి, బ్రిటిష్ సామాజ్యశక్తులు రెండు విదేశీ వర్తకవాణిజ్య కంపెనీలను (ఫ్రెంచి-బ్రిటిష్) రంగంలోకి దించి ఇతోధికంగా 18-19 శాతాబ్దాలల్లో మొత్తం దక్కన్ భూభాగమంతటా ప్రజలను దోచుకు తిని, పిప్పిపిప్పి చేసి వదిలిన ఘట్టాలను వేర్పాటువాద సోదరులు మరిచిపోతున్నారు. లేదా మభ్యపెడుతున్నారు! ఫ్రెంచివాళ్ళను తరిమేసి దక్కన్ లో పాగావేసిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దాని రాజకీయాధికార వ్యవస్థ అయిన బ్రిటిష్ పాలనాశక్తి పరమాధికార శక్తిగా ఇండియాలో అవతరించిన దరిమిలా ఇంగ్లీషువారిని అంటకాగినవారు నిజం పాలకులు, కర్నాటక, మహారాష్ట్రులతో నిత్యం తగాదాలతో ఉన్న నిజం పాలకులకు, బ్రిటిష్ వాళ్ళకి పొత్తు కుదిరింది. ఫలితంగా తమ రాజ్యప్రయోజనాల కోసం ఉభయులూ చేతులుకలిపారు. ఆ వూపులో ఉత్తర సర్కారుల(కోస్తా)ను, రాయలసీమ జిల్లాలనూ నిజం పాలకులు స్వార్థప్రయోజనాలకోసం "అత్తసొమ్మును అల్లుడు దానం చేసిన''ట్టుగా బ్రిటిష్ వాడికి కట్టబెట్టి, అపారమైన పరిహారం పొంది, బలిశారన్న సంగతి వేర్పాటువాదులకు పరగడుపు అయిపోతే ఎలా? మైసూర్ యుద్ధాల్లో తాను కాజేసిన ప్రాంతాలను కూడా నిజంపాలకులు బ్రిటిష్ వాడికి డబ్బులకోసం అమ్మేశారన్న 'యాది'కూడా వేర్పాటువాదులకు లేకపోవడం హాస్యాస్పదం కాదా? తెలుగుప్రజల భూభాగాల్ని బ్రిటిష్ వాడికి అమ్మియా సొమ్ము చేసుకున్న పాపపు సంపదతోనే, తెలుగుప్రజల కష్టార్జితాన్ని తాకట్టుపెట్టిన ఫలితమే హైదరాబాద్ కు సోకులు దిద్దాడని మరచిపోరాదు. ఇప్పటికైనా వెనుతిరిగి చరిత్ర పాఠాలను చదివి, గుణపాఠం నేర్చుకుని బాధ్యతాయుత పౌరులుగా మెలగగలరని మనం ఆశించవచ్చా? మరికొన్ని విషయాలను వచ్చే ఆర్టికల్ లో వివరిస్తాను ....

తెలంగాణా ఇస్తే సంతోషమే, కానీ...

తెలంగాణా ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో కూడా సమైక్యాంధ్రకి అనుకూలంగా మాట్లాడిన ఒకరిద్దరు కాంగ్రెస్ తెలంగాణా నేతల్లో మంత్రి దానం నాగేందర్ కూడా ఒకరు. అయన ఇంతవరకు ఏరోజూ కూడా మిగిలిని తెలంగాణా కాంగ్రెస్ నేతలతో కలిసి ఉద్యమాల బాట పట్టలేదు కూడా. అయితే, ఇక నేడో రేపో కేంద్రం తెలంగాణాకి అనుకూలంగా ప్రకటన చేయబోతోందని బలమయిన సంకేతాలు వెలువడుతున్న ఈ తరుణంలోకూడా ఇంకా తెలంగాణాకి వ్యతిరేఖంగా మాట్లాడి మరింత మంది శత్రువులను పోగేసుకోవడం ఎందుకనుకోన్నారో మరేమో, ఆయన ఈ రోజు హైదరాబాదులో మీడియావారితో మాట్లాడుతూ “ఇంతవరకూ నేనెప్పుడూ తెలంగాణాకి వ్యతిరేఖంగా మాట్లాడలేదు. ఆవిధంగా మాట్లాడిన లాగడపాటి రాజగోపాల్ వంటి వారివల్లనే తెలంగాణా ఉద్యమాలు మరింత తీవ్రతరమయ్యాయి. అటువంటి వారిని తప్పు పట్టకుండా నన్ను వేలెత్తి చూపడం చాల తప్పు. కేంద్రం హైదరాబాదుని ఎక్కడ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేస్తుందో అనే ఆదుర్దతో నేను హైదరాబాదుని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరాను తప్ప, తెలంగాణా వద్దని గానీ, దానిని తెలంగాణాకి రాజధానిగా చేయోద్దనిగానీ నేనెన్నడూ అనలేదు. తెలంగాణా ఇస్తే నాకంటే సంతోషించేవారుండరు అని ఖచ్చితంగా చెప్పగలను. కానీ, మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకొన్న నేను కట్టుబడి ఉంటాను. అది ప్రత్యేక తెలంగాణా అయిన సమైక్యంద్రా అయినా సరే.”

ఓవైసీ అరెస్టు: పాతబస్తీలో టెన్షన్ టెన్షన్

        ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అరెస్ట్‌కు నిరసనగా పార్టీ కార్యకర్తలు బంద్‌కు పిలుపు నిచ్చారు. బలవంతంగా షాపులను మూసివేయిస్తున్నారు. బంద్ చేయని దుకాణాలపై రాళ్లతో దాడి చేశారు. పలుచోట్ల దుకాణాదారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. కవరేజీకి వెళ్లిన మీడియాపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. దీంతో పాతబస్తీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాతబస్తీలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. పాతబస్తీలో పరిస్థితిపై సీపీ అనురాగశర్మ మాట్లాడుతూ చిన్నచిన్న ఘటనలు మినహా పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశించారు. ఎలాంటి ఘటనలనైనా ఎదుర్కుంటామని సీపీ అనురాగ్‌శర్మ తెలిపారు.  

లగడపాటిగారి డ్రామా దేనికొరకు?

  చంద్రబాబు పాదయాత్ర ఈ రోజు కృష్ణ జిల్లాలో ప్రవేశించబోతున్న తరుణంలో విజయవాడ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వీరంగం ఆడేసి మీడియాలోతెలుగుదేశంపార్టీ గురించీ సమైక్యాంద్ర గురించీ చాలానే మాట్లాడారు. అయితే, తెలంగాణాపై తన కాంగ్రెస్ పార్టీ మరో వారం రోజుల్లో తన నిర్ణయం ప్రకటించబోతుంటే, అయన ఇప్పుడు చంద్రబాబు వెంట ఎందుకుపడుతున్నారు? చంద్రబాబుని ఇప్పుడు సమైక్యాంద్రాకి ఒప్పిస్తే కేంద్రం మళ్ళీ తెలంగాణాను పక్కన బెడుతుందా? కాంగ్రేసుపార్టీలో ఆయనొక్కడే ఎందుకు ఇంత హడావుడి పడిపోతున్నారు? అసలు కాంగ్రెస్ అధిష్టానమే అయన వెనకుండి ఈ డ్రామా అంతా నడిపిస్తోందా?అంతిమంగా దీనివల్ల లాభపడేది ఎవరు, నష్టపోయేవారెవరు? చిన్నగా మొదలయిన ఆయన డ్రామా వెనుక ఇటువంటివి చాలా ప్రశ్నలే ఉన్నాయి.   మరొక్క వారం రోజుల్లో రాష్ట్రవిభజనపై ప్రకటన వెలువడనున్న ఈ సమయంలో, ప్రకటన వెలువడక మునుపే, ఇటువంటి డ్రామాతో తెలుగు దేశం పార్టీని ఇబ్బందికరమయిన పరిస్థితుల్లోకి నెట్టి రెండు ప్రాంతాలలో ఆ పార్టీని దెబ్బతీయాలనే ఆలోచన ఒకటి కనిపిస్తుండగా, కేంద్రం సమైక్యాంద్రాకి అనుకూలంగా నిర్ణయం తీసుకొనే ఆలోచన చేస్తుంటే, సీమంద్రాలో ఇటువంటి హంగామా చేయడం ద్వారా వేడిరాజేయగలిగితే ఈ సాకుతో తెలంగాణా ప్రకటనను పక్కనపెట్టేందుకు బలమయిన కారణం కాంగ్రెస్ పార్టీకి దొరుకుతుంది.   ఇక, లగాడపాటే ఎందుకు ముందుకు ఉరుకుతున్నారంటే, సమైక్యవాదిగా అయన ఇప్పటికే అందరికీ సుపరిచితుడు గనుక, అయన తన వాదనతో చంద్రబాబుకి అడ్డుపడి గొడవ సృష్టించగలిగితే కాంగ్రెస్ పార్టీకి లాభమే తప్ప కొత్తగా వచ్చే నష్టం ఏమి ఉండదు. అయన చంద్రబాబుని నిలవరించగలిగితే, కోస్తాలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరగడమే గాకుండా, తెలుగు తమ్ముళ్ళ మద్య విభేదాలు పుట్టుకొస్తాయి. చంద్రబాబు నిర్ణయాన్ని సమర్దించేవారు, సమైక్యాంద్రకోసం పార్టీతో విభేదించేవారు రెండువర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈవిధంగా రెండు వర్గాలను సృష్టించగలిగితే, కాగల కార్యం గంధర్వులే చేసినట్లు తెలుగుదేశం పార్టీని వారే కుప్పకూల్చుకొంటారనే ఆలోచనతో లగడపాటి ఈ డ్రామా మొదలుపెట్టి ఉండవచ్చును.   ఇక, కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయం ప్రకటించే సమయంలో రాష్ట్రంలో పూర్తీ ప్రశాంతత కోరుకొని ఉంటే, లగడపాటిని ఇంతవరకు వెళ్ళనిచ్చేదికాదు. బహుశః సమైక్యాంద్రాకి అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నందునే లగడపాటిని తెరవెనుకనుండి కాంగ్రెస్ అధిష్టానమే ఆడిస్తోందేమో అని అనుమానం ఉంది.   ఒకవేళ, కాంగ్రెస్ అధిష్టానంకి ఎటువంటి సంబంధంలేకుండా ఆయన తనంతట తానే ఇదంతా చేస్తుంటే, రాష్ట్రం విడిపోక మునుపే సమైక్యాంద్రా కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడిగా ప్రజలలో మంచిపేరు తెచ్చుకొంటే, ఆనక రాష్ట్రం విడిపోయినప్పుడు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి పోటీలో అందరికన్నా ముందు తానే ఉండవచ్చుననే ఆలోచనతో ఆయన ఈ హంగామా చేస్తున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.   చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా డిల్లీకి పరిగెత్తే కాంగ్రెస్ పెద్దలు, ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండా, దాని అనుమతి లేకుండా ఈడ్రామా చేస్తున్నారని అనుకోలేము.

లగడపాటికి టిడిపిలోకి ఆహ్వానం

        తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు ఆరాటపడుతున్న విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కావాలంటే తమ పార్టీ లోకి రావచ్చని తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆహ్వానం పలికారు. పాదయాత్రలో బాబును కలిసి కనువిప్పు కలిగిస్తామని లగడపాటి చెప్పడం విడ్డూరమన్నారు. లగడపాటి చీప్ ట్రిక్స్ మానుకోవాలన్నారు. ఆయన నోటికి తాళం ఎలా వేయాలో తమకు తెలుసన్నారు. బాబు పర్యటన ఆపే దమ్ము, ధైర్యం లగడపాటికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఆయన కలవాల్సింది తమ పార్టీ అధినేతని కాదని, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను అన్నారు. బాబు అపాయింట్మెంట్ కావాలంటే లగడపాటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తమ పార్టీలో చేరాలన్నారు.

ప్రజలకోసం పనిచేసేవాళ్లకే ప్రాధాన్యం: రాహుల్ గాంధీ

        జైపూర్‌ చింతన్ శిబిర్‌లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారిగా ప్రసంగించారు. పార్టీలో తనకు అరుదైన గౌరవం లభించిందని, ఎనిమిదేళ్లుగా పార్టీలో ఎంతో నేర్చుకున్నానని, సీనియారిటీతో సంబంధంలేకుండా ప్రజలకోసం పనిచేసేవాళ్లకే పార్టీలో ప్రాధాన్యముంటుందని రాహుల్ గాంధీ అన్నారు. సామాన్య కార్యకర్తనుంచి పార్టీలోని అన్ని స్థాయుల్లోనూ తనకు అందరి సహకారం లభించిందన్నారు. సెల్‌ఫోనుతో సాంకేతిక విప్లవాన్ని సాధించామని, హరితవిప్లవం దేశాన్ని సస్యశ్యామలం చేసిందని, సంస్కరణల ఫలం సామాన్యుడికి దక్కిందనేందుకు సెల్‌ఫోన్ వినియోగమే నిదర్శనమని రాహుల్ చెప్పారు. గాంధీజీ సిద్ధాంతాలే తమ విధానాలని, ప్రజల మనోభావాలను అత్యంత గౌరవిస్తామని, అవినీతి నిర్మూలనకు తమ పార్టీ కట్టుబడి ఉందని, అధికార వికేంద్రీకరణ చేయాల్సిన అవసరముందని రాహుల్ అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రజలందరికీ కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. సంక్షేమ పథకాల ప్రయోజనం రూపాయికి 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయని తన తండ్రి అభిప్రాయపడేవారని, 99 శాతం ప్రజలకు చేరేలా చర్యలు చేపట్టామని రాహుల్ చెప్పారు. ఆధార్, నగదు బదిలీ వల్ల 100 శాతం ప్రయోజనం చేకూరుతోందన్నారు. కాంగ్రెస్ లౌకికవాద పార్టీ అని, భవిష్యత్తులో దేశానికి మంచి నాయకులను కాంగ్రెస్ పార్టీ తయారుచేస్తుందన్నారు. పార్టీలో పనిచేసేవారికే ప్రాధాన్యముంటుందని, పనిచేయనివారికి ఒకటిరెండు సార్లు చెప్తామని, మారకపోతే మరొకరికి అవకాశమిస్తామని ఆయన అన్నారు.

బిజెపి పై షిండే సంచలన వ్యాఖ్యలు, క్షమాపణకు డిమాండ్

        జైపూర్‌లోని కాంగ్రెసు పార్టీ చింతన్ శిబిర్‌లో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి,ఆర్ఎస్ఎస్ హిందూ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. సంఝౌతా ఎక్సుప్రెస్, మక్కా మసీదు, మాలేగామ్ పేలుళ్ల వెనుక ఆర్ఎస్ఎస్ ఉందని ఆయన ఆరోపించారు. బిజెపి, ఆర్ఎస్ఎస్‌లు హిందూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని తాను ఏదో కొత్త విషయం చెప్పలేదని, ఉన్న విషయాన్నే చెప్పానని అన్నారు. షిండే వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. షిండే వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవన్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆయనపై కాంగ్రెసు చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఆయన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలన్నారు. షిండే వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు.

విశాఖ తెలుగుదేశంలో ముసలం

  వైజాగ్ లో చిన్నగా మొదలయిన తెలుగు తమ్ముళ్ళ గొడవ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు రాజీనామాతో తీవ్ర స్థాయికి చేరుకొంది. వైజాగ్ లో రెండు వర్గాలుగా చీలిపోయిన తెలుగుదేశం సభ్యులు పోటాపోటీగా సభలు పెట్టుకొని ఒకరిని ఒకరు దూషించుకొంటూన్నారు. అయ్యన్నపాత్రుడి వర్గానికి చెందిన 23మంది అనుచరులు పార్టీ సభ్యత్వానికి రాజీనామాలు చేసారు. వైజాగ్ లో ప్రముఖ కేంద్రమయిన గాజువాక తెలుగుదేశం పార్టీ విభాగానికి ఇన్-చార్జ్ కోన తాతారావు, శాసన సభ్యుడు రామకృష్ణ కూడా రాజీనామా చేసారు. అయ్యన్నపాత్రుడు స్వస్తలమయిన నర్సీపట్నంలో ఈ రోజు సాయంత్రం వారు సమావేశమయి తమ తదుపరి కార్యక్రమాన్ని ప్రకటించనున్నారు. అయ్యన్నపాత్రునికి మద్దతుగా మరి కొంతమంది శాసనసభ్యులు, కార్పొరేటర్ లు కూడా ఈ రోజు రాజీనామాలు చేసే ఆలోచనలో ఉన్నారు.   మరో వైపు బండారు సత్యనారాయణ వర్గీయులు కూడా సమావేశాలు నిర్వహిస్తూ, పీల శ్రీనివాస రావు మరియు అయ్యన్న పాత్రుని వర్గంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. జిల్లా ఇన్-చార్జ్ సుజన చౌదరి రెండు వర్గాలతో సంప్రదింపులు చేస్తున్నపటికీ, తమ అనుచరుడిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన తరువాత ఇక మాట్లాడేందుకు ఏమి లేదంటూ అయ్యన్నపాత్రుడు ఆయనతో మాట్లాడేందుకు నిరాకరించినట్లు సమాచారం. నల్గొండలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొంటూ, పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమయిన సూచనలు చేస్తున్నారు. అయన అయ్యన్న పాత్రుడి రాజీనామాను తిరస్కరించారు.

టిడిపి నుంచి పీలా శ్రీనివాస్ సస్పెన్షన్

        విశాఖ తెలుగు తమ్ముళ్ల పై టిడిపి అధిష్టానం కన్నెర్ర జేసింది. విశాఖ జిల్లా పెందుర్తిలో ఎన్టీఆర్ వర్థంతి సభ రసాభాసగా మారింది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మీద పీలా శ్రీనివాసరావు వర్గం దాడి చేసింది.   బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అతికష్టం మీద అక్కడి నుండి తప్పించారు. ఈ వ్యవహారంపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పీలా శ్రీనివాస్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. సత్యానారాయణ మూర్తి మీద దాడి చేసిన విషయం తెలియగానే హీరో బాలకృష్ణ ఆయనను ఫోన్ లో పరామర్శించారు. వెంటనే పార్టీ నేతలను సంఘటనపై విచారణకు ఆదేశించారు. బాలకృష్ణ చొరవ మూలంగానే పీలాను పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.

విజయమ్మ వాకిట్లో అవినీతి చెట్టు

    ఇటీవల విడుదలయిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రాజకీయాలలో క్షణం తీరిక ఉండని చంద్రబాబుని సైతం ఆకట్టుకొంది. ఆయన ఆ సినిమా ఇంతవరకూ చూడకపోయినా, క్యాచీగా ఉన్న ఆ సినిమా పేరుని మాత్రం బహు చక్కగా తన ప్రసంగంలో వాడుకొన్నారు. నిన్న నల్గొండ జిల్లా కోదాడ పట్టణంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ విజయమ్మ వాకిట్లో అవినీతి చెట్టు వేస్తే అది పెరిగి పెద్ద ప్యాలెస్ అయిందని,డబ్బులు విరగకాసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించడంతో ప్రజలు కడుపుబ్బా నవ్వుకొన్నారు. చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి చమత్కారంగా మాట్లాడుతూ "ఎవరైనా పుణ్యం కోసం, తమ కోరికలు తీరడం కోసం ఏ గుడికో, చర్చికో, మసీదుకో వెళ్లి కొబ్బరికాయలు కొట్టి దేవుడికి పూజలు చేస్తారు. గానీ, అదే జగన్ పార్టీలో చేరాలంటే మాత్రం చంచల్‌గూడ జైలుకు వెళ్లక తప్పదు. ఆ పార్టీలో చేరాలనుకొనే ఏ నాయకుడయినా తన రాజకీయ జీవితానికి ఆ జైల్లోనే ప్రారంభించకతప్పదు. అప్పుడే అతని కోరికలు తీరుతాయి,” అని చంద్రబాబు పలికినప్పుడు జనం పెద్దగా ఈలలువేసి చప్పట్లు కొడుతూ ఆయనని ప్రోత్సాహించారు. “కోటి సంతకాలు సేకరించిన మాత్రాన్న దోషి నిర్దోషిగా మారిపోడని” జగన్ను ఉద్దేశిస్తూ ఆయన అన్నప్పుడు కూడా ప్రజలు అదే రీతిలో స్పందించారు.   తెలంగాణా విషయంలోతెలుగుదేశం పార్టీ మళ్ళీ మాట మార్చిందని తెరాస నేతలు చంద్రబాబును తప్పుపడుతున్నపటికీ, ప్రజలు వారిని పట్టించుకోవట్లేదని చంద్రబాబు పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన ఋజువు చేస్తోంది.

చార్మినార్ నిజాం జాగీర్ కాదు: జగ్గారెడ్డి

      ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీ అసేంబ్లీ, చార్మినార్, ఎర్రకోట, తాజ్ మహల్ ల గురించి, అసేంబ్లీలో మహాత్మాగాంధీ విగ్రహం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం పై జగ్గారెడ్డి మండిపడ్డారు. చార్మినార్, అసెంబ్లీ, తాజ్ మహల్, ఎర్రకోట మావే అని చెప్పేందుకు అది మజ్లిస్, రజాకార్ల జాగీర్ కాదని, అవి పూర్తిగా ప్రజల సొమ్ముతో కట్టినవని అన్నారు. మరో సారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా పాషాఖాద్రీ మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. దేశ స్వాతంత్రం కోసం కృషిచేసిన మహాత్మగాంధీ గురించి మాట్లాడిన అతనిపై చట్టపరమయిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను అందరూ ఖండించాలని, ఇకముందు ఇలాగే మాట్లాడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

వెంట్రుకపై వివరణ ఇచ్చిన రామ్ చరణ్

        ‘నాయక్’ ఆడియో విడుదల వేదికపై మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ తేజ మీడియా పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'రచ్చ' ఆడియో ఫంక్షన్ కు బాబాయ్ పవన్ కళ్యాణ్ రాలేదని ఓ పత్రిక, ఓ ఛానల్ వార్తలు రాసి మా కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు పలు కథనాలు అల్లారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ కు బాబాయ్ వచ్చాడు. నాన్న రాలేకపోయాడు. ఈ వేదిక మీద నాన్న లేని లోటును బాబాయ్ తీర్చాడు. నా తరువాతి ఫంక్షన్ కు బాబాయ్ రాకపోవచ్చు. మా అనుబంధాల గురించి అడ్డగోలుగా రాసే ఆ పేపర్, ఛానల్ వార్తలు నా వెంట్రుకతో సమానం” అని తెరపై చెప్పాల్సిన డైలాగులు స్టేజిపై చెప్పారు. ఇప్పుడు రామ్ చరణ్ సడన్ గా గేర్ మార్చాడు. తాను చేసిన వ్యాఖ్యలపై మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. ఎవరైతే మాపై ఆ రాతలు రాశారో నేను వాళ్ళను ఉద్దేశించే అన్నాను తప్ప మీడియా మొత్తాన్ని కాదని చెప్పారు. "ఐ లవ్ మీడియా..ఐ రేస్పెక్ట్ మీడియా" రోజు షూటింగ్ లో ఎంత బిజీగా వున్న ఒక గంట మీడియా కు కేటాయిస్తానని చెప్పారు. రామ్ చరణ్ కు ఉన్నట్లుండి మీడియాపై ఎనలేని ప్రేమ ఎందుకు పొంగుకొంచ్చిందో మరీ..!

చంద్రబాబుని శపిస్తున్న లక్ష్మీ పార్వతి

  స్వర్గీయ ఎన్.టి.రామారావుగారి హయంలో అటు తెలుగుదేశం పార్టీన్ని, ఇటు నందమూరి కుటుంబాన్ని ఒక ఆట ఆడుకొన్న లక్ష్మీపార్వతి, అయన పోయిన తరువాత రెంటికీ చెడిన రేవడిగా మిగిలిపోయింది. అన్న తెలుగుదేశం పార్టీ పెట్టి కనీసం తానూ కూడా గెలవలేక చతికిలబడింది. నందమూరి కుటుంబాన్ని ఎంత మంచి చేసుకొందామని ప్రయత్నించినా ఎవరూ కూడా స్పందించకపోవడంతో, ఏక సభ్య పార్టీగా కొంత కాలం పార్టీని నడిపించి చివరికి జగన్ పార్టీలో తెలిందామె. అయితే, ఆమె ఆవేశం, ఆక్రోశం ఎన్నటికీ చల్లారేది కాదని అందరికి తెలుసు. ఈ రోజు తన భర్త నందమూరి తారకరామారావు గారి 17వ వర్ధంతి సందర్భంగా ఆమె ఈ ఉదయం యన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు.   ఆ సందర్బంగా మీడియవారితో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆరిపోయే దీపం అని చెపుతూ చంద్రబాబు నాయుడుకు తన భర్త యన్టీఆర్ శాపం తగిలినందునే ఈనాడు ఈ విధమయిన కష్టాలు అనుభవిస్తున్నాడని ఆమె అన్నారు. అంతేగాకుండా, ఆమె తెలుగుదేశం పార్టీ జాతకం కూడా చెప్పారు. ఆంధ్ర, తెలంగాణా, జగన్ మోహన్ రెడ్డిల వల్ల, వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నారు. రేపు జగన్ పార్టీ కూడా ఆమెకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇలాగే శాపాలు పెడుతుందేమో తెలియదు.