Read more!

ప్రజలకోసం పనిచేసేవాళ్లకే ప్రాధాన్యం: రాహుల్ గాంధీ

 

 

 

 

జైపూర్‌ చింతన్ శిబిర్‌లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారిగా ప్రసంగించారు. పార్టీలో తనకు అరుదైన గౌరవం లభించిందని, ఎనిమిదేళ్లుగా పార్టీలో ఎంతో నేర్చుకున్నానని, సీనియారిటీతో సంబంధంలేకుండా ప్రజలకోసం పనిచేసేవాళ్లకే పార్టీలో ప్రాధాన్యముంటుందని రాహుల్ గాంధీ అన్నారు. సామాన్య కార్యకర్తనుంచి పార్టీలోని అన్ని స్థాయుల్లోనూ తనకు అందరి సహకారం లభించిందన్నారు. సెల్‌ఫోనుతో సాంకేతిక విప్లవాన్ని సాధించామని, హరితవిప్లవం దేశాన్ని సస్యశ్యామలం చేసిందని, సంస్కరణల ఫలం సామాన్యుడికి దక్కిందనేందుకు సెల్‌ఫోన్ వినియోగమే నిదర్శనమని రాహుల్ చెప్పారు.


గాంధీజీ సిద్ధాంతాలే తమ విధానాలని, ప్రజల మనోభావాలను అత్యంత గౌరవిస్తామని, అవినీతి నిర్మూలనకు తమ పార్టీ కట్టుబడి ఉందని, అధికార వికేంద్రీకరణ చేయాల్సిన అవసరముందని రాహుల్ అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రజలందరికీ కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. సంక్షేమ పథకాల ప్రయోజనం రూపాయికి 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయని తన తండ్రి అభిప్రాయపడేవారని, 99 శాతం ప్రజలకు చేరేలా చర్యలు చేపట్టామని రాహుల్ చెప్పారు. ఆధార్, నగదు బదిలీ వల్ల 100 శాతం ప్రయోజనం చేకూరుతోందన్నారు.



కాంగ్రెస్ లౌకికవాద పార్టీ అని, భవిష్యత్తులో దేశానికి మంచి నాయకులను కాంగ్రెస్ పార్టీ తయారుచేస్తుందన్నారు. పార్టీలో పనిచేసేవారికే ప్రాధాన్యముంటుందని, పనిచేయనివారికి ఒకటిరెండు సార్లు చెప్తామని, మారకపోతే మరొకరికి అవకాశమిస్తామని ఆయన అన్నారు.