Read more!

హర్యానా మాజీ సీఎం కు పదేళ్ళ జైలు శిక్ష

 

 

 

ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ చౌతాలాలకు పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించి చౌతాలాను పోలీసులు వారం రోజుల క్రితం అరెస్టు చేశారు. ఈ కేసులో చౌతాలా, ఆయన తనయుడితో పాటు 53 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ రోజు నిందితులకు శిక్షను విధించింది.

 

అంతకముందు దక్షిణ ఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలోని కోర్టు వద్ద చౌతాలా మద్దతుదారులు ఆందోళనకు దిగారు. పోలీసుల పైకి వారు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల పైకి భాష్పవాయువు ప్రయోగించారు. లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు. చౌతాలాకు శిక్షను ఖరారు చేయడానికి ముందు కోర్టు వద్ద ఆయన మద్దతుదారులు భారీగా తరలి వచ్చి ఆందోళన చేపట్టారు.



చౌతాలా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హర్యానాలో 3000 మంది ఉపాధ్యాయులను అక్రమంగా నియమించారనే ఆరోపణలున్నాయి. ఒక్కో అభ్యర్థి తమ ఎంపిక కోసం రూ.3, 4 లక్షలు లంచంగా ఇచ్చినట్లు తేలింది.