గ్యాస్ డబ్బులకి కక్కుర్తి పడిన కేంద్రం

    ఇంతకాలం ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లను ఇస్తున్న కేంద్రం కొద్ది నెలలక్రితం ఆయిలు కంపెనీల ఒత్తిళ్ళకి లొంగిపోయి, ఒకేసారి 6సిలిండర్లు కోత విధించేసింది. అంతటితో ఊరుకోకుండా ఒక కుటుంబానికి కేవలం 6సిలిండర్లు బహు చక్కగా సరిపోతాయని సెలవిస్తూ, అంతకంటే ఎక్కువ అనవసరం అన్నట్లు మాట్లాడింది. ఆపైన ఒక్క సిలిండరు ఇచ్చినా ఆయిలు కంపెనీలకు వందల, వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుందని ఆయిలు కంపెనీల తరపున వఖల్తా పుచ్చుకొని మరీ మాట్లాడింది. అయితే, కేంద్ర నిర్ణయానికి యావత్ దేశ ప్రజలే కాక, తమ స్వంత పార్టీ వారు సైతం తీవ్ర అభ్యంతరం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ సందిగ్ధంలో పడింది.   అంత భారాన్ని మోయలేనని చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ మొన్న గుజరాత్ ఎన్నికల సమయంలో వోట్లు దండుకోవడానికి సిలిండర్లు మళ్ళీ 9కి పెంచేందుకు సిద్ధం అయినప్పుడు, ఎన్నికల కమీషన్ కొరడా జళిపించడంతో వెనక్కి తగ్గింది. అంటే, తనకు లాభం వస్తుందంటే ఓట్ల కోసం ఎరగా వేసి, అది ఎంత భారమయినా భరించగలదని పరోక్షంగా తెలియజేసింది.   గత కొన్నిదశాబ్దాలుగా ప్రభుత్వం తరపున వడ్డింపు వార్తలే తప్ప చిన్న శుభవార్తకి కూడా నోచని భారత ప్రజలకి, ఎన్నికలు ముంచుకొస్తున్నపుడు మాత్రమే ఏచిన్న శుభావార్తయినా వినే అవకాశం కలుగుతుంటుంది. మళ్ళీ అదే కారణంవల్ల ఈ రోజు ప్రజలకి మరో శుభవార్త వినే అవకాశం కల్గింది. పెట్రోలియం శాఖామాత్యులు వాయిలార్ రవి ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రస్తుతం ఇస్తున్న 6 గ్యాస్ సిలిండర్లను 9కి పెంచబోతున్నట్లు డిల్లీలో నేడు ప్రకటించేరు. ఏప్రిల్ 1వ తేదీ నుండి అనే ప్రకటన వెనుక ఈ నాలుగు నెలలు కూడా ప్రజలనుండి ఎంత వీలయితే అంతా పిండుకొందామనే దురాశ కూడా కనిపిస్తోంది.   ధరలు పెంచేటప్పుడు అర్ధరాత్రి నుండే అమలు చేసే ప్రభుత్వం, ప్రజలకి మేలుచేసే నిర్ణయాలను మాత్రం అమలు చేయడానికి ఈ విధంగా మీనమేషాలు లెక్కపెట్టుకోవడం దాని నైజాన్ని తెలియజేస్తోంది.

తెలుగుదేశానికి కలిసొచ్చిన నల్గొండ బాబు పాదయాత్ర

  గత కొన్ని రోజులుగా చంద్రబాబుపై అలిగి ఆయన పాదయత్రకి, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్న తెలంగాణానేత మోత్కుపల్లి నరసింహులు, ఈరోజు నల్గొండ జిల్లాలో అడుగుపెడుతున్న చంద్రబాబుతో ఆయన ఏవిదంగా వ్యహరిస్తారనే అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్న తరుణంలో, నరసింహులు స్వయంగా ఖమ్మం సరిహద్దు గ్రామం నేలకొండపల్లి మండలం పైనంపల్లికి వెళ్లి పార్టీ అధ్యక్షుడికి స్వాగతం పలికేరు. చంద్రబాబు కూడా ఆయనను ఆప్యాయంగా పలకరించడంతో స్థానిక నేతలు, కార్యకర్తలు కూడా చాలా సంతోషించారు. మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ తమ మద్య విభేదాలేవి లేవని, తానూ కూడా తమ నాయకుడితో కలిసి పాదయాత్రలో పాల్గొంటానని అన్నారు.   చంద్రబాబు తన పాదయాత్రలో ముందు నల్గొండ పర్యటనని రద్దు చేసుకోన్నపటికీ, బహుశః మోత్కుపల్లిని కలుపుకుపోవాలనే ఆలోచనతోనే నల్గొండలో కూడా ఆయన పాదయాత్ర మొదలుపెట్టి ఉండవచ్చును. ఆ నిర్ణయం వల్లనే ఈరోజు మోత్కుపల్లి వంటి సీనియర్ నాయకుడు పార్టీకి దూరం కాకుండా కాపాడిందని చెప్పవచ్చును. చంద్రబాబు గనుక నల్గొండలో ప్రవేశించకుండా ముందనుకొన్నట్లు నేరుగా కృష్ణా జిల్లావైపు సాగిపోయుంటే వారిరువురి మధ్య దూరం ఆలాగనే మిగిలిపోయి, చివరికి మోత్కుపల్లి మరో పార్టీ వైపు వెళ్లేందుకు దోహదపడేది. గానీ, చంద్రబాబు నిర్ణయం పార్టీకి మేలు చేకూర్చింది.   నల్గొండ జిల్లా కోదాడ మండలం శాంతినగర్లో అడుగుపెట్టిన చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికేరు. వారితో బాటు సిపిఐ, ఎమ్మార్పీఎస్, యుటిఎఫ్ కూడా స్వాగతం పలకడం మరో విశేషం.

మంత్రి దానం కాన్వాయ్ పై దాడి..అద్దాలు ధ్వంసం

        మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద మంత్రి దానం నాగేందర్ కాన్వాయ్పై తెలంగాణవాదులు గురువారం దాడి చేశారు. దాడిలో మంత్రి వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. కాగా దాడికి పాల్పడినవారిలో ఒకరిని దానం నాగేందర్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఇస్తుందన్న సంకేతాలున్నాయని అన్న దానం నాగేందర్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఆ తరువాత రోజే ఆయన తెలంగాణ ఇస్తే హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని మరో మంత్రి ముఖేష్ గౌడ్ తో కలిసి డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతలతో కుమ్మక్కయిన దానం ఇలా మాట మార్చి తెలంగాణకు అడ్డుపడుతున్నాడని తెలంగాణ వాదులు ఆగ్రహంగా ఉన్నారు.

తెలంగాణాలో కొనసాగనున్న బాబు పాదయాత్ర

  ఖమ్మం జిల్లలో 9 రోజులు పాదయాత్ర చేసిన చంద్రబాబు, ఈ రోజు మద్యాహ్నం నల్గొండ జిల్లలో అడుగుపెట్టనున్నారు. కొద్దిరోజుల క్రితం తెలుగుదేశంపార్టీ నల్గొండ జిల్లాలో ఆయన పాదయాత్ర ఉండబోదని ప్రకటించగానే స్థానిక నేతలు, కార్యకర్తలు స్వయంగా చంద్రబాబును కలిసి తప్పనిసరిగా తమ జిల్లాలో కూడా పర్యటించమని కోరడంతో, చంద్రబాబు వారి విజ్ఞప్తి మన్నిస్తూ ఆ జిల్లాను కూడా పర్యటించాలని నిర్ణయించుకొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం తరువాత నల్గొండలో అయన పాదయాత్ర మొదలవుతుంది.   రెండు రోజుల క్రితం తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తూ అయన తెలంగాణా సరిహద్దు దాటబోతున్నాడు గనుకనే, ఇప్పుడు ఆయన పార్టీ తెలంగాణాపై మాటమార్చి సమైక్యాంద్రా అని మళ్ళీ పాతపల్లవి పాడుతోందని అన్నారు. అందువల్ల చంద్రబాబు తెలంగాణాలోనే పాదయాత్ర కొనసాగిస్తూ ఆమె సవాలును స్వీకరించినట్లు భావించవచ్చును. అయన తెలంగాణాలోనే ఉన్నందున, సీమంద్రాకి చెందిన ఆయన పార్టీ నేతలు సమైక్యాంద్రా పల్లవి ఎత్తుకొన్ననేపద్యంలో తెలంగాణావాదులు ఆయనను స్వయంగా కలిసి తెలంగాణాపై తెలుగుదేశంపార్టీ వైఖరిని మరో మారు తెలుసుకొనే అవకాశముంది.

హాటు హాట్టుగా బాలసాయి జన్మదిన వేడుకలు

  ఒక దయానందుడయిన స్వామీజీ తన భక్తురాలిని పడగదిలో అనుగ్రహిస్తే, మరో పిరమిడ్ బాబా ధ్యానం అంటూ జీన్స్ వేసి కన్నెపిల్లల నడుములు పట్టుకొని భక్తుల ముందే చిందులు వేస్తాడు. మరో బాబా తనకా డ్యాన్సులు చేయడం చేతకాక ఏకంగా ఫారిన్ సరుకునే తెప్పించి ‘సారోస్తారు..రొస్తారు..’ అంటూ సామాన్య ప్రజలకి కూడా అర్ధమయ్యే విదంగా డ్యాన్సులు చేయించి మరింత పేరుతెచ్చుకొన్నాడు.   కర్నూలులో నిన్న తన 51వ జన్మదిన వేడులను ఘనంగా జరుపుకొన్న బాల సాయిబాబా సమక్షంలోనే జరిగిన కార్యక్రమమిది. భజనలు, కీర్తనలు, సందేశాలు అంటే జనం రారనుకోన్నాడోయేమో, విదేశీ డ్యాన్సర్లను (విదేశీ భక్తులని బాబా ఉవాచ), స్వదేశీ డ్యాన్సర్ లను కూడా రప్పించి, వారి డ్యాన్సులతో ఆహుతులను అలరించాడు. డ్యాన్సులతో చిందులు పూర్తయిన తరువాత, ‘వాటేసుకో మ్మావా రాసేసుకో..’ అంటూ ఘాటయిన సినిమా పాటల కార్యక్రమం కూడా ఒకటి ఏర్పాటు చేసారు బాబాగారు.   ఈ కార్యక్రమం ద్వారా లోకానికి, ముఖ్యంగా తనను విమర్శించే వారికీ తన పలుకుబడి తెలియజేసేందుకు, అయన కొందరు రాష్ట్ర మంత్రులు, (టీ జీ. వెంకటేష్) కేంద్ర మంత్రులు (బలరం నాయక్), క్రీడాకారులు (గుట్టా జ్వాల) సినిమా పరిశ్రమకు చెందిన గాయనీ గాయకులను కూడా పాల్గొనేలా చేసారు.   కొద్ది నెలల క్రితం రాష్ట్ర రాజధానిలో సరిగ్గా డీ.జీ.పీ. ఆఫీసు ముందే ఇంజన్ పాడయి నిలిచిపోయిన ఆటోలో బాలసాయికి చెందిన 11 కోట్ల రూపాయలు పోలీసులు పట్టుకొని ఆదాయశాఖవారికి అప్పగించినప్పుడు, వారు నోటీసులు పంపినా పత్తా లేకుండా పోయిన బాలసాయిబాబా, ఆ కధని ఎలా మేనేజ్ చేసాడో గానీ మరి తరువాత ఆ ఊసే వినబడలేదు. మళ్ళీ ఇంతకాలానికి హటాత్తుగా మంత్రులతో సహా కర్నూల్ పట్టణంలో ప్రత్యక్షమవడమే గాకుండా, ఈ విదంగా ఘనంగా తన పుట్టిన రోజు వేడుకలు కూడా జరుపుకొన్నాడు.

కొండకు వెంట్రుకను ముడేసి లాగుతున్నజగన్ పార్టీ

  లోకం బాధని తన బాధగా అనుకొని మహాప్రస్తానానికి శ్రీకారం చుట్టినవాడు శ్రీశ్రీ. అయన తన మహాప్రస్తానంతో ఆ చంద్రార్కం నిలిచేపోయే కీర్తిని పొందగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన బాధను లోకం బాధగా భావించి జైల్లో ఉన్న తన నాయకుడికోసం మరో ప్రస్తానం చేసిన ఘనత సాధించింది.   జైల్లో ఉన్న ఖైదీలను కోటి సంతకాలతో విడిదల చేయించవచ్చుననే ఆలోచన ఆ పార్టీలో ఏమేధావికి కలిగిందోగానీ, కనీవినీ ఎరుగని ఒక వినుత్నమయిన కార్యక్రమానికి పురుడుపోసింది. ఆ మహాయజ్ఞం దిగ్విజయంగా పూర్తిచేసుకొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ కాగితాల కట్టలను మోసుకొనివెళ్లి రాష్ట్రపతికి సమర్పించడానికి ఈ రోజు డిల్లీ బయలుదేరుతోంది. ఈ రోజు సాయంత్రం 6.15గంటలకి రాష్ట్రపతి అపాయింట్మెంట్ పొందిన విజయమ్మ, తన పార్టీకి చెందిన పార్లమెంటు మరియు శాసన సభ్యులతో కలిసి వెళ్లి ఆయనను కలవనున్నారు.   అయితే, తమ శ్రమంతా ఏట్లో పిసికిన చింతపండేనని తెలియకనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంత శ్రమ పడిందా అంటే కాదనే చెప్పవచ్చును. నాయకుడులేని సైన్యంలా ఉన్న ఆపార్టీ నేతలు, అసలు కదలక మెదలక కూర్చొనేకంటే, ఏదో ఒక దిశలో, తమకు తోచిన దిశలో ముందుకు సాగడం తప్ప ప్రస్తుతం చేయగలిగిందేమీ లేదని గ్రహించడం వల్లనే ఇటువంటి కార్యక్రమం చేపట్టినట్లు కనిపిస్తోంది. పార్టీలో స్తబ్దత పార్టీ కార్యకర్తల దైర్యాన్ని, ఉత్సాహాన్ని కబళించకుండా కాపాడుకొనే ప్రయత్నంగా కూడా దీనిని చూడవచ్చును. ‘ఒక ఐడియాతో జీవితాన్నే మార్చేస్తుంది’ అని అనుకోన్నపటికీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిపెట్టిన ఈ కోటి సంతకాల ఐడియా జగన్ జీవితాన్నిఎంత మాత్రం మార్చబోదని వారికీ తెలిసే ఉంటుంది. కొండకు వెంట్రుకను ముడేసి లాగితే కదిలితే కొండ కదలవచ్చును, లేదా పోయేది వెంట్రుకే!

హేట్ స్పీచ్, ఆ గొంతు నాది కాదు: అక్బరుద్దీన్

        నిర్మల్ బహిరంగ సభలో చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించిన గొంతు తనది కాదని మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసును ఎదుర్కుంటున్న అక్బరుద్దీన్ను పోలీసులు మంగళవారంనాడు కూడా సుదీర్ఘంగా విచారించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు విచారణ సాగింది. "నిర్మల్ సభలో పాల్గొన్నది నేనే. అందులో కనిపిస్తున్నది నేనే. కానీ అందులో అన్న మాటలు నావి కావు. ఆ గొంతు నాది కాదు. నేను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు” అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరు్ద్దీన్ ఓవైసీ అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఓ  వర్గం మనో భావాలు దెబ్బతీశారని ఆదిలాబాద్ జైలు లో ఉంటూ పోలీసు విచారణ ఎదుర్కొంటున్న అక్బరుద్దీన్ విచారణలో భాగంగా పోలీసులతో గొంతు నాది కాదని చెప్పడం తప్పించుకోవడానికే అని తెలుస్తోంది. యూట్యూబ్ లో వచ్చే ప్రసంగాల వీడియోల ఆధారంగా కేసును రుజువు చేసే సాంకేతిక పరిజ్ఞానం మన వద్ద లేదన్న ధైర్యంతో ఆయన ఈ విధంగా వాదిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ సంధర్భంగా ఆయన అస్వస్థతకు గురికావడంతో ఓ గంట ముందే విచారణ నిలిపేశారు. ఆ తరువాత ఆరోగ్యం మెరుగుపడింది. అయితే మెరుగయిన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలని ఆయన తరపు న్యాయవాదులు పోలీసులను కోరారు.

పెళ్లినాటి ముచ్చట్లు చెబుతున్న బాలయ్య

        "నా పెళ్లయిన కొత్తలో సంక్రాంతికి అత్తారింటికి వెళితే ఉదయాన్నే నిద్దరలేపి కొబ్బరినూనె తో నలుగుపెట్టి, నదీ జలాలతో స్నానం చేయించేవారు. కొత్త అల్లుడు వారికి దైవంతో సమానం. ఆడబిడ్డ వారికి మహాలక్ష్మి. అందుకే ఆడపిల్ల భర్తకు వారు విపరీతమయిన గౌరవం ఇచ్చేవారు” అని సంక్రాంతి సంధర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ తన భార్య వసుంధరతో పెళ్లి తొలినాటి ముచ్చట్లు చెప్పుకొచ్చారు. మా తోడల్లుడు ప్రసాద్ తో కలిసి పండగకు అత్తారింటికి వెళ్లేవాళ్లం. వారి మర్యాదలకే కడుపునిండేది. ఇక వీధుల్లో పతంగులు, పిండివంటలతో సరదాగా సమయం గడిచిపోయేది అని అన్నారు. ఇక అదే సమయంలో ఆ చుట్టుపక్కల రాజమండ్రి, రామచంద్రాపురం, మండపేటలలోని బంధువుల ఇళ్లకు వెళ్లి వచ్చేవాళ్లం అని అన్నారు. రామచంద్రాపురం సమీపంలోని చెల్లూరుకు చెందిన దేవరపల్లి సూర్యారావు, ప్రమీలలు బాలకృష్ణ అత్తామామలు. బాలకృష్ణ పెళ్లయ్యాక కొన్నేళ్ల తరువాత ఆయన మామ వ్యాపార నిమిత్తం కాకినాడకు వెళ్లిపోయారు. అలా తన తొలనాళ్లలో జరిగిన మర్యాదలను బాలయ్య చెప్పుకొచ్చారు.  ఈ సంక్రాంతి బాలయ్య నారావారి పల్లెలో జరుపుకుంటున్నారు.

స్వామి కమలానంద అరెస్టు

        శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన స్వామి కమలానంద భారతిస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 8న ఇందిరాపార్కు వద్ద జరిగిన సమావేశంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్‌లోని మీర్‌చౌక్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో హైదరబాద్ నుంచి వెళ్లిన సిట్ పోలీసు బృందం కమలానందను అదుపులోకి తీసుకున్నారు.   స్వామి కమలానందను శ్రీశైలంలో అరెస్టు చేసిన పోలీసులు  హైదరాబాద్‌కు తరలించారు. విచారణ అనంతరం కమలానందను పోలీసులు సికింద్రాబాద్‌లోని జడ్జి క్వార్టర్స్‌లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రాథమిక విచారణ జరిపిన న్యాయమూర్తి స్వామిక పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు తెలిపారు. దీంతో పోలీసులు కమలానందను చర్లపల్లి జైలుకు తరలించారు. స్వామి కమలానంద భారతిస్వామిని పోలీసులు అరెస్టు చేయడంపై స్వామి స్వరూపానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల పర్వదినమైన సంక్రాంతి రోజున కమలానందను ప్రభుత్వం అరెస్టు చేయడమంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని స్వరూపానంద విమర్శించారు.

నారావారిపల్లెలో బాలయ్య సందడి

        తెలుగు హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణల తన బావ నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లారు. ప్రస్తుతం బాలకృష్ణ తన సంక్రాంతి సంబరాలను వియ్యంకుడు ఇంట్లో జరుపుకుంటున్నారు. శనివారం రాత్రి నారావారిపల్లిలోని బావ చంద్రబాబు ఇంటికి చేరుకున్న బాలయ్య అభిమానులతో కరచాలనం, నమస్కారాలు చేస్తూ సందడిగా కనిపించారు. అభిమానులు, పల్లెప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబసభ్యులు సందడిచేశారు. వీరి రాకతో గ్రామంలో ఒకరోజు ముందుగానే సంక్రాంతి పండుగ వాతావరణం కనిపించింది. మరోవైపు చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉండటంతో ఆయన ఖమ్మం జిల్లాలోనే సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సెయింట్ జోసెఫ్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు పాఠశాల ఆవరణలో భోగిమంటలు, ముగ్గుల పోటీలు, పతంగుల ప్రదర్శన, గంగిరెద్దుల ఆటలు లాంటివి ఏర్పాటుచేసి సంక్రాంతి సందడి సృష్టించారు.

కాంగ్రెస్‌కు ద్వారంపూడి రాజీనామా

          కాకినాడ అర్బన్ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఆదివారం కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశాడు. పార్టీకి రాజీనామా చేసిన అతను తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేయనని ప్రకటించారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఉద్దేశ్య పూర్వకంగా కాంగ్రెసు ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలను ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా సంక్షేమం కాంగ్రెసు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. తన రాజీనామా లేఖను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు పంపినట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కిరణ్ ప్రభుత్వాన్ని అవిశ్వాసం ద్వారా గద్దె దింపే ప్రయత్నాలు చేస్తానని వెల్లడించారు.

"సీతమ్మ వాకిట్లో..."ఈ ఆనందం ప్రత్యేకం..!

          "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" మొదటి ఆట పూర్తికాగానే మీడియా మిత్రులంతా అభినందిచడంతో నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయని దిల్ రాజు చెప్పారు. ఉదయం అలాగే చాలా మంది ఫోన్లు చేసి ఒక అద్భుతమైన, అందమైన తెలుగు సినిమా తీశారని ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. సినిమాను ఎలా ఆదరిస్తారోనని భయపడ్డాను. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు ఫోన్‌ చేసి మేమందరం మరిచిపోయిన లైన్‌ని నువ్వు సినిమాగా తీశావ్‌, దర్శకుడికి, నీకు హ్యాట్సాఫ్‌ అని చెప్పడం, మంత్రి శ్రీధర్‌బాబు ఫోన్‌ చేసి చాలా కాలం తరువాత ఓ మంచి సినిమా చూశాను, ఈ సినిమా డివిడి రాగానే నాకే ముందు పంపించు, ప్రతి రోజు చూడాల్సిన చిత్రమిదని అన్నారు. ఇద్దరి హీరోల అభిమానులు కూడా మాకు హీరోలు కనిపించలేదు, వాళ్ళ క్యారెక్టర్లు మాత్రమే కనిపించాయని చెప్పడం మరింత ఆనందాన్నిచ్చింది. మా బ్యానర్లో ఇన్ని సినిమాలు వచ్చినా ఈ సినిమాకు లభించిన ఆనందం ఇంతకు ముందు లభించలేదు” అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు.

తెలంగాణాపై కొనసాగుతున్న చర్చలు

    కేంద్రం విదించుకొన్న నెల రోజుల గడువు ముగియడానికి ఇంకా కేవలం 15 రోజుల మాత్రమే ఉంది. ఈ నెల 28వ తేదీతో ఆ గడువు ముగియగానే, కేంద్ర నిర్ణయంతో రాష్ట్ర పరిస్థితి ఏవిదంగా మార బోతుందనే ఆందోళన రాజకీయ వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ, మినీ కోర్ కమిటీ, వార్ రూమ్ మీటింగ్, మేధో మధనం అంటూ ఈ సమస్యను పరిష్కరించడానికి చాలా కష్టపడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈవిదంగా చేతులుకాలేక ఆకులు పట్టుకొనే పరిస్థితి తన చేజేతులా కొని తెచ్చుకోనదే అని చెప్పక తప్పదు. ఈ కష్టం ఏదో అదిముందే పడిఉంటే, రాష్ట్రంలో ఇంత అనిశ్చితి, ఇంత నష్టం ఉండేదికాదు. కాంగ్రెస్ కి ఈ జ్ఞానోదయం కలగడానికి రాష్ట్ర ప్రజలు చాల భారీ మూల్యమే చెల్లించేరు. ఏమయినప్పటికీ కాంగ్రెస్ ఇప్పటికయినా మేల్కొనడం సంతోషించవలసిన విషయమే.   తెరాస అధినేత కేసిర్ తో కాంగ్రెస్ అధిష్టానం తన దూతల ద్వారా చర్చిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరో వైపు, సీమంద్ర నాయకుల తాజా ప్రకటనలు చూస్తుంటే కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రం ఏర్పరచబోతోందని వారు నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గానీ, రాష్ట్ర విభజనకు పూనుకొంటే, మేము రాజీనామా చేస్తామని అప్పుడే కొందరు శాసన సభ్యులు ప్రకటనలు చేస్తుండటం గమనిస్తే, కాంగ్రెస్ ఏమి వారు చేయబోతోందో గ్రహించినట్లు తెలుస్తోంది.   కేంద్రం రాష్ట్ర విభజన విషయంలో ప్రస్తుతం పులి మీద సవారి చేస్తున్నట్లే భావించవచ్చును. అయితే, సమస్యని ఇప్పటికీ పరిష్కరించుకోలేకపోతే, అది మరింత అరాచకానికి దారి తీసి తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది. కష్టమయినా, నష్టమయినా రాజకీయ పార్టీలు పట్టువిడుపులు ప్రదర్శించి విజ్ఞత చూపినప్పుడే రాష్ట్రంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. స్వార్ద రాజకీయ ప్రయోజనాలకోసం పార్టీలు ఇంకా తెలంగాణా లేదా సమైక్యంద్ర అంటూ ఉద్యమాలు కొనసాగిస్తే రాష్ట్రం మరెన్నటికీ కోలుకోలేని దారుణ పరిస్థితులకి చేరుకొంటుంది. రాజకీయాలకు సమాంతరంగా రకరకాల వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాదించుకొంటున్న రాజకీయ నాయకులకి వీటి వల్ల ఏమీ తేడా లేకపోయినప్పటికీ, సామాన్య ప్రజలు మాత్రం వాటి దుష్పరినామాలని చిరకాలం ఎదుర్కోకతప్పదు.

పరిటాల పై రౌడీషీట్

        అనంతపురం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే కామేపల్లి సుధాకర్ రెడ్డి హత్యకు కుట్రపన్నిన కేసులో పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఇప్పటికే పోలీసులకు దొరకకుండా ఈ కేసులో బెయిలు తెచ్చుకున్న శ్రీరామ్ మీద పోలీసులు రౌడీ షీట్ తెరిచేందుకు ప్రయత్నాలు చేయడం జిల్లాలో సంచలనం రేపుతోంది. కేవలం కక్ష్య సాధింపుతోనే ఈ రౌడీ షీట్ తెరుస్తున్నారని, శ్రీరామ్ ను అనవసరంగా ఈ ఉచ్చులోకి లాగుతున్నారని పరిటాల అభిమానులు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే కామేపల్లి సుధాకర్ రెడ్డి నాకు ఎలాంటి విభేదాలు పరిటాల కుటుంబంతో లేవని పలుమార్లు చెప్పారని, అయినా పోలీసులు ఇందులో చూయిస్తున్న అతృతను బట్టి రాజకీయ కోణంలోనే పోలీసుల చర్యలు ఉన్నాయని అంటున్నారు. యువకుడయిన శ్రీరామ్ భవిష్యత్ ను దెబ్బతీసేందుకు ఈ చర్యలు అని అంటున్నారు. మొత్తం ఈ కేసులో ఉన్న 11 మంది మీద రౌడీ షీట్ తెరుస్తున్నారు. మరో వైపు ఈ కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చారని, పరోక్షంగా సాయం చేశారని పరిటాల సునీత, మరో టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ నేత మీద కేసులు పెట్టనున్నట్లు తెలుస్తోంది.  

షర్మిల పాదయాత్ర ఫిబ్రవరి నుంచి ప్రారంభం

        మోకాలి గాయంతో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను నిలిపేసిన జగన్ సోదరి వైఎస్ షర్మిల పిబ్రవరి లో పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తుందని సమాచారం. ఈ మేరకు ఆమెకు వైద్యం చేసిన వైద్యుడు శివభరత్ రెడ్డి ఈ విషయం వెల్లడించాడు. షర్మిల వేగంగా కోలుకుంటుందని, పిబ్రవరి మూడో వారంలో పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని అన్నారు. ఆరువారాల విశ్రాంతి పూర్తి కాగానే ఆమె మోకాలిని పరీక్షించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గాయం అయిన మొదటి రెండు రోజులు దాని తీవ్రతను గుర్తించలేకపోయామని, ఆ తరువాత గాయం తీవ్రత తెలిసి ఎమ్ ఆర్ ఐ స్కాన్ తీయడంతో గాయం తీవ్రత కనిపించిందని అన్నారు. అందుకే శస్త్రచికిత్స నిర్వహించామని, ప్రస్తుతం ఫిజియోథెరపీ నిపుణుల సాయంతో షర్మిల కోలుకుంటుందని అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు షర్మిల పాదయాత్ర మొదలవుతుందని, ఆ లోపు వైఎస్ జగన్ జైలు నుండి విడుదలయితే ఆయనే ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తారని అన్నారు.  

పోలీసుల కస్టడీలోకి అక్బరుద్దీన్, విచారణ

        వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్టైన అక్బరుద్దీన్ ఓవైసీకి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అదిలాబాద్ సబ్ జైలు నుంచి పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. ఈ విచారణ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది. కస్టడీలోకి తీసుకొనే ముందు జైలులో అక్బరుద్దీన్ కు రిమ్స్ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్బరుద్దీన్ ఓవైసీని  ఐదు రోజులపాటు పోలీస్ స్టడీ విధిస్తూ నిర్మల్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అక్బర్‌ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు పెట్టుకున్న పిటిషన్‌పై శుక్రవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు ముగిసిన అనంతరం తీర్పును మధ్యాహ్నానికి వాయిదా పడింది. భోజన విరామం అనంతరం న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

టిడిపి ఎమ్మెల్యేలు అరెస్ట్...

      విద్యుత్ చార్జీలు తగ్గించాలని, నిరంతరం 7 గంటలు కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సచివాలయంలో ధర్నా చేపట్టారు. సీఎం కార్యాలయం సమతా బ్లాక్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి, ఎమ్మెల్యే క్వార్టర్స్‌వైపు తీసుకు వెళ్ళారు. మొదట విద్యుత్ సౌధ వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. అక్కడ భారీగా పోలీసులు మోహరించడంతో టీడీపీ వ్యూహం మార్చింది. సచివాలయంలో సీఎస్ మధ్యూస్‌కు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించి అక్కడకు వెళ్ళగా సీఎం, సీఎస్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉండడంతో కలవలేకపోయారు. అనంతరం అక్కడే ఆందోళనకు దిగారు.    

అజ్ఞాతం వీడిన పరిటాల, పోలీసుల ఎదుట ప్రత్యక్షం

        అజ్ఞాతంలో ఉన్న పరిటాల శ్రీరామ్ గురువారం బయటికి వచ్చాడు. ధర్మవరం పోలీసుల ఎదుట హాజరై బెయిలు పత్రాలు అలాగే కోర్టు  రూ.25 వేల పూచికత్తును సమర్పించాడు. కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారన్న కేసులో పరిటాల శ్రీరామ్‌తో పాటు పదిహేను మందిపై ధర్మవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిటాల శ్రీరామ్ అరెస్టు తప్పదని భావించిన శ్రీరాం కోర్టులో ముందస్తు బెయిలు పిటీషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం బుధవారం శ్రీరాంకు ముందస్తు బెయిలు ఇచ్చింది. శ్రీరాంతో పాటు ఈ కేసులో ఉన్న రాఘవేంద్రకు ముందస్తు బెయిలు వచ్చింది. వడ్డె నాగరాజు, రామకృష్ణ, శ్రీనివాసులులకు రెగ్యులర్ బెయిలు లభించింది. శ్రీరామ్ పోలీసు స్టేషన్‌కు వచ్చిన సమయంలో భారీగా పరిటాల అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు.  

అక్బరుద్దీన్‌ జైలు: ఓయూ పోలీస్ స్టేషన్‌ కు..?

          వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై ఓయూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. శుక్రవారం ఓయూ పోలీస్ స్టేషన్‌లో అక్బరుద్దీన్ హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఓయూ పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను పీటీ వారెంట్‌పై అక్బరుద్దీన్‌ను తీసుకొచ్చే అంశంపై న్యాయ నిపుణులతో ఓయూ పోలీసులు చర్చిస్తున్నారు. ప్రస్తుతం అక్బరుద్దీన్ ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్నాడు. అయితే అక్బరుద్దీన్ ను హైదరాబాద్ కు తీసుకురావడంతో పాటు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ప్రసంగాలను ప్రసారం చేసిన ఛానళ్లకు కూడా నోటీసులు ఇచ్చే అంశాన్ని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఆయా ఛానళ్లకు నోటీసులు జారీ చేసి ఆ ప్రసంగాలకు సంబంధించిన టేపులను అందించాల్సిందిగా కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే అక్బరుద్దీన్ ను హైదరాబాద్ తీసుకురావడం కంటే అక్కడే విచారిస్తే సరిపోతుందని, పోలీస్ స్టేషన్ లో హాజరుపరిచేందుకు ఇంతదూరం తీసుకురావడం ఉద్రిక్తతలకు దారితీస్తుందని భావిస్తున్నారు.