ప్రత్యేక తెలంగాణ పై రాహుల్ కి కిరణ్‌ వివరణ

        విబేధాలు విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహాల్ గాంధీ నేతలకు పిలుపునిచ్చారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయపథంలో నడిపించే దిశగా పనిచేయాలని వారికి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి, ప్రత్యేక తెలంగాణ అంశంపై రాహుల్‌కు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ బొత్స సత్యనారాయణ వివరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులతో రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం జరిపిన తొలి రోజు సమావేశం ముగిసింది. 2014లో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ ఈ రెండు రోజులు వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, పార్టీకి ఎదురవుతున్న సమస్యలు, పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయడం, పార్టీని ఎన్నికల్లో గెలిపించేందుకు తీసుకోవల్సిన చర్యలపై నేతలతో చర్చించి, పలు సూచనలు చేశారు. రేపు కూడా సమావేశం జరగనుంది.

వాలెంటైన్స్ డే: ప్రియుడి చేతిలో ప్రియురాలు మృతి

        బ్లేడ్ రన్నర్ అంటే క్రీడా ప్రపంచంలో తెలియని వారుండరు. రెండు కాళ్లూ లేకున్నా కృత్రిమ కాళ్లతో పరుగెత్తి ట్రాక్ పై అనేక రికార్డులు నెలకొల్పిన దక్షిణాఫ్రికా స్ప్రింటర్ ఆస్కార్ పిస్టోరియస్ తన ప్రేయసిని కాల్చి చంపాడన్నది ఆరోపణ. ఐతే అదేమీ అతను కావాలని చేయలేదు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కావడంతో ప్రియురాలు రీవా స్టీన్‌కాంప్ తన ప్రియుడు పిస్టోరియస్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తడానికి ఓ మాస్కు వేసుకొని వచ్చింది. ఉదయమే ఆమె ప్రియుడి ఇంటికి చేరుకుంది. కానీ, ఆ విషయం తెలియని పిస్టోరియస్ ఆమెను దొంగగా భావించి కాల్చి చంపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. పోలీసులు పిస్టోరియస్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో పలుమార్లు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు తన ప్రియురాలిని అనుకోకుండా కాల్చినప్పటికీ అంతకుముందు అతను జైల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. గతంలో ఓ టీనేజ్ అమ్మాయి పైన దాడి చేశాడు. దీనికి 2009లో ఒకరోజు జైలు శిక్ష అనుభవించాడు. పిస్టోరియస్ అందరూ అనుకునేలాంటివాడేమీ కాదని అతని మాజీ ప్రియురాలు ఓ సందర్భంగా చెప్పింది. పిస్టోరియస్ తన ప్రియురాలిని షూట్ చేసినందుకు హత్యానేరం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.

యెర్నేని రాజకీయ సన్యాసం స్వీకరించారా?

  గోళ్ళూడిన సింహాన్ని చూసి జింకలు, కుందేళ్ళు కూడా భయపడవు. పదవీ, అధికారం కోల్పోయిన రాజకీయనాయకుడి పరిస్థితీ ఇంచుమించుగా అదేవిధంగా ఉంటుంది. పార్టీ పట్టించుకోదు, వీధి గుమ్మం దగ్గర తన కోసం పడిగాపులు కాసే అనుచరులు కనబడరు, శిష్యులు గురువులవుతారు, ఓడలు బళ్ళవుతాయి. పూవులమ్మిన చోటే కట్టెలమ్ముకోలేని దుస్థితిలో ఆశ్రయమిచ్చే వేరే పార్టీలకోసం కళ్ళు కాయలు కాస్తాయి. అయినా, చంచల్ గూడా జైలుకు వెళ్ళే (పార్టీ తీర్దం పుచ్చుకొనే) భాగ్యం అందరికీ దక్కదు.   మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒక వెలుగు వెలిగిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే యెర్నేని రాజారామచందర్ (రాజబాబు) ప్రస్తుతం ఈ పరిస్థితిలోనే ఉన్నారని చెప్పవచ్చును. మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ‘కొత్తనీరు వచ్చి పాత నీటిని బయటకు పంపేస్తుందని’ ఎవరిని ఉద్దేశించి అన్నపటికీ, ఆ సూత్రం యెర్నేనికి చక్కగా వర్తిస్తుంది. క్రమంగా తన అనుచరులందరూ వేరే నేతలదగ్గర సర్దుకుపోయి మొహం చూపించడం మానేసిన తరువాత, ఆయన దగ్గర శిష్యరికం చేసిన వారు పైకెదిగి ఆయనను పట్టించుకోక, ఏకులయివచ్చిన స్థానిక నాయకులూ క్రమంగా మేకులయి తన ఓటమికి కారకులయినపుడు, ఇటు రాష్ట్రంలోగానీ, అటు కేంద్రంలోగానీ తన మోర వినే నాధుడు లేకపోవడంతో, వైరాగ్యం కమ్ముకొన్న యెర్నేని గతకొన్ని నెలలుగా రాజకీయాలకు దూరంగా, అజ్ఞాతంలో గడుపుతున్నారు.   నిత్యం సంచలన వ్యాఖ్యలతో మీడియాలో కనిపించే ఆయన ఒక్కసారిగా నిశబ్ధం అయిపోయారు. కనీసం ఇటీవల జరిగిన సహకార ఎన్నికలలో సైతం ఆయన జాడ కనిపించకపోవడంతో ఆయన స్వంత పార్టీవారే ఆశ్చర్యపోయారు.   ఒకనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడని పేరుగాంచిన యెర్నేని కటాక్ష వీక్షణాలకోసం పడిగాపులు కాసినవాళ్ళే, నేడు ఆయనను పరిహసించే సాహసం చేస్తున్నారంటే ఆయన పరిస్థితి అర్ధం అవుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్-చార్జ్ గా చక్రం తిప్పిన యెర్నేనిని, ఒకవైపు పిన్నమనేని, మరోవైపు కావూరి వర్గీయులు కలిసి వ్యూహాత్మకంగా ఆయన పరిధిని కుచించివేసి, పార్టీలో జిల్లాలో క్రమంగా ఆయన ప్రాబల్యం తగ్గించడంలో సఫలీకృతం అయ్యారు.   ఇందిరమ్మ గృహాల మంజూరుకు ఇన్చార్జిగా ఉన్న యెర్నేనిని ఆ పదవి నుండి తప్పించగలిగారు. ఆ తరువాత కైకలూరు మార్కెటింగ్ యార్డు చైర్మన్ పదవి కేటాయింపులోను ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. కనీసం మండలాల ఇన్చార్జి బాధ్యతలనయినా తన అధీనంలో ఉంచుకొందామనుకొన్న యెర్నేని చేతిలోంచి అదీ లాక్కొని, మాజీ జడ్పీటీసీ సభ్యులకే ఆయా మండలాల బాధ్యతలు అప్పగించడంతో ఆయన హతాశుడయ్యారు.   ఇవి చాలవన్నట్లు దొంగ మెడికల్ బిల్లులు పెట్టిన పాపానికి కోర్టు కేసులు తలకు చుట్టుకోన్నాయి. ఆయన తప్పయిపోయింది క్షమించందని ప్రాధేయపడినా కోర్టు కనికరించలేదు. ఈ పరిణామాలతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయిన యెర్నేని రాజకీయాలు చెడిపోయాయి, నమ్మినవారు మోసంచేస్తున్నారు అంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.   అయితే, వచ్చే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ సంపాదించుకొనేందుకు ఆయన ఆ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారని, అటువైపు నుండి సరయిన ఆఫర్ వస్తే, అయన కూడా చంచల్ గూడా జైలు బాట పట్టడం ఖాయం అని పార్టీలో ఆయన వ్యతిరేఖ వర్గం వారు జోస్యం చెపుతున్నారు. ఇక, యెర్నేని జైలుకి వెళ్తారా లేక (రాజకీయ) సన్యాసం స్వీకరిస్తారా అనేది త్వరలో తేలిపోవచ్చును.  

వైయస్ జగన్ పార్టీలోకి ఎమ్మెల్యే సాయిరాజ్

      శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ ఇచ్ఛాపురం శాసనసభ్యుడు సాయిరాజ్ జగన్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ని ఈ రోజు టిడిపి ఇచ్ఛాపురం ఎమ్మెల్యే సాయిరాజ్ ములాకత్ సమయంలో కలిశారు. సాయిరాజ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే మోహన్ రావు, ఇచ్ఛాపురం టిడిపి ఇంఛార్జ్ వెంకటరమణలు కూడా జగన్ ని కలిశారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయలక్ష్మి సమక్షంలో సాయిరాజ్ వైఎస్ఆర్ సీపీలో తీర్థం పుచ్చుకోనున్నారు. ఇచ్చాపురం తెలుగుదేశం ఎమ్మెల్యే సాయిరాజ్ చిత్రమైన కధ చెప్పారు.తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు మరణించిన తర్వాత తాను రాజకీయంగా ఇబ్బందిలో పడ్డానని, పార్టీ పరిస్థితులు మారిపోయి, తాను రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని ఆయన వెల్లడించారు.

లోగుట్టు పెరుమాళ్ళకే కాదు నాకూ ఎరుకే...

  సహకార ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనవిజయం గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు, పార్టీ అధిష్టానానికి ఏకరువు పెట్టడం చూసినవారికి, పార్టీలకతీతంగా సాగవలసిన సహకార ఎన్నికలు రాజకీయ నాయకుల కనుసన్నలలో ఏవిధంగా జరిగాయో కళ్ళకు కట్టినట్లు చూపుతుంది.   రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలలో వేలు పెట్టడమే ఒక తప్పనుకొంటే, వాటి మద్య పోరాటాలు, పొత్తులు మరో తప్పు. ఇవి చాలవన్నట్లు, ఒకే పార్టీలో మళ్ళీ రెండుమూడు వర్గాలుగా చీలిపోయి, డీసీసీబీ బోర్డు పదవులు, అధ్యక్షపదవుల కోసం లోపాయికారీ రాజకీయాలు చేసుకుపోతున్నారు. తనకు దక్కకపోయినా పరువలేదు కానీ, పార్టీలో తన ప్రత్యర్ధికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పదవులు దక్కకూడదనే పంతంతో కొందరు కోర్టులకి వెళ్లి స్టేలు తెచ్చుకొంటే, మరి కొంత మంది విపక్షాలతో చేతులు కలిపి తమ పార్టీ అభ్యర్డులకే ఎసరు పెడుతున్నారు.   మొన్న కంచికచర్ల మండలం, గొట్టుముక్కల గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గుదే వెంకటేశ్వరరావు (బుజ్జి) నివాసంలో జరిగిన వేడుకల్లో, మంత్రి సారధికి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుకు మద్య నడిచిన ఈ సంభాషణ ఇటువంటి వాటికి ఒక చిన్నఉదాహరణ మాత్రమే.   మంత్రి సారధి: ఏమన్నా బాగున్నావా?   వసంత: ఆ.. ఏం బాగో.. ఒక పక్క నా ఐతవరం సొసైటీకి స్టే తీసుకువచ్చి, నన్ను ఎన్నికల్లో నిలబడకుండా చేసి, ఇప్పుడు బాగున్నావా అని అడగం వెటకారం కాకపొతే మేరేమిటి?   మంత్రి సారధి: అన్నా, నువ్వలా అనుకోమాకు. స్టే సంగతి నాకు నిజంగా తెలియదు. వేరెవరో తెచ్చి ఉంటారు.   వసంత: పిన్నమనేని వెంకటేశ్వరరావు నాకంతా చెప్పాడు. పోనీ, నీకు తెలియదని తినే ఈ భోజనం మీద ప్రమాణం చేసి చెపుతావా?   మంత్రి పార్ధ సారధి: కొంచెం అసహనంగా కదిలారు గానీ జవాబీయలేదు.   వసంత: అన్నా! మీరు పెద్దవాళ్లు. మమ్మల్ని ఆశీర్వదించాలి, కాని ఇలాగ శపించకూడదు.   ఇదొక చిన్న సొసైటీ కధ మాత్రమమే. ఇటువంటివి రాష్ట్రంలో చాలానే కుమ్ములాటల కధలు, జరిగాయి.

బాబు కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా?

    టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గత ఐదు నెలలుగా ఎండనక వాననక తీవ్ర ఆరోగ్య సమస్యలు బాధిస్తున్నా సరే పార్టీకి పునర్వైభవం తేవాలని పాదయాత్రలు చేస్తుంటే, చంచల్ గూడా జైల్లో కూర్చొన్న జగన్ మోహన్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను, నాయకులనూ జైలు బాట పట్టిస్తున్నారు.   నిన్న తెదేపా శాసనమండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు చంచల్ గూడా జైలులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోగా, ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తెదేపా శాసనసభ్యుడు సాయి రాజ్, పాతపట్నం మాజీ శాసన సభ్యుడు కలమట మోహన్ రావు, ఆయన కుమారుడు వెంకట రమణ కూడా చంచల్ గూడా జైలుకి వెళ్లనున్నారు. ఈతంతు ముగిసిన తరువాత వారు నేరుగా విజయమ్మ దర్శనం చేసుకొని, పార్టీ కండువా కప్పుకోవాలని బయలుదేరుతున్నారు.   వీరికి జతగా విశాఖ జిల్లా భీమిలిపట్నం తెదేపా ఇన్-చార్జ్ ఆంజనేయులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంపింగు ఇచ్చుకొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక నేతల వెనుక, తోకలవంటి వారి అనుచరులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జేరుతారని ప్రత్యేకంగా పేర్కొనవలసిన అవసరం లేదు.   తెదేపాకు శ్రీకాకుళం జిల్లాలో పెద్దన్నగా నిలబడిన కింజారపు ఎర్రం నాయుడు ఆకస్మిక మరణంతో ఆ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. రాజకీయాలలోబొత్తిగా అనుభవం లేని ఆయన కుమారుడు రామ్ మోహన్ నాయుడిని ఆయన రాజకీయ వారసుడిగా పార్టీ ప్రకటించడం కూడా, బహుశః జిల్లా నేతలకి రుచించకపోవడం వల్లకూడా ఈ పరిణామాలు కలిగి ఉండవచ్చును.   కానీ, ఇప్పుడే ఇంత జోరుగా సాగుతున్న ఈ వలసలను చూస్తుంటే, రేపు ఎన్నికలు ప్రకటించిన తరువాత వలసలు మరెంత జోరుగా సాగుతాయో ఊహించుకోవచ్చును. అందువల్ల, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తన పాదయాత్ర మీద మాత్రమే దృష్టి పెట్టి ఒక పద్దతిగా ముందుకు సాగిపోయినట్లయితే, వెనక నుండి ఆయన పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయం. కనుక, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిది.

త్రిపురలో 93 శాతం రికార్డ్ పోలింగ్

        త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలికి రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 91.22 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 93 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంతటి భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని ఎన్నికల సంఘం అధికారులు చెపుతున్నారు. త్రిపురలో మొత్తం 23,58,493 మంది ఓటర్లు ఉండగా, 60 మంది సభ్యులు గల అసెంబ్లీకి భారీగా పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల పోలింగ్ ఇంకా ముగియనందున ఓటింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.16 పార్టీలకు చెందిన 249 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీపడ్డారు. శాంతిభద్రతల కోసం 250 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. పోలింగ్ భారీగా నమోదు కావడంతో అధికార లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్ కూటములు విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా ఐదోసారీ తమకే అధికారం దక్కుతుందని లెఫ్ట్‌ఫ్రంట్, ఈ సారి ఓటర్లు తమనే గెలిపిస్తారని కాంగ్రెస్ ధీమాగా ఉన్నాయి.  

రాహుల్ టార్గెట్ 2014: కిరణ్, బొత్స తో భేటి

        ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు, రేపు పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో పార్టీ పటిష్ఠతపై కీలక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావడానికి బొత్స సత్యనారాయణ నిన్న ఢిల్లీ చేరుకోగా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, పార్టీకి ఎదురవుతున్న సమస్యలు, పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయడం, పార్టీ ఎన్నికల్లో విజయావకాశాలకు తీసుకోవల్సిన చర్యలపై వారితో చర్చిస్తారు. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ బొత్స, సీఎం కిరణ్ కూడా ఆయనతో వేర్వేరుగా, కలిసి చర్చించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ ఎదుర్కొంటున్న రాజకీయ, సంస్థాగత సమస్యలు, వైసీపీ ప్రాబల్యం, టీడీపీ అధినేత పాదయాత్ర, తెలంగాణ తదితర అంశాలపై వారిద్దరి అభిప్రాయాలను రాహుల్ తెలుసుకునే అవకాశం ఉంది. ఈ రెండురోజుల్లో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రాహుల్ రాష్ట్రస్థాయి నేతలను కలుసుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ సోనియాతోనే పార్టీ వ్యవహారాలు చర్చించేందుకు అలవాటుపడ్డ ఈ నేతలు ఇప్పుడు నేరుగా రాహుల్ నాయకత్వంలో పనిచేసేందుకు వీలుగా రంగం సిద్ధం చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.

బాబు పాదయాత్రకి బ్రేకుల్లేవు

  చంద్రబాబు తన పాదయాత్రను యధావిధిగా కొనసాగించనున్నారు. నిన్న కొలకలూరులో జరిగిన చిన్న ప్రమాదంలో ఆయనకి కుడికాలు బెణికింది. ఈ రోజు హైదరాబాదు నుండి వచ్చిన డాక్టర్లు మరోమారు పరీక్ష చేసిన అనంతరం వారి సలహా మేరకు బాబు తన పాదయాత్రను కొనసాగించనున్నారు. నిన్న ప్రమాదం జరిగిన తరువాత కూడా ఆయన నడవాలని ప్రయత్నించినా కాలునొప్పి ఎక్కువగా అవడంతో కేవలం మరో కిమీ దూరం మాత్రమే నడిచి పాదయాత్ర విరమించుకొన్నారు. హరికృష్ణ, జూ.యన్టీఆర్, మరియు చంద్రబాబు అర్ధాంగి భువనేశ్వరి బాబును ఫోన్ లో పరామర్సించగా లోకేష్ మాత్రం స్వయంగా కొలకలూరువచ్చి తండ్రిని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొన్నారు. శరద్ పవర్ కూడా చంద్రబాబును ఫోన్ లో పరామర్శించి, ఆరోగ్యం జాగ్రతగా కాపాడుకోమని సూచించారు.

చంచల్ గూడా జైలు బాటపట్టిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరుడు

  గత కొద్ది రోజులుగా తెలుగు దేశం పార్టీ నుంచి బయటకి వెళ్ళే ఆలోచన చేస్తున్న ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు గురువారంనాడు దైర్యం చేసి చంచల్ గూడా జైలుకి వెళ్ళిపోయారు. జగన్ మోహన్ రెడ్డిని కలుసుకొని వచ్చిన తరువాత మీడియా వారితో మాట్లాడుతూ, చంద్రబాబు వైఖరి నచ్చనందునే తానూ పార్టీ వీడుతున్నానని, జగన్ మోహన్ రెడ్డితో మనసు విప్పి అన్ని మాట్లాడుకొ న్నట్లు, చంద్రబాబుతో మాట్లాడే అవకాశం తనకు ఎప్పుడు కలుగలేదని అన్నారు.   అయితే, తెలుగు తమ్ముళ్ళు మాత్రం అతని మీద చాలాగుర్రుగా ఉన్నారు. పార్టీలో కీలకపదవులిచ్చి గౌరవించినప్పటికీ పార్టీపట్ల కానీ, పార్టీ అధినేతపట్ల గానీ కనీస విశ్వాసం కూడా చూపకుండా, జగన్ ఆఫర్ చేసిన డబ్బుకు అమ్ముడుపోయాడని తీవ్రవిమర్శలు చేసారు. గతంలో, తెలుగుదేశం పార్టీ హయాములో ఆయనకి కీలకమయిన రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్ష పదవిని చంద్రబాబు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి కూడా బొడ్డు భాస్కరావే ముఖ్య బాధ్యతలు నిర్వహించారు. 2009 సం.లో పార్టీ పరాజయం పాలయిన తరువాత కూడా, ఆయన అదే స్పూర్తితో, అంకిత భావంతో పార్టీకి సేవచేసినందున శాసనమండలికి పంపడం జరిగింది.   అయినప్పటికీ, ఆయన ఈవిధంగా పార్టీకి ద్రోహం చేసి జగన్ గూటికి చేరడం తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం జగన్ ఆశ చూపిన డబ్బుకి, శాసన సభ టికెట్టుకి ఆశపడి పార్టీకి ద్రోహం తలబెట్టాడని ఆరోపిస్తున్నారు. ఆయన జగన్ను కలిసేందుకు జైలుకి వెళ్ళినట్లు తెలియగానే, ఆయను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా వెలువడ్డాయి.

ప్రేమికులరోజు: అన్నాచెల్లెళ్లకు పెళ్లి, బంధువులు ఆగ్రహం

        ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడానికి ప్రేమ పక్షులు పార్కులకు, పబ్బులకీ వెళితే వారికి అక్కడే పెళ్లిళ్లు చేసేస్తామని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ముందే హెచ్చరి౦చారు. అయితే హైదరాబాదులోని కుషాయిగూడలో రాజు, గౌతమి అనే ప్రేమికులకు భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారు. ఈ పెళ్ళి వివాదానికి దారి తీసింది.   అబ్బాయి - అమ్మాయి తరపు పెద్దలు వచ్చి గొడవకు దిగారు. విషయం ఏంటని చూస్తే.. పెళ్లి చేసుకున్న రాజు, గౌతమిలు కజిన్స్. రాజుకు గౌతమి పిన్ని కూతురట. వీరికి దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారు. అయితే, ఈ విషయం దళ్ కార్యకర్తలకు తెలియదు. వారు కుషాయిగూడలో ఓ గుడికి వెళ్లి వస్తుండగా భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని అడ్డగించి కౌన్సెలింగ్ నిర్వహించి అనంతరం పెళ్లి చేశారు. తాము వరుసకు అన్నా చెల్లెళ్లమని చెప్పలేదట. దీంతో ప్రేమికులుగా భావించి దళ్ కార్యకర్తలు వారి పెళ్లి చేశారు. రాజు, గౌతమిల పెళ్ళిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. 

జగన్ ఆస్తుల కేసు ఆషామాషీ కాదు: సిబిఐ

        చంచల్ గూడ జైల్లో వున్న జగన్ కి కోర్ట్ ఈనెల 27వరకు రిమాండ్ పొడిగించింది . ప్రతి పద్నాలు రోజులకు ఓసారి రిమాండును పొడిగిస్తున్నారని జగన్ తరపు న్యాయవాది ఆక్షేపించారు. సిబిఐ తన దర్యాఫ్తును ఎప్పుడు పూర్తి చేస్తోందో? ఎప్పుడు ఆఖరి ఛార్జీషీటు దాఖలు చేస్తుందో? తెలియకుండా ఉందన్నారు. సిబిఐ తన ఆఖరి ఛార్జీషీట్ ఎప్పుడు దాఖలు చేయనుందో? దర్యాఫ్తు ఎప్పుడు పూర్తి చేస్తారో? స్పష్టంగా చెప్పాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టులో సిబిఐని ప్రశ్నించారు.దీంతో జగన్ కేసు పురోగతిపై పూర్తి వివరాలతో కూడిన మెమో దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. జగన్ కేసుకు సంబంధించి ఏడు అంశాలపై దర్యాప్తు పూర్తి అయ్యాక ఒకే చార్జీ షీటును తయారు చేసి కోర్టుకు దాఖలు చేస్తామని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. జగన్ ఆస్తుల కేసు ఆషామాషీ కేసేమీ కాదని, ఆయన కూడా సాధారణ వ్యక్తి కాదని సిబిఐ కోర్టుకు తెలియజేసింది. జగన్‌కు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, జగన్ జైల్లో ఉంటేనే కేసును స్వేచ్ఛగా విచారణ చేయగలుగుతామని సీబీఐ పేర్కొంది.

చంద్రబాబుకు తప్పిన ప్రమాదం..కాలికి గాయం

        తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కు త్రుటిలో ప్రమాదం తప్పింది. గుంటూరు పాదయాత్రలో కొలకలూరు గ్రామంలో  స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మెట్ల నుండి దిగుతున్న సమయంలో వేదిక కోసం ఏర్పాటు చేసిన మెట్లు కూలిపోయాయి. వెంటనే భద్రత సిబ్బంది స్పందించి ఆయనను కింద పడకుండా పట్టుకున్నారు. దీంతో ఆయనకి ప్రమాదం తప్పింది. సమయానికి స్పందించిన భద్రత సిబ్బంది పై అందరూ పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబుకు ప్రమాదం తప్పిందన్న విషయం తెలియగానే ఆయన కుమారుడు లోకేష్, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ ఫోన్‌లు చేసి ఆరోగ్యం, ప్రమాదంపై వాకబు చేశారు. బాబు తూలిపడ్డారని తెలిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాబు కాలికి స్వల్ప గాయం మినహా ఎలాంటి ప్రమాదం జరగలేదని, టిడిపి అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ రోజు పాదయాత్రను నిలిపివేసే అవకాశం ఉంది.  

తెలంగాణాలో ఎన్నికలకీ సమైక్య బూచేనా?

  ఈ నెల 21వ తేదీన జరగనున్న శాసన మండలి ఎన్నికలను సీమాంద్ర-తెలంగాణా సెంటిమెంటుల మద్యన జరిగే యుద్ధంగా భావించి, తెరాస తరపున పట్టభద్రుల నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్న తనను, సుధాకర్ రెడ్డిని గెలిపించాల్సిందిగా తెలంగాణా జేయేసీ కన్వీనర్ మరియు తెరాస నేత స్వామి గౌడ్ ప్రజలను కోరారు. మొన్న జరిగిన సహకార సంస్థల ఎన్నికలలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొన్నా కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ఫలితాలను ఎత్తి చూపుతూ తెలంగాణా సెంటిమెంటు క్రమంగా కనుమరుగయిపోతోందని చేస్తున్న ప్రచారానికి సరయిన జవాబు చెప్పాలంటే, తెలంగాణా ఉద్యమం కోసం పోరాడుతున్న తెరాస అభ్యర్దులను గెలిపించడం ద్వారానే సాద్యం అని తెలిపారు. తమను గెలిపించడం ద్వారా సమైఖ్యవాదులయిన లగడపాటి వంటి వారికి కనువిప్పు కలుగుతుందని ఆయన అన్నారు.       అయితే, తెలంగాణా ప్రజలలో తమకున్నఆదరణ, మద్దతులపై ఆధారపడి స్వశక్తితో విజయం సాధించవలసిన తెరాస నేతలు, తెలంగాణాలో జరిగే ఎన్నికలకు కూడా సమైఖ్యవాదులను, సమైక్యవాదాన్ని బూచిగా చూపించి ప్రజలనుండి ఓట్లు కోరడమే విడ్డూరం.  

భారత్ ఆశ్రయం కోరిన మాల్దీవుల మాజీ దేశాధ్యక్షుడు

  మాల్దీవుల మాజీ దేశాధ్యక్షుడు మొహమ్మద్ నషీద్, తనపై స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేయడంతో, నిన్నరాజధాని ‘మాలే’లోగల భారత హై కమీషన్ కార్యలయానికి వచ్చి అక్కడ తనకి రాజకీయ ఆశ్రయం ఇప్పించవలసిందిగా భారత హై కమీషనరు డీ.యం.ముల్లెను అభ్యర్దించారు. నషీద్ 2012వ సంవత్సరంలో స్థానిక క్రిమినల్ కోర్టు ప్రధాన న్యాయ మూర్తిని అరెస్ట్ చేసిన కేసులో, కోర్టు నషీద్ ను స్వయంగా కోర్టులో హాజరయి తన సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆడేశించినప్పుడు, ఆయన కోర్టుకు రాకపోవడంతో అయన బెయిలు దరఖాస్తును తిరస్కరిస్తూ, అయన అరెస్ట్ కు ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్ తప్పించుకొనేందుకు, నషీద్ భారత హై కమీషన్ కార్యాలయంలో ఆశ్రయం కోరారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం, స్వదేశంలో ఉన్న విదేశీ హై కమీషన్ కార్యలయాలలోకి స్థానిక పోలీసులు లేదా రక్షణ అధికారులు కానీ లోనకి ప్రవేశించే వీలులేదు గనుక, నషీద్ భారత కార్యాలయంలో ఆశ్రయం కోరారు. అందువల్ల, ఆయన బయటకు వస్తే, అరెస్ట్ చేసేందుకు మాల్దీవుల పోలీసులు భారత హై కమీషన్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. అయితే, వారు ఎట్టి పరిస్థితుల్లో భారత హై కమీషన్ కార్యాలయములోకి ప్రవేశించబోరని మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు మొహమ్మద్ వహీద్ తెలిపారు.

జగన్ తో టిడిపి ఎమ్మెల్సీ బొడ్డు 5 కోట్ల డీల్!

        తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు జగన్ పార్టీలో కి చేరుతున్నట్టు తెలుస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌నుచంచల్‌గూడ జైల్లో కలిశాడు. భాస్కర రామారావు వెంట కాకినాడ నగర శాసనసభ్యుడు, కాంగ్రెస్ నుంచి జగన్ పంచన చేరిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. మరోవైపు భాస్కరరామారావుపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారంటూ, జగన్ తో ఐదు కోట్ల డీల్ జరిగిందని ఆరోపిస్తున్నారని ఒక ప్రముఖ పత్రిక వెబ్ సైట్ లో కధనాన్ని ప్రచురించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.8 కోట్లు ఖర్చు అయిందని, ఆ డబ్బు కోసమే భాస్కరరామారావు పార్టీని ఫిరాయించారని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది మరో బోఫోర్స్ కుంభకోణ౦!

        తాజా హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం మరో బోఫోర్స్ కుంభకోణమని అంటూ బీజేపి విరుచుకు పడింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.   ఇప్పటికే ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించారు. హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో దోషులెవర్నీ వదిలిపెట్టమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అవరమైతే హెలికాప్టర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏ.కే.ఆంటోని ప్రకటించారు. ఇటలీకి చెందిన వీవీఐపీ హెలికాఫ్టర్ కొనుగోలు ఒప్పందంలో చోటు చేసుకున్న అవకతవకల్లో తన పాత్ర ఏమాత్రం లేదని, ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్టు భారత ఎయిర్‌మార్షల్ చీఫ్ ఎస్.పి.త్యాగి వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తం 3,600 కోట్ల రూపాయల వ్యయంతో ఇటలీ ఎయిర్ స్పేస్ కంపెనీ నుంచి 12 అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్టర్లను కొనుగోలు ఒప్పందంలో భారత్ లంచాలు చెల్లించినట్టు ఇటలీ పత్రికలు వార్తా కథనాలను ప్రసారం చేశాయి.  

సమైక్యమా? ఇప్పుడు కాదులే...

    ఒకానొకప్పుడు చంద్రబాబు తెలంగాణా లో పాదయత్ర చేస్తున్న సమయంలో నిత్యం ఎవరో ఒకరు తెలంగాణా ఇవ్వాలని మీరు కోరుకొంటున్నారా లేదా? తెలంగాణా పై మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పమని, లేకపొతే ‘జై తెలంగాణా’ అనమనో అడుగుతూ ఆయనను ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టేవారు. అప్పుడు ఆయన వారికి లౌక్యంగా సమాధానం చెప్పి బయటపడేవారు.   తెలంగాణా అనుకూల నిర్ణయం తీసుకొన్న తరువాత కూడా ఆయన తన పార్టీ వైఖరిని ఇంతవరకు స్పష్టంగా ప్రకటించలేదు. ఎందుకంటే, మరీ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తే, కాంగ్రెస్ దానిని ఆసరాగా తీసుకొని తన పార్టీని రాజకీయంగా దెబ్బ తీయవచ్చుననే భయంచేత కావచ్చును. లేదా, ఒకవేళ తానూ ‘జై తెలంగాణా’ అన్న తరువాత, కాంగ్రెస్ సమైక్యం అని ప్రకటిస్తే, అప్పుడు రాష్ట్రంలో తన పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందనే భయంచేత కావచ్చును. మొత్తం మీద, చంద్రబాబు అటు ‘జై తెలంగాణా’ అని అనలేకా, ఇటు ‘జై సమైక్యాంద్ర’ అని అనలేక చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పాదయాత్ర సాగిస్తున్నారు.   పటిష్టమయిన తన పార్టీ క్యాడర్ల సహాయంతో సమైక్యవాదులను తన పాదయాత్రలకి దూరంగా ఉంచి ముందుకు సాగుతున్న చంద్రబాబు, తెలంగాణాలో తానూ ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇక్కడ కోస్తాంధ్రాలో ఇంతవరకు ఎదుర్కోకుండానే ముందుకు సాగిపోతున్నారు. లగడపాటి వంటివారు ఆయనను ఇబ్బందిపెట్టాలని ప్రయత్నించినా పోలీసుల జోక్యంతో ఆ ప్రమాదం కూడా అదిగమించగలిగారు.   అయితే, నిన్న గుంటూరు జిల్లా ఉప్పలపాడు గ్రామంలో ఆయన పాదయాత్ర సాగున్నపుడు మాత్రం ఈ ఇబ్బందికర సమస్య మళ్ళీ ఎదుర్కోకతప్పలేదు. గ్రామంలో రైతులతో మాట్లాడుతుండగావారిలో ఒక రైతు చంద్రబాబును ‘జై సమైక్యాంధ్ర’ అనమని కోరాడు. ఇటువంటి సమస్యలను ఇప్పటికే చాలాసార్లు ఎదుర్కొన్న చంద్రబాబు ఆచి తూచి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వైఖరిని ఇప్పటికే చాలాసార్లు చెప్పామని, ఇక దానిపై నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత కేంద్రదానిదే తప్ప తమది కాదని ఆయన జవాబు ఇచ్చారు. దీనినే రెండు కళ్ళ సిద్దాంతం అని తెరాస అభిప్రాయపడితే, కర్ర విరగకుండా పాము చావకుండా ప్రమాదం దాటేయడం అని రాజకీయ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.

మంత్రి కొండ్రు మురళి కి మదపిచ్చి!

        చంద్రబాబుకు పిచ్చి ముదిరిందని మంత్రి కొండ్రు మురళి మోహన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు పై టిడిపి నేతలు మండిపడుతున్నారు. కొండ్రు మురళి అధికార మదంతో పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. చంద్రబాబు పాదయాత్ర తల్లి, పిల్ల కాంగ్రెస్‌కు అంతిమయాత్ర అని ఆయన కొత్త నినాదం ఇచ్చారు. వైఎస్ జగన్ అవినీతిలో కొండ్రుకు వాటా ఉందని, ఆయన ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. చంద్రబాబును పార్టీ అద్యక్ష పదవి నుంచి మార్చాలని మురళీమోహన్ సూచించగా, లిక్కర్ డాన్‌గా పేరొందిన కాంగ్రెస్ అధ్యక్షుడిని మార్చుకోండని బాబు రాజేంద్ర ప్రసాద్ సూచించారు.