కొట్టుకు చస్తున్నారు!

      టీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీల నాయకుల మీద మాటలతో దాడులు చేస్తుంటే, ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ నాయకుల మీద కత్తులతో దాడులు చేస్తున్నారు. గద్వాల మండలం అనంతపురం గ్రామం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జలీల్ మీద ఆయన రాజకీయ ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి నరికారు. జలీల్‌ని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు అంటున్నారు. ఇదిలా వుంటే, కర్నూలు జిల్లా డోన్ మండలం వికట నాయిని పల్లిలో కాంగ్రెస్ - టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, కత్తులతో రెండు పార్టీలకు చెందిన నాయకులు విచ్చలవిడిగా కొట్టుకుని, పొడుచుకున్నారు. పదిమంది వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ నాయకుల వాహనం ధ్వంసమైంది.

కావూరి రాజీనామా.. దరిద్రం వదిలింది

      దేశానికి, తెలుగు ప్రజలకు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు రూపంలో పట్టిన దరిద్రం వదిలిందని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. గురువారం ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో సీమాంధ్ర ప్రాంతంలో ఆనందోత్సాలు వ్యక్తమవుతున్నాయి. సీమాంధ్ర ప్రాంతానికి కేసీఆర్ కూడా చేయనంత ద్రోహాన్ని చేసిన కావూరి సాంబశివరావు రాజీనామాని అక్కడ అందరూ స్వాగతిస్తున్నారు. ఏ మంత్రి పదవి కోసమైతే సీమాంధ్ర ప్రజలకు కావూరి వెన్నుపోటు పొడిచాడో ఇప్పుడా మంత్రి పదవికి రాజీనామా చేయడం శుభ పరిణామమని వారు అంటున్నారు. పదవి లేకపోతే బతకలేని కావూరి ఇప్పుడు కాంగ్రెస్‌లో వుంటే తాను ఎంపీగా గెలవలేనన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నాడు. బీజేపీలో చేరాలని ప్లాన్ వేస్తున్నాడు. అయితే కావూరి ఏ పార్టీలో చేరినా, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓడించడం ఖాయమని సీమాంధ్ర ప్రజలు అంటున్నారు. కావూరి లాంటి పదవీ వ్యామోహం వున్న వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పడానికి తామంతా సిద్ధంగా వున్నామన్నారు. కేవలం కావూరికి మాత్రమే కాకుండా కావూరిని చేర్చుకునే పార్టీకి కూడా బుద్ధి చెప్పడం ఖాయమని వారు వార్నింగ్ ఇస్తున్నారు.

కాంగ్రెస్ టైటానిక్ నావ నుండి కావూరి జంప్

  కేంద్రమంత్రి పదవి కోసం కొల్లేరు సమస్యలను, సమైక్యాంధ్ర నినాదం అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి సైతం వెనుకాడని కావూరి సాంబశివరావు, పదవి వచ్చిన తరువాత ఆ సమస్యల గురించి మరిచిపోయి అధిష్టానం భజన మొదలుపెట్టేసారు. కానీ విభజన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేసరికి సీమాంద్రాలో అకస్మాత్తుగా మారిన రాజకీయ వాతావరణం చూసి, కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెదేపాలో చేరాలని నిశ్చయించుకొన్నాక, చాలా నాటకీయంగా “తనకు దిశా నిర్దేశం చేయమని కోరుతూ తన నియోజక వర్గ ప్రజలకు, తన అనుచరులకు ఆయన ఒక బహిరంగ లేఖ వ్రాసారు. కానీ దానికి ప్రజల నుండి ఎటువంటి స్పందన రాకపోయినా, స్థానిక తెదేపా నేతల నుండి మాత్రం “దయచేసి మీరు మా పార్టీలోకి రావద్దు మహాప్రభో” అంటూ మంచి స్పందన రావడంతో చేసేదేమీలేక కమలం చేతబట్టుకొనేందుకు సిద్దమయిపోయి డిల్లీలో వాలిపోయారు. కానీ బీజేపీ నుండి కూడా ఇంతవరకు ఎటువంటి సానుకూల స్పందన లేకపోయినప్పటికీ, వారిని బలవంతంగా ఒప్పించేసయినా సరే ఆ పార్టీలో చేరిపోవాలని ఫిక్స్ అయిపోయారు.   కానీ బీజేపీ-తెదేపాల మధ్య ఎన్నికల పొత్తులు కుదిరి, వారిరువురూ అన్ని సీట్లు సర్దేసుకొన్నాక తను ఎంత పెద్ద ఖర్చీఫ్ పట్టుకొని వెళ్ళినా వేసేందుకు అక్కడ సీటు ఖాళీ ఉండదని, ఇంకా ఆలస్యంచేస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన కావూరి, నెలరోజుల్లో ఊడిపోయే తన కేంద్రమంత్రి పదవిని, మునిపోయే కాంగ్రెస్ పార్టీని కూడా వదిలిపెట్టేసి, పనిలోపనిగా అదే దారిలో ఉన్న బీజేపీ కార్యాలయానికి వెళ్లి కాషాయ కండువా కప్పుకొని వచ్చేద్దామని ఈరోజే డిల్లీ బయలుదేరుతున్నారు. కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత బీజేపీలో ఎంట్రీ-టికెట్ దొరక్కపోతే ఏ పార్టీలో చేరాలో చెప్పమని మళ్ళీ ప్రజలకు బహిరంగ లేఖ వ్రాస్తారేమో. అందువల్ల ప్రజలూ.. మీరు కూడా ఆయనకు జవాబిచ్చేందుకు సిద్దంగా ఉండాలి మరి!

కాంగ్రెస్ మిత్రుడి జోస్యం: బీజేపీ గెలుపు ఖాయం

  గత ఆరేడు నెలలుగా వెలువడుతున్న సర్వే నివేదికలన్నీ మోడీ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారం చేపడుతుందని ఘోషిస్తున్నప్పటికీ అవ్వన్నీ కూడా ఒట్టి గాలి కబుర్లేనని కాంగ్రెస్ నేతలు కొట్టిపడేస్తున్నారు. అయితే, గత పదిహేనేళ్ళుగా ఆ పార్టీతో కలిసి కాపురం చేస్తూ, కేంద్రమంత్రి పదవుల రాజభోగం కూడా అనుభవిస్తున్న మహారాష్ట్రకు చెందిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, ఈసారి ఎన్నికల తరువాత బీజేపీ అత్యధిక మెజార్టీ ఉన్న ఏకైక అతిపెద్ద పార్టీగా మొదటి స్థానంలో నిలుస్తుందని, కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంతో సరిబెట్టుకోవలసి ఉంటుందని ప్రకటించేసి కాంగ్రెస్ అధిష్టానానికి షాక్ ఇచ్చేరు. తమ పార్టీ దీనపరిస్థితి గురించి తెలిసినప్పటికీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎన్నికల ప్రచారం చేసుకొంటున్న కాంగ్రెస్ అధిష్టానం, ఆయన సరిగ్గా ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ కీలక తరుణంలో ఉన్న మాటను కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పేసరికి ఉలిక్కిపడింది.   కొన్ని నెలల క్రితమే ఆయన మోడీని, బీజేపీని వెనకేసుకు వచ్చిన సంగతి గుర్తుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆయన కూడా బీజేపీ వైపు దూకేసి ఎన్నికల తరువాత ఎన్డీయే గూట్లో చేరిపోతారేమోనని ఆందోళన పడుతోంది. అయితే శరద్ పవార్ తన తుది శ్వాస వరకు కూడా కేంద్రమంత్రిగా అధికారం చలాయించాలని చాలా బలమయిన కోరిక ఉన్నపటికీ వృద్దాప్యం, ఆరోగ్యసమస్యల కారణంగా ఆయన ఈసారి ఎన్నికలలో పోటీ చేయడం లేదు. కానీ తన కుమార్తె సుప్రియా పాటక్ ను తన స్థానంలో సెటిల్ చేసేసిన తరువాతనే రాజకీయాల నుండి తప్పుకోవాలని భావిస్తున్నారు. అందువలననే ఈసారి విజవకాశాలు అధికంగా కనిపిస్తున్న బీజేపీని, మోడీని ఇప్పటి నుండే మంచి చేసుకొనే ప్రయత్నాలు చేస్తూ ఎన్నికలకు ముందో తరువాతో ఎన్డీయే గూట్లో తన కుమార్తెను చేర్చి రాజకీయాల నుండి తప్పుకోవచ్చును. ఒకవేళ ఆయన కూడా హస్తం పార్టీకి హస్తం చూపించినట్లయితే, ఇప్పటికే గెలుపు ఆశలు సన్నగిల్లుతున్న కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశాలు మరింత సన్నగిల్లవచ్చును.

తెహల్కా తేజ్‌పాల్: మదర్ సెంటిమెంట్

      తెహల్కా డాట్‌కామ్ స్ట్రింగ్ ఆపరేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తరుణ్ తేజ్‌పాల్ మదర్ సెంటిమెంట్‌ని గోవా కోర్టు గౌరవించింది. ప్రస్తుతం జైల్లో వున్న తరుణ్ తేజ్‌పాల్ గురువారం గోవా సమీపంలో ఒక గ్రామంలో వున్న తన తల్లిని చూసి రావడానికి అనుమతి ఇచ్చింది. తరుణ్ తేజ్‌పాల్ తల్లి గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. ఆమెని చూడాలని తరుణ్ తేజ్‌పాల్ గత కొంతకాలంగా తపిస్తున్నాడు. మార్చి 13వ తేదీన కోర్టు ఒకసారి తరుణ్ తేజ్‌పాల్‌కి తన తల్లిని చూసి రావడానికి అనుమతి ఇచ్చింది. ఇరవై రోజులు తిరక్కుండానే మరోసారి తరుణ్ తన తల్లిని చూడటానికి తనకి అవకాశం ఇవ్వాలని కోర్టును కోరాడు. అవసాన దశలో వున్న తల్లిని చూసే అవకాశం ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేశాడు. తరుణ్ సెంటిమెంట్‌ని అర్థం చేసుకున్న కోర్టు ఆయనకి మరోసారి అనుమతి ఇచ్చింది.

కాంగ్రెస్ సిగ్గొదిలేసింది!

      మళ్ళీ ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో వున్న కాంగ్రెస్ పార్టీ సిగ్గును పూర్తిగా వదిలేసిన లక్షణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఇస్తే తెరాసని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ ఆ మాట తప్పినా కాంగ్రెస్‌కి బుద్ధి రాలేదు. గత కొంతకాలంగా కాంగ్రెస్, తెరాస నాయకులు ఒకరినొకరు బండబూతులు తిట్టుకుంటున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్లలో, మీటింగ్స్ లో కాంగ్రెస్ పార్టీని తిట్ల దండకంతో కడిగేస్తున్నాడు. లేటెస్ట్ గా మెదక్ జిల్లాలో జరిగిన మీటింగ్‌లో కూడా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని నానా మాటలతో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. కేసీఆర్ తిట్లకి ప్రతీకారంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా కేసీఆర్‌ మీద మాటల దాడి చేశాడు. ఇదంతా ఓకే.. ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్‌ని రకరకాలుగా విమర్శించిన పొన్నాల ఆ తర్వాత తెరాసతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా వుందని, కేసీఆర్ ఒప్పుకుంటే రెండు పార్టీలు జట్టు కట్టి తెలంగాణని ఉద్ధరించేద్దామని అన్నాడు. ఒకవైపు కేసీఆర్ ఛీ పో అంటున్నా తెరాసతో పొత్తు కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ పార్టీలో ‘సిగ్గు’ అనే పదార్ధం లేనట్టే కదా!

కాంగ్రెస్ నేతలను కసితో ఓడించాలి: రఘువీర రెడ్డి

  ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీలో పదవులు, హోదా అన్నీ అనుభవించి, ఇబ్బడిముబ్బడిగా డబ్బు, ఆస్తులు అన్నీ సంపాదించుకొని చివరికి పార్టీకి ద్రోహం చేసి బయటకు వెళ్లిపోయిన వారందరికీ ప్రజలు కసితో, చాలా కసితో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. లక్షలాది ప్రజలు, ఉద్యోగులు, విద్యార్ధులు అందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి రెండున్నర నెలల పాటు ఏకధాటిగా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ ఉద్యమాలు చేసినప్పటికీ, వారి పట్ల కనీసం మానవతా దృక్పధంతోనయినా స్పందన చూపకపోగా, డిల్లీలో ఏసీ గదుల్లో కూర్చొని వారి ఉద్యమాలను అవహేళన చేసి, ప్రజలను ఘోరంగా అవమానించారు కాంగ్రెస్ నేతలు.   ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా పార్లమెంటు పరువు మంటగలిపి మరీ రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ నుండి దానికి చెందిన కొందరు నేతలు బయటకి వెళ్ళిపోతే దానివల్ల ప్రజలకు ఏమి నష్టం? వారిని కసితో ఓడించాల్సిన అవసరం ప్రజలకేముంది? స్వంత పార్టీ నేతలనే కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే, సదరు నేతలది కూడా స్వచ్చమయిన కాంగ్రెస్ డీ.యన్.ఏ. కనుకనే వారు కూడా పార్టీని మోసం చేసి వెళ్ళిపోయారు. పైగా వారందరూ పార్టీలో ఉంటూ ఇబ్బడి ముబ్బడిగా డబ్బు, ఆస్తులు కూడబెట్టుకొన్నారని స్వయంగా రఘువీర రెడ్డి చెప్పడం చూస్తే కాంగ్రెస్ నేతలందరూ కలిసి ఇంతకాలంగా వెలగబెడుతున్న గొప్ప ఘనకార్యం ఏమిటో ఆయనే స్వయంగా ప్రకటించుకొన్నట్లుంది. అటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం, దానిని విడిచిపోతున్న నేతల కోసం ప్రజలెందుకు ఆలోచించాలి?   కానీ పీసీసీ అధ్యక్షుడు అంతటి వాడే స్వయంగా తమ కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ ఓడించమని పిలుపునిస్తుంటే ప్రజలు ఆయన ముచ్చట మాత్రం ఎందుకు కాదనాలి ప్రజలు కూడా అందుకే ఎదురు చూస్తున్నారు గనుక కాంగ్రెస్ పార్టీని, కండువాలు మార్చి ప్రజలను ఏమార్చడానికి వస్తున్న సదరు కాంగ్రెస్ నేతలందరినీ ఏ పార్టీ కలుగుల్లో ఎలుకల్లా దాకొన్నాకూడా వారిని ప్రజలు గుర్తుపెట్టుకొని మరీ ఓడించిననాడే వారు మళ్ళీ ఇటువంటి దుస్సాహసం చేసేందుకు కూడా ఎప్పుడు ఆలోచన చేయరు. అలాకాదని పార్టీల జెండాలను, సదరు అధినేతల మాటలను, వారి కులాలాను చూసి మళ్ళీ కాంగ్రెస్ నేతలకే ప్రజలు ఓటేస్తే వారు ఏదో ఒకరోజు మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొని మళ్ళీ తమను గుడ్డిగా నమ్మిఓటేసిన ప్రజలను అపహాస్యం చేయడం తధ్యం. అందువల్ల రఘువీర రెడ్డి కోరినట్లే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ వారు ఏ పార్టీలో ఉన్నపటికీ ఓడించి ఋణం తీర్చుకోవలసి ఉంది.

కేసీఆర్ మీద పొన్నాల ఫైర్!

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మీద తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యాడు. కేసీఆర్ నిన్న మెదక్ జిల్లాలో జరిగిన ఎన్నిక ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీని తిట్టిపోశాడు. దానికి కౌంటర్‌గా పొన్నాల స్పందించాడు. కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ బోలెడంత అభివృద్ధి చెందిందని, కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నాడని విమర్శించాడు.   వంద సంవత్సరాలకు పైబడిన కాంగ్రెస్ పార్టీని తెరాస లాంటి చిన్నా చితక పార్టీలు ఏమీ చేయలేవని ఆయన అన్నారు. మాట తప్పే వ్యక్తి కేసీఆర్ అని, ఇచ్చిన మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ అని పొన్నాల అన్నాడు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్టుగా మాటమీద నిలబడలేని వ్యక్తి తెలంగాణని అభివృద్ధి చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడని దుయ్యబట్టాడు. ఇన్నేళ్ళుగా రాజకీయాల్లో వున్న కేసీఆర్ మెదక్ జిల్లా కోసం ఏం చేశాడో చెప్పాలని నిలదీశాడు. అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని నొక్కి వక్కాణించాడు. కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రధాన వ్యక్తి అంటూ, చరిత్రలో కేసీఆర్ అభివృద్ధి నిరోధకుడిగా మిగిలిపోతాడని శాపనార్థాలు పెట్టాడు.

నోటిఫికేషన్ రిలీజ్: అంకెల్లో తెలంగాణ!

      తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని అంకెల్లో చూసుకుంటే..... ఏప్రిల్ 2న నోటిఫికేషన్ విడుదల. ఈనెల 9వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం వుంటుంది. ఈ ఎన్నికలకు 336 మంది పరిశీలకులను నియమించారు. 138 వ్యయ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. పార్లమెంట్‌కి పోటీ చేసే అభ్యర్థి 25 వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి 10 వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో సగమే చెల్లించాలి. పార్లమెంట్‌కి పోటీ చేసే అభ్యర్థి 70 లక్షల వరకు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి 28 లక్షల వరకు ఎన్నికల ఖర్చు చేయొచ్చు. 10 జిల్లాల్లోని 119 అసెంబ్లీ స్థానాల్లో, 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనున్నాయి. మే 16న ఫలితాలు విడుదలవుతాయి. తెలంగాణలో మొత్తం 2,71,54,339 ఓటర్లున్నారు.

‘సంపద’ చూపించిన రాఖీ సావంత్!

      బాలీవుడ్ సూపర్ హాట్ గర్ల్, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాఖీ సావంత్ ఈ ఎలక్షన్స్ లో వాయవ్య ముంబై లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తోంది. ఈ ఎన్నికలలో పోటీ చేయడం కోసం ‘రాష్ట్రీయ ఆమ్ పార్టీ’ (రేప్)ని స్థాపించింది. హాట్ గర్ల్ అయిన తన ఎన్నికల గుర్తు కూడా హాట్ హాట్‌గా వుండాలన్న ఉద్దేశంతో తనకి పచ్చి మిరపకాయని గుర్తుగా కేటాయించాలని ఎలక్షన్ కమిషన్‌కి దరఖాస్తు చేసుకుంది. ఇదిలా వుంటే, ఎలక్షన్లలో పోటీ చేసేవారు తమ ఆస్తులను బహిర్గతం చేయాలన్న ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాఖీ సావంత్ తన ఆస్తులను బయటపెట్టింది.   రాఖీ సావంత్ ఆస్తి మొత్తం 14 కోట్ల 69 లక్షలు. వీటిలో 3 కోట్ల 57 లక్షలు చరాస్తులు, 11 కోట్లు 12 లక్షలు స్థిరాస్తులు. ఆమె దగ్గర ప్రస్తుతం చేతిలో వున్న డబ్బు 96,427 రూపాయలు. 39 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో వున్నాయి. 61 లక్షలు బాండ్స్, షేర్స్ రూపంలో వున్నాయి. 2 కోట్ల 12 లక్షలు ఇన్సూరెన్స్, పోస్టల్ సేవింగ్స్ వున్నాయి. 21 లక్షల విలువైన ఫోర్డ్ ఎండీవర్ కారు వుంది. ముంబైలో ఒక ఫ్లాట్ వుంది. ఆస్తుల వివరాలు ఇలా వుంటే, ఈ అమ్మడి మీద ఒక ఛీటింగ్ కేసు కూడా వుంది. అందాలు ఆరబోయడం ద్వారానే ఇన్ని కోట్లు సంపాదించిన రాఖీ సావంత్ అస్సలు చదువుకోలేదట. ఎన్నికల డిక్లరేషన్‌లో తాను నిరక్ష్యరాస్యురాలినని రాఖీ సావంత్ పేర్కొంది.  

సోనియా నామినేషన్

      రాయబరేలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నామినేషన్ దాఖలు చేశారు. తన తనయుడు రాహుల్ గాంధీతో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన సోనియాగాంధీ కాంగ్రెస్ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. 2004, 2009 ఎన్నికలలో రాయబరేలీ నుంచి ఎన్నికలలో పోటీ చేసిన సోనియా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతున్న సోనియాగాంధీ ఆశల మీద నీళ్ళు జల్లాలని భారతీయ జనతాపార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త కుమారుడు, సుప్రీంకోర్టు నాయవాది అగర్వాల్‌ని సోనియా గాంధీ మీద పోటికి నిలబెట్టింది. ఈనెల 30న ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరగబోతోంది.

అమాయకుల సంఖ్య!

      సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీలో అమాయకులు ఎంతమంది ఉన్నారో చెప్పగలరా అనే ప్రశ్నకు నిన్నటి వరకూ ఎవరూ సమాధానం చెప్పలేకపోయేవారు. కానీ ఈరోజు మాత్రం ఈ ప్రశ్నకు సులభంగా సమాధానం చెప్పొచ్చు. అమాయకత్వం పర్సెంటేజ్ ఎంతమందిలో ఎక్కువ వుంది.. ఎంతమందిలో తక్కువ వుందనే విషయాన్ని కూడా క్లియర్‌గా చెప్పేయొచ్చు. టోటల్‌గా సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీలో మొత్తం అమాయకుల సంఖ్య ఎంతంటే, 1335. అవును.. అక్షరాలా పదమూడు వందల ముప్పయి ఐదు. ఈ సంఖ్య నీకెలా తెలుసని ప్రశ్నిస్తే దానికీ సమాధానం వుంది.   ఈ సంఖ్యని సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డే స్వయంగా ప్రకటించాడు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌తో ఎన్నికలలో పోటీ చేయడానికి మొత్తం 1335 మంది దరఖాస్తు చేసుకున్నారని రఘువీరా ప్రకటించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ నేలమట్టమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కావాలని కోరుకునేవాళ్ళు అమాయకులే కదా మరి! ఈ అమాయకులలో ఓ మోస్తరు అమాయకుల సంఖ్య 1160. ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకుంటున్నారు. మరీ ముదిరిపోయిన అమాయకుల సంఖ్య 175. ఎందుకంటే వీళ్ళు పార్లమెంట్‌కి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ అమాయకులను కాంగ్రెస్ పార్టీ ఎలాగూ కాపాడలేదు.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకుంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నవాళ్ళు అవుతారు.  

చిరు అన్నయ్యా.. బుర్ర తినకు!

      మాజీ మెగాస్టార్, అభిమానుల పాలిట దగాస్టార్ చిరంజీవికి నీ అభిమాని రాస్తున్న ఉత్తరం. ప్రజారాజ్యం పార్టీ పెట్టి, దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, ఆ తర్వాత దగ్గరుండి రాష్ట్ర విభజన చేసి నువ్వు మా హృదయాలను ఇప్పటికే చాలాసార్లు గాయపరిచావు. నువ్వు చేసిన గాయాలు మాన్పుకునే పనిలో వున్నాం. అలాంటి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయకుండా నిన్న ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేశావ్. మమ్మల్నందర్నీ పిలిచి మాట్లాడావ్. నువ్వు కలవటం మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డితో కూడా మీటింగ్ ఏర్పాటు చేశావ్. అంతా అయిన తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ కి కూడా ఈ ఎన్నికలలో టిక్కెట్లు ఇస్తామని రఘువీరా చేత ప్రకటింపజేశావ్? ఇదంతా చూశాక మాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు మారలేదన్నయ్యా.. నువ్వు మారతావన్న నమ్మకం కూడా నిన్నటి మీటింగ్‌తో  పోయిందన్నయ్యా. నువ్వు మామీద ప్రేమతో మీటింగ్‌కి పిలిచావని, మామీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇస్తానని అనిపించావని మేమేమీ అనుకోవడం లేదు. నీ అపరిపక్వ రాజకీయాల్లో భాగంగానే ఈ మీటింగ్ ఏర్పాటు చేశావని మాకు తెలుసన్నయ్యా. మేమందరం ఎక్కడ పవన్  కళ్యాణ్ తమ్ముడికి చేరువైపోతామోనని భయపడి నువ్వు మాతో మీటింగ్ ఏర్పాటు చేశావని మాకు తెలుసు. ఈ ఎన్నికలలో సీమాంధ్ర నుంచి కాంగ్రెస్ టిక్కెట్లు తీసుకోవడానికి మేమేమైనా పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నామా? మీ పార్టీ నుంచి సీమాంధ్రలో పోటీచేసేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టే మాకు టిక్కెట్లు ఇస్తామంటున్నారు. మా అభిమానుల్లో ఇద్దరికో ముగ్గురికో టిక్కెట్లు ఇచ్చి, ఆ నెపంతో మా అభిమానులందరి చేతా కాంగ్రెస్ పార్టీకి అరవచాకిరీ చేయించాలనేదే నీ ప్లాన్ అనేది మాకు అర్థమైపోయింది చిరు అన్నయ్యా. వద్దన్నయ్యా.. మమ్మల్ని నీ రాజకీయాల్లోకి లాగి మా బుర్రలు తినే ప్రయత్నం చేయొద్దు. నీ రాజకీయా పుణ్యమా అని రాష్ట్రంలో ఇప్పటికే మా పరువు పూర్తిగా పోయింది. ఇంకా మమ్మల్ని హింసించకు. మా మానాన మమ్మల్ని బతకనీ. నీకూ, నీ రాజకీయాలకీ ఓ దణ్ణం.

పార్టీల కళ్ళల్లో నిప్పులు!

      భారతీయ జనతాపార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య ఎన్నికల పొత్తు కుదరబోతోందన్న వార్తలు కాంగ్రెస్ దగ్గర్నుంచి సీపీఐ వరకూ అన్ని పార్టీల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా చేస్తున్నాయి. ఈ పొత్తు కుదరకూడదు దేవుడా అని దేవుణ్ణి నమ్మని కమ్యూనిస్టులు కూడా దణ్ణాలు పెట్టేసుకుంటున్నారు. పొత్తు చెడగొట్టడానికి తమకు సాధ్యమైనట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు.   బీజేపీ, టీడీపీ మధ్య పొత్తులు, సర్దుబాట్లు,  సీట్ల సంఖ్య విషయంలో కొద్దిగా ప్రతిష్టంభన ఏర్పడటంతో ఇక పొత్తు కుదరనట్టే అని వైపీసీ ఇంటి పత్రిక, ఛానెల్ పనికట్టుకుని ప్రచారం మొదలుపెట్టేసింది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా వుండాలని సైంధవుడిలా శాయశక్తులా కృషి చేస్తున్న కిషన్‌రెడ్డి బిహేవియర్ కూడా పొత్తును ఇష్టపడని పార్టీలకు ఆయుధంలాగా దొరికింది. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదరకుండా దేవుడు కూడా ఆపలేడని స్పష్టం కావడంతో ఇప్పుడు సదరు పార్టీలన్నీ ఏడుపు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ నాయకులయితే టీడీపీ, బీజేపీ పొత్తు ఏదో ఘోరమన్నట్టుగా మాట్లాడుతున్నాయి. జగన్ మీడియా ఇప్పటికీ తనవంతు కృషి చేస్తూనే వుంది. ఇక తాజాగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐ కూడా అల్లాడిపోతోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారాయణ అయితే బోలెడంత వెటకారంగా మాట్లాడుతున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దంటూ తెలుగుదేశం పార్టీకి ఒక విజ్ఞప్తి కూడా చేసేశాడు. టీడీపీ, బీజేపీ పొత్తు ఈ పార్టీల బొచ్చెలో రాయి వేసే అవకాశాలున్నాయి. అందుకే ఇంతలా ఏడుస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

జోరుమీదున్న సైకిల్!

      ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రాంతాలకతీతంగా జోరుమీద వుందని ఇప్పటికే ఎన్నో సర్వేలు స్పష్టం చేశాయి. తాజాగా జరిగిన మరో సర్వేలో తెలుగుదేశం పార్టీకి ఓటర్లు అగ్ర తాంబూలం ఇస్తారని స్పష్టమైంది. సీఎన్ఎన్ – ఐబీఎన్ – సీఎస్‌డీఎస్ – లోక్‌నీతి సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి ఉత్సాహాన్ని పెంచే విధంగా ఫలితాలు వచ్చాయి.   ఈ సర్వే ప్రధానంగా లోక్‌సభ స్థానాల మీద దృష్టిని కేంద్రీకరించింది. తెలుగుదేశం పార్టీకి అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో మంచి ఆదరణ లభించబోతున్నట్టు వెల్లడి అయింది. రెండు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి 13 నుంచి 19 లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశం వుందని సర్వే వెల్లడించింది. ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే రెండు ప్రాంతాలలో కలిసి తెలుగుదేశం పార్టీకి 29 శాతం ఓట్లు వచ్చే అవకాశం వుంది. సీమాంధ్ర ప్రాంతంలో అయితే 39 శాతం, తెలంగాణ ప్రాంతంలో 13 శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి దక్కనున్నాయి. తెలుగుదేశం – బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత ఇప్పటి సర్వేలో వచ్చిన సీట్లు, ఓట్ల శాతంలో భారీ పెరుగదల ఉండే అవకాశం వుండొచ్చు.

కాంగ్రెస్ దెబ్బకి రాహుల్ భవిష్యత్ ఫినిష్!

  ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలకు ఈసారి ఎన్నికలు అతిముఖ్యమయినవి. తెరాస, వైకాపాలు మొట్ట మొదటిసారిగా ప్రభుత్వ పగ్గాలు చేజిక్కించుకొనేందుకు తహతలాడుతుంటే, తెదేపా ఈ ఎన్నికలలో గెలవకపోతే తన ఉనికే ప్రమాదం గనుక విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరాడేందుకు సిద్దం అవుతోంది. ఇక రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్, అందుకు సహకరించిన బీజేపీలు మాత్రం ఈ రేసులో అందరి కంటే వెనుకబడిపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ, బీజేపీ-తెదేపాల మద్య ఎన్నికల పొత్తులు కుదిరితే బీజేపీ కూడా బలపడే అవకాశం ఉంటుంది. కానీ, తెరాస హ్యాండివ్వడంతో తెలంగాణాలో, పార్టీ దాదాపు ఖాళీ అయిపోయిన కారణంగా సీమాంద్రాలో కూడా కాంగ్రెస్ ఘోరంగా దెబ్బ తినబోతోంది.   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేకపోయినా, కనీసం దేశంలో మిగిలిన రాష్ట్రాలలోనయినా విజవకాశాలు ఉండి ఉంటే, ఎన్నికల తరువాత ఆంధ్ర, తెలంగాణాలలో ఎన్నికయిన పార్టీలు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడి ఉండేవి. కానీ, దేశంలో వివిధ రాష్ట్రాలలో కూడా ప్రాంతీయ పార్టీలదే పూర్తి రాజ్యం నడుస్తోంది గనుక కాంగ్రెస్ పార్టీ ఏవో రెండు మూడు ఈశాన్య రాష్ట్రాలలో, దక్షిణాన్న కర్ణాటకలో తప్ప మరెక్కడా గెలిచే అవకాశాలు కనబడటం లేదు. కనీసం దాని మిత్రపక్షాలయినా గెలిస్తే కొంతలో కొంత ఊరట లభిస్తుంది. కానీ మోడీ మాయలో పడి వారు కూడా ఎన్డీయే కూటమికి జంపైపోతే ఇక కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలనే కల పగటికలగానే మిగిలిపోతుంది. ఇదంతా కాంగ్రెస్ స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు.   కాంగ్రెస్ అధిష్టానం చాలా దురాలోచన చేసి దక్షిణాదిన తనకు కంచుకోట వంటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్నితన హస్తాలతో తానే స్వయంగా బ్రద్దలు కొట్టుకొని, కన్నకొడుకుల వంటి స్వంత పార్టీ నేతలను కాదని, వేరెవరి చేతికో అధికారం అప్పజేప్పెందుకు  సిద్దం అయ్యింది. తత్ఫలితంగా ఈసారి కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లిపోయాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలంత మెజార్టీ సాధిస్తే తప్ప, రాష్ట్రం నుండి ఎవరి మద్దతు దొరకదు. సోనియా గాంధీ తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీని ఎలాగయినా ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని ఇంత రిస్క్ తీసుకొని కధ నడిపిస్తే చివరికి అదే కారణంగా రాహుల్ గాంధీ శాశ్వితంగా ప్రధాని పదవికి దూరం అయ్యేలా ఉన్నారు.   కాంగ్రెస్ నిసహ్హాయ స్థితి, రాహుల్ గాంధీ భవిష్యత్తు తలచుకొంటే పాపం జాలేస్తుంది.

తెలంగాణాలో నేటి నుంచి నామినేషన్లు

      రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణాలో తొలివిడత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల దాఖలు లో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. స్థానికంగా ఉన్న ఆస్తులతోపాటు విదేశాల్లోని ఆస్తులు, అప్పుల వివరాలను, పోలీసు కేసులుంటే ఆ వివరాలూ అఫిడవిట్‌లో పొందుపరచాలి. ఏ ఒక్క సమాచారం లేకపోయినా నామినేషన్లను తిరస్కరిస్తామని చెప్పారు. నామినేషన్ జారీ తేదీ నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, పదో తేదీన పరిశీలించి, 12న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తామని, అదే రోజు గుర్తులు కేటాయిస్తామని చెప్పారు.   అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్న నియోజకవర్గం పరిధిలోని పది మంది ఓటర్లు ఆయన పేరును ప్రతిపాదించాలి. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయితే ఒక్కరు చాలు. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి రూ. 25వేలను డిపాజిట్టుగా చెల్లించాలి. శాసనసభకు పోటీచేసే అభ్యర్థి రూ.10 వేలను డిపాజిట్లుగా చెల్లించాలి.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అందులో సగం చెల్లించాలి.పార్లమెంటు అభ్యర్థి రూ. 70లక్షల వరకు ప్రచారానికి ఖర్చు చేయవచ్చు. అసెంబ్లీ అభ్యర్థి రూ. 28 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు.