టీఆర్ఎస్ ఆ..టీడీపీ ఆ..? జుట్టు పీక్కుంటున్న ఎమ్మెల్యే ఎవరూ..?

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు ఎలాంటి ఢోకా లేదు. ఇప్పటికే పలు పార్టీలోని నేతలంతా టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇక ప్రతిపక్ష పార్టీల విషయానికి వస్తే టీఆర్ఎస్ తాకిడిక తట్టుకోలేక పోతున్నాయనే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ అయితే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న చందాన తయారైంది. కాస్తో కూస్తో పోటీ ఇచ్చే టీడీపీ పరిస్థితి కూడా ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది. ఇప్పటికే టీడీపీ నుండి పలువురు నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇక మిగిలింది ఒకరిద్దరు నేతలు మాత్రమే. అయితే ఇప్పుడు పార్టీ మారిన వారి పరిస్థితి బానే ఉంది. పార్టీని వీడని వారి పరిస్థితి బానే ఉంది. కానీ టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే పరిస్థితే అటు కక్కలేకా.. ఇటు మింగలేకా అన్న పరిస్థితి ఏర్పడింది.   టీ టీడీపీ నుండి కీలకమైన నేతలే టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఇటీవలే సీనియర్ నేత అయిన ఎర్రబెల్లి.. ఆయనతో పాటు ప్రకాశ్ గౌడ్  కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఇక ఎర్రబెల్లి చేరికతో ఆయనతో పాటు ఇంకో ఎమ్మెల్యే కూడా ఆయన వెనుకే టీఆర్ఎస్ లో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం తాను టీఆర్ఎస్లోకి వచ్చేది లేదని.. టీడీపీలోనే ఉంటున్నానని.. ఆవార్తలు ఆవాస్తవం అని అన్నారు. తాను మాత్రం గాంధేయ మార్గంలోనే నడుస్తానని చెప్పారు.   అయితే చెప్పడానికైతే చెప్పారు కాని తాను మాత్రం అటు ఆపార్టీ ఉండలేక.. ఇటు టీఆర్ఎస్లోకి వెళ్లలేక జుట్టు పీక్కుంటున్నారంట. ఎందుకంటే.. అతనికి టీఆర్ఎస్ లోకి వస్తే ప్రభుత్వం నుండి అతనికి వున్న 20 కోట్ల బకాయిలు రద్దు చేస్తామని ఆఫర్ ఇచ్చారంట. దీంతో ఆ ఎమ్మెల్యే కొంచం ఇంట్రెస్ట్ చూపించినా.. ఇంతలోనే టీడీపీ నుండి షాక్ ఎదురైనట్టు తెలుస్తోంది. అతనికి తన ఊర నందిగామ దగ్గర ఉన్న 100కు పైగా ఎకరాలు ఉండగా వాటి విషయంలో ఇరుకున పడాల్సి వస్తుందని చినబాబు ద్వారా హెచ్చరికలు వచ్చాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో ఆ ఎమ్మెల్యేకు ఏం చేయాలో తెలియక అయోమక స్థితిలో ఉన్నారంట. మరి చూద్దాం..ఆయన ఈ పరిస్థితి నుండి ఎప్పుడు బయటపడతారో..

కుక్కని కూడా రేప్ చేశాడా..!

ఇప్పటి వరకూ మహిళలు, మైనర్ బాలికలు.. ఇంకా దురదృష్టకరం ఏంటంటే చిన్న పిల్లలపై అత్యాచారలు చేయడం విన్నాం. అయితే ఇప్పుడు ఆఖరికి జంతువులపై కూడా అత్యాచారాలు చేయడం మొదలు పెట్టారు కామాంధులు. గతంలో ఇలాంటివి ఒకటి రెండు ఘటనల గురించి విన్నాం. ఇప్పుడు మరో ఘటన తాజాగా వెలుగు చూసింది. క‌ళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు కుక్క‌పై అత్యాచారం చేసిన సంఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి  సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. దీంతో ఈ వీడియో అలా అలా జంతువుల హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యుల కంటపడటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని అప్పజెపితే భారీగా న‌గ‌దు బ‌హుమ‌తి ఇస్తామ‌ని ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చారు. అయితే ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి మాటలను బట్టి అతను మలయాళంలో మాట్లాడుతున్నాడని సంస్థ సభ్యులు చెబుతున్నారు.

మందు కోసం ఐసియూ నుండే వచ్చేశాడు..

మందు బాబులకు రోజు మందు కొట్టనిదే నిద్రపట్టదు. గొంతులో ఓ చుక్క పడటానికి ఏం చేయడానికైనా సరే వెనుకాడరు. కానీ తాజా ఘటన చూస్తుంటే మాత్రం మందు లేకుండా వీరు అసలు ఉండలేరేమో అనే సందేహం వస్తుంది.  సైబీరియాకు చెందిన ఓ వ్యక్తికి భారీ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే అతనికి రోజూ మందు తాగే అలవాటు ఉండటంతో తన పక్కన ఉన్న నర్సును పిలిచి తనకు కనీసం ఒక్క బీరు చుక్కయినా ఇప్పించమని అడిగాడట. దానికి ఆమె నిరాకరించడంతో ఐసీయూలో ఉన్న ఆయన తనకు తగిలించిన ట్యూబులు, మాస్కులు పీకేసి..ఐసీయూ నుంచి రోడ్డు మీదకు వచ్చాడు. దీంతో అతడిని చూసిన చుట్టు ప్రక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతణ్ని హాస్పిటల్‌కు తరలించారు. అంతేకాదు ఇంత మంది సిబ్బంది ఉన్నా అతను భయటకు ఎలా వెళ్లాడబ్బా అని హాస్పిటల్ యాజమాన్యం ఆశ్చర్యపోయింది. మొత్తానికి మందు కావాలంటే మందు బాబులు ఎంతకైనా తెగిస్తారని మరోసారి రుజువైంది.

రైలుకింద పడి బావమరదళ్లు ఆత్మహత్య.. పెళ్లైన మూడురోజులకే..

వికారాబాద్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. బావమరదళ్లు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. నవాబుపేట మండలం ఎక్‌మామిడి గ్రామానికి చెందిన ముక్కు లావణ్య అనే యువతి, రానివాస్‌ అనే యువకుడు ప్రేమించుకున్నారు. రానివాస్ లావణ్య అక్క మరిది. రానివాస్ వరుసకు బావ అవడంతో వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే  లావణ్యకు మాత్రం వారి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో వివాహం చేశారు. కానీ ఆ విహహం లావణ్యకు నచ్చకపోవడంతో వివాహమైన మరుసటి రోజున పుట్టింటికి వచ్చి తన ప్రియుడు రానివాస్ తో కలిసి వికారాబాద్‌ చిట్టిగిడ్డ రైల్వేస్టేషన్‌ మధ్యలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భూమా చేరికపై హైడ్రామా..

కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు భూమానాగిరెడ్డి, ఆయన తనయ భూమా అఖిలప్రియ పార్టీ మార్పుపై హైడ్రామానే నడుస్తోంది. ఒకవైపు భూమా పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తుంటే.. మరోవైపు ఆయన పార్టీ లేదని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు దీనిపై భూమా స్పందించి తాను పార్టీ మారేది లేదని చెప్పినా..టీడీపీ నేతలతో చర్చలు జరుపుతూనే ఉన్నారని అంటున్నారు. అయితే ఈరోజు జరిగిన చర్చల అనంతరం.. భూమానాగిరెడ్డి,  అఖిలప్రియ పార్టీ మారే యోచన నుంచి వెనక్కి తగ్గిట్టు తెలుస్తోంది. పార్టీ అధినేత..పార్టీ నేతలు భూమాని బుజ్జగించిన తరువాత మెత్తబడిట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మరి ఈ మాట మీద ఎన్ని రోజులు ఉంటారో చూడాలి.

మెక్ కల్లమ్ చివరి టెస్ట్ రికార్డ్.. ఫాస్టెస్ట్ సెంచరీ

టెస్టు క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మెక్‌కల్లమ్ సరికొత్త రికార్డుని నమోదు చేశాడు. అది కూడా ఇది తన ఆఖరి టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. క్రైస్ట్‌చర్చ్ వేదికగా అస్ట్లేలియా, న్యూజిలాండ్ కు రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుండగా.. న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో నాలుగవ బ్యాట్స్ మన్ గా క్రీజులోకి దిగిన మెక్ కల్లమ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 54 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. దీంతో టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

భూమాపై జగన్ ఆశలు వదులుకున్నట్టేనా..?

భూమా నాగిరెడ్డి టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ అతనిని బుజ్జగించడం.. కర్నూల్ జిల్లా ఎమ్మెల్యేలతో చర్చలు జరపడం అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే జగన్ భూమాపై ఆశలు వదులుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్యేలతో జగన్ భేటీ అయిన నేపథ్యంలో నాగిరెడ్డి భూమాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అవకాశవాదులను ఏమీ చేయలేమని.. పార్టీలో భూమా నాగిరెడ్డికి తక్కువేమీ చేయలేదని.. భూమాకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామని ఆయన చెప్పారు. గౌరవం ఇచ్చాం కాబట్టే పిఎసి చైర్మన్ పదవి ఇచ్చామని ఆయన చెప్పారు.

జాట్‌ల ఆందోళనలు ఉద్రిక్తం..ఎంపీ ఇంటిపై రాళ్లతో దాడి

ప్రభుత్వ ఉద్యోగాలు, యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు కోరుతూ.. జాట్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హరియాణాలో జాట్ల ఆందోళనలు మరింత ఉద్రితంగా మారాయి. ఆందోళనలో భాగంగానే బీజేపీ ఎంపీ షైనీ నివాసంపై రాళ్లు రువ్వారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్  ఆయన నివాసంలో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజు హజరయ్యారు. హరియాణాలోని భద్రతా ఏర్పాట్లపై వారితో చర్చించారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు హరియాణాలో 10 కంపెనీల పారామిలటరీ బలగాలు మోహరించాయి. మరో 23 కంపెనీల బలగాలను కూడా కేంద్రం అక్కడకు పంపిస్తోంది.

భూమాకి బుజ్జగింపులు.. ఎవరి ఆఫర్ కి ఓకే అంటారో..?

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వేడి వాతావారణం నెలకొంది. దీనంతికి కారణం భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు రావడమే. రెండు రోజుల క్రితమే వైసీపీ అధ్యక్షుడు జగన్ తమ పార్టీ నేతలు ఏ పార్టీలోకి వెళ్లరని.. ఇదంతా టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని.. ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతలే మాతో టచ్ లో ఉన్నారని గట్టిగానే చెప్పారు. అయితే జగన్ అలా చెప్పాడో లేదో రెండు రోజులకే భూమా నాగిరెడ్డి టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు రావడంతో జగన్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. దీంతో ఇప్పుడు ఆయన భూమాని బుజ్జగించే పనిలో పడినట్టు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి టీడీపీలోకి జంప్ అవుతున్నారు అన్న వార్తలు రాగానే  విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి భూమా నాగిరెడ్డితో చర్చలు జరపగా ఆయన వారికి తమకు పార్టీలో జరిగిన అన్యాయాన్ని వివరించారట. ఇదే విషయాన్ని వారు జగన్ కు చెప్పారంట. ఈ నేపథ్యంలోనే ఆయన కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలని ఉన్నపళంగా హైదరాబాద్ కు రమ్మని.. హడావుడిగా భేటీ అయి భూమా వ్యవహారంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.   ఇదిలా ఉండగా భూమా మాత్రం తాను పార్టీలోకి చేరేది లేదు అని ఒక పక్క చెబుతూనే.. ఆయన జరపాల్సిన చర్చలు ఆయన జరుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు టీడీపీలోకి వచ్చే భూమా నాగిరెడ్డికి కాని, కూతురు అఖియ ప్రియకి కాని మంత్రి పదవి ఇస్తామని టీడీపీ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసిందే. అయితే నాగిరెడ్డి మాత్రం టీడీపీలోకి రానూ అంటూనే గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారంట. ఇప్పటికి అన్ని పదవులు అనుభవించాను.. మంత్రి పదవి వద్దు కానీ.. ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే తాను టీడీపీలోకి వస్తానని ఆయనే టీడీపీకి రివర్స్ ఆఫర్ ఇచ్చారంట.   మరోవైపు భూమా నాగిరెడ్డి వ్యవహారంపై అటు వైకాపా నేతలు.. ఇటు టీడీపీ నేతలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. జగన్ ఇప్పటికే కర్నూల్ ఎమ్మెల్యేలతో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు భూమా నాగిరెడ్డితో పాటు ఇతర శాసనసభ్యులు పార్టీలో వస్తున్న నేపథ్యంలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా చూడడానికి కర్నూలు జిల్లా పార్టీ నేతలతో ఈరోజు సాయంత్రం 3 గంటలకి సమావేశం కానున్నారు. మరి ఇప్పటికే టీడీపీ భూమాకి ఒక ఆఫర్ ఇచ్చింది. మరి భూమా నాగిరెడ్డి కర్నూల్ జిల్లాలో కీలకమైన నేత కాబట్టి అతని వదులుకోవడానికి జగన్ సిద్దంగా ఉండరని రాజకీయ పెద్దలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అతను పార్టీలో ఉండాలంటే వైసీపీ కూడా ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి.. మరి వైసీపీ ఏం ఆఫర్ చేస్తుందో.. భూమా కి టీడీపీ ఆఫర్ నచ్చుతుందా.. లేక వైసీపీ ఆఫర్ నచ్చుతుందో..? పార్టీ మారుతారో.. లేదో..? తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

కన్హయ్య కేసులో కొత్త ట్విస్ట్.. మార్ఫింగ్ వీడియోనా..?

దేశ దోహిగా ఆరోపణలు మోస్తున్న కన్హయ్య కుమార్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయడపడుతోంది. ఇప్పటి వరకూ కన్హయ్య కుమార్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడంటూ.. అతనిని దేశ ద్రోహి అంటూ పలువురు అతనిపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఆధారం ఒక వీడియో. జమ్మూ కాశ్మీర్‌కు స్వేఛ్చ కావాలంటూ పెద్దఎత్తున, ఆవేశంగా నినాదాలు చేస్తున్న కన్నయ్యకుమార్‌ విడియో కొద్దిరోజులుగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వీడియో  మార్ఫింగ్‌ చేసిందని తేలింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరింత రసవత్తరంగా మారింది. ప్రముఖ ఎబిపి, ఇండియా టుడే ఛానళ్లు విడివిడిగా చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలినట్టు తెలుస్తోంది. అసలు సంగతేంటంటే..  జెఎన్‌యులో ఈ నెల 9వ తేది ఒక కార్యక్రమం జరగగా అందులో కొందరు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. అయితే, ఆ కార్యక్రమంలో చొరబడిన కొందరు ఎబివిపి విద్యార్థులు కూడా దేశ వ్యతిరేక నినాదాలు చేశారని, మరుసటి రోజు ఎబివిపి నిర్వహించిన కార్యక్రమంలో సైతం వారు ఉన్నారని ఫోటోలతో సహా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 11 వ తేది విశ్వవిద్యాలయ ఆవరణలో జరిగిన మరో కార్యక్రమంలో కన్నయ్యకుమార్‌ పాల్గొన్నాడు. ఈ రెండు కార్యక్రమాల వీడియోని తీసి దానిని మార్ఫింగ్ చేసి వీడియోని చేశారని తాజా పరిశోధనల్లో తెలిసింది. మరోవైపు పోలీసులు ఈ వీడియో ఆధారంగానే కన్హయ్యను అరెస్ట్ చేశారు. అంతేకాదు పలు పార్టీ నేతలు కూడా ఈ వీడియో ఆధారంగానే కన్హయ్యపై విమర్శలు గుప్పించారు. మరి వీడియో ఆధారంగానే కన్హయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంత కీలకమైన ఈ వీడియో మార్ఫింగ్ అంటే నమ్ముతారా.. మరి ఏం జరుగుతుందో చూడాలి..

కన్హయ్య బెయిల్.. ఇదొక సాంప్రదాయంగా మారుతుంది.. సుప్రీం

జెఎన్‌యు విద్యార్ది సంఘ నేత కన్హయ్య బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో హైకోర్టును సంప్రదించాలని సూచించింది. దేశ ద్రోహిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్హయ్య తరుపున  సత్వ రమే అనే న్యాయవాది పిటిషన్ ను దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో సత్వ రమే పిటిషన్‌ను పరిష్కరించాల్సిందిగా హైకోర్టును కోరింది. ఇప్పుడీ పిటిషన్‌ను గనుక ఈ కోర్టు విచారణకు స్వీకరిస్తే దేశంలోని నిందితులందరికీ ఇదొక సాంప్రదాయంగా మారుతుందని.. కాబట్టి ప్రతీ కేసుకు కూడా సుప్రీంకోర్టే కోర్టు అనుకుంటే అదొక ప్రమాదకరమైన సాంప్రదాయం అవుతుందని జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ సప్రేలతో కూడిన బెంచ్‌ పేర్కొంది

ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి..

జార్ఖండ్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. జార్ఖండ్‌లో నవాధియా అడవి సరిహద్దు గ్రామం గార్గబేఢ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అడవిలో నక్సల్స్‌ సమావేశం ఏర్పాటు చేశారని సమాచారం వచ్చిన వెంటనే భద్రతా దళాలతో అక్కడి చేరుకున్నామని.. భద్రతా దళాలు.. మావోయిస్ట్ ల మధ్య కాల్పులు జరిగాయని.. ఈకాల్పుల్లో నలుగురు మావోయిస్ట్ లు మృతి చెందగా..  ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయని.. ఎస్పీ రాజ్‌ కుమార్‌ లఖ్రా తెలిపారు. గాయాలైన పోలీసులను ఆస్పత్రికి తరలించాం.. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది అని చెప్పారు. కాగా మృతి చెందిన నలుగురిలో ఒక మహిళ ఉందని.. వారి మృతదేహాలతో పాటు  రెండు ఎస్‌ఎల్‌ఆర్లు, రెండు 303 తుఫాకులను స్వాధీనపరచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

లులియాకి హిందీ ట్యూషన్‌ పెట్టించిన సల్మాన్ ఖాన్.. ఎందుకో..?

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి ప్రేమాయణాలకు కొదువే లేదు. గతంలో చాలా మంది హీరోయిన్స్ తో రూమర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రొమేనియన్‌ మోడల్‌, టీవీ స్టార్‌ లులియా వంటూర్‌ని ప్రేమిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న వీరిద్దరి వ్యవహారం మరోసారి వార్తల్కోకి ఎక్కింది. అందేంటంటే అసలేమాత్రం హిందీ రాని లులియాకి చక్కటి హిందీ నేర్పడానికి సల్మాన్‌ ట్యూషన్‌ పెట్టించాడట. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. లులియా ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో అడుగుపెడుతుంది. ఈ నేపథ్యంలోనే హిందీ రాక ఇబ్బంది పడుతున్నందుకు ట్యూషన్ పెట్టించాడని అంటున్నారు. అయితే హిందీ సినిమాల్లో నటించేందుకా, లేక సల్మాన్‌ కుటుంబీకులతో కలిసిపోవడానికా అన్నది  బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. మరి ఎందుకో సల్మాన్ కి, లులియాకే తెలియాలి.

జగన పంచ్ కు రివర్స్ పంచ్.. టీడీపీలోకి భూమా..?

రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం వలసల పర్వం సాగుతోంది. ఏ పార్టీ నుండి ఎప్పుడు ఏనేత.. ఏ పార్టీలోకి జంప్ అవుతారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే తెలంగాణలో ఉన్న పార్టీల్లో సగానికి పైగా నేతలు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి చేరడానికే సముఖత చూపిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న టీడీపీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో తెలంగాణలో టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే ఏపీలోకి వచ్చేసరికి కాస్త పరిస్థితి బానే ఉంది. ఇక్కడ అధికార పార్టీ టీడీపీ కావడంతో కొంతమంది నేతలు టీడీపీ లోకి వలస వస్తున్నారు. ఇక ఈనేపథ్యంలో వైసీపీ పార్టీ అధినేత జగన్ కు పెద్ద షాకే ఎదురైంది. రెండు రోజుల క్రితమే మా పార్టీలో ఎవరూ టీడీపీలోకి వెళ్లడం లేదు.. ఇది టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్.. ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతలే మాతో టచ్ లో ఉన్నారు అని అన్నారు. దీంతో అందరూ చంద్రబాబుకి జగన్ ఝలక్ ఇచ్చారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే జగన్ కే దిమ్మతిరిగే షాక్ ఎదురైందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు భూమా అఖిల ప్రియ త్వరలో టిడిపిలో చేరుతారని కర్నూలు జిల్లాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. భూమా నాగిరెడ్డి ప్రస్తుతం పిఎసి చైర్మన్‌గా ఉండగా.. ఆయన కూతురు భూమా అఖిల ప్రియ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే. అయితే వీరిద్దరికి టీడీపీ నుండి మంచి ఆఫరే వచ్చినట్టు చెబుతున్నారు. వీరిద్దరు టీడీపీలోకి చేరితే ఓ మంత్రి పదవిని చంద్రబాబు ఇస్తారని చెప్పినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన  చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. ఇదిలా ఉండగా భూమాతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ రోజు కార్యకర్తలతో భేటీ అనంతరం అసలు విషయాలు తెలుస్తాయి అని అంటున్నారు రాజకీయ పెద్దలు. మొత్తానికి చంద్రబాబుకి షాకిచ్చానని సంతోషపడే లోపులోనే జగన్ కు రివర్స్ షాక్ ఎదురైనట్టుంది.