ఉల్లిని కోస్తే కాదు... అమ్మితే కన్నీళ్లు!
posted on Feb 24, 2016 @ 12:20PM
ఉల్లిగడ్డలు ఈసారి రైతులకు కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లకు చేరుస్తున్న ఉల్లిగడ్డలని ఒక దశలో కిలో 1.5కి కూడా రైతులు అమ్ముకోవల్సిన పరిస్థితి వస్తోంది. తెలంగాణను ముంచెత్తిన కరువు ఇందుకు ఒక కారణం కాగా, మహారాష్ట్ర నుంచి వెల్లువగా వస్తున్న ఉల్లి దిగుమతులు మరో కారణంగా కనిపిస్తున్నాయి. గత ఏడాది ఉల్లికి విపరీతంగా ధరలు లభించడంతో ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి మరీ తెలంగాణ రైతులతో ఉల్లిని సాగు చేయించింది.
కానీ కరువు కారణంగా సాగుకు తగిన నీరు లభించలేదు. దాంతో ఉల్లిగడ్డ పరిమాణం చాలా చిన్నదిగా ఉండిపోయింది. మరోవైపు మహారాష్ట్రలో కూడా ఉల్లిగడ్డలను విపరీతంగా పండించడంతో, అక్కడి మార్కెట్‌లో ఉల్లి ధరలు క్వింటాలుకి 500కి తక్కువగా జారిపోయాయి. వాటన్నింటినీ ఇప్పడు హైదరాబాదుకి తరలించడం మొదలుపెట్టారు మహారాష్ట్ర రైతులు. ఫలితం! నాణ్యత బాగున్న మహారాష్ట్ర ఉల్లి క్వింటాలుకి 1000-1400 పలుకుతుండగా, ఇక్కడ పండించిన ఉల్లిన మాత్రం నాణ్యత బాగోలేదంటూ క్వింటాకు 150-700 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే ఉల్లిరైతుకి తగిన గిట్టుబాటు ధరని చెల్లించాలని రైతులు కోరుకుంటున్నారు. అప్పటిదాకా ఉల్లిరైతుకి కన్నీరు తప్పేట్లు లేదు!