సమైక్యాంధ్రలో ‘జంప్ పితాని’

      పార్టీలు మారేవాళ్ళని ఈమధ్యకాలంలో ‘జంప్ జిలాని’ అని ముద్దుగా పిలుస్తున్నారు. ప్రస్తుతం అన్ని పార్టీల్లోనూ జంప్ జిలానీలున్నారు. అదలా వుంచితే ఇప్పుడు ‘జంప్ పితాని’ కొత్త పదం పుట్టడానికి కారణమయ్యారు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. మొన్నటి వరకూ కిరణ్‌కి తోడుగా వుండి, దగ్గరుండి ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ పెట్టించిన పితాని సత్యానారాయణ్ ఇప్పుడు ప్లేటు ఫిరాయించాడు. సమైక్యాంధ్ర పార్టీకి అంత విషయం లేదని గ్రహించేశాడో ఏంటో గానీ, సడన్‌గా ‘జంప్ పితాని’లాగా మారిపోయి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవాలని డిసైడైపోయాడు. అసలే సీమాంధ్రలో ఊహించిన స్థాయిలో జనాదరణ లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న జై సమైక్యాంధ్ర పార్టీకి మరో షాక్ ఇచ్చాడు. వెళ్ళేవాడు కూడా ఒంటరిగా వెళ్ళకుండా తనతోపాటు మాజీ మంత్రి శైలజానాథ్‌ని కూడా తెలుగుదేశం పార్టీకి తీసుకెళ్తున్నాడు. సమైక్య పోరులో మొదటి నుంచీ కిరణ్ కుమార్‌కి తోడుగా వున్న శైలజానాథ్ కూడా జంప్ జిలానీగా మారడం కిరణ్‌కి మింగుడు పడని విషయం. వీళ్ళతోపాటు ఇప్పటికే పార్టీలో ఉన్న అనేకమంది కీలక నాయకులు తెలుగుదేశం పార్టీకి జై కొట్టబోతున్నట్టు సమాచారం అందుతోంది.

దక్షిణ తెలంగాణలో దమ్ములేదట!

      తెలంగాణని ఉద్ధరించడానికే తాను, తన కుటుంబం ఈ భూమ్మీద అవతరించినట్టు ఫీలయిపోయే కేసీఆర్ అసలు సత్తా ఏంటో ఈసారి ఎన్నికలలో తేలిపోతుంది. ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబం కుక్కిన పేనుల్లా పడి వుండటం తప్ప మరేమీ చేయలేరన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అతి తెలివి కాకపోతే, తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని బాహాటంగా ప్రకటించిన కేసీఆర్ తీరా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కళ్ళు గిర్రున తిరిగేలా చేశాడు. విలీనం, పొత్తులు లేవు పొమ్మని డిసైడ్ చేశాడు. అలా డిసైడ్ చేసి తానేదో తెలివైన పని చేశానని, ఇక తెలంగాణ ఓటర్లందరూ తన పార్టీకి ఓట్లు వేసేస్తారని కేసీఆర్ అనుకుంటున్నాడు.   అయితే కేసీఆర్‌కి, ఆయన కుటుంబానికి, ఆయన పార్టీకి తెలంగాణలో అనుకున్నంత దృశ్యం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సీమాంధ్రులు, ముస్లింలు ప్రభావితం చేసే హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌కి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. దక్షిణ తెలంగాణలో అయితే కేసీఆర్ పప్పులు ఉడికే అవకాశాలు కనిపించడం లేదు. ఉత్తర తెలంగాణా వాడివి మామీద నీ పెత్తనం ఏంటంట అని దక్షిణ తెలంగాణ నాయకులు విరుచుకుపడుతున్నారు. దక్షిణ తెలంగాణ అస్తిత్వాన్ని ఉత్తర తెలంగాణవాళ్ళ చేతుల్లో పెట్టడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని అంటున్నారు. ఈ విషయాన్ని మరింత సూక్ష్మంగా పరిశీలిస్తే, ఉత్తర తెలంగాణలో తెరాస ప్రభావం దాదాపు శూన్యమేనని చెప్పాలి. ఖమ్మం జిల్లా విషయానికి వస్తే అక్కడ టీఆర్ఎస్ పార్టీని పట్టించుకునేవారే వుండరు.ఇక కేసీఆర్‌కి మిగిలింది ఉత్తర తెలంగాణ. ఆ ప్రాంతంలో ఉన్న సీట్లలో కేసీఆర్ పార్టీకి కొన్ని సీట్లు వస్తే రావొచ్చేమో! ఈ మాత్రం భాగ్యానికి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నట్టు, తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతలు తామే నిర్వహించబోతున్నట్టు కేసీఆర్ కుటుంబం చెప్పుకోవడం కామెడీగా వుందని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించకుండా టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్టయితే  కేసీఆర్ పరువు దక్కే అవకాశాలు వుంటేవని చెబుతున్నారు. కేసీఆర్ అతి తెలివితేటలకు మూల్యం ఈ ఎన్నికలలో చెల్లించక తప్పదని అంటున్నారు.

చిరంజీవికి ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ తప్పదా

  ఇటీవల బీజేపీలో చేరిన మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి ఆ పార్టీ సీమాంధ్ర ప్రచార కమిటీ కన్వీనర్ గా నియమించబడ్డారు. ఇంతవరకు సీమాంద్రాలో కిరణ్, జగన్, చిరంజీవి, చంద్రబాబు తమ తమ పార్టీల తరపున ఏదో ఒక రూపంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వారి మధ్య ఇప్పటికే జోరుగా మాటల యుద్ధం సాగుతోంది. మంచి వక్త, చక్కటి రాజకీయ పరిజ్ఞానం కలిగిన పురందేశ్వరి కూడా రంగంలో దిగినట్లయితే, ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చవచ్చును. కాంగ్రెస్ తరపున ఒక్క చిరంజీవి మాత్రమే కనిపిస్తుంటే, మిగిలిన పార్టీలలో అనేకమంది మంచి వక్తలు, జనాకర్షణ గల నేతలు ఉన్నారు. ఆయన తప్ప ప్రచారంలో పాల్గొంటున్న మిగిలిన వారందరూ హేమాహేమీలే. మంచి రాజకీయ పరిజ్ఞానం, పరిణతి ఉన్నవారే. చివరికి ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన కంటే ఎక్కువగా ప్రజలను ఆకట్టుకోగలరు. కానీ, కాంగ్రెస్ పార్టీలో ఆయన తప్ప ప్రజలను ఆకట్టుకోగల నేతలెవరూ లేకపోవడం ఆ పార్టీకి చాలా ఇబ్బందికరమయిన అంశంగా మారబోతోంది. కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవల చాలా మంది నేతలు తెదేపాలో చేరినందున వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవినే లక్ష్యంగా చేసుకొని యుద్దం ప్రకటిస్తే, చిరంజీవి తట్టుకొని నిలబడటం చాలా కష్టమవుతుంది. మాజీ సీయం కిరణ్ కుమార్ రెడ్డి తనపై చిరంజీవి చేసిన విమర్శలకు బదులిస్తూ తాను గనుక నోరు తెరిచి మాట్లాడటం మొదలుపెడితే చిరంజీవి ఇంట్లోంచి అడుగు కూడా బయటపెట్టలేని పరిస్థతి వస్తుందని చెప్పడం గమనిస్తే, చిరంజీవికి ఇన్ ఫ్రంట్ ఇన్ ఫ్రంట్ దేరీజే క్రోకడైల్ ఫెస్టివల్ ఉందని అర్ధమవుతోంది.

బిజెపి ప్రచార కమిటీ కన్వీనర్‌గా పురందేశ్వరి

      బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్‌గా మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి నియమితులయ్యారు. పురంధేశ్వరిని పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా శనివారం ఉదయం బిజెపి సీమాంధ్ర అధ్యక్షుడు హరిబాబు ప్రకటించారు. ఈనెల 25 నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అంగీకరించే పార్టీలతో పొత్తులు ఉంటాయని ఆయన మీడియాతో అన్నారు. కాగా, పురంధేశ్వరి సీమాంద్రలో బిజెపికి ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కూతురిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అయితే బీజేపీ, టీడీపీ పొత్తు ఖాయం అని అంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరిలు ఒకే వేదిక పంచుకోవాల్సి వుంటుంది.

చిరు కామెడీ స్టార్: కిరణ్ సెటైర్

      విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రి చిరంజీవి పైన సెటైర్లు వేశారు. చిరంజీవి తెరపైన మంచి నటుడే కాని రాజకీయాలలో కామెడీ స్టార్ గా మారిపోయారని అన్నారు. చిరంజీవి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదన్నారు. రాజకీయాలు తెలిసిన వారు విమర్శలు చేస్తే సమాధానం చెప్పవచ్చని వ్యాఖ్యానించారు. చిరంజీవి మాటలను బట్టి రాజకీయ పరిజ్ఝానం ఎంత ఉందో అర్థమవుతోందని ఆయన అన్నారు. విభజనకు తాను కారణమంటే వారి జ్ఝానానికి వదిలేస్తున్నానని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా తాను కాంగ్రెసు అధిష్టానం వద్ద ఏనాడూ వ్యవహరించలేదని, తాను విభజనకు వ్యతిరేకమని ముఖ్యమంత్రిని కావడానికి ముందు కూడా చెప్పానని ఆయన అన్నారు.

కాబోయే కేంద్ర మంత్రి పవన్?

      పవన్ కళ్యాణ్ చూడ్డానికి ఆవేశపరుడిలా కనిపిస్తాడుగానీ, లోపల చాలా ఆలోచన వుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయాల్లో తాను వెళ్ళాల్సిన రూట్‌లో కచ్చితంగా వెళ్తున్నాడని అభినందిస్తున్నారు. రాజకీయాల విషయంలో తన అన్న చిరంజీవిలా అపరిపక్వత, ఆలోచనాలేమిని ప్రదర్శించకుండా చాలా తెలివిగా అడుగులు వేస్తున్నాడని కితాబు ఇస్తున్నారు. బీజేపీకి చేరువై భవిష్యత్తులో తన అన్నలాగా కేంద్ర మంత్రి అవ్వాలన్న లక్ష్యానికి పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా చేరువవుతున్నాడని ప్రశంసిస్తున్నారు.   ‘జనసేన’ పార్టీని ప్రకటించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలోని సారాంశాన్ని పక్కన పెడితే, చివర్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన నినాదం బీజేపీకి చేరువ కావడానికి ఉద్దేశించిందేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రసంగమంతా తెలుగులో చేసిన పవన్, చివర్లో ‘కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో’ అని హిందీలో నినదించడం వెనుక కూడా వ్యూహం వుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తరిమికొట్టాలన్నది బీజేపీ విధానం. ఆ విధానాన్నే బీజేపీ అగ్ర నాయకత్వానికి అర్థమయ్యేలా హిందీలో నినదించడం ద్వారా పవన్ బీజేపీ అధిష్టానంలో మార్కులు సంపాదించేశాడు. పార్టీని ఇలా ప్రకటించాడో లేదో అలా బీజేపీ నాయకుడు, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నుంచి పవన్ కళ్యాణ్‌కి పిలుపొచ్చింది. గుజరాత్‌కి వెళ్ళి మోడీని కలిసొచ్చిన పవన్ కళ్యాణ్ తన మద్దతు బీజేపీకి వుంటుందని, కాబోయే ప్రధానమంత్రి నరేంద్రమోడీయేనని తేల్చి చెప్పేశాడు. టోటల్‌గా ఈ మేటర్ మొత్తన్నీ పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు నరేంద్రమోడీ, పవన్ కళ్యాణ్ మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒప్పందం కుదిరిందని భావిస్తున్నారు. ఆంధప్రదేశ్‌లో అంతంతమాత్రంగా వున్న బీజేపీకి పవన్ కళ్యాణ్ తన మద్దతు ఇచ్చి ఎక్కువ సీట్లు వచ్చేలా చేయాలి. దీనికి ప్రతిఫలంగా బీజేపీ అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్‌కి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేసి కేంద్ర మంత్రి పదవిని అప్పగిస్తుంది. మొత్తానికి పవన్ పెద్ద ప్లానే వేశాడు. తన అన్న చిరంజీవి జనాల్లో వున్న పరువంతా పోగొట్టుకుని, పార్టీ పెట్టి భంగపడి సంపాదించిన కేంద్రమంత్రి పదవిని పవన్ కళ్యాణ్ చాలా ఈజీగా సంపాదించే మార్గంలో వెళ్తున్నాడని పరిశీలకులు అంటున్నారు.

కాంగ్రెస్ కపట నాటకాలకు అంతే లేదా?

  నిన్న మొన్నటి వరకు తమను తమ అధిష్టానం అసలు ఖాతరు చేయడం లేదని, తమ మాటకు అసలు విలువే ఈయడం లేదని వాపోయిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ ఇప్పుడు అదే అధిష్టానానికి వీరభజనలు చేసేస్తూ, రాష్ట్రాన్ని విడదీసిందని తిట్టిపోసిన అదే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని తీరుతామని శపధాలు కూడా చేస్తున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినప్పటికీ సోనియా, రాహుల్ గాంధీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చాలా కనికరం చూపుతూ అనేక వరాలు ప్రకటించినందున వారిరువురికీ సీమాంధ్ర ప్రజలు ఎంతో ఋణపడి ఉండాలని, అందువలన కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపించుకొని కృతజ్ఞత ప్రకటించుకోవాలని కాంగ్రెస్ నేతలు కొందరు ఊరూరు తిరుగుతూ ప్రజలకు నూరిపోస్తున్నారు. పనిలోపనిగా, పార్టీని వీడిపోయిన వారందరూ ద్రోహులని, వారి వలననే రాష్ట్ర విభజన జరిగిందని అటువంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు.   రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ పార్టీయే అయినప్పటికీ, ఒకసారి తెదేపా, వైకాపాలు ఇచ్చిన లేఖల వలననే విభజించవలసి వచ్చిందని, అన్ని పార్టీలు ఒత్తిడి చేయడం వలననే విభజించవలసి వచ్చిందని మరోసారి, కిరణ్ కుమార్ రెడ్డి సహకరించడం వలననే విభజన జరిగిందని మరొకసారి చెప్పడం గమనిస్తే కాంగ్రెస్ నాలికకి నరం లేదని అర్ధమవుతుంది. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యేవరకు కూడా కిరణ్ కుమార్ రెడ్డి తన అధిష్టానానికి పూర్తిగా సహకరించారని చిరంజీవే స్వయంగా చెపుతున్నారు. అంటే ఆ విషయం ఆయనకీ చాలా స్పష్టంగా తెలుసనీ ఆయనే దృవీకరిస్తున్నారు.   అదేవిధంగా పార్టీకి అత్యంత విదేయుడయిన కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా విభజన ప్రక్రియను చివరి వరకు పర్యవేక్షిస్తారని దిగ్విజయ్ సింగ్ కూడా మొదటే ప్రకటించారు. ఆయన చెప్పినట్లే విభజన ప్రక్రియకి రాష్ట్రంలో ఎక్కడా ఆటంకం ఏర్పడకుండా టీ-బిల్లుని కిరణ్ కుమార్ రెడ్డి సజావుగా కేంద్రానికి త్రిప్పిపంపారు. అంటే కాంగ్రెస్ నేతలందరూ కలిసి కట్టుగా నాటకమాడుతూ ప్రజలను మభ్యపెడుతూనే ఈ తంతు పూర్తి చేసారని స్పష్టమవుతోంది.   కానీ, ఇప్పుడు చిరంజీవి కిరణ్ కుమార్ రెడ్డి తమను, పార్టీని మోసం చేసారని ఆరోపించడం చాలా విడ్డూరంగా కనిపిస్తున్నపటికీ, ఇదంతా కూడా కాంగ్రెస్ నేతలందరూ కలిసి కట్టుగా ఆడుతున్న నాటకంలో భాగమేనని, ఎన్నికల తరువాత కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడో లేక దానికి మద్దతు ఇచ్చినపుడో నిరూపించబడుతుంది.   అదేవిధంగా సీమాంధ్రలో ప్రతిపక్షాల మీద, పార్టీని వదిలిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి మీద నెపం వేసి చేతులు దులుపు కొంటున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణాలో మాత్రం సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణా ఏర్పడిందని అందువలన కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని కోరడం దీనిలో మరో కొత్త కోణం. అదేవిధంగా తెలంగాణా ఇచ్చినందుకు తెలంగాణాలో, సీమాంధ్రకు వరాలు ఇస్తున్నందుకు సీమాంద్రాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని ఇరు ప్రాంతాల ప్రజలకు కాంగ్రెస్ నేతలు ప్రభోదిస్తున్నారు. కానీ, రాష్ట్ర విభజన చేసి అటు తెలంగాణా ప్రజలకు కానీ, ఇటు సీమాంద్రా ప్రజలకు గానీ సంతోషం కలిగించలేని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో వారే చెప్పవలసి ఉంది.   సువిశాలమయిన భారతదేశాన్ని చిరకాలంగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ దృక్పధం కనబరచకపోగా, ఒక ప్రాంతీయ పార్టీ కంటే హీనంగా వ్యవహరించింది. వ్యవహరిస్తోంది. అటువంటప్పుడు దానికి ఓటేసి, దాని ముందు చేతులు జాచే దుస్థితి తెచ్చుకొనే బదులు ప్రజాభిప్రాయానికి విలువనిస్తున్న ప్రాంతీయ పార్టీలకే ఓటు వేసి గెలిపించుకొన్నట్లయితే కనీసం ఉభయ రాష్ట్రాలలో పరిస్థితులు స్థానిక ప్రభుత్వాల నియంత్రణలో సాగే అవకాశం ఉంటుంది.

పవన్ మోదీని కలవడం ఆశ్చర్యం: చిరు

      పవన్ కళ్యాణ్ బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోదీని కలిసి మద్దతు తెలపడంపై ఆయన సోదరుడు, కాంగ్రెస్ కేంద్రమంత్రి చిరంజీవి తప్పుపట్టారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... జన పార్టీ ఆవిర్భావ సభలో తాను లౌకిక వాదిని అని చెప్పిన పవన్ కళ్యాణ్, మతత్వ పార్టీ నాయకుడైన మోదీని కలవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో గోద్రా నరమేధంలో ఇప్పటికీ మోడీ పాత్రపై ఆరోపణలున్నాయని చిరంజీవి చెప్పారు. ఈ విషయంపై పవన్ కు అవగాహన ఉందో లేదో తెలియదని ఆయన తెలిపారు. మరోవైపు విభజనకు అనుకూలమని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత అన్ని పార్టీలు మాట మార్చాయని ఆరోపించారు. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళతామని చిరంజీవి చెప్పారు. కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు ఇతర పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. నాయకులు పార్టీని వీడినా..కార్యకర్తలు తమ వెంటే వున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు 13 జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు.

బీజేపీతో పొత్తుకు లోక్ సత్తా రెడీ

  రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు లోక్‌ సత్తా సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్ర, దేశ ప్రయోజనాల దృష్ట్యా పొత్తులకు సానుకూలమని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పేర్కొంటూ.. రాబోయే ఎన్నికల్లో కలసి పనిచేయడానికి బీజేపీని మెరుగైన భాగస్వామిగా పేర్కొన్నారు. ‘ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ స్వచ్ఛందంగా కండబలం, ఉచిత తాయిలాల రాజకీయం చేయకుండా వ్యవహరిస్తుందో.. ఎన్నికల విజయాలమార్గం ముళ్లబాటగా మారుతుంది’అని పేర్కొన్నారు.ఓటర్లకు డబ్బు పంపిణీ వంటి వ్యవహారాల్లో బీజేపీ వైఖరి ఇతర పార్టీలకంటే మెరుగైనదని పేర్కొంటూ ఆ పార్టీతో పొత్తుకు సానుకూల వైఖరి వ్యక్తంచేశారు. పార్టీ సభ్యులు లోతుగా ఆలోచించి.. కొత్త రాజకీయాన్ని కొనసాగిస్తూ ప్రజాప్రయోజనాల్ని పెంపొందించేందుకు ఆచరణాత్మక వ్యూహాన్ని వెలువరించాలని విజ్ఞప్తి చేశారు.

జానా - కోమటిరెడ్డి భాయీ భాయీ

  ఇన్నాళ్లూ నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌లో ఉప్పు-నిప్పులా ఉన్న మాజీ మంత్రులు కె.జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గాలు ఒక్కటయ్యాయి. వర్గ విభేదాలు, ఆధిపత్య పోరును తాత్కాలికంగా పక్కనపెట్టి ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. పార్టీ వర్గాల సమాచారం మేరకు కోమటిరెడ్డి నివాసంలో విందు సమావేశాన్ని నిర్వహించారు. జానారెడ్డితోపాటు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దీనికి హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్ష పదవి తనకే దక్కుతుందని భావించి చివరి నిమిషంలో భంగపడిన కుందూరు జానారెడ్డి, తెలంగాణ సాధనలో మంత్రి పదవిని త్యాగం చేసి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నా రాజకీయంగా కలిసి రావడం లేదని భావించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత జిల్లాలో వర్గపోరుకు అడ్డుకట్ట వేయాలనే నిర్ణయానికి వచ్చి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. వాస్తవానికి నల్లగొండ జిల్లాలో మొత్తం నాలుగు గ్రూపులున్నాయి. కోమటిరెడ్డి, జానారెడ్డి ఒక్కటి కావడంతో టీపీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వర్గాలు కూడా ఒక్కటైనట్లు తెలుస్తోంది.

మోదీకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్

      పవర్ పవన్ కళ్యాణ్ ఈరోజు అహ్మదాబాద్‌లోని గాంధీనగర్‌లో బీజేపీ కార్యాలయంలో నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. మోదీతో 40 నిముషాల పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...మోదీకి మద్దతు తెలపడం కోసమే అహ్మదాబాద్ వచ్చానని అన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ఎవరూ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్న విబేధాలను గుర్తించలేకపోయారని, ఇదే విషయాన్ని మోదీ కూడా చెప్పారని పవన్ పేర్కొన్నారు. మోదీ ప్రధాని అయితే రాష్ట్రానికి ఎలాంటి అవసరాలు ఉంటాయో కూడా చెప్పానని అన్నారు. తెలుగు ప్రజల్లో ఐక్యత లేకపోతే దేశ సమగ్రతకు భంగం కలుగుతుందని మోదీ చెప్పినట్లు ఆయన తెలిపారు. సూరత్‌లో ఉన్న తెలుగువారంతా ఐక్యతగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్న తెలుగువారిని, ఎందుకు ఐక్యంగా ఉంచలేకపోయారని మోదీ ప్రశ్నించారని పవన్ తెలిపారు. పదవులు కంటే రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరూ బాగుండాలని కోరుతూ మోదీని కలవడం జరిగిందని పవన్ స్పష్టం చేశారు.

ఒక్క ఓటరు.. ఐదుగురు సిబ్బంది

      అది కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. ఆ దట్టమైన అడవిలో 20 కిలో మీటర్లు ప్రయాణం వెళ్తే బనేజ్ అనే ప్రాంతంలో అక్కడో గుడి ఉంది. ఆ గుడికి ఒక పూజారి ఉన్నారు. ఆయన పేరు మహంత్ దర్శన్ దాస్. ఆయన ఉండేది సప్నేశ్ బిల్లియత్ అనే ఊళ్లో. ఆ ఊరు గుజరాత్ లో ఉంది. ఆ ఊరికి ఆయనొక్కడే నివాసి, ఆ పోలింగ్ బూత్ కి ఆయనొక్కడే ఓటరు.   ఈ ఒక్కరి కోసం ఒక పోలింగ్ బూత్ ఏర్పాటవుతుంది. ఈ ఒక్క ఓటు వేయించడం కోసం ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు పోలింగ్ ఆఫీసర్లు, ఒక ప్యూన్, ఒక పోలీసు అడవిలో ప్రయాణించి వస్తారు. దర్శన్ దాస్ ఓటు వేస్తే అధికారుల డ్యూటీ పూర్తయినట్టే. నిజానికి ఒకప్పుడు బనేజ్ లో 85మంది ఓటర్లు ఉండేవారు. వారంతా అడవిని వదిలిపెట్టి వేరే చోట్లకి వెళ్లిపోయారు. కానీ దర్శన్ దాస్ మాత్రం గుడిని, ఊరిని వదిలిపెట్టలేదు.ఈ బూత్ గుజరాత్ లోని జునాగఢ్ జిల్లాలోని ఉనా నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇలాంటి బూత్ లు అరుణాచల్ లో కూడా ఉన్నాయి. అక్కడున్న 8 పోలింగ్ బూత్ లలో 3-8 మంది ఓటర్ల చొప్పున ఉంటారు. మరాంబో, అప్పర్ ముడోయిదీప్ పోలింగ్ బూత్ లలో మూడేసి మంది చొప్పున ఓటర్లు ఉంటారు. మాలోగామ్, సికారిడోంగ్ పోలింగ్ బూత్ లలో నలుగురు చొప్పున ఓటర్లుంటారు. లామ్టా అనే బూత్ లో అయిదుగురు, మటక్రాంగ్, ధర్మపూర్ బూత్ లలో ఏడుగురు చొప్పున, పున్లి బూత్ లో తొమ్మిది మంది ఓటర్లు మాత్రమే ఉంటారు. ఇక్కడకు వెళ్లాలంటే రోడ్లేమీ ఉండవు. వాహనాలు వెళ్లలేవు. కాబట్టి పోలింగ్ సిబ్బంది రెండేసి రోజులు కాలి నడకన ప్రయాణించి పోలింగ్ బూత్ లకు చేరుకుంటారు. పోలింగ్ పూర్తయ్యాక రెండు రోజులు తిరుగుప్రయాణం చేస్తారు. ఈ పోలింగ్ బూత్ లన్నీ చైనా , మయన్మార్ సరిహద్దుల్లో ఉంటాయి.

నీకు హెల్ప్ చేశానుగా.. ప్లీజ్

      జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు తమ గెలుపునకు విశ్వప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే కీలకమైన సర్పంచ్‌లను ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు.   ‘పంచాయతీ ఎన్నికల్లో నేను మద్దతిచ్చాను. ఇప్పుడు నేను గెలిచేందుకు మద్దతివ్వు. ఓట్లేసి నిన్ను గెలిపించినోళ్లు.. మీమాట వింటారు. వాళ్లతో మాట్లాడి.. నన్ను గెలిపించు’ అంటూ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఆయా గ్రామాల్లోని సర్పంచ్‌లను కోరుతున్నారు. వారి మద్దతు కోసం అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. కొన్నిచోట్ల ప్యాకేజీలు కూడాఇస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది జులైలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎనిమిది నెలల వ్యవధిలో పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎం పీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారై, ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. వేలం పాటల జోలికి వెళ్లినట్లు తెలిస్తే శిక్ష తప్పదని భయపడుతున్నవారు వేరే మార్గాలు వెతికారు. సర్పంచ్‌ల మద్దతు ఉంటే గెలుపు సులభతరం అవుతుందని భావిస్తున్న వారు వారి మద్దతు కోసం నానాపాట్లు పడుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయడానికి ముందునుంచే సర్పంచ్‌లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో అభ్యర్థుల నుంచి అధికమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఆర్థికస్థోమత ఎక్కువగా ఉన్న నేతలు తాము గెలిచేందుకు ఎంతైనా వెచ్చించడానికైనా సిద్ధంగా ఉండటంతో పలువురు సర్పంచ్‌ల పంట పండుతోంది. గ్రామాన్ని బట్టి లక్ష రూపాయల నుంచి ఐదులక్షల వరకు ప్యాకేజీ ఇస్తున్నట్లు తెలిసింది.

యాచక కోటీశ్వరురాలు మృతి

      సౌదీ అరేబియాలో వందేళ్ల వయసున్న ఈషా అనే యాచకురాలు కన్నుమూసింది. పేరుకు యాచకురాలే అయినా ఆమె కోట్ల సంపదను కూడబెట్టింది. ఆమె వద్ద ఉన్న బంగారు నాణేలు, ఆభరణాలు, భవనాలు, భూముల విలువ సుమారు రూ.6 కోట్లపైనే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. జెడ్డాలో సుమారు 50 ఏళ్లపాటు ఆమె భిక్షాటన చేసినట్టు ఈషాకు పరిచయస్తుడైన అహ్మద్ అల్ సయీది తెలిపారు. అల్ బలాద్ జిల్లాలో ఈషాకు నాలుగు భవనాలు ఉన్నాయి. ఆమెకు ప్రస్తుతం నా అన్నవాళ్లెవరూ లేరని, తల్లి, ఓ సోదరి ఉంటే గతంలోనే మృతిచెందారని సయీది తెలిపారు. వారి ఆస్తి కూడా ఈషాకే వచ్చిందని, ఆమె వీలునామా గురించి ప్రభుత్వ అధికారులకు తెలపగా ఎలాంటి స్పందన లేదని ఆయన చెప్పారు. తన సంపదను పేదలకు పంచాల్సిందిగా ఈషా వీలునామాలో రాసిందని వెల్లడించారు. ఈషా తమనుంచి ఎప్పుడూ అద్దె వసూలు చేయలేదని ఆమె భవనాల్లో నివసిస్తున్నవారు ఈ సందర్భంగా చెప్పారు.

వైకాపా ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి అరెస్ట్

      రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టారనే ఆరోపణలపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపర్చేందుకు బెంగుళూరు నుంచి బళ్లారికి తరలిస్తున్న జగన్, కాపు ఫోటోలున్న గోడగడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.36 లక్షల విలువ చేసే చెక్కులు, చీరలు, రైస్‌కుక్కర్లు, క్రికెట్ సామాగ్రిని పోలీసులు బళ్లారి చెక్ పోస్ట్ వద్ద సీజ్ చేశారు. ఈ ఉదయం కర్నాటక బళ్లారి, అనంతపురం జిల్లా రాయదుర్గంలో రామచంద్రారెడ్డి నివాసంలో పోలీసులు ఏకకాలంలో సోదాలు చేసి ఓట్లర్లకు పంచేందుకు సిద్దం చేసిన సామాగ్రిని స్వాదీనం చేసుకున్నారు. అనంతరం రామచంద్ర రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కి తరలించారు.

పవన్ లెఫ్ట్ భావాలు.. రైట్ చూపులు

  పవన్ కళ్యాణ్ . ఇప్పుడు ఓ పవర్ సెంటర్. పవనిజం.. యూత్ ను ఊపేస్తున్న మానియా. ఎన్నికల్లో దిగుతానని పవన్ ప్రకటించగానే స్నేహహస్తం అందిస్తూ అనేక పార్టీలు ముందుకు వచ్చాయి. ఆయితే పవన్ ఆలోచనలు, మానసిక సంఘర్షణ అంతా లెఫ్ట్ భావాలతో తొణికిసలాడుతుంది. ఒక్క కాంగ్రెస్ ను ఓడించేందుకు తానూ ఏ పార్టీతోనైనా కలుస్తానని ప్రకటించిన పవన్, తన ఆలోచనలకు దగ్గరగా ఉండే కామ్రేడ్లు వైపు కన్నెత్తి చూడడం లేదు. పైగా తన భావాలకు పూర్తి విరుద్ధమైన బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నాడు. నోవాటెల్ నుంచి ప్రసంగించిన పవర్ స్టార్, కులం, మతం, ప్రాంతం అన్నింటికీ తాను వ్యతిరేకమని ప్రకటించాడు. కానీ ఇప్పుడు మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీతో జట్టు కట్టేందుకు చర్చలు జరుపుతున్నాడు. ఇక్కడే క్లారిటీ లోపించిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

బీజేపీలోకి దినేష్ రెడ్డి?

      ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న మాజీ డీజీపీ దినేష్ రెడ్డి.. బీజేపీ వైపు చూస్తున్నారు. త్వరలోనే ఆయన కమలం పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశమున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర బీజేపీ నేతలతో దినేష్‌రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఎన్నికల్లో బీజేపీ తరుపున ఒంగోలు లోక్‌సభ స్ధానం నుంచి బరిలోకి దిగేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇంకా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. తనకు మద్దతివ్వాలంటూ ముందే టీడీపీ నేతలను కలిసి వచ్చి, ఆ తర్వాతే ఆయన బీజేపీ నాయకులను సంప్రదించారని దినేష్ సన్నిహితులు చెబుతున్నారు. అలాగే పార్టీలో చేరికపై బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతో కూడా దినేష్‌రెడ్డి ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

ఇల్లు కాలుతుంటే.. చుట్టకు నిప్పా?

      ఒకవైపు ఇల్లు కాలిపోతుంటే మరోవైపు చుట్టకు నిప్పు దొరికిందని సంబర పడ్డాడట వెనకటికెవడో. మన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల) తీరు అలాగే ఉందని గవర్నర్ నరసింహన్ మండిపడ్డారు. వాళ్ల విదేశీ పర్యటనల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ పథకాలు, కార్యక్రమాల అధ్యయనం పేరుతో విదేశీ పర్యటనలకు అనుమతించాలని ఫైళ్లు రావటంతో ఆయన మండిపడ్డారు. ఒకపక్క విభజన ప్రక్రియ, మరోపక్క ఎన్నికలు జరుగుతుంటే ఇప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లటం ఏమిటని ప్రశ్నించారు. ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు ఎవ్వరికీ విదేశీ పర్యటనలకు అనుమతితో పాటు సెలవులు కూడా మంజూరు చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు. ఇక నుంచి విభజన ప్రక్రియ ముగిసే వరకూ ప్రభుత్వఉద్యోగులు ఎవ్వరికీ గవర్నర్ అనుమతి లేకుండా సెలవులూ మంజూరు చేయరు. దీనికి సంబంధించి సీఎస్ మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

జైరామ్ దృష్టిలో వీరంతా ఎవరు?

  కేంద్రమంత్రి జైరామ్ రమేష్ అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు అత్యంత ప్రముఖుడు. మన రాష్రం కోటా నుంచే రాజ్యసభకు కాంగ్రెస్ ఎంపిక చేసిన ఈ మేధావి కలహ ప్రియుడు. అంటే నారదుడి టైపు అన్నమాట. ఒకే నోరు.. కర్నూలులో ఒక మాట, కరీంనగర్ లో ఒక మాట ఇదీ జైరాం రమేష్ తీరు. తాజాగా మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణా ఇవ్వడం కోసం కాంగ్రెస్ 14 ఏళ్ళుగా రాముడిలా వన వాసం, పాండవులా అజ్ఞాత వాసం చేసిందన్నాడు. అయితే సీమాంధ్రులు కౌరవులా, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీతో పాటు ఇతర పార్టీలు రావణుడి టైపా? మరి ఈ విషయాలు కూడా చెబితే కదా ఎవరు రాముడో, ఎవరు రావణుడో తేలిపోయేది. తమరు పాండవులైతే .. కౌరవులెవరో చెప్పకుండా ఎలా తెలుస్తుంది సారూ..?