జగన పంచ్ కు రివర్స్ పంచ్.. టీడీపీలోకి భూమా..?

రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం వలసల పర్వం సాగుతోంది. ఏ పార్టీ నుండి ఎప్పుడు ఏనేత.. ఏ పార్టీలోకి జంప్ అవుతారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే తెలంగాణలో ఉన్న పార్టీల్లో సగానికి పైగా నేతలు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి చేరడానికే సముఖత చూపిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న టీడీపీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో తెలంగాణలో టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే ఏపీలోకి వచ్చేసరికి కాస్త పరిస్థితి బానే ఉంది. ఇక్కడ అధికార పార్టీ టీడీపీ కావడంతో కొంతమంది నేతలు టీడీపీ లోకి వలస వస్తున్నారు. ఇక ఈనేపథ్యంలో వైసీపీ పార్టీ అధినేత జగన్ కు పెద్ద షాకే ఎదురైంది. రెండు రోజుల క్రితమే మా పార్టీలో ఎవరూ టీడీపీలోకి వెళ్లడం లేదు.. ఇది టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్.. ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతలే మాతో టచ్ లో ఉన్నారు అని అన్నారు. దీంతో అందరూ చంద్రబాబుకి జగన్ ఝలక్ ఇచ్చారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే జగన్ కే దిమ్మతిరిగే షాక్ ఎదురైందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు భూమా అఖిల ప్రియ త్వరలో టిడిపిలో చేరుతారని కర్నూలు జిల్లాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. భూమా నాగిరెడ్డి ప్రస్తుతం పిఎసి చైర్మన్‌గా ఉండగా.. ఆయన కూతురు భూమా అఖిల ప్రియ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే. అయితే వీరిద్దరికి టీడీపీ నుండి మంచి ఆఫరే వచ్చినట్టు చెబుతున్నారు. వీరిద్దరు టీడీపీలోకి చేరితే ఓ మంత్రి పదవిని చంద్రబాబు ఇస్తారని చెప్పినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన  చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. ఇదిలా ఉండగా భూమాతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ రోజు కార్యకర్తలతో భేటీ అనంతరం అసలు విషయాలు తెలుస్తాయి అని అంటున్నారు రాజకీయ పెద్దలు. మొత్తానికి చంద్రబాబుకి షాకిచ్చానని సంతోషపడే లోపులోనే జగన్ కు రివర్స్ షాక్ ఎదురైనట్టుంది.

15 ఏళ్లు పైబడిన బస్సులను నడపొద్దు..

గోవా రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..ఇకనుండి 15 ఏళ్లు పైబడిన బస్సులను నడపకూడదని. వివరాల ప్రకారం.. కదంబ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(కేటీసీఎల్‌)లో 15 ఏళ్లు పైబడిన బస్సులను ఇక నడిపించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. 15 ఏళ్ల పాటు ఉపయోగించిన బస్సులను తొలగించాలని.. వాటి స్థానంలో కొత్త బస్సులను చేర్చాలని ఆదేశించింది. బస్సులను దశలవారీగా తొలగించి..   2021 నాటికి ఈ ప్రక్రియను  పూర్తి చేయాలని సూచించింది. అంతేకాదు 20 ఏళ్లకు పైగా నడుస్తున్న బస్సులను వచ్చే ఏడాది మార్చి 31 లోపల తొలగించాలని.. 17, 18ఏళ్లు పైబడిన బస్సులను 2018 మార్చి నాటికి మార్చేయాలని ప్రభుత్వం రవాణా సంస్థకు సూచించింది.

68 రూపాయలకే ఐ-ఫోన్‌

ఈ ప్రకటన ఆన్‌లైన్లో కనిపిస్తే ఎగబడంది ఎవరు. కానీ 30,000 విలువ చేసే  iPhone 5S ని ఎవరన్నా 68 రూపాయలకి అమ్ముతారా? అంటే అదే జరిగింది మరి! స్నాప్‌డీల్‌ సంస్థ చేసిన ఈ పొరపాటు ఓ వినియోగదారుడికి కలిసి వచ్చింది. ఈ నెల 12వ తేదీన స్నాప్‌డీల్‌ వెబ్‌సైట్లో కొత్త ఐఫోన్‌ విలువని పొరపాటుగా 68 రూపాయలు అంటూ పేర్కొంది. ఇలాంటి ఆఫర్లు ఎప్పుడు కనిపిస్తాయా అని కాచుకుని కూర్చున్న నిఖిల్‌ బన్సల్‌ అనే విద్యార్థి మరుక్షణంలోనే దానిని ఆర్డరు చేసేసుకున్నాడు. స్నాప్‌డీల్ తన పొరపాటుకి చింతించి వెంటనే ఆ ధరని మార్చేసింది. కానీ అప్పటికే ఫోన్ కొనేసిన నిఖిల్‌ ఊరుకుంటాడా! స్నాప్‌డీల్ తనని మోసం చేసిందంటూ పంజాబులోని ఓ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశాడు. కోర్టు నిఖిల్‌కి అనుకూలంగా తీర్పుని ఇవ్వడమే కాకుండా నష్టపరిహారంగా ఓ రెండు వేలు చెల్లించమని చెప్పింది. అయినా స్నాప్‌డీల్‌కి మనసు ఒప్పలేదు. ఇదంతా ఓ సాంకేతిక పొరపాటు అంటూ ఓ వినియోగదారుల పోరంలో కేసుని దాఖలు చేసింది. అక్కడా స్నాప్‌డీల్‌కి చుక్క ఎదురైంది. ఈసారి నష్టపరిహారం 10,000కి పెరిగింది. అదీ సంగతి! ఇటూ ఐ-ఫోనూ చవకగా దొరికింది. అటు నష్టపరిహారమూ దక్కింది.

అక్రమాస్తుల కేసులో భాగంగా జగన్ కు కోర్టు సమన్లు..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్యుడు జగన్మోహన్‌రెడ్డికి ఆక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిలో భాగంగా కోర్టు సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఫార్మ కంపెనీలైన అరబిందో, హెటిరో వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాఖలు చేసిన ఫిర్యాదును గురువారం ఈడీ ప్రత్యేక కోర్టు, మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఈకేసులో నిందితుడైన జగన్ కు కి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి టి రజని సమన్లు జారీ చేశారు. మార్చి 28న  వ్యక్తిగతంగా హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ తో పాటు మరో 19 మందికి సమన్లు జారీ చేశారు.

అండర్‌వరల్డ్‌ డాన్‌ కుమార పిళ్లై అరెస్ట్..

అండర్‌వరల్డ్‌ డాన్‌ కుమార పిళ్లైను పోలీసులు పట్టుకున్నారు. ముంబైలోని పలు నేరాలలో నిందితుడిగా ఉన్న కుమార పిళ్లై కోసం పోలీసులు గత కొంత కాలంగా పరారీలో ఉన్నారు. ఈయన కోసం పోలీసులు చాలా కాలం నుండి గాలిస్తున్నారు. దీనిలో భాగంగానే కుమార పిళ్లైని సింగపూర్‌లో అరెస్టు చేసినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. గతంలో ఇతడిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు కూడా జారీ అయింది. అయితే ఇప్పుడు సింగపూర్ లో అరెస్ట్ చేసిన వ్యక్తి కూమార్ పిళ్లె అవునా ..కాదా? అని అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. దీనిపై  ముంబయి పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడు కుమార పిళ్లై అని నిర్ధరణ అయిన తర్వాత సింగపూర్‌ నుంచి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.

మోడీ, షరీఫ్ మరోసారి..

పఠాన్ కోట్ ఉగ్రవాదుల దాడి వలన జనవరిలో జరగాల్సిన భారత్ ప్రధాని నరేంద్ర మోడీ.. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ల భేటీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు జరగాల్సిన భేటీ ఆగిపోవడంతో వీరిద్దరూ మరోసారి కలవనున్నట్టు తెలుస్తోంది. మార్చి నెలలో ప్రారంభమయ్యే.. ప్రపంచ అణుసదస్సులో ఇరుదేశాల ప్రధానులు ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వం వహిస్తారు. కాగా ప్రపంచ దేశాల అణుకార్యక్రమాలు, పర్యవసానాలు, అణుశక్తి వినియోగం తదితర అంశాలపై ఈ సదస్సులో పలు తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మోదీ పర్యటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ పాక్ అధికారులు మాత్రం ఇద్దరి భేటీ ఖాయమంటున్నారు. మరి అది ఎంత వరకూ నిజమే చూడాలి.

రైలు ఢీకొని నలుగురు మృతి..

ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు గ్యాంగ్ మెన్ లపైకి సబర్బన్ రైలు దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడనే దుర్మరణం చెందారు. వివరాల ప్రకారం.. సబర్బన్‌ కుర్లా- విద్యావిహార్‌ స్టేషన్ల మధ్య గ్యాంగ్‌మెన్లు పట్టాలపై మరమ్మతులు చేస్తుండగా... ఛత్రపతి శివాజీ టెర్మినస్‌కు(సీఎస్‌టీ) వెళ్తున్న లోకల్‌ రైలు వీరిపై నుంచి దూసుకెళ్లినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. అయితే వారిని ఆస్పత్రికి తీసుకెళుతుండగా అప్పటికే మృతి చెందినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణంపై విచారిస్తున్నామని, ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

రంగలోకి దిగనున్న బీజేపీ అధ్యక్షుడు..

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ చేసింది ఏం లేదు. దీంతో బీజేపీ పై రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుండి విమర్శలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎన్నో ఆందోళనలు..దీక్షలు చేపట్టడం కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు తమ పార్టీపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షానే స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. దీనిలో భాగంగానే ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై బీజేపీ సంకల్పం’ పేరుతో ఒక భారీ ప్రచార ప్రణాళికను ఆయన రాష్ట్రంలో అమలు చేయబోతున్నట్టు సమాచారం.. అయితే ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రతి పైసా, ప్రతి అనుమతీ ప్రజల ముందు పెట్టడమేనట. అంతేకాదు మార్చి ఆరో తేదీన రాజమండ్రి లో జరిగే పార్టీ బహిరంగ సభ నుంచే అమిత్‌షా ఈ ప్రణాళికను అమలులో పెట్టబోతున్నారట. చూద్దాం.. ఈ ప్రణాళిక ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..

చెన్నై ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్య.. కారణం అదేనా..?

చెన్నై లో యువ ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. తమిళనాడు రాజధాని చెన్నై శివారు ప్రాంతం ఎగ్మోర్‌లో ఎన్‌ హరీశ్ ఐపీఎస్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన  చెన్నైలోని ఎగ్మోర్‌ ప్రాంతంలో ఐపీఎస్‌ అధికారుల క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. అయితే ఈరోజు ఈయన కోసం కార్యలయ సిబ్బంది రాగా ఆయన మాత్రం ఎంతసేపటికీ తలుపులు తెరవక పోవడంతో అనుమానం వచ్చి వారు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే హరీశ్‌ చనిపోయి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అయితే అధికారుల సమాచారం ప్రకారం కాస్త కొద్ది రోజుల నుండి హరీశ్‌ ప్రమోషన్ పై విచారణ జరుగుతోందని.. అతని బ్యాచ్ వాళ్లకి రెండేళ్ల కిందటే ప్రమోషన్స్‌ వచ్చాయి దీంతో హరీశ్ మనస్తాపం చెందినట్టు తెలిపారు. అయితే ఇప్పుడు హరీశ్‌ ఆత్మహత్యకు పదోన్నతి అంశమే కారణమా? లేక వేరే ఏదైనా ఉందా? అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు

దిల్లీ ప్రొఫెసరు గిలానీ- తీహార్‌ జైలుకి!

దిల్లీ విశ్వవిద్యాలయపు మాజీ ప్రొఫెసరు గిలానీకి న్యాయస్థానం 14 రోజుల జుడీషియల్‌ కస్టడీని విధించింది. ఈ మేరకు ఆయనను కొద్దిసేపటి క్రితమే తీహార్‌ జైలుకి తరలించారు. ఆది నుంచీ వివాదాస్పదంగా వ్యవహరిస్తూ వస్తున్న గిలానీ ఈ నెల 10వ తేదీన అఫ్జల్‌గురుకి అనుకూలంగా ప్రెస్‌క్లబ్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో అఫ్జల్‌గురుకి అనుకూలంగా, ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. గిలానీ మొదటి నుంచీ కూడా కశ్మీర్ వేర్పాటవాదులకు మద్దతుగా వ్యవహరించేవారు. 2001లో పార్లెమంటు మీద జరిగిన దాడిలో కూడా గిలానీ ముఖ్య పాత్రను పోషించారని ఆరోపణలు వచ్చాయి. అయితే సరైన సాక్ష్యధారాలు లేకపోవడంతో ఆయనను విడుదల చేయక తప్పలేదు. మరోసారి దేశద్రోహం కేసు కింద అరెస్టైన గిలానీ విషయంలో న్యాయస్థానం ఏ తీర్పుని వినిపించబోతోందో చూడాలి.

పాముల పెట్టెలో తల పెట్టిన క్రికెటర్.. కాటేసింది..

పాము పుట్టలో చేయి పెడితే కాటు వేయకుండా ఉంటుందా.. వేసే తీరుతుంది. అలాంటిది కావాలని పెడితే ఇంక ఊరుకుంటుందా.. ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది. ఇంతకీ పాము పుట్టలో చేయి ఎవరు పెట్టారబ్బా అనుకుంటున్నారా.. పెట్టింది చేయి కాదు.. తల అది కూడా క్రికెటర్ షేన్‌వార్న్. ఆస్ట్రేలియాలో నెట్ వర్క్ టెన్ నిర్వహించిన ఓ రియాల్టీ షోకు వార్న్ హాజరయ్యాడు.  ఈ రియాల్టీ షోలో ఓ చిన్న సైజు అనకొండలతో ఓ టాస్క్  చేయాల్సి ఉంది. దీనిలో భాగంగానే అతను తన తలను అనకొండలు ఉన్న బాక్స్ లో దూర్చాడు. అంతే అందులో ఉన్న ఒక అనకొండ వార్న్ తలపై కాటేసింది. అయితే అదృష్టం ఏంటంటే.. అది విషపూరితం కాకపోవడం, మరీ పెద్దగా కాటేయకపోవడం. అదే గట్టిగా కాటేస్తే.. సుదీర్ఘ కాలం పాటు చికిత్స చేయించుకోవాల్సి వచ్చేదట. మరి ఇలాంటి రిస్కీ రియాల్టీ షోలు ఎంతవరకూ అవసరమో..?

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం..

చిత్తూరు జిల్లాలో ఓ దారుణమైన ఘటన వెలుగుచూసింది. కన్న తండ్రే కూతురిపై అత్యాచారం చేసి సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో ఓ వ్యవసాయ కూలీ పన్నెండేళ్ల తన కూతురిపై ఇప్పటికీ మూడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తరచూ పంట పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి.. పైగా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడు. అయితే ఒకరోజు తన తండ్రి అత్యాచారానికి ప్రయత్నించగా బాలికి తప్పించుకొని ఇంటికి వెళ్లి తన తల్లికి చెప్పింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైం తల్లి బాలికను తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా బాలిక తండ్రి పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు