పాపం శంకర్రావు!

      కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావుకి తనకు మళ్ళీ టిక్కెట్ దక్కదేమోనన్న భయం పట్టుకుంది. సోనియాగాంధీకి గుడికట్టినప్పటికీ శంకర్రావుకి ఈసారి టిక్కెట్ రావడం అనుమానమేనన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో శంకర్రావు దిగులు పెట్టేసుకున్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడ్డం, ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడం వెన్నతో పెట్టిన విద్య అయిన శంకర్రావు కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరమైపోయారు. ఈమధ్యకాలంలో తాను చేసిన తప్పులు గుర్తొచ్చి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించారు. తెలంగాణ తల్లి అంటే వేరే ఎవరో కాదు. సాక్షాత్ సోనియాగాంధీయే అని ప్రకటించేశారు. చివరికి సోనియాగాంధీకి గుడి కూడా కట్టేశారు. అలాంటి శంకర్రావు ఇప్పుడు తనకు టిక్కట్ రాదని బెంగపడిపోతున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా పర్లేదు గానీ, తన స్థానంలో తన కుమార్తెకి అయినా టిక్కెట్ ఇవ్వాల్సిందిగా  వినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. పాపం శంకర్రావు.

బాబు అంటే కోపం లేదు: పురంద్రేశ్వరి

      తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అంటే తనకు వ్యక్తిగతంగా కోపమేమీ లేదని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంద్రేశ్వరి అన్నారు. దగ్గుబాటి కుటుంబం నారా కుటుంబానికి మొదటి నుంచీ దూరంగా వుంటూ వచ్చంది. ఎన్టీఆర్‌ని పదవీచ్యుతుడిని చేసిన సమయంలో తోడల్లుళ్ళు చంద్రబాబు, వెంకటేశ్వరరావు దగ్గరైనప్పటికీ ఆ తర్వాత వెంకటేశ్వరరావు చంద్రబాబుకి దూరమయ్యారు. ఆ తర్వాత రెండు కుటుంబాలూ దూరంగానే వుంటూ వచ్చాయి.   దగ్గుబాటి కుటుంబం గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాజకీయంగా కూడా చంద్రబాబుతో వైరం వుండేది. అయితే ఇటీవలి కాలంలో  మారిన రాజకీయ సమీకరణాలతో ఈ రెండు కుటుంబాలు మళ్ళీ దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ మధ్య ఎన్నికల పొత్తు కుదరబోతున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార కార్యదర్శిగా వున్న పురంద్రేశ్వరి తెలుగుదేశం నాయకులతో, చంద్రబాబుతో సంప్రదింపులు జరపాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో పాత పగలను కడుపులో పెట్టుకుంటే అది రెండు పార్టీలకు మంచిది కాదు. ఇలాంటి సందేహాలు జనంలో వస్తాయనే ఊహించిన చిన్నమ్మ శనివారం నాడు వివరణ ఇచ్చంది. తనకు చంద్రబాబు నాయుడితో వ్యక్తిగతంగా వైరమేమీ లేదని స్పష్టం చేసింది. ఆనాటి సంక్షోభ సమయంలో తమ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం వాటిని తాను పట్టించుకోవడం లేదని ఆమె చెప్పింది. చిన్నమ్మ చెప్పిన చల్లటి మాట తెలుగుదేశం వర్గాల్లో సంతోషాన్ని కలిగిస్తోంది.

జగ్గారెడ్డి పోటీ చేయరా?

      తెలంగాణలో ప్రజా ప్రతినిధులందరూ మాస్ హిస్టీరియా వచ్చినట్టు రాష్ట్రాన్ని విభజించాల్సిందేనని గందరగోళం చేస్తున్న సమయంలో రాష్ట్ర విభజన మంచిది కాదని నినదించిన ఏకైక తెలంగాణ బిడ్డ సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ఇప్పటికీ ఆయన రాష్ట్రం విడిపోకూడదని చెబుతూనే వుంటారు. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి విజయం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగ్గారెడ్డి ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి.   సిద్దిపేట ఉపఎన్నిక సందర్భంగా జగ్గారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మీద నమోదైన కేసు విచారణకు వచ్చింది. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి ఈ ఎన్నికలలో పోటీ చేయడం మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే జగ్గారెడ్డి సతీమణి నిర్మలకు కూడా సంగారెడ్డి ప్రజలతో అనుబంధం వుంది. ఈసారి ఎన్నికలలో నిర్మలను సంగారెడ్డి నుంచి పోటీ చేయించాలని జగ్గారెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం వుంది.  

సిపిఐకి కేసిఆర్ మరో షాక్

      సిపిఐ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ షాక్ మీద షాక్ లు ఇస్తున్నారు. మొదట ఆ పార్టీతో ఎన్నికల పోత్తు పెట్టుకుంటానని మాటిచ్చిన కేసిఆర్, దానిని పట్టించుకోకుండా సిపిఐ సిటింగ్ స్థానాల్లోనూ తన అభ్యర్థులను నిలబెట్టారు. తాజాగా సిపిఐ ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే చంద్రావతి కి టికెట్ ఇవ్వకుండా పార్టీ కార్యకలాపాలకు వినియోగించుకోవాలనుకున్న సిపిఐకి కేసిఆర్ మరో షాకునిచ్చారు. వైరా ఎమ్మెల్యే చంద్రావతిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు కేసిఆర్. శుక్రవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో చంద్రావతి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటూ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని ఆమె అన్నారు. కొత్తగా పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేల౦దరికీ టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో చంద్రావతికి కూడా టికెట్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.

టీఆర్ఎస్ శ్రవణ్‌పై కేసు!

      తాను ఏ పార్టీలో వుంటే ఆ పార్టీకి అనుకూలంగా అడ్డంగా వాదించడంలో సిద్ధహస్తుడైన దాసోజ్ శ్రవణ్ పీఆర్పీ అనే అస్తమించిన పార్టీ ద్వారా రాజకీయ రంగంలోకి వచ్చాడు. పీఆర్పీ పనికిరాని సిద్ధాంతాల గురించి గొంతు చించుకుని మరీ అరిచి ఎదుటివారిని ఒప్పించే ప్రయత్నం చేసేవాడు. పీఆర్పీ అస్తమించిన తర్వాత ఆయనగారు టీఆర్ఎస్‌లో చేరిపోయి సీమాంధ్రుల మీద నిప్పులు చెరగడంలో, అక్కసు కక్కడంలో బిజీగా వున్నాడు.   ఆయనగారి టాలెంట్ చూసిన కేసీఆర్ ఆయనగారిని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించాడు. చేతిలో పదవి వుంది. అరవడానికి నోరుంది. దాంతో రెచ్చిపోయిన శ్రవణ్ విశ్వరూపం అందరూ చూస్తున్నదే. టీఆర్ఎస్‌లో బెదిరింపు సెక్షన్ ఎక్కువ. ఆ బెదిరింపు సెక్షన్‌ని శ్రవణ్ ఒక దర్శకుడి మీద ప్రయోగించడంతో ఆ దర్శకుడు శ్రవణ్ ఫోన్‌లో చేసిన బెదిరింపులన్నిటీని రికార్డు చేసి జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో శ్రవణ్ మీద కేసు నమోదైంది. అరెస్టు చేసి లోపల వేయడం మాత్రం మిగిలి వుంది.

హిందూపూర్ బరిలో బాలకృష్ణ?

      నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ విజయ యాత్ర ముగిసింది. పనిలోపనిగా జరిపిన ‘తీర్థయాత్ర’ కూడా ముగిసింది. పాత ఫీల్డులో విజయాన్ని ఇచ్చినందుకు, కొత్త ఫీల్డులోకి ఎంటర్ కాబోతున్నందున ఆశీర్వాదాలు కోరుకుంటూ బాలకృష్ణ పనిలోపనిగా ప్రసిద్ధ దేవాలయాలను కూడా సందర్శించారు. అనంతపురం జిల్లాలో బాలకృష్ణ పర్యటన ముగిసింది.   ఈ సందర్భంగా కార్యకర్తలతో సమావేశమైన బాలకృష్ణ తాను హిందూపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా వున్నట్టు వెల్లడించినట్టు సమాచారం. ఇప్పటి నుంచే కార్యకర్తలు, అభిమానులు హిందూపూర్‌లో తన ప్రచారానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ చేయాల్సిందిగా సూచించినట్టు తెలుస్తోంది. హిందూపురం అసెంబ్లీ నుంచి బాలకృష్ణ పోటీచేయాలనుకోవడం స్థానిక తెలుగుదేశం నాయకులలో సంతోషాన్ని కలిగిస్తోంది. ఎన్టీఆర్ కుటుంబానికి హిందూపూర్ అంటే ఉన్న అభిమానాన్ని తలచుకుని అక్కడివారందరూ మురిసిపోతున్నారు. ఎన్టీఆర్ కూడా గతంలో హిందూపూర్ నుంచే పోటీ చేసి ఘన విజయాలు సాధించారు. ఆయన సంప్రదాయాన్ని ఆయన కుమారుడు బాలకృష్ణ కొనసాగిస్తారని భావిస్తున్నారు.

ఆయన వస్తున్నాడు..వస్తున్నాడు..వచ్చేసాడు

  చనిపోయిన వారు ఎలాగు తిరిగి బ్రతికి వచ్చి నిజాలు చెప్పలేరు గనుక వారి పేరున ఎన్ని కబుర్లయినా దైర్యంగా చెప్పేసుకోవచ్చును. అవసరమయిన చోటల్లా వారి పేరుని యదేచ్చగా వాడేసుకోవచ్చును. మహాత్మా గాంధీజీ అంతటి వాడికే ఈ బాధ తప్పలేదు. ఇక అటువంటప్పుడు మాజీ సీయం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మాత్రం అందుకు అతీతులు కాబోరని ఆయన పుత్రరత్నాలే నిరూపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.   చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకోవాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి తండ్రిలాగే అమ్మమ్మలు, తాతయ్యలు, అక్కయలు, చెల్లాయిలు అంటూ తెలుగు డిక్షనరీలో ఉన్న బందుత్వాలన్నినీ రోజూ తన సభలలో వల్లే వేసి చివరాఖరున వారికి పేరుపేరునా దండాలంటూ ఇమిటేట్ చేస్తూ, తండ్రిలాగే 108 అంభులెన్స్ కుయ్యికుయ్యిమని ఎలా వస్తుందో చెపుతూ ప్రజలను రంజింపజేస్తున్నారు.   ఆయన సంక్షేమ పధకాలన్నిటినీ జగన్ తన పద్దులో వ్రాసేసుకొన్నపటికీ, ఆయన తన కోసం భద్రంగా దాచి ఉంచిన వందల కోట్ల విలువ చేసే టైటానియం లంకె బిందెలని మాత్రం క్లెయిం చేసుకోవడానికి ఎందుకో వెనుకంజ వేస్తున్నారు. కానీ జగన్ అంగీకరించినా, లేకున్నా ఆ నిధులన్నీ ఖచ్చితంగా ఆయనవేనని చంద్రబాబు బల్ల గుద్ధి మరీ వాదిస్తున్నారు.   అయితే తన తండ్రి దాచిపెట్టిన ‘టైటానియం నిధులున్నలంకె బిందెలు సరిగ్గా ఎన్నికల సమయంలో దొరికినందుకు జగన్ సంతోషించక పోగా బయటకు చెప్పుకోలేని ఏదో బాధతో కుమిలిపోతున్నాడు.   “యస్! వైయస్స్ ఆత్మని, అంతరాత్మని, పరామాత్మని... అన్నీ నేనే..సర్వం నేనే...అదిగో నా తల మీద ఆయనే ఉన్నాడు చూడండి...” అని కేవీపీ రామచంద్ర రావు సగర్వంగా మీడియా ముందు నిలబడి చెప్పిన ఆ నాలుగు ముక్కలే బహుశః జగన్మోహన్ రెడ్డికి ములుకుల్లా గుచ్చుకొని బాధిస్తూ ఉండవచ్చును.   ఏమయినప్పటికీ గత రెండు మూడు వారాలుగా అన్ని టీవీ ఛానేళ్ళలో “ఆయన వస్తున్నాడు..ఆయన వస్తున్నాడు..”అనే వైకాపా ప్రకటనలు చూస్తున్న ప్రత్యర్ధ పార్టీల వాళ్ళందరూ కూడా యస్! వైయస్స్ నిజంగానే ఇప్పుడు తిరిగి వచ్చేసినట్లే ఉందని  కుళ్ళు జోకులు వేసుకొని పకపకా నవ్వుకొంటున్నారుట.

టీఆర్ఎస్ లో అలకలు షురూ

      టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి పోటీ చేసే 69 అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో వలస నేతలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోకి వలస వచ్చిన ప్రజాప్రతినిధులు తమ స్థానాలను కైవసం చేసుకున్నారనే ఆవేదనతో రగులుతున్నారు.   ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పొత్తులు లేకపోవడంతో పార్టీలోని నేతలంతా తమకు టికెట్ దక్కుంతుందని ఆశలు పెంచుకున్నారు.  నియోజకవర్గాల్లో నేతలు తమ గెలుపే లక్ష్యంగా పార్టీని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అయితే అఖరి నిమిషంలో ఇతర పార్టీల ను౦చి వలస వచ్చిన వారికి టిక్కెట్లు కేటాయించడంతో వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో తెరాసలో ఆందోళనలు మొదలైయ్యాయి.    నేతలు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. అలక వహిస్తున్న నేతలను బుజ్జగించేందుకు ముఖ్య నాయకులు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఆయా నేతలు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. బరిలో దిగేందుకు అవకాశం లేని వారికి ప్రత్యామ్నాయాలు కల్సిస్తామని ఏకంగా అధినేతనే వారికి హామిలనిస్తున్నారు. అయినా అలకల పర్వం మాత్రం కొనసాగుతుంది. దీంతో తెరాస దీనిపై ప్రత్యేకమైన దృష్టిని సారించినట్లు తెలుస్తోంది.    

నేడే చివరి రోజు...తెదేపా-బీజేపీ పొత్తులకి

  తెలుగులోకి డబ్బ్ చేసిన తమిళ టీవీ సీరియల్లాగ ఎంతకీ తెగకుండా సాగుతున్న తెదేపా-బీజేపీ పొత్తుల కబుర్లు వినీవినీ బహుశః ప్రజలకే కాదు చంద్రబాబుకి కూడా బోర్ కొట్టేసినట్లుంది. అందుకే నిన్న అర్ధరాత్రి వరకు సాగిన పోలిట్ బ్యూరో సమావేశం అనంతరం తమ తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్దమయిపోతున్నట్లు ఆయన మీడియాకు లీకులిచ్చేసారు.   డిల్లీలో కాంగ్రెస్ పార్టీని తిట్టుకొంటూ బిజీగా ఉన్న బీజేపీ నేతలు టీవీలలో లీకవుతున్న ఆ వార్తలను చూసి వెంటనే డయల్-యువర్-ఫ్రెండ్ ఆప్షన్ ఎంచుకొని చంద్రబాబుని లైన్లోకి తీసుకువచ్చి ఆయనని తెల్లారే వరకు ఆగమని, అప్పటికి తామే రెక్కలు కట్టుకొని ఆయన ముందు వాలిపోతామని హామీ ఇవ్వడంతో చంద్రబాబు లిస్టు మళ్ళీ జేబులో పెట్టేసుకొన్నారు. కానీ కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు ఆయన జేబులో నుండి పడిపోయిన ఆ లిస్టు తమ చేతిలో చిక్కిందని చెప్పుకొంటూ స్క్రోలింగులో వరుసపెట్టి తెదేపా అభ్యర్ధుల పేర్లను చూపించేస్తున్నాయి. మరి ఇది కూడా మరోకరకమయిన లీకీజి సమస్యా అన్నది ఇంకా తేలవలసి ఉంది.   ఇక కమలనాధులు అంతకు ముందు చంద్రబాబుకి మొన్న సాయంత్రం వరకు గడువు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు చంద్రబాబే వారికి ఈరోజు సాయంత్రం వరకు గడువు పెట్టి ఈ క్లైమక్స్ సీన్లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఈసారయినా సీరియల్ సుఖాంతం అవుతుందని ఆశిస్తూ, ఇంతకాలంగా తెదేపాతో చర్చలు సాగిస్తున్న బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ తో బాటు గ్రూప్ ఫోటో కోసం అరుణ్ జైట్లీ కూడా విమానంలో దిగుతున్నారుట. ఒకవేళ పొత్తులు ఆ రెండు పార్టీల మధ్య కుదిరితే ‘జై రామ్ జీ’కి అనుకొంటూ ఒకరి భుజాల మీద మరొకరు చేతులు వేసుకొని ఫొటోలకి ఫోజులివ్వచ్చును. లేకుంటే రేపటి నుండి ఆ రెండు పార్టీల నేతల మధ్య రామరావణ యుద్ధం మొదలయిపోతుంది. దానిని బట్టే మిగిలిన పార్టీల సౌండ్ క్వాలిటీ కూడా మారిపోవడం తధ్యం.

పితాని కూడా జంప్

  కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకిలో కార్యకర్తలెవరయినా ఉన్నారో లేదో ఖచ్చితంగా తెలియదు, కానీ ఒక అరడజను మంది నేతలు మాత్రం ఇంకా పార్టీలో మిగిలి ఉన్నారు. అయితే వారిలో కూడా ఒకరొకరుగా మెల్లగా వేరే పార్టీలలోకి జారుకొంటున్నారు. తాజాగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పితాని సత్యనారాయణ తెదేపాలోకి జంపైపోయారు.ఆయన చంద్రబాబు చేతులతో పసుపు కండువా కప్పించుకొని తెదేపా తీర్ధం కూడా సేవించారు.   శుక్రవారం తెనాలిలో జరిగిన సభలో ఆ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి కనిపించిన హర్షకుమార్, రెండు రోజుల క్రిందటే తనకు డిల్లీ నుండి దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి పార్టీలోకి తిరిగి రమ్మని ఆహ్వానించారని, కానీ పార్టీయే తమను బయటకు వెళ్ళగొట్టింది గనుక ముందు తనపై వేసిన ఆ పార్టీ బహిష్కరణ వేటుని ఎత్తేస్తే అప్పుడు పార్టీలోకి తిరిగి రావడం గురించి ఆలోచిద్దామని జవాబు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దానితో ఆయన తాను జైసపాను వీడి వెళ్ళడం లేదని, ఆ పార్టీ టికెట్ పైనే తాను అమలాపురం నుండి లోక్ సభకు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేసి అప్పటికి మంటలార్పగలిగారు. కానీ రేపు మళ్ళీ దిగ్విజయ్ నుండి డిల్లీకి రమ్మని కాల్ వస్తే, అప్పుడు కిరణ్ పెట్టుకొనే తరువాత సభలో ఆయన మరి కనిపిస్తారో లేదో అనుమానమే. ఈ మునిగిపోతున్న నావలో మరెవరూ లేరని రూడీ చేసుకొన్నాక ఆఖరుగా కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా బయటకు దూకుతారేమో!

లౌకికవాదాన్నికాపాడుకొనేందుకే కలిసారుట!

  కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన ప్రత్యర్ధి బీజేపీని రోజూ తిట్టిపోసే ముందు ఓం ప్రధమంగా అదొక మతతత్వపార్టీ అని మొదలుపెట్టి ఇతర అంశాలపై విమర్శలకు వెళుతుంది. లౌకికవాదానికి తామే పేటెంట్ హక్కులు తీసుకొన్నట్లు, బీజేపీకి మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే పని అన్నట్లు కాంగ్రెస్ వాదిస్తుంటుంది. కానీ, ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచే అవకాశంలేదని క్రమంగా బోధపడుతుండటంతో, వరదలో కొట్టుకుపోతున్న మనిషికి గడ్డి పోచ దొరికినా సంతోషించినట్లు కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు కోసం ఉన్న అన్ని మార్గాలను ఆన్వేషిస్తోంది. ఆ ప్రయత్నంలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా తమ లౌకికవాదం కాసేపు పక్కనబెట్టి మొన్న మంగళవారంనాడు ఢిల్లీ జుమామసీద్ షాహి హిమామ్ బుఖారీతో సమావేశమయ్యి దేశంలో ముస్లిం ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకే ఓట్లువేసేలా చేయమని అభ్యర్దించారు. అయితే ఆలోచించవలసిన పాయింటు ఏమిటంటే బుకారీ సాబ్ దేశంలో ముస్లిం ప్రజలందరికీ ప్రతినిధి కాదు. ఆయన కేవలం ఒక మత గురువు మాత్రమే. గత అరవై ఏళ్లబట్టి దేశంలో అధికశాతం ముస్లిం ప్రజల దుర్బర దారిద్ర్యం అనుభవిస్తూనే ఉన్నారు. నాటి నుండి నేటి వరకు దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వారిని కేవలం ఒక ఓటు బ్యాంకుగానే చూసింది తప్ప వారిని కనీసం మనుషులుగా కూడా చూడలేదు. అందుకే వారి పరిస్థితిలో ఇంతవరకు కూడా మార్పు రాలేదు. పైగా నానాటికీ ఇంకా దారిద్ర్యంలో కూరుకుపోతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు సోనియాగాంధీ స్వయంగా బుకారీ సాబ్ ని కలిసి వచ్చినందున వారందరూ ఇంతకాలం కాంగ్రెస్ చేసిన నిర్వాకాలన్నిటినీ మరిచిపోయి కాంగ్రెస్ పార్టీకే గుడ్డిగా తమ ఓట్లు గుద్దేస్తారని అనుకోవడం అత్యాసే అవుతుంది. సోనియాగాంధీ ఒక మతగురువుని కలిసి ఆవిధంగా కోరడం ఏరకమయిన లౌకికవాదమో తెలియదు కానీ దేశంలో లౌకికవాదాన్ని అంటే దానికి మారు పేరయిన కాంగ్రెస్ పార్టీని మతతత్వ పార్టీ అయిన బీజేపీ నుండి, దానికి నాయకత్వం వహిస్తూ తన ముద్దుల యువరాజు రాజకీయ భవిష్యత్తుని మంట గలిపేద్దామని చూస్తున్న నరేంద్ర మోడీ నుండి రక్షించవలసిన ఆగత్యం గురించి ఆమె బుకారీ సాబ్ కి విన్నవించుకొన్నారు. దానిపై సహజంగానే బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. బుకారీ ద్వారా దేశంలో ముస్లిం ప్రజలందరి ఓట్లు రాబట్టుకొందామని ప్రయత్నించడం, అది కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అడగడం ఉల్లంఘన క్రిందకే వస్తుందని తీర్మానించేసిన బీజేపీ సోనియాగాంధీపై ఎన్నికల కమీషన్ కి నిన్న పిర్యాదు కూడా చేసింది. అటువంటి పిర్యాదు వస్తే పరిశీలిస్తామని కమీషనర్ సంపత్ ముందే చెప్పారు గనుక వెంటనే పిర్యాదు స్వీకరించి నేడో రేపో సోనియమ్మను సంజాయిషీ కోరుతూ నోటీసు పంపవచ్చును. అయితే సుప్రీం కోర్టు చేత మొట్టికాయలు వేయించుకొన్నపుడే అదరలేదు..బెదరలేదు, అందువల్ల ఎన్నికల కమీషన్ నోటీసులు చూసి కాంగ్రెస్ పార్టీ బెంబేలెత్తిపోదని ఖచ్చితంగా చెప్పవచ్చును.

శంకరమ్మకు టీడీపీ సపోర్ట్?

      కేసీఆర్ తనకి ప్రాధాన్యం లేని, ఓడిపోయే హుజూర్ నగర్ టిక్కెట్ కేటాయించడంతో ఆగ్రహంగా వున్న శంకరమ్మని టీఆర్ఎస్ నాయకత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. పోటీ చేస్తే చెయ్ లేకపోతే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. అమరవీరుల త్యాగ ఫలితంగా తెలంగాణ వస్తే, ఆ అమరవీరుల కుటుంబాలనే చిన్నచూపు చూస్తున్న కేసీఆర్ మీద శంకరమ్మతోపాటు అమరవీరుల కుటుంబాల వారు చాలా ఆగ్రహంగా ఉన్నారు.   శంకరమ్మ ఎంత వద్దని చెప్పినా హుజూర్ నగర్ టిక్కెట్‌నే ఆమెని కేటాయించడం అన్యాయమని వారు అంటున్నారు. ఇదిలా వుంటే, కేసీఆర్ మీద తీవ్ర ఆగ్రహంగా వున్న శంకరమ్మకి న్యాయం చేయాలని, అమరవీరుల త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. శంకరమ్మకి తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్ ఇవ్వాలని, అది కూడా ప్రస్తుతం తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే వుండగా, తప్పకుండా గెలిచే స్థానాన్ని శంకరమ్మకి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే శంకరమ్మ పోటీ చేసే నియోజకవర్గంలో అభ్యర్థిని పోటీ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు శంకరమ్మ హుజూర్ నగర్ స్థానాన్ని వ్యతిరేకిస్తూ వుండటంతో ఆమెతో సంప్రదింపులు జరపాలని టీ టీడీపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం.

ఇండియా మ్యాచ్ డౌటేనా?

      క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ 20 సెమీ ఫైనల్ లెక్క ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆరున్నర నుంచి ప్రారంభం కావలసి వుంది. ఇండియా – దక్షిణాఫ్రియా జట్ల మధ్య బంగ్లాదేశ్‌లోని ఢాకా స్టేడియంలో జరుగుతుంది. గురువారం నాడు వెస్టిండీస్ – శ్రీలంక మధ్య జరిగిన తొలి సెమీ ఫైనల్ వర్షం కారణంగా అంతరాయాన్ని ఎదుర్కొంది. వర్షం పెరిగిపోయి మ్యాచ్ ఆగిపోవడం వల్ల తలాతోకా లేని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి కారణంగా వెస్టిండీస్ మ్యాచ్ ఓడిపోయింది. అలాంటి పరిస్థితి ఇండియా ఆడే మ్యాచ్‌కి కూడా వస్తుందేమోనని క్రికెట్ అభిమానులు భయపడుతున్నారు.   ఇప్పటికే ఢాకా స్టేడియం దగ్గర వర్షం వచ్చేదా వద్దా అన్నట్టుగా మబ్బులు కమ్మి వున్నాయి. మ్యాచ్‌కి ముందే గనుక వర్షం పడి మ్యాచ్ రద్దయితే రన్ రేట్ ఆధారంగా ఇండియా ఫైనల్‌కి చేరుకుంటుంది. అయితే టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇండియా బ్యాటింగ్ చేసే సమయంలో వర్షం పడితే మాత్రం ఇండియా డక్ వర్త్ లూయిస్ పద్ధతికి బలైపోయే ప్రమాదం వుందని ఇండియా క్రికెట్ అభిమానులు భయపడుతున్నారు.

కేసీఆర్ మీద శంకరమ్మ ఆగ్రహం!

      తెలంగాణవాదులు అమరవీరుడని కొనియాడే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని బతిమాలో, బెదిరించో ఎమ్మెల్యే టిక్కెట్ పొందడానికి హామీ పొందింది. కేసీఆర్ ఆమెకి ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి గెలవని నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ టిక్కెట్ ఇస్తానని చెప్పారు. అయితే గెలవని సీటు తనకి ఎందుకు అని శంకరమ్మ నెత్తీనోరు బాదుకుంటున్నప్పటికీ శుక్రవారం నాడు కేసీఆర్ ప్రకటించిన తొలి విడత అభ్యర్థుల లిస్టులో శంకరమ్మకు హుజూర్ నగర్ టిక్కెట్ కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.   అయితే ఈ నిర్ణయం శంకరమ్మకి ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది. తను వద్దు మొర్రో అంటున్నా తాను ఖచ్చితంగా ఓడిపోయే సీటుని కేటాయించడం అన్యాయమని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది.  కేసీఆర్ ప్రకటించినప్పటికీ తాను హుజూర్ నగర్ స్థానం నుంచి పోటీ చేయబోనని, తనకు గెలిచే స్థానం ఇస్తేనే పోటీ చేస్తానని శంకరమ్మ అంటున్నట్టు సమాచారం. అయితే శంకరమ్మ ఆక్రోశాన్ని టీఆర్ఎస్ నాయకులెవరూ పట్టించుకోవడంలేదు. పోనీలేపాపం అని ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే, ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటూ వుంటే ఇంకా కోరికలు కోరడం బాగాలేదని వారు అభిప్రాయ పడుతున్నారు. అయితే శంకరమ్మ మాత్రం తన పట్టు విడిచిపెట్టడం లేదని సమాచారం. తనకు గెలిచే టిక్కెట్ ఇవ్వకుంటే తాను మరో పార్టీ నుంచి గెలిచే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని శంకరమ్మ అంటున్నా ఆమెని కేసీఆర్ లైట్‌గా తీసుకుంటున్నారు. దాంతో కేసీఆర్ మీద తీవ్ర ఆగ్రహంగా వున్న శంకరమ్మ భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆ విమానాన్ని మర్చిపోవాల్సిందేనా?

      మలేసియాకి చెందిన ఎంహెచ్ 370 విమానం హిందూ మహాసముద్రంలో అదృశ్యమై నెలరోజులు కావొస్తోంది. విమానంతోపాటు విమానంలో ప్రయాణిస్తున్న 239 ప్రయాణికుల జాద తెలియడం లేదు. మలేసియాతోపాటు అమెరికా, చైనా తదితర దేశాలు ఎంత వెతికినా విమానం ఎక్కడుందో, ఏమైందో ఎవరూ పసిగట్టలేకపోయారు. వచ్చే సోమవారం లోపు ఈ విమానం ఎక్కడుందో కనుక్కోలేకపోతే ఇక ఆ విమానాన్ని మరచిపోవాల్సిందేనని మలేసియాకి చెందిన ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆరోజుతో విమానంలోని బ్లాక్ బాక్స్ సిగ్నల్స్ పంపడం ఆపేస్తుంది. దాదాపు నెల రోజులుగా విమానాలు, హెలికాప్టర్లు, స్టీమర్లతో వెతికారు. మొన్నీమధ్య సబ్ మెరైన్లు కూడా రంగంలోకి దిగాయి. కానీ, ఇంతవరకు ఈ విమానం జాడ తెలియలేదు. అయితే, విమానం జాడ కనుక్కునేవరకూ తాము విశ్రాంతి తీసుకునే ప్రసక్తే లేదని మలేసియా ప్రధానమంత్రి ప్రకటించారు.

లక్ష్మీపార్వతి లబోదిబో!

      ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా జంప్ జిలానీల కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి నాయకులు మారుతూ వుండటం నేచురల్. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరు. ఏ నాయకుడు ఎప్పుడైనా ఏ పార్టీలో అయినా చేరొచ్చు. అయితే నందమూరి లక్ష్మీపార్వతి మేడమ్ విషయంలో మాత్రం ఈ సూత్రం వర్తించదు. ఆమె ఏ పార్టీలో అయినా చేరొచ్చుగానీ, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఎంతమాత్రం లేదు.. లేదు.. లేదు.. లేనేలేదు!   లక్ష్మీపార్వతి, చంద్రబాబు మధ్య ఎంతటి వైరం వుందో, చంద్రబాబు మీద ఆమెకి ఎంత పగ వుందో ఫ్లాష్ బ్యాక్ రాజకీయాలు తెలిసిన వాళ్ళందరికీ బాగా తెలుసు. అలాంటి లక్ష్మీపార్వతి మేడమ్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు పుకార్లు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ పుకారు విన్నవాళ్ళందరూ ఇది కలా, నిజమా అనుకున్నారు. తామసలు జీవించి ఈ భూమ్మీదే వున్నామా అనే సందేహాలు కూడా చాలామందికి వచ్చాయి.  ఈ పుకార్లు విని లబోదిబోమన్న లక్ష్మీ పార్వతి వెంటనే వాటిని ఖండించారు. తానేంటి.. తెలుగుదేశం పార్టీలో చేరడమేంటని విస్తుపోయారు. ఇలాంటి దారుణమైన పుకార్లను సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.

పాత చింతకాయ మేనిఫెస్టో!

      టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి పోటీ చేసే 69 అభ్యర్థుల లిస్టుతోపాటు పార్టీ మేనిఫెస్టో కూడా ప్రకటించారు. జనానికి ఆయన ప్రకటించే అభ్యర్థుల పేర్ల మీద ఇంట్రెస్టే తప్ప మేనిఫెస్టో మీద ఎంతమాత్రం ఇంట్రస్ట్ లేకుండా పోయింది. సాధారణంగా ఏ పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నా జనం అందులో ఏముంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే టీఆర్ఎస్ మేనిఫెస్టో విషయంలో మాత్రం అలాంటి ఇంట్రెస్ట్ కొంచెం కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికే వంద మేనిఫెస్టోలకి సరిపోయేటన్ని వాగ్దానాలు ఆల్రెడీ చేసేశారు. నోటికొచ్చిన వాగ్దానాలు, అమలు అస్సలు సాధ్యం కాని వాగ్దానాలు, హామీలు ఇప్పటి వరకు ఆయన లెక్కలేనన్ని చేశారు. ఈ వాగ్దానాలే పార్టీ మేనిఫెస్టోలో కూడా వుంటాయి కాబట్టి దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. జనం అనుకున్నట్టే టీఆర్ఎస్ మేనిఫెస్టో నిండా గాలిమేడల వాగ్దానాలు వున్నాయి. కేసీఆర్ వాగ్దానాలు వినీ వినీ వుండటం వల్ల మేనిఫెస్టోలో విషయాలన్నీ పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తున్నాయని తెలంగాణవాదులే అంటున్నారు.