ప్రేమ విఫలం కావడంతో బూతుపాట రాశా- శింబు
posted on Feb 23, 2016 @ 3:10PM
తమిళహీరో శింబుకి సినిమా కష్టాలు ఇంకా తీరలేదు. గత ఏడాది బీప్ సాంగ్ పేరుతో ఒక బూతుపాటను రాసిన శింబూ, ఆ పాటకి సంగీతాన్ని అందించిన అనిరుధ్‌ల మీద మహిళా సంఘాలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే! మహిళలను కించపరిచేలా ప్రవర్తించారంటూ వీరి మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఈ విషయం చిలికిచిలికి గాలివానగా మారడంతో శింబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కానీ రేపు ఎట్టిపరిస్థితుల్లోనూ కోర్టు ఎదుట కనిపించాలని న్యాయస్థానం ఆదేశాలను ఇవ్వడంతో, శింబు ఇవాళ కోయంబత్తూరు పోలీసుల ముందు లొంగిపోక తప్పలేదు. ఈ సందర్భంగా శింబుని విచారించేందుకు 35 ప్రశ్నలతో ఒక చిట్టాని పోలీసులు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
శింబు వీటన్నింటికీ ఓపికగా జవాబులు ఇచ్చాడట. శింబు చెప్పినదాని ప్రకారం తాను కొన్నేళ్ల కిందట ఓ ప్రేమ వ్యవహారంలో విఫలం అయిన సందర్భంలో ఈ పాటను రాశాడట. దానికి తనే స్వయంగా సంగీతాన్ని కూడా సమకూర్చుకున్నాడట (ఇందులో అనిరుధ్ పాత్ర ఏమీ లేదని చెప్పడం శింబు ఉద్దేశ్యం కాబోలు). తను ఏదో తనకోసం పాటని రాసుకున్నాడే కానీ సినిమాల కోసం కాదని స్పష్టం చేశాడట శింబు. తను వ్యక్తిగతంగా దాచుకున్న ఈ పాట ఇంటర్నెట్లోకి ఎలా ప్రత్యక్షమైందో తెలియదంటూ తెగ ఆశ్చర్యపడిపోయాడట. శింబు మాటలు విన్నవారు కూడా అందులో నిజం ఎంత ఉందా అని ఆశ్చర్యపడక తప్పలేదు.