బీజేపీతో పొత్తు-కోడెల సీటుకు ఎసరు

  తెదేపా-బీజేపీల పొత్తులో భాగంగా మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నగుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గాన్ని బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలియడంతో ఆయన తీవ్ర ఆగ్రహం చెందారు. “మా రెండు పార్టీల మధ్య పొత్తులు కోరుకొనే వాళ్ళల్లో నేనే మొదటివాడిని. రాష్ట్రంలో చంద్రబాబు, జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ అధికారం చెప్పట్టాలని నేను కోరుకొంటున్నాను. కానీ బీజేపీ తను బలంగా లేని, గెలవలేని స్థానాలకు కూడా పట్టుబట్టడం వలన రెండు పార్టీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. దానివల్ల ప్రత్యర్ధ పార్టీలు లాభపడతాయి. అందువల్ల బీజేపీ తెదేపా నుండి వీలయినన్ని ఎక్కువ సీట్లు రాబట్టుకొనే ప్రయత్నం చేయడం కంటే, తను గెలవగలిగే సీట్లను మాత్రమే తీసుకొంటే మంచిది. తెదేపా ఖచ్చితంగా గెలవగల యంపీ సీట్లను, బీజేపీ బలవంతంగా తీసుకొని పోటీలో ఓడిపోయినట్లయితే దాని వలన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకి అన్ని సీట్లు తక్కువ పడతాయి. అంతే గాక మేమూ నష్టపోతాము. ఇదివరకు జరిగిన ఎన్నికలలో కూడా ఈ సంగతి రుజువయ్యింది. అందువల్ల రాష్ట్రంలో, దేశంలో ప్రతీ ఒక్క సీటు కూడా చాలా విలువయినదేనని బీజేపీ నేతలు గుర్తించి అందుకు అనుగుణంగా తమకి బాగా బలం ఉన్నసీట్లను మాత్రమే తీసుకోవడం మేలు. లేకుంటే వారూ నష్టపోతారు,” అని అన్నారు.   గత ఐదు ఎన్నికలలో ఏకధాటిగా నరసరావుపేట నుండి గెలుస్తున్న కోడెలను, బీజేపీ కోసం ఆ సీటు నుండి తప్పించి సత్తెనపల్లి నుండి పోటీ చేయించాలనికోవడం తెదేపాకు నష్టం కలిగించవచ్చును. అయితే బీజేపీ కూడా అదే నియోజక వర్గం కావాలని బిగుసుకు కూర్చోవడంతో తప్పనిసరిగా కోడెలను తప్పించవలసి వస్తోంది. కానీ కోడెల మాత్రం తన నియోజక వర్గం వదిలే ప్రసక్తే లేదన్నట్లు చెపుతున్నారు. అవసరమయితే స్వతంత్ర అభ్యర్ధిగానయినా అక్కడి నుండే పోటీ చేస్తానని చెపుతున్నట్లు సమాచారం. ఇటువంటి సమస్యలే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో అనేక చోట్ల ఉన్నదున త్వరలోనే రెండు పార్టీలలో అలక పాన్పు-బుజ్జగింపు సీన్లు మొదలవుతాఎమో. ఇప్పటికే బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి అలక పాన్పు ఎక్కగా, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసినట్లు తాజా సమాచారం. మున్ముందు ఇంకా ఎంత మంది అలక పాన్పులు ఎక్కుతారో చూడాలి.

జగన్ని కలిసిన అశోక్ బాబు !

  ఒకప్పుడు మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి కనుసన్నలలో పనిచేసిన ఏపీ యన్జీవో సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు, ఒకానొక సమయంలో ఎన్నికలలో పోటీ చేయాలని కూడా చాలా ఉవ్విళ్ళూరారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే ఆయన అందులో జేరి ఆ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తారని అందరూ భావించారు. నిజానికి అశోక్ బాబు, ఆయన వెనుకున్న ఉద్యోగ సంఘాలు, లక్షలాది ఉద్యోగస్తులు, వారి కుటుంబాల పూర్తి మద్దతు తనకే ఉంటుందనే భ్రమ కూడా కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించడానికి ఒక ప్రధాన కారణం. కానీ కిరణ్ పార్టీ పెట్టినప్పటికీ దానికి రాజకీయ నేతల నుండి కానీ, ప్రజల నుండి గానీ ఎటువంటి ఆదరణ లేకపోవడంతో అశోక్ బాబు కూడా మొహం చాటేశారు. ఆయన ఆ తరువాత చంద్రబాబు వైపు వెళ్లేందుకు కూడా చూసారు. కానీ ఎందువల్లో పొసగలేదు. ఈరోజు ఆయన తన ఉద్యోగ సంఘాల నేతలను వెంటబెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కలిసారు. అయితే అందుకు ఆయన చెపుతున్న కారణం నమ్మశక్యంగా లేదు. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాదులో పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులకు తగిన భద్రత కల్పించేందుకు జగన్ కృషి చేయాలని, ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపుతూ మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వాలని కోరేందుకే కలిసారుట. జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి ఉద్యోగుల మద్దతు కోరుతూ, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తాను కూడా వారిని తన తండ్రి లాగే భద్రంగా చూసుకొంటానని హామీ ఇచ్చారుట. ఇంతకీ అశోక్ బాబు చల్ల కొచ్చి ముంత దాచినట్లుగా తనకి టికెట్ ఇవ్వమని అడిగారో లేదో తెలియనే లేదు. కానీ ఆయన తరువాత చంద్రబాబుని, కిరణ్ కుమార్ రెడ్డిని కలవాలనుకొంతున్నారుట! దేనికో..?

ఎన్నికల బరిలో దూసుకుపోతున్న తెరాస

తెరాస కాంగ్రెస్,తెరాసల మధ్య పొత్తులు కుదరకపోవడంతో రెండు పార్టీలు తమ తమ అభ్యర్ధుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈసారి ఎన్నికలలో మజ్లిస్, లోక్ సత్తా, ఆమాద్మీ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఆ మూడు పార్టీలు కూడా ఇప్పటికే తమ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసాయి. ఇక తెదేపా-బీజేపీల మధ్య నిన్న అర్ధరాత్రి వరకు ఎడతెగకుండా సాగిన చర్చలలో ఎట్టకేలకు వాటి మధ్య ఎన్నికల పొత్తులు కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. గనుక, ఇక ఆ రెండు పార్టీలు కూడా తమ తమ అభ్యర్ధుల జాబితాలను నేడో రేపో ప్రకటించితే, ఇక అన్ని పార్టీలు ఎన్నికల రణరంగానికి సిద్దమయిపోయినట్లే!   ప్రస్తుతం తెరాస అభ్యర్ధుల పేర్ల ఖరారు, ఎన్నికల మ్యానిఫెస్టో, ప్రచారంలో మిగిలిన అన్ని పార్టీల కంటే కూడా చాలా ముందంజలో ఉంది. ఇంతవరకు తెరాస ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్దుల జాబితాను పరిశీలించినట్లయితే, వారిలో చాలా మంది గెలుపు గుర్రాలేనని అర్ధమవుతుంది. తెరాస తెలంగాణా సెంటిమెంటు, తెలంగాణా సాధన, పునర్నిర్మాణం అనే మూడు అంశాలతో రేసు గుర్రంలా దూసుకుపోతోంది. కానీ నేడోరేపో కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు కూడా తమ అభ్యర్ధులను ప్రకటిస్తే, వారితో పోల్చి చూసినప్పడు మాత్రమే తెరాస అభ్యర్ధుల అసలయిన బలాబలాలు తెలుస్తుంది.

టీ-కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధులు వీరే

  కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో లోక్ సభకు పార్టీ తరపున పోటీ చేయనున్న16మంది పార్టీ అభ్యర్ధుల పేర్లను నిన్న రాత్రి డిల్లీలో ప్రకటించింది. దానితో బాటు 110 అసెంబ్లీ స్థానాలకు ఖరారు చేసిన పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తున్నకాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలకు వారి పేర్లను ప్రకటించవద్దని అహ్మద్‌పటేల్‌ నుండి ఫోన్ రావడంతో మధ్యలోనే నిలిపివేసి త్వరలోనే మళ్ళీ ప్రకటిస్తానని ముగించారు. టీ-కాంగ్రెస్ నేతలు కొందరు అభ్యర్ధులను వ్యతిరేఖించడం, మరి కొందరు కొత్త పేర్లను ప్రతిపాదించి వారికి టికెట్స్ ఇమ్మని అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి చేయడం వలననే ఖరారు చేసిన అభ్యర్ధుల పేర్ల ప్రకటన కూడా అర్ధాంతరంగా ముగించవలసి వచ్చింది. టీ-కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధులు వీరే: కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి:                        మహబూబ్‌నగర్ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ           మల్కాజ్‌గిరి కార్తీక్ రెడ్డి (సబితా రెడ్డి కుమారుడు)       చేవెళ్ల నంది ఎల్లయ్య                                    నాగర్ కర్నూల్ గుత్తా సుఖేందర్ రెడ్డి                            నల్గొండ జి వివేక్                                            పెద్దపల్లి పొన్నం ప్రభాకర్                                   కరీంనగర్ మధు యాష్కి గౌడ్                              నిజామాబాద్ అంజన్‌కుమార్ యాదవ్                         సికింద్రాబాద్ సామా కిషన్ రెడ్డి                                   హైదరాబాద్ సురేష్‌కుమార్ షెట్కర్                             జహీరాబాద్‌ బలరాం నాయక్‌                                    మహబూబాబాద్‌ డా.శ్రవణకుమార్‌ రెడ్డి                               మెదక్‌ సిరిసిల్ల రాజయ్య                                     వరంగల్‌ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి                          భువనగిరి నరేష్‌జాదవ్‌                                           ఆదిలాబాద్‌

మొదలయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

  రాష్ట్రంలోని 543 మండలాల్లో 557 జెడ్పీటీసీ, 8250 ఎంపీటీసీలకు ఈరోజు (ఆదివారం) తోలి దశ మొదలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మళ్ళీ ఈనెల 11న రెండవ దశ ఎన్నికలు జరుగుతాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్ధులకు ఎన్నుకొనేందుకుగాను ఒక్కో ఓటరుకు రెండు ఓట్లు ఉంటాయి. ఓటర్లు ఒకేసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్ధులకు ఓటేయవలసి ఉంటుంది గనుక, వారిలో ఎటువంటి అయోమయానికి తావు లేకుండా ఎంపీటీసీకి పింక్ కలర్ బ్యాలట్ పేపర్, జెడ్పీటీసీకి తెల్ల రంగు బ్యాలట్ పేపర్ ఉపయోగిస్తున్నట్లు ఎన్నికల కమీషనర్ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున ఈ ఎన్నికల ఫలితాల ప్రకటన కూడా వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపినట్లు సమాచారం.

డా. జయశంకర్ కుటుంబానికి అవమానం!

  కేసీఆర్ అవమానాల పరంపర కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసిన అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇంతవరకు ఆ దిశలో ఒక్క అడుగు కూడా వేయలేదు. అలాగే అమరవీరుల కుటుంబ సభ్యులను ఎన్నికలలో నిలబెడతామని వాగ్దానం చేసిన కేసీఆర్ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి అతి బలవంతం మీద, ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన మీదట టిక్కెట్ ఇవ్వడానికి అంగీకరించాడు. అదికూడా టీఆర్ఎస్ పొరపాటున కూడా గెలవని హుజూర్ నగర్ టిక్కెట్ ఇచ్చాడు. ఈ విషయంలో అమరవీరుల కుటుంబాలు కేసీఆర్ మీద చాలా ఆగ్రహంగా వున్నాయి. ఇదిలా వుంటే, కేసీఆర్ తాజాగా మరో అవమానం చేశాడు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అయిన జయశంకర్ సార్ కుటుంబ సభ్యుడిని దారుణంగా అవమానించాడు. కేసీఆర్ విషయంలో జయశంకర్ సార్ తన చివరి దశలో నమ్మకాన్ని కోల్పోయారు.   ఇప్పుడు జయశంకర్ కుటుంబానికి కూడా ఆ విషయం బాగా తెలిసొచ్చింది. జయశంకర్ సార్ అన్న కొడుకైన వాసుదేవరావు కేసీఆర్ని కలిసి తనకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరాలని అనుకున్నారు. దీనికోసం ఆయన కేసీఆర్ ఇంటికి వెళ్ళారు. అయితే కేసీఆర్ ఇంట్లో వున్నప్పటికీ ఆయనకి లోపలికి వెళ్ళే అవకాశం లభించలేదు. సెక్యూరిటీ గార్డులు వాసుదేవరావుని ఇంటి బయటే నిలబెట్టేసి కేసీఆర్ పార్టీ ఆఫీసుకి వస్తారు అక్కడకి వెళ్ళి వెయిట్ చేయమని చెప్పారు. నేను జయశంకర్ సార్ కుటుంబ సభ్యుడినని చెప్పినా ఎంతమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. చేసేది లేక వాసుదేవరావు టీఆర్ఎస్ భవన్‌కి వెళ్ళి రెండు గంటలకు పైగా కేసీఆర్ కోసం వెయిట్ చేశారు. అయితే కేసీఆర్ అక్కడకి రాలేదు. చివరికి వాసుదేవరావు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.   తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అని పదేపదే చెప్పే కేసీఆర్ ఇప్పుడు జయశంకర్ సార్ కుటుంబ సభ్యుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాసుదేవరావుకు టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం ఇంటికి వచ్చిన మనిషిని పలకరించాలన్న సంస్కారం కూడా లేకుండా పోయిందా అని అంటున్నారు. పార్టీ ఆఫీసులో రెండు గంటలకు పైగా వాసుదేవరావును వెయిట్ చేయించడం దారుణమని విమర్శిస్తున్నారు

యన్టీఆర్, పవన్, మహేష్ తెదేపా ప్రచారంలో పాల్గొంటారా

  నందమూరి హరికృష్ణ ఆయన తనయుడు జూ.యన్టీఆర్ గత కొంత కాలంగా తెదేపాకు దూరంగా ఉంటున్నారు. అందుకు కారణాలు అందరికీ తెలిసినవే. అయితే గత ఎన్నికలలో స్టార్ ఎట్రాక్షన్ గా నిలిచిన యన్టీఆర్ ఈసారి తెదేపా తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు వస్తున్నారా లేదా అనే సంగతి ఇంకా తేలలేదు. అటు తెదేపా నేతలు కానీ, ఇటు యన్టీఆర్ గానీ ఈ విషయంపై ఇంతవరకు బయటపడలేదు. పార్టీ కోరనప్పుడు తానేందుకు చొరవ తీసుకొని భంగపడాలి? అని యన్టీఆర్ భావిస్తుంటే, ఆయన చొరవ చూపకుండా పార్టీకి దూరంగా మసులుతున్నపుడు మనమెందుకు బ్రతిమాలాలి అనే ఆలోచనతో ఉన్నందున, ఈసారి ఎన్నికల ప్రచారంలో యన్టీఆర్ పాల్గొంటారా అని అనుమానంగానే ఉంది. అయితే ఈ ఎన్నికలు తేదేపాకు జీవన్మరణ పోరాటం వంటివి గనుక తెదేపా తప్పని సరిగా అతని సహాయం కోరే అవకాశం ఉంది. అదేవిధంగా యన్టీఆర్ కూడా సరిగ్గా అదే ఆలోచనతో స్వయంగా ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు.   ఇక, పవన్ కళ్యాణ్ తేదేపాకు పరోక్షంగా మద్దతు ప్రకటిస్తున్నపటికీ ఇంతవరకు తాను ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఎన్నడూ అనలేదు. అందువల్ల ఆయన ప్రచారంలో పాల్గొంటారా లేక ఇదేవిధంగా అప్పుడప్పుడు టీవీలలో కనబడుతూ అన్యాపదేశంగా ఆ పార్టీకే ఓటేయమని ప్రభోదిస్తారా? అనే సంగతి ఇంకా తేలవలసి ఉంది. ఆయన తీరు చూస్తుంటే రెండో పద్దతికే మొగ్గు చూపేలా ఉంది తప్ప నేరుగా ఎన్నికల ప్రచారం చేసే ఉద్దేశ్యం ఉన్నట్లు కనబడటం లేదు.   ఇక మరొక ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఇటీవల తెదేపాలో చేరిన తన బావగారు గల్లా జయదేవ్ కోసం తెదేపా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చును. ఆవిషయం మహేష్ స్వయంగా చెప్పకపోయినా జయదేవ్ పార్టీలో చేరుతున్న రోజే, మహేష్ బాబు తన కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించేశారు. ఈ ముగ్గురు సినీ హీరోలు తెదేపా తరపున గట్టిగా ప్రచారం చేసినట్లయితే, తెదేపా తప్పకుండా లబ్ది పొందవచ్చును.

విమానం సిగ్నల్ దొరికింది

      హిందూ మహాసముద్రంలో మునిగిపోయిన మలేసియాకి చెందిన ఎంహెచ్ 370 విమానం ఆచూకీ కోసం మలేసియా, అమెరికా, చైనాతోపాటు అనేక దేశాలకు చెందిన విమానాలు, షిప్పులు వెతుకుతున్న విషయం తెలిసిందే. సోమవారం లోపు ఈ విమానం ఆచూకీ తెలియని పక్షంలో ఇక విమానం ఆచూకీ తెలిసే అవకాశం లేదని మలేసియా అధికారులు ప్రకటించారు. అయితే శనివారం ఈ విమానం కోసం వెతుకుతున్న ఒక చైనీస్ షిప్‌కి విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ నుంచి వెలువడే సిగ్నల్ దొరికినట్టుగా తెలుస్తోంది. హిందూ మహా సముద్రంలో విమానం ఎక్కడుందనే విషయాన్ని ఈ సిగ్నల్ ద్వారా తెలుసుకునే అవకాశం వుందని చైనీస్ అధికారులు చెబుతున్నారు.

వైకాపా దొంగల పార్టీ: మారెప్ప

  సంచలనాత్మక వ్యాఖ్యానాలు చేయడంలో సిద్ధహస్తుడైన  రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మారెప్ప జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ అని అభివర్ణించారు. జగన్ అధికారంలోకి వస్తే శ్మశానాలని కూడా అమ్మేస్తాడని విమర్శించాడు.  ఈ ఎన్నికలలో టిక్కెట్లు అమ్ముకుంటూ జగన్ వందల కోట్లు తన ఖజానాలో వేసుకుంటున్నాడని మారెప్ప అన్నారు. జగన్ గెలిచినా, ఓడినా జైలుకు వెళ్ళడం ఖాయమని మారెప్ప జోస్యం చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన మారెప్ప వైఎస్సార్ మరణం తర్వాత జగన్ పార్టీలో చేరారు. అయితే అక్కడి విధానాలతో విసిగిపోయిన మారెప్ప ఆ పార్టీ నుంచి బయటకి వచ్చేశారు. పార్టీ నుంచి బయటకి వచ్చినప్పటి నుంచి జగన్‌ని తిట్టిపోయడంలో మారెప్ప బిజీగా వున్నారు.

టీడీపీ, బీజేపీ పొత్తు కుదిరింది

      టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు చర్చలు ఫలప్రదమయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన జవదేకర్ బృందంతో చంద్రబాబు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. తెలంగాణలో బీజేపీకి 45 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలు కేటాయించేలా ఒప్పందం కుదిరింది. అలాగే సీమాంధ్రలో 15 అసెంబ్లీ స్థానాల్లో, 5 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ అంగీకరించింది. దీనితో గత కొంతకాలంగా రెండు పార్టీల మధ్య జరిగిన పొత్తుల ప్రతిష్టంభన ముగిసి, కథ సుఖాంతమైంది. టీడీపీతో పొత్తు కుదుర్చుకోరాదంటూ తెలంగాణ బీజేపీ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేసినా, కొందరు స్థానిక నాయకులు రాజనామాలు చేసినా బీజేపీ కేంద్ర నాయకత్వం టీడీపీతో పొత్తుకే మొగ్గు చూపింది.

సోనియా, రాహుల్ సీమాంధ్రకి రానట్టే?

  ఈ నెలలోనే తెలంగాణలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పర్యటించే అవకాశం వుంది. తెలంగాణ ఇచ్చాం కాబట్టి మా పార్టీకే ఓటేయండి అని సోనియాగాంధీ పబ్లిక్ మీటింగ్‌లో చెబితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వరదలా పారతాయని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. తెలంగాణలో పర్యటించాలని వీళ్ళు అమ్మగారిని, యువరాజుని కోరగా ఇద్దరూ ఓకే అన్నారని, ఈనెలలోనే వీరిద్దరూ తెలంగాణలో పర్యటించనున్నారని తెలుస్తోంది. అయితే సీమాంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సోనియా, రాహుల్‌లను సీమాంధ్రలో పర్యటించేలా ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు. ఈమేరకు ఆయన కాంగ్రెస్ అధిష్ఠానానికి విజ్ఞప్తి కూడా చేశారట. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం తొలగాలంటే మీరిద్దరూ జాయింట్‌గా ఇక్కడి వచ్చి, బహిరంగసభల్లో పాల్గొని ఇక్కడి ప్రజల్లో వున్న అపోహలు తొలగించాలని కోరారట. రఘువీరా చేసిన విజ్ఞప్తిని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తామని చెప్పిందట. అయితే ఆ తర్వాత జరిగిన సమాలోచనల్లో  మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో సీమాంధ్రకు వెళ్ళకపోవడమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. ఎలాగూ సీమాంధ్రలో కాంగ్రెస్ మునిగిపోయింది కాబట్టి అక్కడి వెళ్ళి సాధించేదేమీ లేదని తేల్చేశారట. అందువల్ల సోనియా, రాహుల్ తెలంగాణలో పర్యటన ముగించుకుని వెళ్ళిపోయే అవకాశం వుంది.

బిస్కెట్ వేస్తున్న రఘువీరా!

      సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఆరిపోయిన దీపంతో సమానం. ఆ ఆరిపోయిన దీపంలో నీళ్ళు పోసి వెలిగించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి సీమాంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదు. పోటీ చేయడానికి అత్యుత్సాహంగా ఒకళ్ళిద్దరు ముందుకు వచ్చినా వాళ్ళందరూ గెలిచే సత్తా లేనివాళ్ళే. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని రఘువీరారెడ్డి సత్తా వున్న అభ్యర్థులకు బిస్కెట్ వేస్తున్నారు.   ఆ బిస్కెట్ సారాంశమేంటంటే, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సీమాంధ్ర నుంచ పోటీ చేసి గెలిచిన వారికి 2019 ఎన్నికలలో కూడా సదరు టిక్కెట్ వాళ్ళకే కేటాయిస్తారట. రఘువీరా ఇచ్చిన ఈ ఆఫర్ చూసి సీమాంధ్రలో అందరూ పగలబడి నవ్వుకుంటున్నారు. పాపం ఫ్రస్టేషన్‌లో వున్న రఘువీరా ఇలాంటి తలాతోకా లేని ఆఫర్లు ఇస్తున్నారని అనుకుంటున్నారు. రఘువీరా ఎన్ని ఆఫర్లు ఇచ్చినా సత్తా సీమాంధ్రలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే సాహసం ఎవరూ చేయరు. ఒకవేళ అలాంటి సాహసం చేసినవాళ్ళు పొరపాటున కూడా గెలవరు. ఒకవేళ గెలిచినా 2019లో మళ్ళీ టిక్కెట్ వస్తుందన్న గ్యారెంటీ ఏమీ లేదు.. ఎందుకంటే 2019లో టిక్కెట్ ఇస్తానని హామీ ఇస్తున్న రఘువీరారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా వుండకపోవచ్చు. ఆమాటకొస్తే కాంగ్రెస్ పార్టీలోనే వుండకపోవచ్చు. అంచేత ఇలాంటి తలాతోకా లేని ఆఫర్లు ఇవ్వడం రఘువీరా మానుకుంటే బాగుంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

రేవ్ పార్టీ : అమ్మాయిలు దొరికిపోయారు!

      పూణేలోని లోనావాలా ప్రాంతంలో ఓ పెద్ద బిల్డింగ్‌లో 20 మంది కాలేజీ అమ్మాయిలు రేవ్ పార్టీ చేసుకుంటున్నారు. పీకలదాకా తాగి, తమతోపాటు వచ్చిన 26 మంది తమ కాలేజీ అబ్బాయితో కలసి డాన్స్ చేస్తున్నారు. ఆ కుర్రాళ్ళు కూడా బీభత్సంగా తాగి వున్నారు. ఇంతలో అనుకోకుండా పోలీసులు ఆ ఇంటి మీద దాడి చేశారు. పోలీసులు దాడి చేసిన అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతమాత్రం పట్టించుకోకుండా డాన్స్ చేస్తూనే వున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు పూర్తిగా మత్తులో మునిగిపోయి వచ్చింది పోలీసులు అని కూడా అర్థం చేసుకోలేని స్థితిలో వున్నారు.   వాళ్ళ ఒంటిమీద వున్న బట్టల పరిస్థితిని మనం ప్రస్తావించుకోకపోవడమే మంచిది. వాళ్ళందరికీ మత్తు వదిలాక తామందరూ పోలీస్ స్టేషన్‌లో వున్నామని అర్థం చేసుకున్నారు. అమ్మాయిలతో డాన్స్ చేసిన మగ గాడిదల సంగతి అలా వుంచితే, సదరు అమ్మాయిలందరూ పూణేలో ఉన్నత కుటుంబాలకు చెందిన అమ్మాయిలే. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా మామూలుగా లేదు. అయినా పోలీసులు భయపడకుండా ఈ విషయాన్ని మీడియాకి వెల్లడించారు. ఈ అమ్మాయిలందరూ రేవ్ పార్టీ చేసుకోవడానికి ఆ బిల్డంగ్‌ని బోలెడంత అద్దె చెల్లించి అద్దెకి తీసుకున్నారట. కాలేజీ జరుగుతున్న సమయంలో కూడా అక్కడకి వచ్చి పార్టీ చేసుకుని వెళ్తారట. బిల్డింగ్ అద్దె, పార్టీకి అయ్యే ఖర్చు మొత్తం అమ్మాయిలే పెట్టుకుంటారట. పోలీసులు అమ్మాయిలందరికీ బెయిల్ ఇచ్చేసి వాళ్ళ ఇళ్లకి పంపేశారు. రేపో మాపో కోర్టులో కాస్తంత జరిమానా విధించి వాళ్ళకి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తారు. మరి ముళ్ళదారిలో ప్రయాణిస్తున్న యువతరాన్ని ఎవరు కాపాడతారు?

పోలీసుల అతి చూతము రారండీ!

      అసలే కోతి... ఆపై కల్లు కూడా తాగితే ఎలా వుంటుంది? అలాగే అసలే పోలీసులు.. అందులోనూ రాష్ట్రపతి పాలన.. ఆపై ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇక పోలీసులకు పట్టపగ్గాలుంటాయా? ఎన్నికల సందర్భంగా ఓటర్లకి పంచడానికి డబ్బు తరలింపు జరుగుతుందనే సాకు చూపించి రాష్ట్ర మంతటా పోలీసులు ఎక్కడపడితే అక్కడ టెంట్లు వేసుకుని కూర్చుని దారిన పోయే వాహనాలను చెక్ చేసి జనాన్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. డబ్బు తరలించే రాజకీయ నాయకుల వాహనాలు పోలీసుల ముందు నుంచి జుమ్మని తూనీగల్లా వెళ్తున్నా పట్టించుకోకపోగా, సెల్యూట్ కొడుతూ రాచ మర్యాదలతో పంపించేస్తున్నారు.   సామాన్యులను మాత్రం టార్గెట్ చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. వ్యాపార లావాదేవీల కోసం తీసుకువెళ్తున్న డబ్బుని పట్టుకుని లెక్కలున్నాయా? టాక్స్ కట్టావా? అంటూ టార్చర్ చేస్తున్నారు. సదరు డబ్బుని ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్‌కి అప్పగించి ప్రజల్ని హింసిస్తున్నారు. కోట్లకు కోట్లు డబ్బు దొరికితే సరే, లక్షల్లో , వేలల్లో డబ్బు దొరికినా పోలీసులు జనంతో ఆడుకుంటున్నారు. మొన్నీమధ్య ఒక వ్యక్తి దగ్గర యాభై వేల రూపాయలు దొరికాయట. ఈ డబ్బు నీకు ఎక్కడిది? టాక్స్ కట్టావా? ఆదాయపు పన్ను కట్టావా అని ఆ డబ్బు స్వాధీనం చేసుకుని ఆదాయపన్ను శాఖకి అప్పగించారట. ఓటర్లకి డబ్బు పంచడానికి యాభై వేల రూపాయలు తీసుకెళ్ళేంత దరిద్రంలో మన రాజకీయ నాయకులు లేరన్న కామన్ సెన్స్ కూడా పోలీసులకు వుండటం లేదు. పోలీసుల బారినపడి చాలామంది చిన్న చిన్న వ్యాపారులు, సామాన్యులు తమ డబ్బు పోగొట్టుకుని ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ చుట్టూ తిరుగుతున్నారు. పోలీసుల సోదాల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎవరి దగ్గరైనా డబ్బు కనిపిస్తే, మాక్కొంత ఇస్తావా.. లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్‌కి పట్టించేయమంటావా అని పోలీసులు జేబులు నింపుకుంటున్నట్టు తెలుస్తోంది.

మోడీ ప్రధాని అవుతారు: అద్వానీ

      భారత రాజకీయాలలో పెద్దమనిషి, బీజేపీలో పెద్ద దిక్కు లాల్ కృష్ణ అద్వానీ తన మసులో వున్న మాటని బయటపెట్టారు. ఈ ఎన్నికల తర్వాత నరేంద్రమోడీ ప్రధాని కావడం ఖాయమని అద్వానీ చెప్పారు. అద్వానీ ఈ స్టేట్‌మెంట్ ఇవ్వడం భారతీయ జనతాపార్టీ వర్గాలకు సంతోషాన్ని కలిగిస్తోంది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీని పార్టీ ప్రకటించినప్పుడు అద్వానీ హర్టయ్యారు. ఆయన్ని బుజ్జగించడానికి పార్టీ నాయకులు తంటాలు పడాల్సి వచ్చింది. అద్వానీ కూడా అయిష్టంగానే నరేంద్రమోడీ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. అయితే ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అద్వానీ క్రమంగా వాస్తవాన్ని అర్థం చేసుకుని మోడీతో కలసి పనిచేయడం ప్రారంభించారు. మోడీ కూడా ఏ పని చేసినా అద్వానీ సలహా తీసుకుంటూ వచ్చారు. కాంగ్రెస్‌లోని ఒక వర్గం అద్వానీని మోడీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా అద్వానీ సంయమనం పాటించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ హవా నడుస్తోంది. ఆ విషయన్ని అద్వానీ సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. ఈ సమయంలో మోడీకి తనలాంటి వ్యక్తి సపోర్ట్ అవసరమని భావించినట్టున్నారు. అందుకే పెద్దమనసు చేసుకుని మోడీకి అనుకూలంగా ప్రకటన చేశారు. ఏదిఏమైనా అద్వానీ ఒక మంచి పని చేశారు.. మంచ మాట చెప్పారు.

టీఆర్‌ఎస్ రెండో జాబితా విడుదల

      టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ తమ పార్టీ తరపున పోటీ చేయబోయే 7గురు లోక్ సభ, 4 అసెంబ్లీ అభ్యర్ధులను ఈ రోజు ప్రకటించారు.  లోక్‌సభకు పోటీ చేయనున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు.. మహబూబ్‌నగర్ - జితేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ - మందా జగన్నాథం, వరంగల్ - కడియం శ్రీహరి, భువనగిరి - బూర నర్సయ్యగౌడ్, నల్లగొండ - పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కరీంనగర్ - బి.వినోద్‌కుమార్, చేవెళ్ల - కొండా విశ్వేశ్వరరెడ్డి. శాసనసభకు పోటీ చేయనున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు.. షాద్‌నగర్(మహబూబ్‌నగర్) - వై. అంజయ్య యాదవ్, కోదాడ (నల్లగొండ) - కె. శశిధర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి - చింతల కనకారెడ్డి, నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్.  

సి.పి.ఐ. నారాయణకి అందని ద్రాక్ష!

      ద్రాక్ష అందితే చాలా తీయన.. అందకపోతే మాత్రం చాలా పుల్లన. ఇప్పుడు సీపీఐ అధ్యక్షుడు నారాయణ ఈ మైండ్ సెట్‌లోనే వున్నారు. రాష్ట్ర విభజనకు వత్తాసు పలికి రాష్ట్రం ముక్కలు కావడానికి ఒక కారణంగా నిలిచిన సీపీఐ ఈ ఎన్నికలలో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని రాజకీయంగా లాభం పొందాలని అనుకుంది. టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే తమకు ఏయే సీట్లు కావాలన్న లిస్టు కూడా నారాయణ చేతిలో పెట్టుకుని తిరిగారు. నోటికొచ్చినట్టు తిట్టుకుంటూ, జుట్టూ జుట్టూ పట్టుకుంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను కలిపితే తమ పార్టీకి రాజకీయంగా మరింత లాభం కలుగుతుందని ఆశించిన నారాయణ ఆ దిశగా కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. పాపం నారాయణ ఎంత ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. సరేలే టీఆర్ఎస్‌తోనే సరిపెట్టుకుందామని అనుకున్న నారాయణకి కేసీఆర్ భయంకరమైన షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటించినప్పుడు సీపీఐ ఆశలు పెట్టుకున్న సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించేశారు. అంతేకాకుండా తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకూడదని డిసైడ్ చేసుకున్నటు ప్రకటించారు. దాంతో సీపీఐ నారాయణ కంగుతిన్నారు. కేసీఆర్ తమకి ఇంత భారీ షాక్ ఇస్తాడని ఊహించలేకపోయినందుకు తమను తాను తిట్టుకుని, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కేసాఆర్ని తిట్టారు. టీఆర్ఎస్‌తో తమకు పొత్తు కుదరలేదు కాబట్టి సదరు పొత్తు ఇప్పుడు పుల్లని ద్రాక్ష అయిపోయింది.