ఒక్క గుద్దు గుద్దానంటేనా... ట్రంప్!
posted on Feb 23, 2016 @ 5:11PM
కాబోయే అమెరికా అధ్యక్షునిగా అందరూ కీర్తిస్తున్న డొనాల్డ్ ట్రంప్, అధ్యక్ష ఎన్నికలలో ఎంతవరకూ విజయవంతం అవుతాడో లేదో తెలియదు కానీ, ప్రపంచం అంతటా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ తన ఎన్నికల ఉపన్యాసం ఇస్తుండగా సభలో ఓ కుర్రవాడు అలజడి సృష్టించడం మొదలుపెట్టాడు. అతణ్ని పోలీసులు బయటకి తీసుకువెళ్లిపోయారు. అయినా ట్రంప్‌గారికి ఆవేశం ఆగలేదు. ‘వాడి మొహం మీద ఒక్క గుద్దు గుద్దాలని ఉంది’ అంటూ మైకు ముందర నిల్చొని సెలవిచ్చారు కాబోయే అధ్యక్షులవారు. అంతేనా! ‘అదివరకు రోజులలో అయితేనా! ఇలాంటివాడిని చితక్కొట్టి స్ట్రెచర్ మీద బయటకి పంపేవారు’ అంటూ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఇవి అదివరకు రోజులు కావు కాబట్టి, చాలామంది ట్రంప్ చేతిలో దెబ్బలు తినకుండా తప్పించుకుంటున్నారన్నమాట.