బ్రహ్మోత్సవం రిలీజ్... కూలిపోయిన హోర్డింగ్స్

సూపర్‌స్టార్ మహేశ్-శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్రహ్మోత్సవం. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ సినిమా ఇవాళ రిలీజైంది. కానీ ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేక డిజాస్టర్‌గా మిగిలింది. ఇదంతా పక్కన బెడితే "రోను తుఫాన్" ప్రభావంతో గత రెండు రోజులుగా ఏపీ వణికిపోతోంది. వివిధ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్‌ భాగ్యనగరంపై పడింది. సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సుమారు 100 నుంచి 150 కిమీల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. వరుణుడి ప్రతాపం బ్రహ్మోత్సవంపై ఇన్‌డైరెక్ట్‌గా పడింది. భారీ ఈదురుగాలుల కారణంగా అనేక ప్రాంతాల్లో హోర్డింగ్‌లు నేలకూలాయి. వాటిలో బ్రహ్మోత్సవం హోర్డింగ్స్‌ కూడా ఉన్నాయి.

ఏపీ నుండి తెలంగాణకు వచ్చిన వర్షాలు

  ఏపీలో రోను తుఫాను కారణంగా కొన్ని ప్రాంతాలు నీటి మయమైపోయాయి. అయితే ఇప్పుడు ఏపీ నుండి వర్షాలు తెలంగాణకు వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో మధ్యాహ్నం వరకూ తీవ్రమైన ఎండ ఉండగా.. సాయంత్రం అయ్యే సరికి గాలి వాన మొదలైంది. ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు రావడంతో ప్రజలు ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందినా.. బీభత్సమైన గాలి, పిడుగులకు ఎక్కడ ఏం జరుగుతుందో అన్న భయం నెలకొంది. పలుచోట్ల కురిసిన వర్షానికి రోడ్లు నీటితో నిండిపోగా, వివిధ ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. హోర్డింగులు, విద్యుత్ స్థంభాలు రోడ్లపై పడిపోయాయి.   కాగా ఏపీలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లోనూ 4 నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రదేశాలు వెళ్లాలని అధికారులు సూచించారు.

ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు వారు..

  ఎవరెస్ట్ ను అధిరోహించిన వారిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు రికార్డ్ సాధించారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో ఎఎస్పీగా పని చేస్తున్న జిఆర్‌ రాధిక, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భద్రయ్య ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. గత నెల 19వ తేదీన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి వెళ్లిన వీరు ఈరోజు ఉదయం విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. వీరిద్దరితో పాటు ఐపిఎస్‌ అధికారి సునీల్‌ శర్మ, దుబాయ్‌లో ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాలన్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రభాకరన్‌ కూడా ఉన్నారు. కాగా, రాధిక గతంలో 7,077 మీటర్ల ఎత్తున్న కూన్ పర్వతాన్ని కూడా ఆమె అధిరోహించారు. ఈ పర్వతాన్ని అధిరోహించిన రెండో మహిళగా ప్రపంచం రికార్డు నాడు నెలకొల్పారు.

బ్రహ్మోత్సవం అప్‌డేట్స్:మహేశ్‌కు "రోను" గండం

నిన్న మొన్నటి వరకు అందరికళ్లూ బ్రహ్మోత్సవంపైనే. మహేశ్ శ్రీమంతుడిలా రికార్డులు సృష్టిస్తాడా..తన విన్నింగ్ కౌంట్ పెంచుకుంటాడా అంటూ కోటీ ఆశలతో ధియేటర్లలోకి అడుగుపెట్టిన ప్రేక్షకులకు బ్రహ్మోత్సవం నిరాశను మిగిల్చింది. ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు ఏ సీన్ కూడా ప్రేక్షకులకు అర్ధం కాకపోవడంతో ఈ సినిమా పెద్ద డిజాస్టరయ్యింది. ఈ మ్యాటర్ పక్కనబెడితే బ్రహ్మోత్సవానికి మరో ముప్పు పొంచి ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై "రోన్" తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. కలెక్షన్లే టార్గెట్‌గా ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మోత్సవాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. సినిమా ప్లాప్ కావడంతో కనీసం పెట్టుబడి అయినా వస్తుందా..? అనుకుంటున్న నిర్మాతలకు "మూలిగే నక్కపై తాటికాయ పడిన "చందంగా రోన్ గట్టి దెబ్బ తీసింది. రెండు రోజుల నుంచి వర్షాలు ముంచెత్తుతుండటంతో చాలా ప్రాంతాల్లో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. రేపు, ఎల్లుండి రోను తగ్గుముఖం పడితే వీకెండ్ కాబట్టి కాస్త సేఫ్. లేదంటే మహేశ్  పరిస్థితి దారుణంగా తయారవ్వడం ఖాయం.

ఇక మోడీ మంత్రం పనిచేయదు..

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో శివసేన ఎప్పుడూ ముందుంటుంది.. అందునా బీజేపీ పై విమర్శలు చేయడం అంటే శివసేనకు బ్రెడ్ పై బటర్ పూసినంత ఈజీ. ఇప్పుడు తాజాగా మరోసారి బీజేపీపై విరుచుకుపడింది. శివసేనాధిపతి ఉద్దవ్ ఠాక్రే.. మోదీ మంత్రం 2016లో పనిచేయదంటూ విమర్శించారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు బీజేపీని దెబ్బ తీశాయని.. ఇదంతా మిత్రపక్షాల చలవే అని అన్నారు. ఏదో అసోంలో పొత్తు పెట్టుకోవడం వల్ల అధికారం సాధ్యమైంది కానీ.. లేకపోతే అక్కడి ప్రజలు కూడా బుద్ధిచెప్పేవారని ఎద్దేవ చేశారు. బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తరువాత తాజా ఫలితాలు పార్టీకి సంజీవని వంటివి అని రాయడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అంతేకాదు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ పై కామెంట్లు విసిరారు.. అవినీతి, తీవ్రవాదం పెరిగిపోయిన ఈ రాష్ట్రాన్ని 'మమత విముక్త బెంగాల్' కావాలని బీజేపీ నేతలు అన్నారు.. ఇప్పుడు ఏమైంది.. మమతా మరోసారి అధికారంలోకి ఎలా వచ్చారు అని ప్రశ్నించారు.

కేరళ సీఎంగా పినరాయి విజయన్.. అచ్యుతానందన్ కు నిరాశే

  కేరళ సీఎంగా పినరాయి విజయన్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో నిన్న ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎల్టీఎఫ్ ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే సీఎంగా ఎవరు పీఠాన్ని అధిష్టిస్తారు అన్నదానిపై చర్చలు జరుగగా విఎస్ అచ్యుతానందన్.. పినరాయి విజయన్ పేర్లు వినిపించాయి. వీరిద్దరూ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడానికి ఆసక్తిచూపించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఎన్నికపై తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ(ఎం) స్టేట్ కమిటీ.. ఆ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ పినరాయి విజయన్ ను సీఎంగా నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే అధికారింకంగా మాత్రం రేపు ప్రకటినంచనున్నారు. దీంతో అచ్యుతానందన్ కు నిరాశ మిగిలింది.   కాగా మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 92 స్థానాలలో, యూడీఎఫ్ 47 స్థానాలు, బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.

నీట్‌ ఏడాది పాటు వాయిదా.. ఏపీ మంత్రుల హర్షం

  నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్రమంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ జారీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. కేంద్ర మంత్రి వర్గం ఇవాళ ప్రధాని కార్యాలయంలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నీట్‌పై ఆర్డినెన్స్‌ను జారీ ఏసింది.   మరోవైపు నీట్‌ను ఏడాది పాటు వేయిదా వేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించే అంశమన్నారు. నీట్‌ను వాయిదా వేయించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. నీట్‌ అవసరం కానీ.. ప్రస్తుతం సిద్ధంగా లేమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు తెలిపామని చెప్పారు.

ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న హిల్లరీ, ట్రంప్..

  అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్సనాస్త్రాలు సంధించుకున్నారు. అమెరికా అధ్యక్ష స్థానానికి ట్రంప్ తగిన వాడు కాదని..వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ కు సంక్లిష్టమైన విదేశీ విధానాల పరంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేటంత సత్తా లేదన్నారు. గ్రేట్ బ్రిటన్ ను నిందించడం, అమెరికాపై క్షిపణులు ఎక్కుపెడతానని హెచ్చరిస్తున్న ఉత్తరకొరియా నేతను ప్రశంసించడం, నాటోలో అమెరికా సభ్యత్వాన్ని ప్రశ్నించడం తదితర సంఘటనలను హిల్లరీ ఉదాహరణలుగా పేర్కొన్నారు.   అయితే ట్రంప్ మాత్రం సైలెంట్ గా ఉంటాడా.. అసలే వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. హిల్లరీ తనపై చేసిన కామెంట్లకు తాను కూడా ధీటుగా సమాధానం చెప్పాడు. కష్టకాలంలో ఉన్న అమెరికాకు అధ్యక్ష అభ్యర్థిగా హిల్లరీ సరిపోరని.. హిల్లరీ భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఓ రేపిస్ట్ అని ఆరోపించారు. ఇక పనిలో పనిగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఒబామాపై కూడా విమర్శలు చేశారు. అమెరికా స్థాయిని చైనా ముందు డెవలపింగ్ కంట్రీగా (అభివృద్ధి చెందుతున్న దేశంగా) మార్చాడని.. ఆయనొక అవివేకి అని అన్నాడు. మరి ట్రంప్ వ్యాఖ్యలకు హిల్లరీ.. ఒబామా ఎలా స్పందిస్తారో చూడాలి.

అజహర్ విషయంలో భారత్ కు అనుకూలంగా చైనా..

  పఠాన్ కోట్ విమానం స్థావరంపై ఉగ్రవాదులు దాడికి సూత్రధారి అయిన మౌలానా మసూద్ అజహర్ ను పట్టుకునేందుకు భారత ప్రభుత్వం తెగ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అజహర్ కు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అయితే ఇప్పుడు అజహర్ విషయంలో చైనా కూడా భారత్ కు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా భారత్ కు చైనాకు మధ్య సత్సంబంధాలు లేని సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అజహర్ విషయంలో మాత్రం భారత్ కు అనుకూలంగా వ్యవహరించేందుకు చైనా ముందుకు వచ్చింది. మౌలానా మసూద్ అజర్ ను ఐరాసా నిషేధించిన ఉగ్రవాదుల జాబితాలో చేర్చు విషయంలో భారత్ తో సన్నిహితంగా వచ్చామని చైనా నిన్న పేర్కొంది. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఈ రోజు ట్వీట్ చేశారు.  

అవి పాఠశాలలు కాదు.. వ్యభిచార కేంద్రాలు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

  రాజకీయ నేతలకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. ఇప్పుడు ఈ జాబితాలో కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్.ఆంజనేయ కూడా చేరిపోయారు. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఆంజనేయ ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలపై కామెంట్లు చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలు పాఠశాలలు కాదు, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న వ్యభిచార కేంద్రాలు అని.. సంపాదన కోసమే వాటిని ఏర్పాటు చేశారని.. అందుకే ప్రజల నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.   అంతే ఇప్పుడు మంత్రిగారు చేసిన వ్యాఖ్యలపై ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా సీబీఎస్ఈ స్కూల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అలీఖాన్ మాట్లాడుతూ... మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి పద ప్రయోగాలు చేయరాదని, ఆయనపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. మరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తరువాత క్షమాపణలు చెప్పే రాజకీయనాయకులు మాదిరి.. ఇప్పుడు మంత్రిగారు అలానే క్షమాపణలు చెబుతారో లేదో చూడాలి.

దారుణం.. రైలుకింద పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

  విజయవాడలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల ప్రకారం..హైదరాబాద్ కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు విజయవాడలో ఉంటున్నారు. వీరి తండ్రి రఫీ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇక తల్లి సుల్తానా కూడా గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిపాలైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వీరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉద‌యం రాయనపాడు రైల్వేస్టేషన్ వ‌ద్ద ఆత్మ‌హత్య చేసుకున్నారు. వీరిలో ఇద్ద‌రు యువ‌తులు మృతి చెంద‌గా, ఒక యువ‌తి తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది.

రోను తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

రోను తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లోనూ 4 నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రదేశాలు వెళ్లాలని అధికారులు సూచించారు.   మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకూ 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇచ్ఛాపురంలో అత్యధికంగా 15.5, రణస్థలం 13.8 వర్షపాతం నమోదైంది. ఇక తుపాన్‌ కారణంగా పాపికొండ వెళ్లవలసిన పర్యాటక బోటులు నిలిచిపోయాయి. పట్టిసీమ, పురుషోత్తమపట్నం గ్రామాల వద్ద గోదావరి ఒడ్డున పర్యాటక బోట్లు నిలిచిపోయాయి.

నగరంలో నలుగురు బాలికలు అదృశ్యం...

  హైదరాబాద్ నగరంలో బాలికలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్, చందానగర్ కు చెందిన నలుగురు బాలికలు స్వప్న (12), పద్మ (10), రేణుక (9), కావేరి (8) ఐదు రోజులుగా కనిపించకుండా అదృశ్యమయ్యారు. దీంతో బాలికల తల్లి దండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. బాలికలను ఎవరన్నా కిడ్నాప్ చేశారా.. లేక వారే ఎటైనా వెళ్లారా అన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో స్వప్న అనే బాలిక ఇలాగే వెళ్లిపోయిందని.. మళ్లీ తిరిగొచ్చిందని.. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా అలాగే మిగిలిన బాలికలను కూడా తీసుకెళ్లిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరిగిందో తెలియాలంటే వారు దొరికాల్సిందే.