బంగ్లాదేశ్ పై తన ప్రతాపాన్ని చూపుతున్న రోను..

  రెండు రోజుల నుండి ఏపీని జలమయం చేస్తున్న రోను తుఫాను..ఇప్పుడు బంగ్లాదేశ్ పై తన ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ నుండి బంగ్లాదేశ్ వైపు పయనిస్తున్న తుఫాను తీరం దాటకముందే తన ప్రభావాన్ని చూపుతోంది. బలమైన ఈదురు గాలులతో మొదలైన ఈ తుఫాను కారణంగా చెట్లు నేలకూలాయి. పూరి గుడిసెలు, మట్టితో కట్టిన ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు అక్కడ ఐదుగురు మరణించగా.. వంద మందికి పైగా గాయాలయ్యాయి. ఇప్పటికే చాలామంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ తీరానికి 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ఈరోజు తీరం దాటే అవకాశం ఉందని.. తుపాను కారణంగా గంటకు 88 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 60వేల మంది ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు.

'సూపర్ సేల్' తో ముందుకొచ్చిన ఎయిర్ ఇండియా...

  భారత ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఎయిర్ ఇండియా ఒక సరికొత్త స్కీముతో ముందుకొచ్చింది. 'సూపర్ సేల్' పేరుతో ఒక స్కీమును ప్రారంభించింది. గతంలో స్పైస్‌జెట్‌, ఇండిగో, ఎయిర్‌ ఏషియా ఇండియా తదితర సంస్థలు ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించేశాయి. స్పైస్ జెట్ రూ. 511 (పన్నులు అదనం), ఇండిగో రూ. 800 (పన్నులు అదనం)కు టికెట్లను విక్రయించాయి. ఇప్పుడు అదే బాటలో ఎయిర్‌ ఇండియా సైతం నడుస్తోంది. మే 25 నుంచి సెప్టెంబరు 30లోపు తమ విమానాల్లో ప్రయాణాలు చేయాలనుకున్న వారు 'సూపర్ సేల్‌' స్కీమ్ ద్వారా తగ్గింపు ధరకే టిక్కెట్లను పొందవచ్చని తెలిపింది. దేశీయ రూట్లలో టిక్కెట్‌ ప్రారంభ ధర 1,499(పన్నులతో కలిపి)గా ఉందని చెప్పింది. తాము నడుపుతున్న అన్ని రూటల్లో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు.

ఏపీ మెడికల్ ఫలితాల్లో తెలంగాణ హవా..టాప్-10లో ఆరుగురు

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2016 మెడికల్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్ధులు సత్తా చూపారు. టాప్‌-10లోని పదిమందిలో ఆరుగురు తెలంగాణ విద్యార్థులే. రంగారెడ్డి జిల్లాకు చెందిన సాత్విక్‌రెడ్డి 155 మార్కులతో 2వ ర్యాంక్ సాధించాడు. టాప్‌-10లో నిలిచిన తెలంగాణ విద్యార్థులు వీరే: 1 సాత్విక్ రెడ్డి-2వ ర్యాంక్ రంగారెడ్డి 2 యజ్ఞప్రియ-3వ ర్యాంక్ హైదరాబాద్ 3 ఇక్రమ్‌ఖాన్-5వ ర్యాంక్ హైదరాబాద్ 4 సాహితి సావిత్రి-6వ ర్యాంక్ హైదరాబాద్ 5 గ్రీష్మా మీనన్-8వ ర్యాంక్ వరంగల్ 6 శివకుమార్-9వ ర్యాంక్ నల్గొండ

మోడీతో టిమ్ కుక్ భేటీ.. అప్ డేటెడ్ వెర్షన్ ను ప్రారంభించిన కుక్

  యాపిల్ సంస్థ అధినేత టిమ్ కుక్ భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.  ఆయన ఈరోజు ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఢిల్లీలోని 7 రేస్ కోర్స్ గల ప్రధాని అధికారి నివాసంలో ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా 'నరేంద్ర మోదీ మొబైల్ యాప్'కు సరికొత్త అప్ డేటెడ్ వర్షన్ ను స్వయంగా తయారు చేయించుకుని వచ్చిన టిమ్ కుక్.. అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను ప్రారంభించారు. భేటీ అనంతరం.. టిమ్‌ చేతుల మీదుగా మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందని.. టిమ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ మోడీ ట్వీట్‌ చేశారు. ఈ సరికొత్త వర్షన్ లో 'మై నెట్ వర్క్' పేరిట కొత్త విభాగం మొదలైంది. ఇక మీరంతా ఓ గ్రూప్ గా ఏర్పడి నాకు సలహాలు, సూచనలు పంపొచ్చు. ఇతరులతో మీ ఐడియాలను పంచుకుని చర్చించవచ్చు" అని మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. మరోవైపు టిమ్‌కుక్‌ కూడా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌కు మరోసారి రావాలనుందంటూ టిమ్‌ ట్వీట్‌ చేశారు.  

ఏపీకి రావాల్సిందే.. త్యాగాలు తప్పవు.. చంద్రబాబు

  ఈ ఏడాది జూన్ కల్లా హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏపీకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా రోజుల నుండి చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదట ఏపీకి రావడానికి ఆసక్తి చూపించిన ఉద్యోగులు ఇప్పుడు అంత ఆసక్తి చూపించడంలేదు. అక్కడ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని ఏవో కుంటిసాకులు చెబుతూ తాము రావడానికి వచ్చే ఏడాది మార్చి వరకూ గడువు కూడా ఇమ్మని కోరారు. కానీ చంద్రబాబు మాత్రం రావాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. మరో నెల రోజుల్లోగా తాత్కాలిక సచివాలయం సిద్దమైపోతుందని..  హైదరాబాద్ లో ఉన్న ఏపీ ఉద్యోగుల్లో కొద్దిమంది మినహా మిగతావారంతా రావాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని శాఖల ఉద్యోగులు, కార్యాలయాలు ఒకచోట ఉంటేనే పరిపాలన సాధ్యమవుతుందని.. కావున కొన్ని త్యాగాలు చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండాల్సిందేనని అన్నారు. రావాల్సిందేనని తెలిపారు.

మరోసారి బయటపడిన టీడీపీ నేతల విబేధాలు..

టీడీపీ నేతల మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. జిల్లాలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేత అయిన కరణం బలరాం వర్గీయులకు, ఇటీవల వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన గొట్టిపాటి రవి వర్గీయులకు మధ్య ఘర్షణ జరిగింది. సభలో గొట్టిపాటి రవి మాట్లాడుతుండగా.. బలరాం వర్గీయులు, గొట్టిపాటి వర్గీయులు గొడవకి దిగారు. ఇంతలో అక్కడే వున్న పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇరు వర్గాల మధ్యకు వెళ్లి వారించేందుకు ప్రయత్నించగా.. కరణం బలరాం ఆయనతో కూడా వాగ్వాదానికి దిగారు. "నీవల్లే రవి టీడీపీలోకి వచ్చాడు"అని బలరాం గట్టిగా అనడంతో, ఆయన వర్గీయులు బుచ్చయ్యపైనా దాడికి యత్నించారని సమాచారం. మరి ఈ రగడ ఎన్ని రోజులు జరుగుతుందో చూడాలి.

విజయ్ మాల్యా కి గ్యారంటీగా రైతు మన్మోహన్ సింగ్..!

  బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యాను తిరిగి దేశం రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. అయితే తాజాగా మాల్యా ఓ బంపరాఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనను అరెస్ట్ చేయకుండా.. తగిన భద్రత కల్పిస్తానని ప్రభుత్వం నుండి హామీ వస్తే తిరిగి ఇండియా వస్తానని.. రుణాలు చెల్లిస్తామని చెప్పాడు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి తగిన హామీ ఇచ్చేందకు రెడీ అని చెప్పింది. అయితే ఇప్పుడు మాల్యా విషయంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. మాల్యాకు గ్యారంటీ ఇచ్చాడంటూ ఒక అమాయక రైతు ఖాతాను ఫ్రీజ్ చేశారు అధికారులు.   వివరాల ప్రకారం.. పిలిభిత్ సమీపంలోని ఖజూరియా నవిరామ్ గ్రామంలో మన్మోహన్ సింగ్ అనే రైతు వ్యవసాయంపై ఆధాపడి జీవిస్తున్న వ్యక్తి. ఈయనకు బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఖాతా ఉంది. అయితే ఈయన మాల్యాకు గ్యారంటీగా ఉన్నాడంటూ.. తక్షణం ఖాతా సీజ్ చేయాలని ముంబై హెడ్డాఫీసు నుంచి ఆదేశాలు రాగా స్పందించిన బ్యాంకు అధికారులు ఆయన ఖాతాలను స్తంభింపజేశారు. దీంతో రైతు లబోదిబోమంటూ ఆరోపిస్తున్నాడు. అసలు మాల్యా ఎవరో తనకు తెలియదంటూ.. బ్యాంకు ఖాతా ఎందుకు నిలిపివేశారో తెలియదంటూ వాపోతున్నాడు. దీనివల్ల బ్యాంకుల నుండి వచ్చే స్కీములు నాకు చేరడం లేదు. ఇల్లు గడిచేందుకు డబ్బు అవసరమై నా పంటనంతా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వచ్చింది అని చెబుతున్నాడు. మరోవైపు బ్యాంకు అధికారులు చేసిన ఈ పనికి అందరూ విమర్శిస్తున్నారు. డబ్బున్న వారిపై ఎలాంటి ప్రతాపం చూపించలేని అధికారులు.. ఇలాంటి వారిపై మాత్రం తమ ప్రతాపాన్ని చూపిస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడు అసెంబ్లీ రికార్డ్.. 170 మంది కోటీశ్వరులు

  తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ విజయం పొంది ముఫ్పై ఎళ్ల చరిత్రను తిరగరాసి ఇప్పటికే జయలలిత రికార్డు సాధించింది. ఇప్పుడు మరో రికార్డు వెనుకేసుకుంది తమిళనాడు అసెంబ్లీ. కొత్తగా ఏర్పడిన తమిళనాడు అసెంబ్లీలో కాలుపెడుతున్నవారందరూ కోటీశ్వరులే కావడంతో.. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ధనిక అసెంబ్లీగా రికార్డు సాధించింది. ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థుల్లో 170 మంది కోటీశ్వరులు గెలిచి అసెంబ్లీలో కాలుపెడుతున్నారు. నామినేషన్ల సమయంలో వీరు సమర్పించిన అఫిడవిట్లలో వారి ఆస్తి విలువలు తెలిపిన ప్రకారం ఈ విషయం తెలిసింది. అసెంబ్లీకి వెళ్లిన కోటీశ్వరుల జాబితాలో రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్న ముఖ్యమంత్రి జయలలితతో పాటు, రూ. 337 కోట్ల ఆస్తులతో కాంగ్రెస్ ఎమ్మెల్యే నెంగునేరి వసంత్ కుమార్, రూ. 170 కోట్లకు పైగా ఆస్తులతో డీఎంకే ఎమ్మెల్యే ఎంకే మోహన్ తదితరులు ఉన్నారు. తమిళనాడులో ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ. 8.21 కోట్లుగా తేలింది.

ప్రొఫెసర్ పెళ్లికి వెళ్లిన స్టూడెంట్.. ఏం చేశాడో తెలుసా..?

సాధారణంగా పెళ్లికి వెళ్లినప్పుడు.. దంపతులకు ఏదో ఒక గిఫ్టో లేక.. కట్నాలు చదివించి వస్తారు. కానీ ఇక్కడ ఓ ప్రొఫెసర్ పెళ్లికి వెళ్లిన ఓ స్టూడెంట్ చాలా విచిత్రమైన పని చేశాడు. ఇంతకీ ఏం చేశాడనే కదా డౌట్.. అసలు సంగతేంటంటే.. కేరళలోని పతనంతిట్ట ముజలియర్ కాలేజ్ స్టూడెంట్ శ్రీనాథ్ తన ప్రొఫెసర్ పెళ్లికి వెళ్లాడు. అక్కడ అందరూ స్టేజ్ పై ఉన్న జంటను ఆశీర్వదిస్తున్నారు. కొంత మంది ఫొటోలు దిగుతున్నారు. ఇక అందరిలాగానే శ్రీనాథ్ కూడా స్టేజ్ పైకి వెళ్లాడు. వెళ్లగానే తనతోపాటు తెచ్చుకున్న రికార్డును ప్రొఫెసర్ ముందుంచి సంతకం కావాలని కోరాడు. అంతే శ్రీనాథ్ చేసిన పనికి షాకైన ప్రొఫెసర్ ఏం చేయాలో తెలియక.. నవ్వుతూ సంతకం చేశాడు. మొత్తానికి స్టూడెంట్ చేసిన ఈ పని అక్కడ ఉన్న వారందరికీ నవ్వు తెప్పించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

డా.గోఖలేని సత్కరించిన సీఎం చంద్రబాబు

నవ్యాంధ్ర చరిత్రలోనే తొలిసారిగా గుంటూర ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఒక వ్యక్తికి గుండె మార్పిడిని చేసిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఏపీ ఎంసెట్ ఫలితాలను సీఎం విడుదల చేశారు. ఇదే కార్యక్రమంలో డాక్టర్ గోఖలేకు శాలువా కప్పి చంద్రబాబు సత్కరించారు. కార్యక్రమంలో వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. నిన్న గుంటూరు స్వర్ణభారతి నగర్‌కు చెందిన ఉప్పు ఏడుకొండలు అనే వ్యక్తికి, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను గోఖలే బృందం విజయవంతంగా మార్పిడి చేసింది.

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

  ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలతాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మొదటి పది ర్యాంకులు సాధించిన వారి పేర్లను తెలిపారు. మెడిసిన్ లో ఫస్ట్ ర్యాంకు ఎం. హేమలత(156 మార్కులు), ఎర్ల స్వాతిక్ రెడ్డి (155 మార్కులు)మూడో ర్యాంకు యజ్ఞప్రియ (153మార్కులు), నాలుగో ర్యాంకు నేహా (152 మార్కులు), ఐదో ర్యాంకు విక్రమ్ ఖాన్ (152 మార్కులు), ఆరో ర్యాంకు సొంటి సాహితి (152 మార్కలు), ఏడో ర్యాంకు పెద్దిరెడ్ల శైలజ(150 మార్కులు), ఎనిమిదో ర్యాంకు గ్రీష్మభావన(150 మార్కులు), తొమ్మిదో ర్యాంకు దారం శివకుమార్(150 మార్కులు), పదో ర్యాంకు సాయి ప్రతాప్ రెడ్డి(150 మార్కులు) సాధించినట్టు తెలిపారు.   ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ కే ఏపీ పెద్ద పీట వేస్తుందని.. ఏపీని నాలెడ్జ్ హబ్ గా మారుస్తామని..పదేళ్లలో అక్షరాస్యత మరింత పెరుగుతుంది వ్యాఖ్యానించారు. నీట్ పై కేంద్రం ఆర్డినెన్స్ అందాల్సి ఉందని.. వచ్చే ఏడాది నీట్ కు ప్రిపేర్ కావాలని.. నీట్ సిలబస్, అధ్యాపకుల ట్రైనింగ్ పై విద్యాశాఖ సమీక్ష నిర్వహిస్తుందని తెలిపారు. జూన్ 1 వ తేదీన డీఎస్సీ అభ్యర్ధులకు అపాయింట్ మెంట్ లెటర్స్ అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు సకాలంలో పరీక్షలు నిర్వహించలేదని అన్నారు. కాగా రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌, ప్రత్తిపాటి పుల్లారావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.

చావుకు దగ్గరగా వెళ్లొచ్చా.. పీతల సుజాత

  హైదారాబాద్లో నిన్న ఓ అరగంట పాటు వచ్చిన గాలి, వాన ప్రజలను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసిన సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద ఉరుములు, గాలి, పిడుగులతో వచ్చిన ఈ వాన బీభత్సమే సృష్టించింది. అయితే దీనివల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నంత పనైందని చెబుతున్నారు ఏపీ మంత్రి పీతల సుజాత. ఆమె తెలిపిన వివరాల ప్రకారం..శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి విజయవాడకు స్పైస్ జెట్ విమానం బయలుదేరింది. ఈ విమానంలో పీతల సుజాత కూడా ఉన్నారంట. అయితే గాలివాన వల్ల విమానం కుదుపులకు గురైందని.. పెద్ద కుదుపులు, శబ్దాలు రావడంతో ఏం చేయాలో పాలు పోలేదు.. ప్రాణాలతో విమానం దిగుతామని అనిపించలేదు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నంతపనైంది..  "చావుకు దగ్గరగా వెళ్లి వచ్చాను అని చెప్పారు. విజయవాడలో క్షేమంగా ల్యాండ్ అయిన తరువాతనే ఊపిరి పీల్చుకున్నాం" అన్నారు.

ఈసారి చైనాపై ప్రేమ కురిపించిన ట్రంప్.. ఎందుకో..?

  అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ చైనా పై విమర్శలు చేయడం కామన్. ఏదో ఒక సందర్భంలో చైనాపై విమర్శలు చేస్తూనే ఉంటారు.  అయితే ఈసారి ట్రంప్ తన రూట్ మార్చాడు. ఎప్పుడూ చైనాను ఆడిపోసుకునే ట్రంప్ వెరైటీగా ఈసారి ప్రేమను కురిపించాడు. అమెరికాకు చైనా మిత్రదేశమని, తాను అధ్యక్షుడినైతే, మరింత సత్సంబంధాలు పెరుగుతాయని అన్నారు. అంతేకాదు చైనీయులను అమెరికా ఇంకా గౌరవంగా చూసేలా తన విధానం ఉంటుందని, ప్రస్తుత నేతలు సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. చైనాతో బాగుంటే, అమెరికన్లు అదనంగా 500 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసుకోవచ్చని ఆయన అన్నారు. మరి ఉన్నట్టుండి ట్రంప్ లో ఇంత మార్పు రావడానికి గల కారణాలేంటే అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వడం మోడీకి కూడా ఇష్టంలేదా..?

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని.. ఏపీకి అసలు ప్రత్యేక హోదా అవసరం లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను బట్టి అర్దమైపోయింది. అయితే ఇప్పటి వరకూ బీజేపీ నేతలే ఇలాంటి వ్యాఖ్యలు చేసినా.. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఈ విషయంపై నోరు విప్పింది లేదు. అయితే ఇప్పుడు మోడీకి కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టం లేదన్న విషయం అర్ధమవుతోంది. దీనికి ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్ధార్ధ్ సింగ్ చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయనే స్వయంగా బీజేపీ నేతలతో ఈ విషయం చెప్పినట్టు తెలుస్తోంది. నిన్నఏపీ బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సందర్బంగా బీజేపీ నేతలు ఏపీ ప్రత్యేక హోదా, ప్యాకేజీపై సిద్దార్ధ్ సింగ్ గట్టిగానే అడిగట్టు సమాచారం. ప్రత్యేక హోదానా, ప్యాకేజీ ఇస్తారా తేల్చాలని వారు సిద్ధార్థనాథ్ సింగ్‌ను ప్రశ్నించారని తెలుస్తోంది. రెండేళ్లలో కేంద్రం చాలా ఇచ్చిందని ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేశారని, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే నిధులు మంజూరు చేశారని వారు ఘాటుగానే స్పందించారని తెలుస్తోంది. ఇదే సమయంలో సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఏపీకి హోదా ఇచ్చే అవకాశం లేదని, ప్రధాని మోడీ కూడా అందుకు వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టం చేశారని తెలుస్తోంది. దీంతో ఈయన చేసిన వ్యాఖ్యలను బట్టి ప్రధాని మోడీకి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టం లేదని స్పష్టంగా అర్ధమవుతోంది. మరి ప్రధాని మోడీ తన మనసులోని మాటను ఎప్పుడు బయటపెడతారో చూడాలి.

ఆశావర్కర్‌పై గ్యాంగ్‌రేప్..

మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆశావర్కర్‌ను కిడ్నాప్ చేసి గుర్తుతెలియని దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. నిన్న రాత్రి ఒక ఆశావర్కర్ నర్సాపూర్‌లో ఓ సమావేశానికి హాజరై ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌కు వెళ్తోంది. ఆ సమయంలో ఐదుగురు గుర్తుతెలియని దుండగులు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకుని కిడ్నాప్‌ చేశారు. అనంతరం ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆశావర్కర్‌పై సామూహిక అత్యాచారం చేసి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. రాత్రంతా వర్షం కురవడంతో ఆ వైపుగా ఎవరూ వెళ్లకపోవడంతో ఆమె వర్షంలో స్పృహ లేకుండా పడిపోయింది.   ఇవాళ ఉదయం అటుగా వెళ్తున్న కొందరు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు బాధితురాలిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం అవుతోందని, జరిగిన ఘోరం తాలుకు షాక్ నుంచి ఆమె తేరుకోలేదని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స నిమిత్తం ఆశా కార్యకర్తను హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు.

బ్రహ్మోత్సవంపై పగబట్టిన వరుణుడు..!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు-శ్రీకాంత్ అడ్డాల కాంబోలో తెరకెక్కిన సినిమా బ్రహ్మోత్సవం. ఈ సినిమా ఇప్పటికే డిజాస్టర్ కావడంతో తర్వాత పరిస్థితేంటా అని డైలమాలో పడిపోయింది ఆ చిత్ర యూనిట్. అసలే సినిమా ఫ్లాప్ ఈ సమయంలో మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా వరుణుడు కూడా  బ్రహ్మోత్సవంపై పగ బట్టినట్లున్నాడు. ఇప్పటి వరకు ఏపీని వణికించిన రోన్ తుఫాన్ కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌ను అల్లాడించింది. 100 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పది నిమిషాల పాటు జనాన్ని భయభ్రాంతులకు గురిచేసింది.   భారీ ఈదురుగాలుల కారణంగా అనేక ప్రాంతాల్లో హోర్డింగ్‌లు నేలకూలాయి. వాటిలో బ్రహ్మోత్సవం హోర్డింగ్స్‌ కూడా ఉన్నాయి. వరుణుడు ఫస్ట్ పబ్లిసిటి మీద దెబ్బ కొట్టగా...సరిగ్గా ఫస్ట్ షో చూడటం కోసం థియేటర్లకు వెళ్లేవారిని వెంటాడాడు వరుణుడు. వర్షం దెబ్బకి చాలా ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి రోడ్ల మీద ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఒకవేళ చచ్చిచెడి సినిమాకు వెళ్లినా,  ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం, కరెంటు తీగలు తెగిపోవడంతో  చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడి షో నిలిచిపోయింది. ఈ విధంగా వరుణుడు బ్రహ్మోత్సవాన్ని ముప్పుతిప్పలు పెట్టాడు.