అవి పాఠశాలలు కాదు.. వ్యభిచార కేంద్రాలు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
posted on May 20, 2016 @ 11:53AM
రాజకీయ నేతలకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. ఇప్పుడు ఈ జాబితాలో కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్.ఆంజనేయ కూడా చేరిపోయారు. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఆంజనేయ ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలపై కామెంట్లు చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలు పాఠశాలలు కాదు, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న వ్యభిచార కేంద్రాలు అని.. సంపాదన కోసమే వాటిని ఏర్పాటు చేశారని.. అందుకే ప్రజల నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
అంతే ఇప్పుడు మంత్రిగారు చేసిన వ్యాఖ్యలపై ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా సీబీఎస్ఈ స్కూల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అలీఖాన్ మాట్లాడుతూ... మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి పద ప్రయోగాలు చేయరాదని, ఆయనపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. మరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తరువాత క్షమాపణలు చెప్పే రాజకీయనాయకులు మాదిరి.. ఇప్పుడు మంత్రిగారు అలానే క్షమాపణలు చెబుతారో లేదో చూడాలి.