ఏపీ నుండి తెలంగాణకు వచ్చిన వర్షాలు
posted on May 20, 2016 @ 5:35PM
ఏపీలో రోను తుఫాను కారణంగా కొన్ని ప్రాంతాలు నీటి మయమైపోయాయి. అయితే ఇప్పుడు ఏపీ నుండి వర్షాలు తెలంగాణకు వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో మధ్యాహ్నం వరకూ తీవ్రమైన ఎండ ఉండగా.. సాయంత్రం అయ్యే సరికి గాలి వాన మొదలైంది. ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు రావడంతో ప్రజలు ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందినా.. బీభత్సమైన గాలి, పిడుగులకు ఎక్కడ ఏం జరుగుతుందో అన్న భయం నెలకొంది. పలుచోట్ల కురిసిన వర్షానికి రోడ్లు నీటితో నిండిపోగా, వివిధ ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. హోర్డింగులు, విద్యుత్ స్థంభాలు రోడ్లపై పడిపోయాయి.
కాగా ఏపీలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లోనూ 4 నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రదేశాలు వెళ్లాలని అధికారులు సూచించారు.