మహిళలపై లైంగిక వేధింపులు.. బాబా పరమానంద్ అరెస్ట్

బాబాల రూపంలో మహిళలను లైంగికంగా వేధించేవారిని చాలామందినే చూశాం. ఇప్పుడు ఆ జాబితాలో బాబా పరమానంద్ కూడా చేరిపోయారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన బాబా పరమానంద్ ఆ రాష్ట్ర రాజధాని అయిన లక్నోకి సమీపంలోని ఆశ్రమం నడుపుతున్నారు. అయితే ఆయన తన దగ్గరకు వచ్చే మహిళాభక్తులపై అసభ్యంగా ప్రవర్తించేవాడని.. వారికి పిల్లల్ని పుట్టిస్తానని చెప్పి లైంగికంగా వేధించేవాడని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన ఆశ్రమంపై దాడి చేయడంతో మహిళలతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సీడీలు, పోర్న్ చిత్రాల సీడీలూ వెలుగులోకి వచ్చాయి. అయితే పరమానంద మధ్యప్రదేశ్ లోని సాత్నా ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లి ఆయనని అరెస్ట్ చేశారు.

నీట్ వాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం..!

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఒకే అర్హత పరీక్ష నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు నీట్ ఆర్డినెన్స్ ఫైల్‌పై ఆయన సంతకం చేశారు. దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే జాతీయ పరీక్ష ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సుప్రీం నిర్ణయాన్ని చాలా రాష్ట్రాలు వ్యతిరేకించి..నీట్‌ను రద్దు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరాయి. రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో నీట్‌ను ఈ ఏడాది వాయిదా వేస్తూ ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.   దీనికి ఆమోదముద్ర కోసం ఫైలుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు పంపింది. ఈ ఆర్డినెన్స్‌ను పరిశీలించిన రాష్ట్రపతి న్యాయసలహా అడిగారు. అలాగే నిన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను పిలిపించుకుని ఇంత అత్యవసరంగా ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సిన అవసరం ఏమోచ్చిందా అని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ప్రణబ్ ఇవాళ చైనా పర్యటనకు వెళ్తుండటంతో ఆర్డినెన్స్ ఆమోదం కోసం కేంద్రం పావులు కదిపింది. మొత్తానికి ఆయన్ను సంతృప్తి పరిచి అనుకున్నది సాధించుకుంది బీజేపీ ప్రభుత్వం.

ఒడిశా ప్రమాదంపై చినరాజప్ప దిగ్భ్రాంతి..

గుంటూరు జిల్లాకు చెందిన యాత్రికుల బస్సు ఒడిశాలో ప్రమాదానికి గురైన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒడిశా సర్కార్‌తో మాట్లాడి క్షతగాత్రులకు సాయమందించాలని ఆయన ఏపీ విపత్తు నిర్వహణ అధికారులను, పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన డీజీపీ జేవీ రాముడు ఒడిశా డీజీపీతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దీనితో పాటు యాత్రికులను తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు పంపేలా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.  

ఆస్తి కోసం మరదలిపై అత్యాచారం..

ఆస్తి కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారు అనడానికి నిత్యం వార్తల్లో ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అదే కోవలోకి మరో దుర్మర్గుడు చేరాడు. హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని ప్రగతి నగర్‌లో ఆస్తి కోసం సొంత మరదలిపై బావ అత్యాచారానికి పాల్పడ్డాడు.    గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన అజయ్ మరదలికి అమరావతి ప్రాంతంలో ఆస్తి ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో..ఒక్కసారిగా ఆ భూమికి ధర పెరిగింది. దీంతో ఆ భూమిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ప్లాన్ వేశాడు. బలవంతంగా లొంగదీసుకుంటే ఆ యువతి జీవితాంతం తాను చెప్పినట్టే వింటుందని భావించాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడి, ఫోటోలను తీశాడు. అనంతరం ఎవరికైనా చెప్పినా..ఆస్తి తన పేరిట రాయకపోయినా నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతో వేధింపులు భరించలేని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

వెలుగులోకి ట్రంప్‌ చీకటి కోణం..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దిగినప్పటి నుంచి నోటీ ద్వారానో..చేతల ద్వారానో వివాదాలు రేకిత్తిస్తున్న డోనాల్డ్ ట్రంప్ గురించి మరో నిజం బయటకు వచ్చింది. మాఫియాడాన్ అంతోని ఫాట్ టోని సాలెర్నొతో ట్రంప్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ట్రంప్..ట్రంప్ టవర్, ట్రంప్ ప్లాజా నిర్మించడానికి మాఫియా డాన్ ఫాట్ టోనికి చెందిన కంపెనీలతో రహస్య ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రముఖ జర్నలిస్ట్ డేవిడ్ కే జాన్‌స్టన్ వెల్లడించారు. ఈ మేరకు జాన్‌స్టన్ పొలిటికో పత్రికలో ట్రంప్-మాఫియాడాన్ సంబంధాలపై విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించారు. ట్రంప్‌కు మాఫియాతో సంబంధాలున్నట్టు కథనాలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన మాఫియా లింకులు బయటకొచ్చాయి. అయితే ఈ కథనాన్ని ట్రంప్ కొట్టిపారేశారు. ఫ్యాట్ టోనితో తనకు సంబంధాలు లేవని, ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాన్ని ప్రచురించినందుకు జాన్‌స్టన్‌పై కేసు వేస్తానని హెచ్చరించారు.

టోల్ కట్టమన్నందుకు..బస్సుతో గుద్దబోయాడు

టోల్‌ కట్టమన్నందుకు ఏకంగా ఒక వ్యక్తినే ఢీకొట్టబోయాడు ఒక బస్సు డ్రైవర్. గుర్గావ్‌లోని ఖేర్కీ ధౌలా టోల్‌ప్లాజా దగ్గర టోల్ టాక్స్ రూ.60 కట్టడానికి ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిరాకరించాడు. టోల్ ట్యాక్స్ కట్టాల్సిందిగా నిలదీయడంతో బస్సు డ్రైవర్ కట్టకుండా పారిపోవడానికి ప్రయత్నించాడు. అతన్ని అడ్డుకునేందుకు టోల్ ప్లాజా మేనేజర్ ప్రయత్నించాడు. దీంతో అతన్ని ఢీ కొట్టడానికి కూడా సదరు డ్రైవర్ వెనుకాడకపోవడంతో అతను వెంటనే పక్కకు దూకాడు. ఈ మొత్తం వ్యవహారం అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యింది. జరిగిన ఘటనపై టోల్‌ప్లాజా నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఇలాంటి సంఘటనలు కామన్. గతంలో కూడా ఇలాగే టోల్ కట్టమన్నందుకు కొందరు వ్యక్తులు టోల్ సిబ్బందిపై దాడికి దిగారు. 

చంద్రబాబు దారిలో జయలలిత..!

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె తొలి సంతకం దేనిపై పెడతారా అని ప్రజలు, ప్రతిపక్షాలు ఆసక్తిగా ఎదురుచూశారు. దీనికి జయలలిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఫాలో అయ్యారు. తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం రైతు రుణమాఫీ ఫైలుపైనే పెడతామని బాబు ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన తొలి సంతకం రైతు రుణమాఫీ ఫైలుపై చేశారు. అదే విధంగా జయలలిత కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేశారు. అంతేకాకుండా కొత్త పథకాలతో వరాల జల్లు కురిపించారు.   ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం, మద్యం దుకాణాలకు సమయం కుదింపు, వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, చేనేత కార్మికులకు 700 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా పథకాలను జయ మేనిఫెస్టోలో ప్రకటించారు. వీటిలో మద్యం దుకాణాల సమయం కుదింపుపై జయ తన హామీని నిలబెట్టుకున్నారు. అలాగే 500 రిటైల్ మద్యం షాపుల మూసివేతకు అమ్మ ఆదేశాలు జారీ చేశారు. ఇంతక్రితం తమిళనాడులో ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ మద్యం దుకాణాలు తెరిచి ఉండేవి. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే తెరచుకోనున్నాయి. మిగిలిన కొత్త ఫథకాలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

బాత్‌రూంలో 30 పాములు..!

ఇది ఏ లక్ష్మీగణపతి మూవీస్ వారి ఇంగ్లీష్ సినిమా తెలుగు టైటిల్ కాదు. నిజంగానే..ఒక్కపాము కనిపిస్తేనే గుండె రాజధాని ఎక్స్‌ప్రెస్ స్పీడులో కొట్టుకుంటుంది. అలాంటి 30 పాములు ఒకేసారి కనిపిస్తే ఇంకేమైనా ఉందా..కాని ఇలాంటి అనుభవం ఒక వ్యక్తికి ఎదురైంది. హర్యానాలోని కర్నల్ అనే గ్రామంలో ఓ ఇంటి యాజమాని బాత్‌రూం తలుపు తీయగానే నల్లతాచు పిల్లలు కనిపించాయి. ఒకటి రెండు కాదు ఏకంగా 30కి పైగా. దీంతో ఉలిక్కిపడిన ఆ వ్యక్తి వెంటనే పాములు పట్టేవారికి సమాచారం అందించాడు. వారు పాములును పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. ఈ వార్తను గ్రామస్తులంతా వింతగా చెప్పుకుంటున్నారు.

మీ కారుకు పదేళ్లు నిండాయా ..అయితే షెడ్డుకే..!

నానాటికి పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటోంది. అవి సత్ఫాలితాల్ని ఇవ్వడంతో దేశంలోని మిగిలిన ప్రభుత్వాలు కూడా ఇదే ఫార్మూలాని ఫాలో అవ్వాలని డిసైడయ్యాయి. కేరళలోని ఎర్నాకులంకు చెందిన లాయర్స్ ఎన్విరాన్‌మెంటల్ అవేర్‌నెస్ ఫోరమ్ అనే సంస్థ కాలుష్యానికి కారణమవుతున్న కార్లపై చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్  ఎర్నాకులం బెంచిలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను నిషేధిస్తూ తీర్పు వెలువరించింది. పదేళ్లు దాటిన నెల రోజుల తర్వాత కూడా అలాగే వాహనాలను నడుపుతుంటే రూ.10 వేల జరిమానా విధించాలని కూడా ఆదేశించారు. 

బ్రెడ్, బిస్కెట్లు తింటున్నారా..అయితే..!

బ్రెడ్, బన్నులు, బిస్కెట్లు, పిజ్జా ..ఇలాంటివి తింటున్నారా? అయితే జర భద్రం..అవి తినేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తినమంటున్నారు శాస్త్రవేత్తలు. వీటిని తయారు చేయడానికి ఉపయోగించే కొన్ని రకాల రసాయనాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని..వాటి వల్ల మనుషులకు కేన్సర్ వచ్చే అవకాశముందని నిపుణుల పరిశోధనలో తేలింది.   ఢిల్లీలోని వివిధ బేకరీల నుంచి సేకరించిన బ్రెడ్ సహా ఇతర బేకరీ ఉత్పత్తుల శాంపిళ్లలో 84% పొటాషియం బ్రోమేట్, పొటాషియం లోడేట్ లాంటి రసాయన అవశేషాలున్నాయని తేలింది. దీని వల్ల కడుపునొప్పి, డయేరియా, వాంతులు, చెముడు, వెర్టిగో, హైపోటెన్షన్, డిప్రెషన్..ఇలా రకరకాల సమస్యలు వస్తాయని పరిశోధకులు తేల్చారు. దీంతో పొటాషియం బ్రోమేట్‌ను చాలా దేశాల్లో నిషేధించారు. మానవ శరీరంపై ఇంతలా దుష్ప్రభావం చూపిస్తున్న పొటాషియం బ్రోమేట్, పొటాషియం ఆయోడేట్‌ను భారత్‌లో మాత్రం అనుమతిస్తున్నారు. ఇప్పటికైనా ఎఫ్ఎస్ఎస్ఏఐ దీని వినియోగంపై చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.

అమ్మ ప్రమాణ స్వీకారంలో స్టాలిన్‌కు అవమానం..!

తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే వైరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేదిక ఏదైనా సరే ఈ రెండు పార్టీల నేతలు ఎదురుపడితే విమర్శలు, ప్రతి విమర్శలు అవసరమైతే కొట్టుకోవడానికి కూడా వీరు వెనుకాడరు. తాజాగా ప్రజాతీర్పుతో వరుసగా రెండోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా జయ, తన ప్రత్యర్థి డీఎంకే అధినేత కరుణానిధికి ఆహ్వానం పంపారు.   ఆ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి కరుణ కుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. అయితే ఇక్కడ స్టాలిన్‌కు ఘోర అవమానం జరిగింది. ఆయనకు ఆడిటోరియంలో 16వ వరుసలో కుర్చీ కేటాయించారు. ఆయనతో పాటు మరికొందరు డీఎంకే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. స్టాలినే ఈసారి ప్రధాన ప్రతిపక్ష నేత అవుతారని ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షనేత హోదా అంటే కేబినెట్ ర్యాంక్‌తో సమానం. అలాంటి వ్యక్తిని ఇలా వెనుక కూర్చోబెట్టడం ఏంటని డీఎంకే నేతలు మండిపడుతున్నారు. ఇదే కార్యక్రమంలో సినీనటుడు శరత్‌కుమార్‌కు మాత్రం ముందు వరుసలో సీటు ఇచ్చారు.  జయ ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేసిందని డీఎంకే అధినేత కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

జయ కేబినెట్ మంత్రులు వీరే..

తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోసారి ప్రమాణం చేశారు. మద్రాస్ యూనివర్శిటీ సెంటినరీ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య ఆమె చేత ప్రమాణం చేయించారు. జయతో పాటు 28 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జయలలిత కేబినెట్: * జయలలిత (ముఖ్యమంత్రి): ప్రజావ్యవహారాలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, సాధారణ పాలన, జిల్లా రెవిన్యూ అధికారులు, పోలీసు, హోం. 1. పనీర్‌సెల్వం : ఆర్థికశాఖ; వ్యక్తిగత, పాలనా సంస్కరణలు  2. దిండిగల్‌ శ్రీనివాసన్‌ : అటవీ శాఖ  3. ఎడప్పది కే పళనిస్వామి : జాతీయ రహదారులు, ప్రజా పనులు, చిన్న పోర్టులు  4. సెల్లుర్‌ కే రాజు : సహకార, కార్మిక శాఖ 5. తంగమణి : విద్యుత్తు, ఎక్సైజ్‌  6. వీపీ వేలుమణి : మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, గ్రామీణాభివృద్ధి, ప్రత్యేక పథకాల అమలు  7. కే జయకుమార్‌ : మత్స్య శాఖ  8. షణ్ముగం : న్యాయ శాఖ, కోర్టులు, జైళ్లు 9. కేపీ అంబజగన్‌ : ఉన్నత విద్య  10. డాక్టర్‌ వీ సరోజ : సంక్షేమం, పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం  11. కేసీ కరుప్పన్నన్‌ : పర్యావరణం  12. ఎంసీ సంపత్‌ : పరిశ్రమలు 13. ఆర్‌ కామరాజ్‌ : ఆహారం, పౌరసరఫరాలు, హెచ్‌ఆర్‌అండ్‌సీఈ  14. ఓఎస్‌ మణియన్‌ : చేనేత, టెక్స్‌టైల్స్‌  15. ఉడుమలై రాధాకృష్ణన్‌ : పట్టణాభివృద్ధి, హౌసింగ్‌  16. సీ విజయభాస్కర్‌ : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం 17. ఎస్‌పీ షణ్ముగనాథన్‌ : పాలు, డెయిరీల అభివృద్ధి  18. ఆర్‌ దొరైకన్ను : వ్యవసాయ, పశుసంరక్షణ  19. కదంబుర్‌ రాజు : సమాచారం, ప్రచారం  20. ఆర్‌బీ ఉదయ్‌కుమార్‌ : రెవెన్యూ 21. కేటీ రాజేంద్ర బాలాజీ : గ్రామీణ పరిశ్రమలు  22. కేసీ వీరమణి : వాణిజ్య పన్నులు  23. పీ బెంజమిన్‌ : పాఠశాల విద్య, క్రీడలు, యువజన సంక్షేమం  24. వెల్లమండి ఎన్‌ నటరాజన్‌ : పర్యాటకం  25. ఎస్‌ వలర్‌మతి : వెనకబడిన వర్గాలు, మైనార్టీల సంక్షేమం 26. వీఎం రాజలక్ష్మి : ఆదిద్రవిడార్‌, గిరిజన సంక్షేమం  27. డాక్టర్‌ ఎం మణికందన్‌ : ఐటీ  28. ఎంఆర్‌ విజయభాస్కర్‌ : రవాణా

వారానికి ఐదు రోజులే పనిదినాలు.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చే ఉద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారానికి ఐదు రోజుల పనిదినాలను కల్పించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇవాళ విడుదలయ్యాయి. హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలివచ్చే ఉద్యోగులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులందరినీ దశలవారీగా కాకుండా జూన్ 27వ తేదీ కల్లా అమరావతికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీరిని దశలవారీగా కాకుండా ఒకే విడతలో నూతన రాజధాని ప్రాంతానికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే దీనిపై వేగంగా చర్యలు తీసుకుంటోంది.

పునర్‌వినియోగ వాహక నౌక పరీక్ష విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌ నుంచి పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక ( ఆర్‌ఎల్వీ)ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం 7 గంటలకు ధ్వని కంటే ఐదు రెట్లు వేగంతో నింగిలో 70 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లిన రాకెట్ 11 నిమిషాల వ్యవధిలోనే బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్‌వేపై సురక్షితంగా దిగింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష ప్రయోగాల వ్యయం దాదాపు పదిరెట్లు తగ్గనుంది. ప్రస్తుతం ఉన్న సంప్రదాయ వాహకనౌకలకు ఆ సామర్ధ్యం లేకపోవడంతో అంతరిక్ష ప్రయోగ వ్యయం ఎక్కువవుతోంది.