మోడీ సమక్షంలో సీఎంగా ప్రమాణం చేసిన సోనోవాల్..

] అసోం ముఖ్యమంత్రిగా శర్వానంద సోనావాల్ ప్రమాణ స్వీకారం చేశారు. గౌహతిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పీబీ ఆచార్య సోనావాల్ చేత ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఆరుగురు బీజేపీ సభ్యులుకాగా, అసోం గణపరిషత్‌కు చెందిన ఇద్దరు, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీకి చెందిన ఇద్దరు ఉన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. 

జయలలిత ప్రమాణ స్వీకారం.. స్టాలిన్ సీటుపై వివాదం..

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.  ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీ డీఎంకే నేత ఎం.కే స్టాలిన్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయన వెనుక వరుసలో కూర్చోవడంపై వివాదాలు తలెత్తుతున్నాయి. దీంతో దీనిపై జయలలిత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. స్టాలిన్‌ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు అధికారులు ముందుగానే తనకు చెప్పి ఉంటే ప్రోటోకాల్‌ పక్కనపెట్టి ఆయనకు ముందు వరుసలో సీటు కేటాయించమని చెప్పేదానినని.. స్టాలిన్‌ శాసనసభ్యుల కోసం కేటాయించిన సీటులో కూర్చున్నారని ఆమె అన్నారు.  దీనిలో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. స్టాలిన్‌ పట్ల, వారి పార్టీ పట్ల తనకు ఎలాంటి అగౌరవం లేదని, రాష్ట్రాభివృద్ధికి వారితో కలిసి పని చేయాలనుకుంటున్నామని జయలలిత చెప్పారు. మరి దీనిపై డీఎంకే పార్టీ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.

దేశంలో అత్యాచారాలు పెరగడానికి గాంధీ కుటుంబమే కారణం.. బీజేపీ ఎమ్మెల్యే

  బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వివాదాస్పద విషయాల్లో ఇరుక్కోవడం కామన్. గతంలో జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థులు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే గ్యాన్ దేవ్ ఆహుజా ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ గాంధీ కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యాచారాలు పెరగడానికి నెహ్రూ, గాంధీ కుటుంబమే కారణమని.. వ్యాఖ్యానించారు. అన్ని రకాల సామాజిక సమస్యలకు నెహ్రూ కుటుంబమే కారణమని.. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ విగ్రహాలను ధ్వంసం చేసినట్లుగా.. మన దేశంలో నెహ్రూ, గాంధీలకు సంబంధించిన అన్ని విగ్రహాలను, ఇతర స్మారకాలను ధ్వంసం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరి దీనిపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

"శక్తిమాన్‌" జ్ఞాపకంగా..

కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్‌లో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించిన పోలీస్ గుర్రం శక్తిమాన్‌కు గుర్తుగా డెహ్రాడూన్‌లో ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని పోలీస్ లైన్స్‌ ప్రాంతంలో జూన్‌లో శక్తిమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ధ్యాన్‌ సింగ్ నేగి అనే శిల్పి శక్తిమాన్ విగ్రహాన్ని రూపొందించనున్నారు. శక్తిమాన్ 5 అడుగుల 8 అంగుళాల ఎత్తుండగా, ఆ విగ్రహాం 9 అడుగుల ఎత్తుంటుంది. ఇప్పటికే శక్తిమాన్ జ్ఞాపకర్థం పోలీస్ లైన్స్ వద్ద నిర్మాణంలో ఉన్న పెట్రోల్ పంప్‌కు శక్తిమాన్ పేరు పెట్టారు. శక్తిమాన్ జ్ఞాపకాలు ఎప్పుడూ తమ గుండెల్లో పదిలంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసు అధికారులు చెప్పారు.

ఎవరెస్ట్‌పై పాదం మోపిన నవ్యాంధ్ర తొలి మహిళ..

ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ను అధిరోహించడమంటే మామూలు విషయం కాదు. అందుకు ఎన్నో వ్యయ ప్రయాసల్ని ఎదుర్కొవాలి. వాటన్నింటిని తట్టుకుని ఒక తెలుగు వనిత ఎవరెస్ట్‌ను అధిరోహించింది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెనికి చెందిన నీలిమ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు చిన్ననాటి నుంచి సాహసాలంటే ప్రాణం. ఎప్పటికైనా ఎవరెస్ట్‌ ఎక్కడమే తన లక్ష్యమని సన్నిహితులతో చెప్పేది. దీనిలో భాగంగా ఎవరెస్ట్‌ అధిరోహించాలని గత ఏడాది ఏప్రిల్‌లో ప్రయత్నించింది. అయితే నేపాల్‌లో భూకంపం సంభవించడంతో వెనక్కి వచ్చేసింది. అయినా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా మళ్లీ తన ప్రయత్నాలను ప్రారంభించి మరోసారి ఎవరెస్ట్‌ అధిరోహించేందుకు వెళ్లి ఈ సారి విజయం సాధించింది. దీంతో నవ్యాంధ్రప్రదేశ్ నుంచి ఎవరెస్ట్‌ అధిరోహించిన తొలి మహిళగా ఆమె రికార్డుల్లోకి ఎక్కింది.

ల్యాప్‌టాప్‌లు షాక్ కొడతాయి..ప్రాణాలు తీస్తాయి..!

సెల్‌ఫోన్ పేలి పలువురు మృతిచెందిన వార్తలు వింటూ ఉంటాం. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి ల్యాప్‌టాప్‌లు వచ్చాయి. ల్యాప్‌టాప్‌పై వర్క్ చేస్తూ కరెంట్‌ షాక్‌కు గురై యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణ ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతానికి చెందిన బ్రిజేశ్ సింగ్ అనే యువకుడు తన ల్యాప్‌టాప్‌కు చార్జింగ్ పెట్టి మెయిల్స్ చూసుకుంటున్నాడు. ఈ సమయంలో కరెంట్ షాక్ తగలడంతో అతడు మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిది అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ల్యాప్‌టాప్‌ను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే బ్రిజేశ్‌కు కొద్ది రోజుల క్రితమే పెళ్లైంది. తల్లిదండ్రులు, భార్యతో కలిసి గోవిందపురిలో నివాసముంటున్నాడు.

రాజ్యసభ సీటిస్తే మాకేం ఇస్తారు.. ముఖం మీదే అడగనున్న చంద్రబాబు

  రాజ్యసభలో 57 మంది అభ్యర్దుల పదవికాలం పూర్తి కావడంతో సీట్లు ఖాళీ అవనున్న సంగతి తెలిసిందే. ఈ 57 మంది అభ్యర్దులలో నలుగురు అభ్యర్ధులు ఏపీ నుండి ఉండగా.. ఇద్దరు అభ్యర్ధులు తెలంగాణ నుండి ఉన్నారు. అయితే ఇప్పుడు ఏపీ నుండి నాలుగు స్థానాలకు ఎవరికి చోటు దక్కుతుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ టీడీపీ మిత్రపక్షం కాబట్టి.. ఇందులో ఒక స్థానం తమకు ఇవ్వాలని బీజేపీ టీడీపీని కోరనున్నట్టు తెలుస్తోంది. టీడీపీకి ఏపీ కోటా నుండి మూడు సీట్లు దక్కనున్న నేపథ్యంలో.. ఈసారి కూడా సుజనాకు ఎలాంటి ఇబ్బంది లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఏపీ కోటా నుండి నిర్మలాసీతారామన్ కు గతంలో టీడీపీ ఆమెను రాజ్యసభకు పంపింది. ఇక ఇప్పుడు కూడా ఆమెను ఏపీ నుండే రాజ్యసభకు పంపించాలని బీజేపీ చూస్తుంది.   అయితే ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు రెండు పార్టీల మధ్య అంత సఖ్యత లేదు. దీంతో ఈసారి రాజ్యసభ స్థానంపై బీజేపీని డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఇక దీనిపై అసోం సీఎంగా సర్బానంద సోనోవాల్ పదవీ ప్రమాణం చేయనున్న కార్యక్రమానికి వెళుతున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గువాహటిలో కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. అందుకే నిర్మలను తమ కోటా కింద రాజ్యసభకు పంపితే తమకేమిస్తారని ఆయన అమిత్ షా ను ముఖం మీదే అడిగేయాలని చూస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో.. చూడాలి.

కొత్త ఫీచర్లతో ముందుకొస్తున్న వాట్స్ యాప్..

స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వారికి వాట్స్ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే పలు అప్ డేట్స్ ముందుకొచ్చిన వాట్స్ యాప్ ఇప్పుడు మరిన్ని సరికొత్త మార్పులతో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. వాట్స్ యాప్ ద్వారా వచ్చిన కాల్స్ ను లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో  ఆటోమేటిక్ వాయిస్ మెయిల్ ను వారికి పంపే ఫీచర్ ను తీసుకురానున్నారు. ఇందులో పర్సనలైజ్ చేయబడ్డ వాయిస్ మెయిల్స్ ఉంటాయి. అంతేకాదు ఇప్పటివరకూ కొత్త కాంటాక్ట్ లతో చాట్ చేయాలంటే వారి నెంబరును సేవ్ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు సేవ్ చేసుకునే అవసరమూ తప్పిపోనుంది. ఇంకా గ్రూప్ చాట్ చేస్తున్నప్పుడు లేటెస్ట్ మెసేజ్ కి తీసుకెళ్లే బటన్ కూడా వాట్స్ యాప్ కు జత కానుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్లన్నీ పరీక్షా దశలో ఉండగా.. త్వరలో వచ్చే కొత్త వర్షన్ లో ఉంటాయని అధికారులు తెలుపుతున్నారు.

సునామీలు విరుచుకుపడినా.. "బంతి" కాపాడుతుంది

బంతి ఏంటి..? సునామీలు వస్తే కాపాడటమేంటి అనుకుంటున్నారా..సునామీలు, భూకంపాలు, హరికేన్‌ల వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు జరిగే ప్రాణనష్టం ఊహకందదు. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ప్రాణాల్ని కాపాడలేం. ఒక్కసారిగా విపత్తులు తలెత్తితే ఎక్కడ తలదాచుకోవాలో..ప్రాణాలు రక్షించుకోవడం ఎలాగో తెలియని పరిస్థితుల్లో ఒక బంతి మీ ప్రాణాలు కాపాడుతుంది.     2004లో వచ్చిన ఇండోనేషియా సునామీని ప్రేరణగా తీసుకుని బ్రిటన్‌కు చెందిన ఏరోనాటికల్ శాస్త్రవేత్త జూలియన్ షార్ప్ బృందం విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు వీలుగా బంతిలాంటి సాధానాన్ని రూపొందించింది. గోళాకారంలో ఉండే దీనిలోకి ప్రవేశించేందుకు ఒక మార్గం ఉంటుంది. బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వీలుగా గాజు అద్దాల కిటికీలుంటాయి. ఎంత నీరు చుట్టుముట్టినా ఇది తేలుతుంది. సునామీలు, భూకంపాలు, హరికేన్‌ల వంటి భయంకర ప్రకృతి విలయాల సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పట్టేలా వివిధ పరిమాణాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

సీబీఐ విచారణలో హరీశ్ రావత్.. స్టింగ్ ఆపరేషన్ పై ప్రశ్నల వర్షం..

  ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ కు మరో సమస్య వచ్చిపడింది. ఇప్పటికే కోర్టు పుణ్యమా బలపరీక్షలో నెగ్గి తిరిగి అధికారాన్ని చేపట్టిన హరీశ్ రావత్ ఇప్పుడు స్టింగ్ ఆపరేషన్లో అడ్డంగా బుక్కయిన కారణంగా సీబీఐ విచారణలో పాల్గొనాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుండి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీకి కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆపార్టీ నేతలతో మంతనాలు జరిపి స్టింగ్ ఆపరేషనల్లో అడ్డంగా బుక్కయ్యారు హరీశ్ రావత్. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ... విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు ఇటీవలే నోటీసులు జారీ చేసింది. దీనిలోభాగంగానే హరీశ్ రావత్ ఈరోజు సీబీఐ విచారణలో పాల్గొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై సీబీఐ అధికారులు హరీశ్ రావత్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది.

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..

  రాజ్యసభలో దాదాపు 57 మంది సభ్యుల పదవీకాలం ముగియడంతో సీట్లు ఖాళీ అవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ 57 మందిలో ఏపీ నుండి నలుగురు సభ్యులు, తెలంగాణ నుండి ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఖాళీ అయిన స్థానాల ఎన్నికల నోటీఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి జూన్ 3 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం వరకు కౌంటింగ్ కూడా పూర్తి కానుంది. కాగా తెలంగాణలో గుండు సుధారాణి (టీడీపీ), వి.హన్మంతరావు (కాంగ్రెస్) పదవి కాలం పూర్తి కాగా.. ఏపీలో నిర్మలా సీతారామన్ (బీజేపీ), జేడీ శీలం (కాంగ్రెస్), సుజనా చౌదరి, సీఎం రమేశ్ (టీడీపీ)ల పదవీ కాలం ముగియనుంది.

పార్టీ ఫిరాయించే నేతలపై పయ్యావుల కామెంట్లు.. ప్రొద్దుతిరుగుడు పువ్వులాంటివారు

పార్టీ ఫిరాయించే నేతలపై టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలో జరిగిన మినీ మహానాడు సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం కొంతమంది నేతలు పార్టీలు మారుతుంటారు.. వారు ప్రొద్దు తిరుగుడు పవ్వులాంటివారు.. సూర్యుడు ఎటు తిరిగితే పువ్వు అటు తిరిగినట్టు.. వారు కూడా అధికారం ఎటు ఉంటే అటు వెళుతుంటారు.. అలాంటి వారి పట్ల పార్టీ పెద్దలు అప్రమత్తంగా ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. అలాంటి నాయకులతో టీడీపీకి కూడా ఇబ్బందులు రావొచ్చని ఆయన అన్నారు. అయితే ఇదే సభలో ఇటీవలే వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి చేరిన కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా కూడా పాల్గొన్నారు. దీంతో పయ్యావుల చేసిన వ్యాఖ్యలకు ఆయన సమావేశం ముగియక ముందే అక్కడి నుండి వెళ్లిపోయారు.  

మారిన తత్కాల్ టికెట్ నిబంధనలు.. ఇకపై రిఫండ్

  తత్కాల్ టికెట్ల పద్ధతిపై భారతీయ రైల్వే శాఖ కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అయితే తత్కాల్ టికెట్ బుక్ చేసుకొని.. క్యాన్సిల్ చేసుకుంటే ఎటువంటి రిఫడ్ వచ్చేది కాదు. అయితే ఇప్పుడు మారిన నిబంధనల ప్రకారం.. తత్కాల్ పద్దతి ద్వారా టికెట్ బుక్ చేసుకొని.. క్యాన్సిల్ చేసుకుంటే సగం మొత్తాన్ని చెల్లించనున్నారు. అంతేకాదు తత్కాల్ బుకింగ్ సమయం కూడా అధికారులు మార్చారు. ఏసీ కోచ్ లకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, స్లీపర్ కోచ్ ల్లో బెర్తుల కోసం 11 నుంచి 12 గంటల వరకూ కౌంటర్లు ప్రత్యేకంగా పనిచేస్తాయి. ఇంకా మారిన నిబంధనలు గమనిస్తే..   * రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో మొబైల్ టికెట్లను మాత్రమే అనుమతిస్తారు. * రైళ్లలో వెయిటింగ్ లిస్టులోని వారికి, తదుపరి అదే రూట్లో వచ్చే రైళ్లలో ఖాళీలను బట్టి బెర్తుల కేటాయింపు. * బెర్తు కేటాయించిన తరువాత చార్జీల తేడాలున్నా రిఫండ్ రాదు, అదనపు చార్జీలూ ఉండవు. * గమ్యస్థానం వచ్చే సమయానికి ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు వేకప్ కాల్ సదుపాయం.

అమ్మకు ప్రేమతో.. ఒక్క రూపాయికే ఆటో సర్వీసు

  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అమ్మా ప్రమాణ స్వీకారం సందర్బంగా ఓ ఆటో డ్రైవర్ చాలా కేవలం ఒక్క రూపాయికే తన ఆటో సేవలు అందించాడు. వివరాల ప్రకారం.. 45ఏళ్ల మాథివనమ్ గత 25 ఏళ్లుగా ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈయనకు అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ అంటే ఎంతో అభిమానం. ఈ కారణంతోనే అన్నాడీఎంకే ఎప్పుడు ఎన్నికల్లో గెలిచినా..తన అభిమానాన్ని ఏదో ఒక రూపంలో చూపిస్తూనే ఉంటాడు. అలాగే ఈసారి కూడా తన అభిమానాన్ని చాటుకున్నాడు. జయలలిత ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒక్క‌రూపాయికే ప్ర‌యాణికుల‌కు సేవ‌లందించాడు.

వెరైటీగా పగ తీర్చుకున్న కాంగ్రెస్.. మరుగుదొడ్డికి రిషికపూర్ పేరు

  దేశంలోని పలు కట్టడాలకు, రోడ్లకు, పలు ప్రాంతాలకు గాంధీ పేర్లు పెట్టడంపై రిషి కపూర్ కాంగ్రెస్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గాంధీ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ 'మీ అబ్బ సొత్తా' అని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ కార్యకర్తలు వెరైటీగా తమ పగను తీర్చుకున్నారు. దీనిలో భాగంగానే ఓ మరుగుదొడ్డికి రిషికపూర్ పేరు పెట్టారు. యూపీలోని అలహాబాద్ లో శివాజీ పార్క్ ఏరియాలో సులభ్ టాయిలెట్ ను నిర్మించగా దానికి రిషికపూర్ పేరును పెట్టారు. మరి దీనికి రిషి కపూర్ ఎలా స్పందిస్తారో చూడాలి.