హేట్సాఫ్ టూ ఎన్ఐఏ..పేలుళ్ళ కుట్ర ఎలా తెలిసింది..?

  హైదరాబాద్‌లో వీకెండ్‌కు భారీ విధ్వంసానికి స్కెచ్ గీసిన ఇస్లామిక్ ఉగ్రవాదుల కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. దేశాన్ని పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కించిన ఎన్‌ఐఏపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలు హైదరాబాద్ లో పేలుళ్లకు ఉగ్రవాద సానుభూతిపరులు కుట్ర పన్నారని ఢిల్లీ లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎలా పసి గట్టింది..? భాగ్యనగరంలోని చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మీ ఆలయంతో సహా వివిధ దేవాలయాలు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ ను పేల్చి వేయాలని వారు పథకం వేసినట్టు ఎలా తెలుసుకుంది. దీని వెనుక ఎన్ఐఏ రెండేళ్ల కష్టం ఉంది.   ఐసిస్ గ్రూప్ మీద, దేశంలో ఉగ్రవాద సానుభూతిపరుల మీద నిఘా పెట్టింది. స్లీపర్‌సెల్స్ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు..ఏం చేస్తున్నారు..ఎవరెవరిని కలుస్తున్నారు వంటి వాటిపై ఆరా తీస్తూ వచ్చింది ఎన్ఐఏ. వీరికి సిరియాలోని ఐసిస్‌తో లింకులున్నట్లు 2014లోనే ట్రేస్ చేశారు. ఉగ్రవాద సానుభూతిపరులపై గత నెల 22నే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.  ఒకేసారి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించేందుకు కోర్టు నుంచి అనుమతి పొందింది.. ఓల్డ్‌సిటిలో సోదాలు జరిపి 11 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఐదుగురిని తప్ప మిగిలిన వారిని విడుదల చేసింది. అలా ఉగ్రవాదుల ఎత్తులను చిత్తు చేసింది.

ఫ్రీజ్‌లో ఏం పెట్టోద్దు..పెట్టినా తినోద్దు

  మార్కెట్ నుంచి ఫ్రెష్‌గా తీసుకువచ్చే కూరగాయలు, పండ్లు లాంటి వాటిని పాడైపోతాయని ఫ్రీజ్‌లో పెట్టడం డైలీ అందరూ చేసే పనే. అలా పెట్టిన వాటిని మనకి అవసరమైనప్పుడు వాడుకుంటాం. అలాంటి వారందరికి షాకిచ్చారు నిపుణులు. రోజుల తరబడి ఫ్రిజ్ లో ఉన్న ఆహారాన్ని తినడం అంత మంచిది కాదని చెబుతున్నారు. ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచే ఆహార పదార్థాలతో శీతల ఉష్ణోగ్రత రసాయనిక చర్య జరుపుతుందని... ఈ పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముందని ఫుడ్ స్టాండర్స్ ఏజెన్సీ చెబుతోంది. ముఖ్యంగా మిల్క్ ప్యాకెట్స్ ను ఫ్రిజ్‌లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదంటోంది. సో..బీ కేర్ ఫుల్.

మందెక్కువైంది.. బట్టలు విప్పేశారు

  తాగినోడు లోకాన్ని మరిచిపోతాడని అందరూ అంటుంటే ఎంటో అనుకున్నాం. నిన్న రాత్రి మన హైదరాబాద్‌లో జరిగిన ఘటనను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఇద్దరు ఆకతాయిలు పీకల దాకా తాగారు. తాగితే జనానికి వచ్చిన నష్టమేమి లేదు..కాని తాగిన మత్తులో మనోళ్లు మనుషులమని..జనం మధ్య బతుకుతున్నామని మరచిపోయారు. అంతే ఒంటిపై బట్టలులేకుండా అర్ధరాత్రి రోడ్డుపై చిందులేశారు. ఇది చూసినోళ్లంతా ఇదేంటని ప్రశ్నించారు..మత్తులో ఉన్నోళ్లకి ఆ మాటలేం వినిపిస్తాయి. ఎంత చెప్పినా వినకపోయేసరికి పోలీసులకు ఫోన్ చేశారు. వారొచ్చి ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

15 ఏళ్ల బాలికపై అత్యాచారం..వీడియో వాట్సాప్‌లో

దేశ అత్యాచారాల రాజధాని ఉత్తరప్రదేశ్‌లో ఆడవారిపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఆగ్రాలో మరో దారుణం జరిగింది. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన స్కూల్ డైరెక్టరే కామాంధుడిగా మారాడు. జితేందర్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఓ 15 ఏళ్ల బాలికను తాను చెప్పినట్టు వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి లోబర్చుకున్నాడు. ఆమె బతిమాలినా వినకుండా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఆ కామాంధుడికి తృప్తి కలగలేదు..ఆమెతో గడిపిన వీడియోను వాట్సాప్‌‌లో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాడు. దాదాపు సంవత్సరం నుంచి తనను బలవంతంగా అనుభవిస్తున్నాడని..తాను చెప్పినట్లు రాకపోతే వీడియోను నెట్‌లో పెడతానని బెదిరించేవాడని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఆ కామాంధుడి వలలో 20 మందికి పైగా అమ్మాయిలు చిక్కుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ దుర్మార్గుడు పరారీలో ఉన్నాడు.

మహిళ ప్రాణం తీసిన సిద్దూ కాన్వాయ్

  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ వివాదాలు చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక సన్మాన సభలో మహిళ పబ్లిక్‌గా సిద్దూకి కిస్ ఇచ్చిన ఘటనను మరవకముందే మరో వివాదం సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంది. జూన్‌ 25న హోస్కొటే సమీపంలో సిఎం కాన్వాయ్ కు లైన్ క్లియర్ చేసేందుకు చిక్కబల్లాపూర్‌-చింతామణి హైవేపై ట్రాఫిక్‌ను దాదాపు 25 నిమిషాల పాటు నిలిపివేశారు. ఈ ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్‌ కూడా ఉంది. ట్రాఫిక్ ఎంతకు క్లియర్ కాకపోవడంతో తన తల్లి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉందని.. అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని ఓ వ్యక్తితో పాటు, మిగతా వాహనదారులు కోరినా పోలీసులు కనికరించలేదు. సీఎం కాన్వాయ్‌ వెళ్లిన తర్వాతే ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. అంబులెన్స్ ఆసుపత్రికి చేరుకునేసరికి ఆలస్యమైపోయింది..మహిళను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్టు ధ్రువీకరించారు.

సమస్యల సుడిగుండంలో జగన్‌కు కొత్త టెన్షన్

  ఆంధ్రప్రదేశ్‌లో అధికారపార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తల్లడిల్లిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఒకదశలో రాజ్యసభ సీటు వస్తుందో రాదోనన్న బెంగ పట్టుకుంది. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాజ్యసభ సీటు దక్కించుకుని ఊపిరిపీల్చుకుంది వైసీపీ. జంపింగ్‌లు ఆగిపోయాయి అనుకుంటూ ఉపశమనం పొందుతోన్న ఈ తరుణంలో జగన్‌కు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు అధికార టిడిపిలోకి వెళ్లిపోగా, మళ్లీ ఫిరాయింపులు షురూ కానున్నాయంటూ వైసీపీ నిఘావర్గాలు అధినేతకు సమాచారం అందించాయి. ఇప్పటికే ఈడీ అటాచ్‌మెంట్‌తో ఏం చేయాలో తోచక కిందా మీదా పడుతున్న జగన్‌కు ఈ వార్త కొత్త టెన్షన్‌ను తీసుకొచ్చింది.

జనగామలో ప్రత్యేక జిల్లా ఉద్యమం హింసాత్మకం

వరంగల్ జిల్లా జనగామ కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు ఇవాళ ఆందోళనలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిరసనకారులు హైదరాబాద్-వరంగల్ రహదారిపై భైఠాయించి నినాదాలు చేశారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లురువ్వారు. ఈ ఘటనలో మూడు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. రహదారిపై ఆగివున్న జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారుల్ని చెదరగొట్టారు.  

మోడీ బేటీ బచావో అంటూంటే..బీజేపీ నేతలు ఏం చేస్తున్నారో

ఓ వైపు మోడీ బేటీ బ‌చావో..బేటీ ప‌డావో మంత్రాన్ని జ‌పిస్తుండ‌గా బీజేపీ నేత‌లు మైన‌ర్ బాలిక‌ల‌ జీవితాలతో ఆడుకుంటున్నారు. జార్ఖండ్ బిజెపి అధ్యక్షుడు టలా మరాండీ కుమారుడు 11 ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకోవడం అక్కడ సంచలనం కలిగించింది. 18 ఏళ్ళ వయస్సువాడైన మున్నా మరాండీ గొడ్డా ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను జూన్ 27న బాల్య వివాహం చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం ఆరో తరగతి చదువుతోంది. ఈ వివాహం జరగడానికి ముందు..పెండ్లి చేసుకుంటానని చెప్పి మరో మైనర్‌పై రెండేళ్లుగా లైంగికదాడికి దిగారని ఆరోపణలు వచ్చిన మూడు రోజులకే మున్నా మరో మైనర్‌ బాలికను పెళ్లి చేసుకోవడం జార్ఖండ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. బుధవారం నాడు జరిగిన రిసెప్షెన్‌కు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ హాజరుకావలసి ఉంది. చట్టవ్యతిరేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి తాను వెళితే అమ్మో..! ఇంకేమైనా ఉందా అనుకున్న సీఎం చివరి నిమిషంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

కష్టాలు తీరతాయా: జ్యోతిష్యులను అడిగిన జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డికి రేపు ఏమౌవుతుందోనన్న భయం పట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్, ఎమ్మెల్యేల ఫిరాయింపులు, జనం నుంచి ఆదరణ కరువు ఇలా వరుస సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. ఈ టెన్షన్‌ల నుంచి కాస్త రిలీఫ్ అవుదామని ఫ్యామిలీతో ఫారిన్ టూర్ వెళ్లి వచ్చిన జగన్‌కు వచ్చి రాగానే ఈడీ తనదైన స్టైల్లో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది. జగన్‌కు చెందిన దాదాపు రూ.750 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. దీంతో జగన్‌కు భయం పట్టుకుంది. ఈ కష్టాలు తీరతాయా.? లేదంటే మరింత ఎక్కువవుతాయా..? అన్నది తెలుసుకోవడానికి ఆయన జ్యోతిష్యులను సంప్రదించారట. తన పర్యటన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి ప్రముఖ జ్యోతిష్యులను పిలిపించుకుని మాట్లాడినట్లు సమాచారం. అలాగే న్యాయసలహాదాలరులతోనూ..మరి కొంతమంది మత పెద్దలతోనూ జగన్ భేటీ అయినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

తన ప్రేయసిని రేప్ చేశాడని..స్నేహితుడని కూడా చూడకుండా

తన ప్రేయసిని రేప్ చేశాడని స్నేహితుడని కూడా చూడకుండా అతని తల నరికాడు ఒక వ్యక్తి. అమెరికాకు చెందిన థార్సెన్ అనే వ్యక్తికి హైమన్ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. స్వల్పకాలంలోనే వారిద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. థార్సెన్‌కు ఒక గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉంది. ఒక రోజు థార్సెన్ గర్ల్‌ఫ్రెండ్ వద్దకు వెళ్లిన హైమన్ ఆమెపై అత్యాచారం చేశాడు.   తనపై జరిగిన దారుణాన్ని ఆమె థార్సెన్‌కు చెప్పింది. వీరు ముగ్గురు డ్రగ్స్‌కు కట్టుబానిసలు. అలా ఒకరోజు ఫుల్లుగా డ్రగ్స్ సేవించి కారులో వెళుతున్నారు. కారు చెకింగ్ కోసమని హైమన్ కిందకు దిగడంతో వెనుక నుంచి థార్సెన్ బేస్ బాల్ బ్యాట్ తో బలంగా కొట్టాడు. అనంతరం కత్తితో అతడిని పొడిచి తల నరికేసి అడవిలో విసిరేశాడు. తర్వాత ఏం తెలియనట్టు తన పని చూసుకున్నాడు. అడవుల్లో తల.. ఒక కారులో తల లేని మొండి లభించడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించారు. పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులను సినిమా స్టైల్లో వెంటాడి థార్సెన్‌ను అతడి గర్ల్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

బంగ్లాలో హిందూవులపై ఆగని దాడులు..మరో పూజారి హత్య

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు ఏ మాత్రం ఆగకపోగా..మరింత ఎక్కువవుతున్నాయి. హిందూవులతో పాటు క్రిస్టియన్ పౌరులు, మైనార్టీకి చెందిన ప్రోఫెసర్లను అతి కిరాతకంగా చంపేస్తున్నారు. తాజాగా ఓ హిందూ పూజారిని దారుణంగా హత్య చేశారు. జెనైదా ప్రాంతంలో శ్యామనందో దాస్ అనే హిందూ పూజారి దేవతార్ఛన కోసం పూలు కోస్తుండగా..ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి..కత్తులతో విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో దాస్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. జెనైదా జిల్లాలో గత జూన్ 7న కూడా ఓ హిందూ పూజారి హత్యకు గురయ్యాడు. 

ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంపై దాడికి ఐఎస్ స్కెచ్

హైదరాబాద్ పాతబస్తీలోని హిందూ-ముస్లిం సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంపై ఇస్లామిక్ స్టేట్ లక్ష్యంగ చేసుకున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. పాతబస్తీలో నిన్న అదుపులోకి తీసుకున్న 11 మంది ఐసిస్ సానుభూతిపరులను విచారించిన ఎన్ఐఏ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని పేల్చేయాలని ఐసిస్ లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిత ఉగ్రవాదులు వెల్లడించినట్లు ఎన్ఐఏ తెలిపింది. దాంతో పాటు శక్తివంతమైన బాంబులతో పోలీస్ స్టేషన్‌ పైకి దాడికి కుట్ర పన్నినట్లు వారు తెలిపారు. నిన్న అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఆరుగురిని విడిచిపెట్టిన ఎన్‌ఐఏ..మిగిలిన ఐదుగురి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. దర్యాప్తు నిమిత్తం వీరిని కస్టడీలోకి తీసుకునేందుకు ఎన్ఐఏ సన్నాహలు చేస్తోంది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్

టర్కీలోని అటాటర్క్ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌పై దాడి..అనంతరం హైదరాబాద్‌లో ఐఎస్ సానుభూతిపరులు పట్టుబడటంతో జంట నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ, ఐబీ, ఎన్ఐఏ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాల మేరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. విజిటర్ల ప్రవేశంపై అంక్షలు విధించారు. డొమెస్టిక్, ఇంటర్నేషన్ ప్రయాణికులు ప్రయాణ సమయానికి ముందుగానే విమానాశ్రయానికి చేరుకుని తనిఖీల, ఇతర భద్రతాపరమైన అంశాలలో సహకరించాలని ఎయిర్‌పోర్ట్ భద్రతా విభాగం ప్రకటించింది. త్వరలో రంజాన్, బోనాలు ఇతర పండుగలు ఉన్నందున ఎయిర్‌పోర్ట్‌తో పాటు పరిసరాలలో భద్రతను పటిష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి, కాచిగూడ తదితర ప్రాంతాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్, బెంగుళూరుల్లో బ్రస్సెల్స్ తరహా దాడులు..

హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ముష్కరులను నిన్న ఎన్‌ఐఏ అరెస్ట్ చేయడంతో దేశం ఉలిక్కిపడింది. వీరిని అదుపులోకి తీసుకుని విచారించిన ఎన్ఐఏ అధికారులు దిగ్భ్రాంతికరమైన విషయాలు సేకరించారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ "అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్" కు చెందిన ఉగ్రవాదులు హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు నగరాల్లో విధ్వంసం చేసేందుకు కుట్రపన్నినట్లు తెలిసింది. వీరికి విదేశాల నుంచి భారీగా హవాలా మార్గంలో డబ్బులు అందినట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఆ డబ్బుతో పెద్ద ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసినట్లు తెలిపింది. క్రూడ్ బాంబులను తయారు చేయడంలో వీళ్లు సిద్ధహస్తులని తెలిపింది. గత నెలలో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌ తరహా దాడులు చేయాలన్నది వీరి ప్రధాన లక్ష్యమని ఎన్ఐఏ వెల్లడించింది. అంతేకాకుండా వీరు తయారు చేసే బాంబులను బ్యాగేజి స్కానర్ల సాయంతో సైతం గుర్తించలేమని నిపుణులు చెబుతున్నారు.

విశాఖ మహిళా టెక్కీ..హైదరాబాద్‌లో ఆత్మహత్య,వరకట్న వేధింపులే కారణమా..?

విశాఖపట్నానికి చెందిన మహిళా టెక్కీ హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. సనత్‌నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భానుతేజతో విశాఖకు చెందిన హరికీర్తనకు మూడు నెలల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి సనత్‌నగర్‌లోని అత్తవారింట్లో ఉంటోన్న కీర్తన నిన్న రాత్రి ఇంటిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హరికీర్తన మరణవార్తను తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసేవారని అందువల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు భానుతేజ, అతడి తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఒడిశా తీరంలో క్షిపణి పరీక్ష..

భూ ఉపరితలం నుంచి గగనతంలోని లక్ష్యాలను చేధించగల క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. రక్షణ సహకారంలో భాగంగా భారత్-ఇజ్రాయెల్ సంయుక్తంగా దీనిని తయారు చేశాయి. ఈ మిస్సైల్‌ను ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగా కేంద్రం నుంచి పరీక్షించారు. ఉదయం 8.15 నిమిషాలకు ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించినట్టు డీఆర్‌డీవో అధికారులు తెలిపారు.  మిగిలిన సాంకేతిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో సైన్యం అమ్ములపోదిలోకి  చేరుస్తామని వారు వెల్లడించారు. మిస్సైల్ ప్రయోగ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యాకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

టర్కీ నరమేధంలో 41 మంది బలి

టర్కీలోనే కాక యూరప్‌లోనే అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయమైన ఇస్తాంబుల్ అటాటర్క్ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి ముష్కరులు సృష్టించిన నరమేధంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ఆత్మహుతి దళ సభ్యులు రాత్రి పదిగంటల సమయంలో ట్యాక్సీలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని విధ్వంసం సృష్టించారు. ఒక ఉగ్రవాది టెర్మినల్ వెలుపల పేల్చేసుకోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు. వారితో పాటుగా పరిగెత్తిన మరో ఉగ్రవాది జనంలో తనను తాను పేల్చేసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక మూడో ఉగ్రవాది ఇంటర్నేషనల్ ఎరైవల్ ప్రాంతంలో పేల్చేసుకున్నట్లు తెలిపింది. ముష్కరుల దాడులతో పరుగులు తీసిన ప్రయాణికులు విమానాశ్రయం వెలుపల భయం భయంగా కాలం గడిపారు. దాడి జరిగిన వెంటనే విమానాశ్రయాన్ని మూసివేసి అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇక్కడికి చేరుకోవాల్సిన విమానాలను దారి మళ్లించారు. ఈ దాడికి పాల్పడింది ఇస్లామిక్ ఉగ్రవాదులేనని ప్రధాని బినాలి యిల్దిరిమ్ పేర్కొన్నారు. అటు ప్రపంచ దేశాధినేతలు ఈ దాడిని ఖండించారు.