టర్కీ నరమేధంలో 41 మంది బలి
posted on Jun 30, 2016 @ 11:12AM
టర్కీలోనే కాక యూరప్‌లోనే అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయమైన ఇస్తాంబుల్ అటాటర్క్ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి ముష్కరులు సృష్టించిన నరమేధంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ఆత్మహుతి దళ సభ్యులు రాత్రి పదిగంటల సమయంలో ట్యాక్సీలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని విధ్వంసం సృష్టించారు. ఒక ఉగ్రవాది టెర్మినల్ వెలుపల పేల్చేసుకోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు. వారితో పాటుగా పరిగెత్తిన మరో ఉగ్రవాది జనంలో తనను తాను పేల్చేసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక మూడో ఉగ్రవాది ఇంటర్నేషనల్ ఎరైవల్ ప్రాంతంలో పేల్చేసుకున్నట్లు తెలిపింది. ముష్కరుల దాడులతో పరుగులు తీసిన ప్రయాణికులు విమానాశ్రయం వెలుపల భయం భయంగా కాలం గడిపారు. దాడి జరిగిన వెంటనే విమానాశ్రయాన్ని మూసివేసి అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇక్కడికి చేరుకోవాల్సిన విమానాలను దారి మళ్లించారు. ఈ దాడికి పాల్పడింది ఇస్లామిక్ ఉగ్రవాదులేనని ప్రధాని బినాలి యిల్దిరిమ్ పేర్కొన్నారు. అటు ప్రపంచ దేశాధినేతలు ఈ దాడిని ఖండించారు.