హైదరాబాద్, బెంగుళూరుల్లో బ్రస్సెల్స్ తరహా దాడులు..
posted on Jun 30, 2016 @ 12:24PM
హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ముష్కరులను నిన్న ఎన్‌ఐఏ అరెస్ట్ చేయడంతో దేశం ఉలిక్కిపడింది. వీరిని అదుపులోకి తీసుకుని విచారించిన ఎన్ఐఏ అధికారులు దిగ్భ్రాంతికరమైన విషయాలు సేకరించారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ "అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్" కు చెందిన ఉగ్రవాదులు హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు నగరాల్లో విధ్వంసం చేసేందుకు కుట్రపన్నినట్లు తెలిసింది. వీరికి విదేశాల నుంచి భారీగా హవాలా మార్గంలో డబ్బులు అందినట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఆ డబ్బుతో పెద్ద ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసినట్లు తెలిపింది. క్రూడ్ బాంబులను తయారు చేయడంలో వీళ్లు సిద్ధహస్తులని తెలిపింది. గత నెలలో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ తరహా దాడులు చేయాలన్నది వీరి ప్రధాన లక్ష్యమని ఎన్ఐఏ వెల్లడించింది. అంతేకాకుండా వీరు తయారు చేసే బాంబులను బ్యాగేజి స్కానర్ల సాయంతో సైతం గుర్తించలేమని నిపుణులు చెబుతున్నారు.