తెలంగాణలో మళ్లీ బీఆరెస్సేనా? టైమ్స్ నౌ సర్వే ఏం చెబుతోంది?
posted on Aug 17, 2023 @ 1:44PM
ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గత తొమ్మిదేళ్లుగా ఎకఛత్రాధిపత్యంగా కొనసాగారు. మరో సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. అయితే బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర మైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమౌతోందన్న పరిశీలకుల విశ్లేషణ.
పార్టీలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి, అదే సమయంలో కాంగ్రెస్ గట్టిగా పుంజుకోవడం.. ఇక అధికారమే తరువాయి అన్నట్లుగా ఆ పార్టీలో గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఐక్యత..ఇవన్నీ వెరసి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాకుండా బీఆర్ఎస్ శ్రేణుల నుంచే వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా వెలువడిన ఓ సర్వే.. బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ అది.. ప్రభుత్వాన్నికూలదోసే స్థాయిలో లేదని పేర్కొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమైనప్పటికీ.. అది బీజేపీ స్థాయిని గణనీయంగా తగ్గించగలిగిందే కానీ.. బీఆర్ఎస్ ను అధిగమించే స్థాయికి చేరుకోలేకపోయిందని సర్వే పేర్కొంది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ మరో సారి అధికారం చేపట్టడం ఖాయమని టైమ్స్ నౌ వెల్లడించింది.
అధికార బీఆరెస్స్ కు 38.4 శాతం మంది ప్రజల మద్దతు ఉందని.. ఆ తరువాత కాంగ్రెస్ కు 29.9 శాతం, బీజేపీకి 24.3 శాతం,ఇతరులకు 7.4 శాతం ప్రజా మద్దతు ఉందని టైమ్స్ నౌ సర్వే పేర్కొంది. అంటే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలంగాణలో మెజార్టీ ప్రజలు బీఆరెస్స్ కు మద్దతుగా నిలుస్తారని సర్వే వెల్లడించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హోరా హోరీ పోరు తప్పదన్న అంచనాల నేపథ్యంలో వెలువడిన టైమ్స్ నౌ సర్వే కాంగ్రెస్ తెలంగాణలో బలంగా పుంజుకుందనీ, అయితే అధికారం చేజిక్కించుకునేందుకు ఆ బలం సరిపోదనీ పేర్కొంది. అయితే.. రానున్న రోజులలో ప్రజా వ్యతిరేకత మరింత పేరిగే అవకాశాలు కనిపిస్తున్నాయనీ, ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక, అసమ్మతి, అసంతృప్తి వంటికి ఈ సారి కంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం చేకూర్చే అవకాశాలున్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.