వైసీపీలో మ్యుజికల్ చైర్స్
posted on Aug 26, 2023 @ 2:04PM
ఏపీలో అధికార పార్టీ వైసీపీ పనైపోయిందన్న చర్చ గత కొంత కాలంగా రాజకీయ వర్గాలలో తీవ్రంగా జరుగుతోంది. ఇప్పటికే పలు సర్వేలలో వైసీపీకి ఈసారి ఘోర పరాజయం తప్పదనే విషయం బయటపడగా.. ప్రజలలో తీవ్రంగా కనిపిస్తున్న అసంతృప్తితో పలువురు పరిశీలకులు కూడా ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టేశారు. మాకు తిరుగే లేదని.. మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని మరోసారి అందలం ఎక్కిస్తాయని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం తెగ మధనపడిపోతున్నారు. అంతేకాదు, ప్రజలలో అసంతృప్తిని దారి మళ్లించి మాఫీ అయ్యేలా చేసుకొనేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని నేతల మీదకి మళ్లించి.. ఆయా స్థానాలలో కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
తాజాగా మూడ్ అఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టు డే ఓ సర్వే నిర్వహించింది. అయితే, ఈ సర్వేలో వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఏపీలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వే తేల్చింది. ఈ 15 ఎంపీ సీట్లను కూడా టీడీపీ ఒంటరిగానే సాధించేస్తుందని చెప్పడం మరో విశేషం. అదే సమయంలో వైసీపీ 3-4 సీట్లకే పరిమితమవుతుందని చెప్పగా.. మిగిలిన సీట్లలో హోరా హోరీ పోటీ ఉంటుందని.. రాజకీయ సమీకణాలను బట్టి ఆయా స్థానాలలో ఫలితాలు ఉండనున్నాయని వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపాటు మొదలైంది. ఇన్నాళ్ళూ పెయిడ్ సర్వేలతో ఏపీ ప్రజలను తప్పుదారి పట్టించాలని చూసిన వైసీపీ అండ్ కో కు ఇండియా టుడే సర్వేతో కాళ్ళ కింద భూమి కదిలినట్లైంది.
దీంతో నష్ట నివారణ చర్యలపై దృష్టిపెట్టింది. వైసీపీ ప్రజలలో అసంతృప్తి ఎక్కువగా ఉన్న ఎంపీలను పోటీ నుండి తప్పించేసే పని మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది. మరోవైపు వివిధ నియోజకవర్గాల్లో గ్రాఫ్ మెరుగుపడని ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దించడం ద్వారా కొంత వ్యతిరేకతను తగ్గించుకోవచ్చని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానాల మార్పులో భాగంగా శ్రీకాకుళం ఎంపీగా ధర్మాన సోదరుల్లో ఒకరిని, లేదంటే స్పీకర్ తమ్మినేనిని రంగంలోకి దింపనున్నారట. తనయుడికి ఎమ్మెల్యే సీటు ఇస్తే తమ్మినేని ఎంపీగా పోటీకి వెళ్లడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఇక అనకాపల్లి ఎంపీ సత్యవతిని అసెంబ్లీకి పంపి మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అవంతి శ్రీనివాస్ లలో ఒకరిని ఎంపీగా పోటీ చేయించనున్నారట. అలాగే కాకినాడ ఎంపీ వంగవీటి గీతను తప్పించి మాజీమంత్రి కురసాల కన్నబాబు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇక, అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని పోటీ నుండి తప్పించి ఇక్కడ కూడా ఎవరొకరు ఎమ్మెల్యేను దింపనున్నట్లు తెలుస్తుంది. అమలాపురం ఎంపీగా మంత్రి విశ్వరూప్ పోటీ చేయనుండగా.. బదులుగా ఆయన తనయుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కాగా, రామచంద్రాపురంలో మంత్రి వేణు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసు మధ్య పంచాయితీ తెలిసిందే. దీనికి పరిష్కారంగా వేణును రాజమండ్రి ఎంపీగా బరిలోకి దింపే అవకాశాలున్నాయి. ఇక నరసాపురం ఎంపీగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీగా మాజీమంత్రి ఆళ్ల నాని, లేదా ప్రముఖ పారిశ్రామికవేత్త అరసవెల్లి అరవింద్, నరసరావుపేట నుండి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును పొన్నూరు ఎమ్మెల్యేగా సీటు ఇచ్చి.. ఇక్కడ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఎంపీగా పోటీకి దించనున్నట్లు తెలుస్తుంది.
ఇక రాయలసీమ విషయానికి వస్తే.. గూడూరు ఎంపీగా ఉన్న డాక్టర్ మద్దిల గురుమూర్తిని గూడూరు అసెంబ్లీకి పంపి.. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ ను తిరుపతి ఎంపీగా పోటీ చేయించనున్నారట. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను ఈసారి ఎన్నికల నుండి తప్పించనుండగా.. ఈ స్థానంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ను ఎంపీగా పోటీ చేయిన్చానున్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ వైసీపీ అధిష్టానం ప్రణాళిక కాగా.. ఇందులో ఎంతమంది ఎమ్మెల్యేలు పార్లమెంటుకు వెళ్లేందుకు ఇష్టపడతారన్నది చూడాల్సి ఉంది.