అప్పూ లేదు.. అప్పాయింట్ మెంటూ లేదు.. హస్తినలో జగన్ పరువు గంగపాలు!
posted on Aug 26, 2023 5:25AM
అప్పు అప్పు.. ఏపీ ప్రభుత్వానికి తెల్లారి లేచిన దగ్గర నుంచీ ఇదే యావ. ఏదైనా చేయండి ఈ నెల అప్పు దొరికేలా చూడండి. కేంద్రం అడిగినవన్నీ చేద్దాం కొత్త అప్పుకు అనుమతి వచ్చేలా చేయండి. మీరు ఎవరినైనా కలవండి.. అప్పు దొరకకుండా రాష్ట్రానికి మాత్రం రావద్దు. మీరు తెచ్చే అప్పుతోనే ఇప్పుడు మన ప్రభుత్వం నడవాల్సి ఉంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మసులుకోండి. ఇదీ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అప్పుల సృష్టి కోసం ఢిల్లీలో తాను నియమించుకున్న బృందానికి ఇచ్చిన, ఇస్తున్న ఆదేశాలు. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అప్పు కోసం నానా తిప్పలు పడుతుంది. ఇప్పటికే కేంద్రం ఏం చెప్పినా కాదనకుండా చేస్తూ ప్లీజ్ ఈ ఒక్కసారికి అప్పు ఇవ్వండి అంటూ కేంద్ర పెద్దల వద్ద జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న విన్నపాలు అన్నీ ఇన్నీ కాదు. వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్ల బిగింపు నుండి సీపీఎస్ రద్దు వరకూ కేంద్రం పెట్టిన ఆంక్షలన్నీ సీఎం జగన్ నెరవేరుస్తూ వచ్చారు. వాటి బదులు అప్పు లాగేశారు.
అయినా, ప్రభుత్వం నడిచే పరిస్థితి కనిపించడం లేదు. ఏ నెలకి ఆ నెల వచ్చిన ఆదాయానికి తోడు కొంత అప్పు చేసి జీతాలు, పెన్షన్లు ఇవ్వడంతోనే సరిపోతుంది. ఈ నెల ఇప్పటికి కూడా ఇంకా కొన్ని జీతాలు పెండింగ్ లోనే ఉన్నాయి. మరో వారం రోజులలో మరో నెల కూడా రాబోతుంది. మరోవైపేమో బటన్ నొక్కి చెల్లించాల్సిన పథకాలు బోలెడు ఉన్నాయి. ఇటు ప్రభుత్వ ఖర్చులకు.. అటు పథకాలకు వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. ఇప్పటికే పరిమితికి మించి అప్పులు తెచ్చారు.. కార్పొరేషన్ల రుణాలను అందిన వరకు ప్రభుత్వ ఖజానాలకు మళ్లించేసుకున్నారు. పంచాయతీల ఆదాయాన్ని కూడా ఖజానాలో జమ చేసుకుంటున్నారు. రోడ్లు, డ్రైనేజీలకు గానీ.. కొత్తగా ఇటుక పెట్టేందుకు కూడా ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. ముందు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వక కాంట్రాక్టర్లు బాబోయ్ ఏపీ అంటూ రాష్ట్రం సరిహద్దు దాటి వెళ్లిపోయారు. ఇన్ని చేసినా ప్రభుత్వం నడిచే పరిస్థితి కానరావడం లేదు.
ఏది ఏమైనా ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే కొత్త అప్పు పుట్టి తీరాలి. దీంతో కొత్త అప్పుల కోసం వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో నియమించుకున్న హైలెవల్ కమిటీ తీవ్ర కసరత్తులు చేస్తుంది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి కనుసన్నల్లో పనిచేస్తున్న ఈ కమిటీ ఇప్పుడు ఏపీ లిక్కర్ బాండ్లను చూపించి కొత్త అప్పు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అయితే కేంద్రం మాత్రం ఇక మీకు అప్పు పుట్టేందుకు వీలుగా ఎలాంటి సలహాలు, ఆదేశాలు ఇచ్చేది లేదని తెగేసి చెప్పిందని అంటున్నారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఢిల్లీలో ఏపీ అప్పుల కమిటీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. కానీ, కేంద్రం పెద్దలు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఇప్పుడు సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారట. జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారట.
అయితే కేంద్రంలో జగన్ పరిస్థితి కూడా ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇక మీదట ఓ లెక్క అన్నట్లు తయారైందని పరిశీలకులు అంటున్నారు. గతంలో సీఎం కోరడం తరువాయి ప్రధాని, కేంద్ర హోంమంత్రి, కేంద్ర మంత్రులు ఆఘమేఘాల మీద అప్పాయింట్ మెంట్ ఇచ్చేసేవారు. అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు జగన్ తో భేటీ అయ్యేవారు. కానీ ప్రస్తుతం సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా ఇప్పుడు ఢిల్లీలో అపాయింట్ మెంట్ దొరకడం లేదు. ప్రధాని మోడీ కాకపోయినా కనీసం అమిత్ షాతో అయినా అపాయింట్మెంట్ కావాలని కోరినా కేంద్రం నుండి ఎలాంటి అనుకూలత కనిపించడం లేదని చెప్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీజేపీ అన్నీ లెక్కలేసుకొని ఆచితూచి అడుగులేస్తున్నది. ఈ క్రమంలోనే ఏపీలో పొత్తుల ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. సోమవారం (ఆగస్టు 28) తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉంది.ఆ విషయంలో ఇప్పటికే బీజేపీ పెద్దలతో మంతనాలు జరుగుతున్నట్టు చెప్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు భేటీ అయ్యే వరకూ జగన్ కు కేంద్రం పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకడం దుర్లభమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు భేటీలో పొత్తుల చర్చలు సఫలీకృతమైతే ఇక జగన్ కు అపాయింట్ మెంట్ దొరికే అవకాశమే లేదని అంటున్నారు.