కాంగ్రెస్ గూటికి తుమ్మల.. ఖరారేనా?
posted on Aug 25, 2023 @ 5:26PM
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ రిక్త హస్తం చూపింది. జిల్లాలో బలమైన నేత అయినప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని కనీసం పరిశీలించకపోవడంతో ఆయనిక పార్టీలో కొనసాగడం జరిగే పని కాదని అందరికీ అర్ధమైపోయింది. ఖమ్మం జిల్లాలో కీలక నేత అయిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
ఈసారి పాలేరు నుంచి మాజీమంత్రి తుమ్మలకు అవకాశం కచ్చితంగా ఉంటుందని, సర్వేల్లోనూ ఆయనకే మొగ్గు ఉందన్న ప్రచారం జరిగింది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన కందాల ఉపేందర్‌రెడ్డికే బీఆర్‌ఎస్ టికెట్ కేటాయించడంతో తుమ్మల భవితవ్యం ఏంటా అన్న చర్చ పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఇక బలమైన నేత అయిన తుమ్మలకు పాలేరు టికెట్ ఆఫర్ చేస్తూ కాంగ్రెస్ తమ పార్టీలోకి ఆహ్వానించింది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచీ తుమ్మలకు ఆహ్వానం ఉందంటున్నారు. మరో వైపు బీఆర్ ఎస్ అసంతృప్తులపై కన్నేసిన బీజేపీ కూడా తుమ్మలకు తమ పార్టీ తలుపులు బార్లా తెరిచిందని చెబుతున్నారు. ఇలా మూడు పార్టీల నుంచీ తుమ్మలకు ఆహ్వానం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల తీసుకునే నిర్ణయం ఏమిటన్నది తెలియాల్సి ఉందని ఇంత కాలం అంతా భావించారు.
అయితే ఆయన హస్తం గూటికి చేరుతారన్న విషయం దాదాపు ఖరారైపోయిందని తాజా పరిణామాన్ని బట్టి చూస్తే అవగతమౌతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆయనను ఆహ్వానించి పాలేరు టికెట్ ఆఫర్ చేసిందని అంటున్నారు. చివరి క్షణం వరకూ తుమ్మల బీఆర్ఎస్ నుంచి పాలేరు టికెట్ కోసం వేచి చూశారు.
ఈ నేపథ్యంలోనే ఆయన తన పోటీ పాలేరు నుంచేనని పదే పదే స్పష్టం చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ ఆఫర్ ను అంగీకరించినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణలక బలం చేకూరే విధంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం (ఆగస్టు 25) ఈ సందర్భంగా తుమ్మల వర్గీయులు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద కాంగ్రెస్ జెండాతో ఆయనకు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ నుండి టికెట్ లభించకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ తుమ్మల వర్గీయులు కోరుతున్నారు.