జగన్ ను దూరం పెట్టేసిన మోడీ.. వైసీపీ వాట్ నెక్స్ట్?
posted on Oct 8, 2023 6:56AM
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని ప్రశ్నించారు.. నిలదీశారని కూడా ప్రచారం చేసుకున్నారు. అయితే, అసలు మంత్రులతో ఏం మాట్లాడారన్నది మాత్రం వీడని సస్పెన్నే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, జగన్ ఢిల్లీ పర్యటన అనగానే రాజకీయ వర్గాలలో తీవ్ర ఆసక్తి రేగింది. చంద్రబాబు అరెస్ట్ తరువాత తొలిసారి జగన్ ఢిల్లీ వెళ్తుండడంతో.. ఢిల్లీలో జగన్ ఎవరిని కలుస్తారు? ఏం మాట్లాడతారు? రాజకీయాలలో ఏమైనా కీలక పరిణామాలు ఉంటాయా అన్న చర్చలు సాగాయి. ముఖ్యంగా ఏపీలో బీజేపీ ప్రయాణం ఎటు వైపు అనే దానిపై ఏదైనా స్పష్టత వస్తుందా అన్న ఆసక్తి కూడా కనిపించింది.
అయితే, స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లిన జగన్ అదే ఫ్లైట్ లో మళ్ళీ తాడేపల్లి కూడా రానే వచ్చారు. అక్కడ ఏం జరిగిందో ప్రభుత్వ వర్గాలు మీడియాకు చెప్పాల్సింది చెప్పారు. అయితే, ఇప్పటికైతే జగన్ ఢిల్లీ పర్యటనతో అద్భుతాలేమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు చర్చించిన అంశాలు కూడా జరిగేవి కాదు. కేంద్రాన్ని జగన్ ఎంత మేర ప్రశ్నించారో కూడా ఏపీ ప్రజలు అర్ధం చేసుకోగలరు. అయితే, ఒక్కసారి జగన్ ఢిల్లీ పర్యటనను పరిశీలిస్తే రాష్ట్రానికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదన్నది క్లియర్ గా తెలిసిపోతుంది. గట్టిగా మాట్లాడితే జగన్ ఢిల్లీ వెళ్లేముందు వైసీపీ వర్గాలు ఊహించుకుంది వేరు.. అక్కడ జరిగింది అందుకు పూర్తిగా విరుద్ధం. జగన్ ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు. ఆయన ఈ భేటీలో ఏపీకి సంబంధించిన సమస్యలను ప్రస్తావించారని ప్రభుత్వ వర్గాలు చెప్పుకున్నాయి. అలాగే రాజకీయ అంశాలు ఇద్దరు నేతల మధ్యన ఖచ్చితంగా వచ్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే, ఎన్నో ఆశలతో హస్తినకు వెళ్లిన సీఎం జగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి మొహం చాటేశారు. జగన్ కు పీఎంఓ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జగన్ కు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ లభించకపోవడం చర్చకు దారితీస్తోంది. నిజానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు అందుబాటులో ఉంటారన్న కచ్చితమైన సమాచారంతోనే సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారు చేసుకున్నారు. అసలు లండన్ పర్యటన నుంచి రాగానే హస్తిన పర్యటన పెట్టుకున్న జగన్ అప్పట్లో ప్రధాని అందుబాటులో ఉండరని, అప్పాయింట్ మెంట్ దొరకదని ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈసారి ఇద్దరు అందుబాటులో ఉంటారనే పక్కా సమాచారంతోనే జగన్ ఢిల్లీ వెళ్లారు. ఆ ఇద్దరి నేతల అపాయింట్మెంట్లు దొరికాయని కూడా వైసీపీ నేతలు చెప్పుకున్నారు. కానీ ఒక్క హోం మంత్రి అమిత్ షా మాత్రమే అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే, కృష్ణా జలాల వివాదంపై జగన్ ప్రధానికి లేఖ రాసి వెనుతిరిగినట్లు ప్రభుత్వం మీడియాకు సమాచారం ఇచ్చింది. కానీ, జగన్ ను కలవడం ఇష్టం లేకే ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఢిల్లీ వర్గాల సమాచారం.
ఏపీ సమస్యలు, రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ బీజేపీ పెద్దలకు తెలిసిందే. పైగా చంద్రబాబు అరెస్టు అంశంలో బీజేపీ అండ ఉందని జగన్ పార్టీ నేతలు చేసిన ప్రచారం, మరోవైపు జగన్ కారణంగానే ఏపీలో ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన కూడా దూరం జరగడం కూడా ప్రధాని మోడీ జగన్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వక పోవడానికి కారణంగా చెబుతున్నారు. అదీ కాక తెలంగాణలో ఎన్నికల సమయం కనుక జగన్ ప్రస్తావించాలనుకున్న కృష్ణా జలాల విషయంలో ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకోగలిగే అంశం కాదు. పాము చావాలి.. కర్ర విరగకూడదు అన్న సిద్ధాంతాన్ని పాటించే బీజేపీ ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయాలపై ఓపెన్ కావడం ఇష్టం లేకనే మోడీ సీఎం జగన్ కు అపాయింట్ ఇవ్వలేదని అంటున్నారు. ఇక అమిత్ షా అయితే చంద్రబాబు అరెస్టు, తదననంతర పరిణామాలు, బాబు అరెస్టుకు కేంద్రం మద్దతు ఉందన్న వైసీపీ ప్రచారం తదితర అంశాలపై జగన్ కు గట్టిగా క్లాస్ పీకినట్లు హస్తిన వర్గాలు చెబుతున్నాయి. 2014 నాటి పరిస్థితి ఏపీలో పునరావృతం కావాలన్నది తన అభిమతమని, తెలుగుదేశం, జనసేనతో పాటు బీజేపీ కూడా కలవాలని జనసేనాని పవన్ కల్యాణ్ చెబుతున్నప్పటికీ, ఏపీలో ఇప్పటికైతే తటస్థంగా ఉండాలనే బీజేపీ భావిస్తోందనీ, అందుకే మోడీ జగన్ ను దూరం పెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.