చంద్రుడి కోసం కాంతితో క్రాంతి!
posted on Oct 8, 2023 8:35AM
వెన్నెల చిన్నబోయింది. చందమామ భవిలో తన వెలుగులను మరపించేలా ఆ దీపాలేంటని నివ్వెరపోయింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పిలుపుమేరకు శనివారం(అక్టోబర్ 7) రాత్రి 7 నుంచి 7.05 గంటల వరకూ జరిగిన కాంతితో క్రాంతి నిరసన కార్యక్రమంలో జనం స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బాబు అరెస్టుకు నిరసనలు చేపట్టాలంటే ఏపీకి పోయి చేసుకోండి.. తెలంగాణలో మాత్రం కుదరదు అన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాటలను ఖాతరు చేయకుండా బీఆర్ఎస్ నేతలూ మంత్రులూ కూడా చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు.
నారా చంద్రబాబుకు మద్దతుగా వెలుగుల నిరసనలో రాజకీయ, ప్రాంతీయ భేదాలు లేకుండా అన్ని వర్గాల వారూ పాల్గొన్నారు. చంద్రబాబును వైసీపీ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిందని జనం విశ్వసిస్తున్నారు. ఈ అరెస్టు క్షక్ష పూరితం, కుట్ర పూరితం అని నమ్ముతున్నారు. అందుకే ఆయన అరెస్టై నెల రోజులు కావస్తున్నా.. తెలుగురాష్ట్రాల్లోనే కాదు దేశ,విదేశాల్లోనూ ఆగకుండా, తగ్గకుండా జనం స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నిరసన తెలిపేందుకూ వెనుకాడటం లేదు. చంద్రబాబుది అక్రమ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం నిత్యం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే కాంతితో క్రాంతి పేర శనివారం (అక్టోబర్ 7) రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఇళ్లల్లో లైట్లు ఆఫ్ చేసి దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలలో కాంతితో క్రాంతి నిరసన కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు. రాజమండ్రిలో నారా భువనేశ్వరి, ఢిల్లీలో నారా లోకేశ్ దీపాలు వెలిగించిన నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ అభిమానులు సైతం కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లతో తమ నిరసన తెలిపారు.
మంగళగిరి ఎన్టీఆర్ భవన్ వద్ద దీపాలు వెలిగించి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిరసన వ్యక్తం చేశారు. ఇక ఏపీలో చంద్రబాబును అరెస్టు చేస్తే తెలంగాణలో ఆందోళనలు ఏమిటి అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అసహనం వ్యక్తం చేసినా తెలంగాణ వ్యాప్తంగా కాంతితో క్రాంతి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పార్టీలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులూ, మంత్రులూ కూడా కాంతితో క్రాంతి కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించారు. మణికొండ చౌరస్తా నుంచి ల్యాంకోహిల్స్ వరకు తెలుగుదేశం అభిమానులు ర్యాలీ నిర్వహించారు. అంతేకాదు అలాగే బెంగళూరు, చెన్నైలోనూ లైట్లు ఆపి దీపాలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనను తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రారంభించారు. నందమూరి రామకృష్ణ, అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, జ్యోత్స్న, శ్రీపతి సతీశ్, మురహరిగౌడ్, బంటు వెంకటేశ్వర్లు, కొత్తపల్లి మధుసూదన్‌రావు పాల్గొన్నారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను హైదరాబాద్‌లో తన బృందంతో కలిసి కొవ్వొత్తులు వెలిగించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా హైదరాబాద్ అభివృద్ధికి పునాదులు వేసిన నాయకుడు చంద్రబాబునాయుడు అని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్ కూడలి నుంచి చైతన్యపురి శివాజీ విగ్రహం వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశంఉపాధ్యక్షురాలు సుహాసిని, పొలిట్‌బ్యూరో సభ్యుడు అరివింద్‌కుమార్‌గౌడ్ తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. సిరిసిల్లలో సంఘీభావ ర్యాలీ చేపట్టడంతో పాటు ఏపీ సీఎం జగన్‌కు సద్బుద్ధి ప్రసాదించాలంటూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కరీంనగర్, వనపర్తి, ఖమ్మంలలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణ సెటిలర్స్ ఫోరం ఆధ్వర్యంలో త్వరలో మిలియన్ మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రసూన తెలిపారు. సనత్‌నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరానికి అనుమతి లేదని పోలీసులు శనివారం ఉదయం నిర్వాహకులను స్టేషన్‌కు పిలిచారు. విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పోలీసులకు ఫోన్ చేసి నచ్చజెప్పారు. దీక్షా శిబిరానికి చేరుకుని తన మద్దతు ప్రకటించారు.