లేని ప్రాజెక్టులో అవినీతా?.. తెలుగుదేశం డైరెక్ట్ అటాక్
posted on Oct 8, 2023 @ 8:12PM
టీడీపీ అధినేత చంద్రబాబు కలల సౌధం రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ఈ ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలనుకున్నారు. ఈ ప్రాజెక్టు కొంత కసరత్తులు కూడా జరిగాయి. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. అయితే, ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని ఇప్పుడు జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ ఆలోచన చేసింది తప్ప.. ఎక్కడా ఒక్క ఎకరం భూసేకరణ చేయలేదు.. ప్రభుత్వం తరుఫున ఒక్క రూపాయి నిధులు కేటాయించ లేదు. ఇంకా చెప్పలంటే కనీసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కూడా ఇవ్వలేదు. అయితే ఏమీ లేని దానిలో అవినీతి జరిగిందని ఇప్పుడు వైసీపీ తప్పుడు ఆరోపణలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. వైసీపీ కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇలాంటి పిచ్చి అంశాలను తెరపైకి తెస్తూ అరెస్టులు చేయాలని కుట్రలు పన్నుతోంది. దీనిని ఇలాగే ఉపేక్షిస్తే లాభం లేదనుకున్న టీడీపీ ఇప్పుడు డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టింది.
అసలు 'లేని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి ఎలా జరిగింది అనే పుస్తకాన్ని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో తాజాగా పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడుతో పాటు తెలుగుదేశం నేతలు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, పంచుమర్తి అనురాధ, నిమ్మల రామానాయుడు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, పీతల సుజాత, అశోక్ బాబు, రాకేష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అసలు లేని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్ లో ఎవరైనా ఎలా తప్పుచేస్తారో ఈ మతి లేని ప్రభుత్వం, బుద్ధిలేని ముఖ్యమంత్రే చెప్పాలంటూ టీడీపీ నేతలు నిలదీశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కు, లోకేశ్ కు ఎలాంటి సంబంధంలేదని జగన్ సర్కారే హైకోర్టుకి చెప్పిందని.. ప్రతి దానిలో లోకేష్ పేరుని తీసుకొచ్చి రాజకీయం ఆనందం పొందాలని ఈ సైకో సీఎం ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం అధినేతను జైలుకు పంపి 30 రోజులవుతున్నా.. ఈ సీఎం, ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆయన తప్పుచేశారని రుజువు చేయలేకపోయింది. న్యాయ స్థానాల్లో ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా ప్రవేశపెట్టలేకపోయింది. ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు నిరూపించలేని ఈ దద్దమ్మలు చివరకు ఏమీ తేల్చలేని తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఇచ్చిన విరాళాలపై పడ్డారని ఎద్దేవా చేశారు.
సీఐడీ చంద్రబాబుని ఏ కేసులో అరెస్ట్ చేసిందో.. ఆ కేసులో ఆయన తప్పు చేశారని నెల రోజులుగా నిరూపించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి అధికారంతో వేలకోట్లు కొట్టేసి, తన అవినీతిని సీబీఐ, ఈడీ సంస్థలు న్యాయస్థానాల్లో రుజువు చేస్తేనే జగన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు. కానీ, మీరు రుజువు చేయలేకనే నెల రోజులుగా కక్షకట్టి చంద్రబాబును జైల్లో ఉంచారని మండిపడ్డారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకోకుంటే తాడేపల్లి ప్యాలెస్ ఎప్పుడో నేలమట్టమయ్యేదన్న అచ్చెన్నాయుడు.. సెక్షన్ 144.. సెక్షన్ 30లు తెలుగుదేశం చేపట్టే శాంతియుత నిరసనలు, ధర్నాలకే వర్తిస్తాయా?వైసీపీకి వర్తించవా అని ప్రశ్నించారు. తెలుగుదేశం విడుదల చేసిన ఈ పుస్తకంతో ఏపీలో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారిపోయిది.
ఏంటి అసలు లేని ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని లోకేష్ ను అరెస్ట్ చేస్తామని శపథాలు చేశారా అంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ కేసు విచారణ సమయంలో అడ్వకేట్ జనరల్ చేతులెత్తేయడంతో ఈ కేసు మూలన పడింది. అయితే వైసీపీ నేతల నోళ్లు మాత్రం మూతపడలేదు. దీంతో టీడీపీ పుస్తకం విడుదల చేసి నిజాలు బయట పెట్టడంతో వైసీపీ నేతల మొహాలు వాడిపోతున్నారు. అసలు లేని రోడ్డు, మొదలే కానీ ప్రాజెక్టు, నిధులే విడుదల కాని పనులలో అవినీతి జరిగిందని కేసులు పెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ దేశం మొత్తంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే నని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే అసలు ఇలాంటి ఐడియాలు ఇచ్చిన సలహాదారులు ఎవరంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.