బీఎల్ సంతోష్ హంగ్ ఆశలు.. సింగిల్ డిజిట్ పార్టీ అయినా పవర్ మాదే అంటూ గొప్పలు!
posted on Oct 7, 2023 @ 12:29PM
తెలంగాణలో అధికారం మాదేనంటూ బీజేపీ నేతలు ఘనంగా ప్రకటనలు గుప్పిస్తూ.. జాతీయ స్థాయి నాయకులను తీసుకు వచ్చి రాష్ట్రాన్ని చుట్టేయిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం ఆ పార్టీకి ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఇప్పటికే పూర్తి స్పష్టత ఉన్న నేతలు కమలం పార్టీకి దూరం జరుగుతున్నారు.
సాక్షాత్తూ ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినా మొహం చాటేస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం గాంభీర్యాన్ని వదలడం లేదు. తాజాగా రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటి దాకా అధికారం మాదే అంటూ గొప్పలు చెప్పుకుంటూ వస్తున్న ఆ పార్టీ రాష్ట్ర నేతల మాటలకు భిన్నంగా.. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో హంగ్ తప్పదని జోస్యం చెప్పి రాష్ట్ర బీజేపీ నేతల గాలి తీసేశారు.
అదే సమయంలో రాష్ట్రంలో హంగ్ వచ్చినా.. అధికారం మాత్రం బీజేపీదేననీ ఇప్పటి నుంచే హార్స్ ట్రేడింగ్ కు తెరతీశారు. గతంలో కర్నాటక, గోవా, మహారాష్ట్రలలో ఎలా అయితే ప్రజా తీర్పును తుంగలోకి తొక్కి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందో అలాగే తెలంగాణలో కూడా అధికారాన్ని చేపడతామని బీఎల్ సంతోషంగా పార్టీ నేతలు, వర్గాలకు సంకేతమిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తాజాగా లోక్ పాల్ నిర్వహించిన సర్వే తెలంగాణలో బీజేపీకి రెండు నుంచి మూడు స్థానాలకు మించి రావని పేర్కొంది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి రోజుల ముందు వెలువడిన ఈ సర్వే సంచలనం సృష్టిస్తోంది. ఆ సర్వే ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ సింగిల్ గానే మ్యాజిక్ ఫిగర్ సాధించి బయట నుంచి ఎటువంటి మద్దతు అవసరం లేకుండానే అధికారం చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. రెండో స్థానంలో బీఆర్ఎస్ నిలుస్తుంది. ఇక బీజేపీ రెండు లేదా మూడు స్థానాలతో సరిపెట్టుకుంటుంది.
ఎంఐఎం యథా ప్రకారంగా తనకు పట్టున్న 6 నుంచి 8 స్థానాలలో విజయం సాధిస్తుంది. లోక్ పాల్ సర్వే ఇలా వెలువడిందో లేదో అలా బీఆర్ఎస్ నేతలు ఖండనలకు దిగిపోయారు. లోక్ పాల్ సర్వే ప్రకారం అధికార బీఆర్ఎస్ 45 నుంచి 51 స్థానాలకు పరిమితం అవుతుంది. కాంగ్రెస్ 61 నుంచి 67 స్థానాలలో విజయం సాధిస్తుంది. ఆ సర్వే ప్రకారం సీట్ల విషయంలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కంటే 15 స్థానాల వరకూ ఎక్కువ వస్తాయి. అయితే అదే సర్వే ఓట్ల విషయంలో మాత్రం రెండు పార్టీలకూ పెద్దగా తేడా లేదని చెబుతోంది. కాంగ్రెస్ కు 41 నుంచి 45 శాతం, బీఆర్ఎస్ కు 39 నుంచి 42శాతం ఓట్లు పోలవుతాయని పేర్కొంది. ఇక బీజేపీ అయితే 10 నుంచి 12 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటుందని లోక్ పాల్ సర్వే పేర్కొంది. ఇక ఆరు నుంచి 8 సీట్లు గెలుచుకునే ఎంఐఎం 3నుంచి 4 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని లోక్ పాల్ సర్వే పేర్కొంది.
ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో 60 వేల శాంపిల్స్ ఆధారంగా ఈ సర్వే చేసినట్టు లోక్ పోల్ సంస్థ తెలిపింది. మొత్తం మీద ఈ సర్వే పరిశీలకుల అంచనాకు తగ్గట్టుగానే ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం ప్రభావంతో బీఆర్ఎస్ కు సీట్లు గణనీయంగా తగ్గుతాయన్నది పరిశీలకుల అంచనా. ఆ అంచనాకు తగ్గట్టే.. దాదాపు పాతిక స్థానాలలో బీఆర్ఎస్ పై తెలుగుదేశం ప్రభావం తీవ్రంగా ఉంటుందని లోక్ పాల్ సర్వే ఫలితం కూడా పేర్కొందని అంటున్నారు.