భధ్రత కల్పించాలంటూ హైకోర్టు నాశ్రయించిన బర్రెలక్క 

తెలంగాణ నిరుద్యోగ సమస్య మీద అసెంబ్లీలో పోరాడటానికి  ఎన్నికల బరిలో ఉన్న ఇండిపెండెంట్  అభ్యర్థి బర్రెలక్క ఎలియాస్ శిరీష తనకు సెక్యురిటీ కల్పించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు నాశ్రయించారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క  తనకు భద్రత కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల ప్రచారంలో తన సోదరుడిపై దాడి జరగడంతో సెక్యూరిటీ అభ్యర్థించారు. అయితే, పోలీసులు తన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టుకెక్కారు. ఎన్నికల బరిలో నిలిచిన నాటి నుంచి తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని, చంపేస్తామని ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు 2 ప్లస్ 2 గన్ మెన్లతో సెక్యూరిటీ కల్పించేలా పోలీసులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం దీనిపై విచారణ జరిపి నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని కోర్టు వర్గాల సమాచారం. బర్రెలక్కకు అంతర్జాతీయ న్యాయవాదుల సంఘం నాయకులు కావేట శ్రీనివాసరావు, కరణం రాజేశ్, ఆదిత్య దొడ్డల మద్దతు ప్రకటించారు. బర్రెలక్కపై, ఆమె సోదరుడిపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెదిరింపుల నేపథ్యంలో ఆమెకు 2 ప్లస్ 2 గన్ మెన్లతో సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన దాడిని ప్రస్తావిస్తూ హోంశాఖ ప్రధాన కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీచేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టు సానుకూలంగా స్పందించి బర్రెలక్కకు భద్రత కల్పించాలని తీర్పిస్తే దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జగన్ కు సుప్రీం షాక్.. బెయిల్ రద్దుపై నోటీసులు జారీ

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు   పిటిషన్‌పై సుప్రీం కోర్టు జగన్‌, సీబీఐ సహా ప్రతివాదులందరికీ  నోటీసులు జారీ చేసింది. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది కోర్టును కోరారు. ఇప్పటికే విచారణను హైదరాబాద్‌ నుంచి దిల్లీకి మార్చాలని రఘురామ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. బెయిల్ రద్దు  పిటిషన్ తో మపాటు  జగన్ అక్రమాస్తుల కేసు వేరే రాష్ట్రానికి   బదిలీ చేయాలన్న పిటిషన్ ను కూడా జత చేయాల్సిందిగా సుప్రీం ఆదేశించింది. అనంతరం విచారణకు జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించింది.  జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్ ను గత ఏడాది అక్టోబరు 28న  తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి విదితమే. దీంతో రఘురామకృష్ణం రాజు సుప్రీంను ఆశ్రయించారు.  అక్రమాస్తుల కేసులో జగన్ గత పదేళ్లుగా బెయిల్ పై ఉన్న సంగతి విదితమే. జగన్ బెయిలు రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ వేశారు. ఆ తరువాత రఘురామకృష్ణం రాజుపై సీఐడీ కస్టోడియల్ టార్చర్ కు పాల్పడింది.  కాగా రఘురామకృష్ణం రాజు పిటిషన్ పై అప్పట్లో సీబీఐ స్పందన సరిగా లేదు. దీంతో  తెలంగాణ హైకోర్టు రఘురామకృష్ణం రాజు పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే  తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రఘురామకృష్ణం రాజు సుప్రీంను ఆశ్రయించారు.    ఇలా ఉండగా జగన్ సర్కార్ ఆర్థిక అవకతవకలపై రఘురామకృష్ణం రాజు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై అక్కడి కోర్టు జగన్ సహా మొత్తం 41 మందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  ఒక ప్రభుత్వం ఆర్ధిక అవకతవకలకు పాల్పడుతుందన్న అభియోగంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుండి నోటీసులు అందుకున్న తొలి సీఎంగా నిలవడమే ఆ రికార్డు సృష్టించారు. కాగా ఈ కేసు విచారణ నెల 24కు వాయిదా పడింది. ఏపీ సీఎం వరుసగా ఇలా హైకోర్టు, సుప్రీం కోర్టుల నుంచి నోటీసులు అందుకోవడం సంచలనం సృష్టిస్తోంది. మొత్తం మీద రఘురామకృష్ణం రాజు పిటిషన్లతో జగన్ చిక్కుల్లో పడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తెలంగాణలో ప్రియాంకగాంధీ  ప్రచారం 

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మరో మారు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్ ఉంది. ఈ నెల 28న ప్రచారం ముగియనుండటంతో  ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్,  కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్  ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత  రోజు రోజుకు ఎక్కువవుతుంది. యాంటీ ఇన్ కంబెన్సీ ఎక్కువవడంతో ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ జారవిడుచుకోకుండా జాగ్రత్త పడుతుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లింది. కర్ణాటకలో ఫైవ్ గ్యారెంటీస్ తో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో సిక్స్ గ్యారెంటీస్ తో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణ  ఎన్నికల ప్రచారంలో మమేకమయ్యారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా 5 రోజులు మాత్రమే ఉండటంతో కాంగ్రెస్ అగ్రనేతలు స్పీడ్ పెంచారు. ప్రియాంకగాంధీ ఇవ్వాళ , రేపు (నవంబర్ 24, 25 ) తెలంగాణలో పర్యటిస్తున్నారు. శుక్రవారం పాలకుర్తి, హుస్నాబాద్, కొత్తగూడెంలో మిత్రపక్షమైన సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు తరపున ప్రచార సభల్లో ఆమె ప్రసంగించనున్నారు.ఇవ్వాళ ఖమ్మంలో బసచేసి శనివారం పాలేరు, సత్తుపల్లి, మధిర ప్రచారసభల్లో ఆమె ప్రసంగించనున్నారు. అనంతరం విజయవాడ చేరుకుని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీ తిరుగు ప్రయాణం కానున్నారు. 

మేడిగడ్డ డ్యామేజ్ నిజమే.. కేటీఆర్ ఒప్పుకోలు!

బుకాయింపులు పని చేయలేదో ఏమో తెలంగాణ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ వాస్తవమేనని అంగీకరించారు. అయితే కింద పడ్డా పై చేయి నాదేనని చెప్పుకోవడానికి బ్యారేజీలలో సమస్యలు రావడం సర్వసాధారణమని సూత్రీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపం కూడా అలాంటి సర్వసాధారణమైన విషయమేనని కేసీఆర్ తేల్చేశారు. నాగార్జున సాగర్ లో అది నిర్మించిన కొత్తల్లో లీకేజీలు లేవా? అని ప్రశ్నించారు. శ్రీశైలం పంపులు కూడా నీట మునగలేదా అన్నారు. ధవళేశ్వరం, కడెం జలాశయాల్లోనూ సమస్యలు వచ్చాయని చెప్పి మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ పెద్ద విషయం కాదనీ సమర్ధించుకోవడానికి శతధా ప్రయత్నించారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై మంత్రి కేటీఆర్ గురువారం (నవంబర్ 23)న పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తున్నారంటూ చిర్రుబుర్రులాడారు. ప్రాజెక్టులలో సమస్యలు వెరీ కామన్.. వాటిని భూతద్దంలో చూడొద్దన్నారు. లోపాలను పట్టించుకోవద్దనీ, ఈ తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో ప్రగతిని మాత్రమే చూడండని చెప్పకొచ్చారు. కేసీఆర్ సర్కార్ సాగునీటి ప్రాజెక్టులపై లక్షా 70వేల కోట్ల రూపాయలు వ్యయం చేసిందని గణాంకాలు చెప్పారు.  ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని తమ సర్కార్ కేవలం నాలుగున్నర సంవత్సరాలలో పూర్తి చేసిందని గొప్పగా చెప్పుకున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఏమైనా ఇంజినీరింగ్‌లో లోపాలు ఉంటే సవరణలు చేయడంతో పాటు పునర్నిర్మాణపనులు చేపడతామని నిర్మాణ కంపెనీ చెబుతుంటే ఇక విమర్శలెందుకని నిలదీశారు. రాజకీయం కోసమే కాళేశ్వరంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. మొత్తం మీద మేడిగడ్డ డ్యామేజీ నిజమేనని ఒప్పుకున్నారు. 

ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు.. ఎప్పుడంటే?

అధికారంలో ఉన్నామా? విపక్షంలో ఉన్నామా? అన్న ధ్యాసే లేకుండా నిత్యం రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమమే లక్ష్యం  ఏడు పదుల వయస్సులోనూ యువనాయకుల కంటే ఎక్కువగా క్షేత్ర స్థాయిలో పర్యటలు చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం పై సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సైతం సిద్ధమయ్యే చంద్రబాబు దాదాపు రెండు నెలలుగా ప్రజాక్షేత్రంలో కనిపించడం లేదు.   స్కిల్ కేసు పేరిట  జగన్  ప్రభుత్వం చంద్రబాబును ఆయన నంద్యాల పర్యటనలో ఉండగా అరెస్టు చేయడం తదననంతర పరిణామాలు తెలిసినవే.   స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బైలు వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఆయన పై కేసుల మీద కేసులు వేస్తూ ఏదో ఒక కేసులో మళ్ళీ బాబుని అరెస్టు చేసి ప్రజా జీవితానికి దూరం చేయాలనే దుర్మార్గపు ఆలోచనతో ఉంది. జగన్  ప్రభుత్వం బాబు చుట్టూ అల్లిన కేసులను ఛేదించుకుని ప్రజల మధ్యకు రావడానికి ఆయన న్యాయపోరాటాన్నే నమ్ముకుంది. న్యాయపోరాటాలతో కేసుల నుండి ఊరట పొందిన తరువాతనే చంద్రబాబు పూర్తి స్థాయిలో  ప్రజాక్షేత్రంలోకి రావాలని భావిస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. జగన్ సర్కార్ చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులన్నీ దూరిపింజెల్లా ఎగిరిపోవడం ఖాయమని న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు. నేడో, రేపో సుప్రీంలో క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడితే చంద్రబాబు పులు కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటపడినట్లేనని అంటున్నారు. అయితే చంద్రబాబుపై వరుసగా కేసులు బనాయిస్తూ ఆయనను ప్రజాక్షేత్రంలోకి రానీయకుండా చేయడానికి జగన్ సర్కార్ ఎందుకు తహతహలాడుతోందంటే ఆయన జనంలో ఉంటే.. ఇప్పటికే దిగజారిపోయిన జగన్ గ్రాఫ్ మరింత పాతాళానికి పడిపోతుందని అందరికంటే బాగా జగన్ కే తెలుయడమే. ఆయన గొంతు జనానికి వినపడకుండా చేయగలిగితే.. తన సర్కార్ పై ప్రజా వ్యతిరేకత మరింత పెరగకుండా ఉంటుందన్న అభిప్రాయంతో కక్షగట్టి ఇలా చంద్రబాబుపై వరుస కేసులు నమోదు చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ చేస్తున్న ఈ కుట్ర రాజకీయాలకు తనదైన శైలిలో చెక్ పెట్టి బాబు తిరిగి తెలుగు దేశం పార్టీని, ఆ పార్టీ నేతలను ప్రభుత్వం పై యుద్దానికి సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ ప్రభుత్వం పై పోరాటానికి బాబు రంగం సిద్ధం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ లోగా క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు వెలువడుతుందనీ, కచ్చితంగా సర్వోన్నత న్యాయస్థానం తన క్వాష్ పిటిషన్ కు అనుకూలంగానే తీర్పు ఇస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారంటున్నారు. హైకోర్టు రెగ్యులర్ బెయిలు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు స్కిల్ కేసులో ఏపీ సీఐడీ విచారణ ఎంత లోపభూయిష్టమో తేలిపోయిందనీ, సుప్రీం కోర్టులో కూడా అదే జరుగుతుందనీ పార్టీ శ్రేణులు కూడా బలంగా నమ్ముతున్నాయి.  సో.. డిసెంబర్ మొదటి వారం నుంచీ చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వచ్చి జగన్ సర్కార్ అక్రమాలు, అవినీతి పాలనపై చండ్ర నిప్పులు చెరుగుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తెలుగుదేశం, జనసేన పొత్తు సరే.. బీజేపీ సంగతేంటి?

తెలుగురాష్ట్రాలలో బీజేపీ తీరు తమాషాగా ఉంది. రెండు రాష్ట్రాలలోనూ కూడా ఆ పార్టీ తన వాస్తవబలానికి మించి బిల్డప్ ఇస్తోంది. ఇందుకు ఆయా రాష్ట్రాలలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులు కొంత కారణమైతే.. కేంద్రంలో అధికారం చేతిలో ఉంది కనుక ఎలా వ్యవహరించినా, ఏం చేసినా అడిగేవారెవరూ ఉండరన్న అహంభావం అసలు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముందుగా తెలంగాణ విషయం తీసుకుంటే.. ఆ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకూ అధికారం మాదే అన్న స్థాయిలో చెలరేగిన బీజేపీ ఎన్నికల వేళ వాస్తవ స్థితి తెలుసుకుని పొత్తులకు వెంపర్లాడింది. ఒక వైపు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ తో రహస్య మైత్రి ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటూనే.. జనసేనతో మైత్రిని పొత్తుగా మలచుకుని ఎన్నికల బరిలోకి దిగింది. సరే ఆ పొత్తు, ఆ మైత్రి సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణలో ఆ పార్టీ అధికార రేసు నుంచి పూర్తిగా వెనుకబడిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పలు సర్వేలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి.  ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే...ఆ రాష్ట్రంలో బీజేపీకి కనీసం ఒక శాతం ఓటు స్టేక్ కూడా లేదు. కానీ ఆ పార్టీ అగ్రనేతలు బీఎల్ సంతోష్, జీవిఎల్ నరసింహారావు వంటి వారు మాత్రం ఏపీలో అధికారమే బీజేపీ లక్ష్యం అని గంభీరంగా ప్రకటనలు చేస్తుంటారు. వీరి తీరు ఎలా ఉంటుందంటే.. అడుగు గడప దాటదు కానీ మాటలు మాత్రం కోటలు దాటేస్తాయి అన్నట్లు ఉంటుంది.  తెలంగాణలో జనసేన పొత్తు విషయంలో ఉన్న క్లారిటీ బీజేపీలో ఏపీలో జనసేనతో మైత్రి విషయంలో ఏ మాత్రం కనిపించదు. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం ఏకపక్షంగా ఏపీలో కూడా జనసేన తమ మిత్రపక్షమే అని బల్లగుద్ది మరీ చెబుతారు. కానీ ఏపీలో ఇప్పటికే జనసేన తెలుగుదేశంతో పొత్తులో ఉందికదా అన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వరు. ఏపీలో బీజేపీని విస్మరించి మరీ తెలుగుదేశంతో జనసేన పొత్తు పెట్టుకుందనడంలో సందేహం లేదు. ఇరు పార్టీలూ ఇప్పటికే సమన్వయంతో అడుగులు వేస్తున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకూ, ఉమ్మడిగా ప్రచారానికి వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అయినా కూడా బీజేపీ జనసేన తమ మిత్రపక్షమే అని బలంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నది. దీంతో ఏపీలో రాజకీయంగా బీజేపీ అడుగులు ఎటు అన్న విషయంలో  బీజేపీకి ఒక క్లారిటీ లేదు. ఆ పార్టీ శ్రేణులే కాదు, నాయకులు కూడా ఈ విషయంలో అయోమయంలోనే ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశంతో జనసేన పొత్త కుదుర్చుకుంది కదా మీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు పొత్తులపై నిర్ణయం అధిష్ఠానానిదే అన్న ఒక్క ముక్కతో బదులిచ్చేసి రాష్ట్ర నాయకత్వం చేతులు దులిపేసుకుంటోంది.  బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఒంటరిగా పోటీ చేసినా ఏపీలో ఆ పార్టీకి దక్కేదీ, పోయేదీ కూడా ఏదీ లేదన్నది సుస్పష్టం.   అయితే ఏపీలో తమ మిత్రపక్షమైన జనసేన, టిడిపితో పొత్తు పెట్టుకొందని తెలిసి కూడా బీజేపీ రాష్ట్ర నేతలు జనసేనతో కలిసే సాగుతామని చెప్పడం వెనుక  అంటే తెలంగాణ ఎన్నికల తర్వాత జనసేన, టీడీపీ కూటమితో బీజేపీ కూడా కలిసి వెళుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   అయితే బీజేపీ హై కమాండ్ తెలుగుదేశంతో పొత్తు వద్దని భావిస్తే.. ఆ పార్టీ ముందు రెండే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి జనసేనతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని తెలుగుదేశంకు దూరం చేయడం. అది సాధ్యమయ్యే పని కాదని ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టేశారు. ఏపీతో తమ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసే ఎన్నికలకు వెడుతుందని ఇప్పటికే విస్పష్టంగా ప్రకటించేశారు. సీట్ల సద్దుబాటు, క్షేత్రస్థాయిలో సమన్వయం, ఉమ్మడి మేనిఫెస్టో వంటి వాటిపై చర్చలు సాగుతున్నాయి. అవికూడా దాదాపుగా కొలిక్కి వచ్చేశాయని తెలుగుదేశం, జనసేన నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల కేడర్ కలిసి పని చేస్తున్నాయి. తెలుగుదేశంకార్యక్రమాలలో  జనసేన జెండాలు, జనసేన కార్యక్రమాలలో తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయి. సో బీజేపీకి ఇక ఒకే ఒక ఆప్షన్ మిగిలింది. అదేమిటంటే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో పొత్తు పెట్టుకోవడం. అయితే అదీ జరిగే పనిగా కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే  బీజేపీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి జగన్   సర్కార్ అవినీతి ఆరోపణలు చేస్తూ  ఒక రకంగా యుద్ధమే చేస్తున్నారు. అధిష్ఠానం అనుమతి, ఆశీస్సులూ లేకుండా ఆమె ఈ పని చేస్తున్నారని భావించలేం.  కనుక వైసీపితో బీజేపీ పొత్తు పెట్టుకొనే  ప్రశక్తే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలాగని ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధపడే పరిస్థితి కూడా లేదు. ఒక వేళ అలా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగినా.. ఆ పార్టీకి ఉన్న ఒక శాతం కంటే తక్కువ ఓటు స్టేకుతో పోటీ చేసిన ఏ స్థానంలోనూ కూడా డిపాజిట్ దక్కించుకునే అవకాశం ఉండదు.  ఈ నేపథ్యంలోనే డిసెంబర్‌ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఏ క్షణంలోనైనా బీజేపీ అధిష్టానం ఏపీలో పొత్తులపై నిర్ధిష్ట ప్రకటన చేయడం ఖాయమే. ఆ ప్రకటన ఎలా ఉండబోతుందన్నది అందరూ ఊహించగలిగిందేనని అంటున్నారు. 

నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ నోటీసులు.. ఎందుకో తెలుసా?

దర్యాప్తు సంస్థలను తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వాడుకోవడంలో మోడీ సర్కార్  ఇసుమంతైనా వెనుకాడదు. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై అస్త్రాలుగా ఉపయోగించడం ఎంత దాకా వెళ్లిందంటే కేంద్రం కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ, ఈడీ, సీబీఐలను తన ఇష్టాను సారంగా ఉపయోగించుకుంటుంటే.. రాష్ట్రాలు తమ ప్రభుత్వ అధీనంలో ఉండే దర్యాప్తు సంస్థలను ఇష్టానుసారంగా రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు వినియోగిస్తున్నాయి. ఈ మాట ఒక సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అన్నారు. ఫామ్ హౌస్ కేసు సందర్భంగా  తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రంలోని మోడీ సర్కార్ ను ఉద్దేశించి మీకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటే.. మాకు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి అని వ్యాఖ్యానించారంటే దర్యాప్తు సంస్థల పరిస్థితి ఏలా మారిపోయిందో అర్ధమౌతుంది.  ఇక ఏపీ విషయమైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ సీఐడీ ఆ రాష్ట్రంలోని అధికార వైసీపీకి అనుబంధ సంస్థగా మారిపోయిందన్న విమర్శలను ఎదుర్కొంటున్నది. విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై స్కిల్ సహా వరుసగా ఒకదాని వెంట ఒకటిగా నమోదు చేసిన, చేస్తున్న కేసులను చూస్తే ఈ విషయం ఇట్టే అర్ధమైపోతుంది. ఇక విషయానికి వస్తే తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈడీ, సీబీఐల లక్ష్యం కేంద్రంలో మోడీ సర్కార్ ను వ్యతిరేకించే పార్టీల నేతలు, వ్యక్తులేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతన్న సంగతి తెలిసిందే. మోడీని, ఆయన ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేవారిపై ఈడీ సోదాలు, సీబీఐ దర్యాప్తులు తప్పవని సామాన్య ప్రజానీకం కూడా భావిస్తున్నారంటేనే ఆ దర్యాప్తు సంస్థల పని తీరు ఎలా ఉందన్నది అవగతమైపోతుందని పరిశీలకులు అంటున్నారు. అయిన దానికి , కాని దానికీ కూడాఈడీ కేసులు నమోదు చేస్తూ పోతోందంటున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఏదో ఒక విధంగా ఈడీ నోటీసులు జారీ చేయడమన్నది పరిపాటిగా మారిపోయింది. తాజాగా    ప్రకాష్ రాజ్ కు ఈడీ నోటీసులు అందజేసింది. ఇందుకు ఈడీ చెప్పిన కారణమేమిటంటే ఆయన మహదేవ్ యాప్ అనే ఒక  యాప్ కు ప్రచారం చేశారు. అంటే ఆయన నేరుగా ఆ యాప్ కు ప్రచారం చేయలేదు. కానీ కేరళలో ఓ చిన్న జ్యూయలరీ షాప్ కు ఒక ప్రకటన చిత్రంలో నటించారు.  అంతే  ఈడీ రంగంలోకి దిగిపోయింది. తిరుచ్చికి చెందిన ప్రణవ్ జువెలర్స్ అనే కంపెనీపై నవంబర్ 20న ఈడీ దాడులు చేసింది. ఆ  సంస్థ నుంచి లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది. దానికీ ప్రకాష్ రాజ్ కు నోటీసులకూ సంబంధం ఏమిటి అంటే.. ఆ సంస్థకు ప్రకాశ్ రాజ్ ప్రచారకర్తగా ఉన్నారు. అందుకే ఆయనను విచారణకు పిలిచినట్లు ఈడీ పేర్కొంది. సాధారణంగా ప్రతి బంగారం దుకాణం ఓ స్కీమ్ నిర్వహిస్తూ ఉంటుంది. పదకొండు నెలలు కిస్తీలు కడితే.. పన్నెండో నెల తాము యాడ్ చేసి బంగారం ఇస్తామని చెబుతూ ఉంటాయి. అలాంటి స్కీమ్ ద్వారా .. ప్రణవ్ జ్యూయలర్స్ వంద కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు. అయితే  ఆ జ్యువెల్లరీ సంస్థ ఆ విధంగా వందల కోట్లు వసూలు చేసినా.. అందులో ప్రకాష్ రాజ్ పాత్ర ఏముంటుందన్న ప్రశ్నకు మాత్రం ఈడీ సమాధానం చెప్పడం లేదు. సదరు జ్యవెల్లరీ సంస్థకు చెందిన యాడ్ లో ప్రకాష్ రాజ్ ప్రచార కర్తగా నటించి ఉంటారు. అందుకు ఎంతో కొంత సొమ్ము తీసుకుని ఉంటారు. దానికీ సదరు జ్వువెల్లరీ సంస్థ స్కీమ్ పేరుతో వసూలు చేసిన వ్యవహారానికీ ప్రకాష్ రాజ్ కు సంబంధం ఏముంటుంది?   బీజేపీని, మోదీని తీవ్రంగా విమర్శించేవారిలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. సోషల్ మీడియా ద్వారా మోడీ తీరును, విధానాలనూ ప్రకాష్ రాజ్ తూర్పారపడుతుంటారు. అందుకే ఈడీ ఆయనకు ఒక జ్యువెల్లరీ సంస్థకు ఇచ్చిన ప్రకటన నెపంతో నోటీసులు జారీ చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఆర్ధిక అవకతవకలపై సీఎం, మంత్రులకు హైకోర్టు నోటీసులు.. చరిత్రలోనే తొలిసారి!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా మరో రికార్డు బద్దలు కొట్టారు. కోర్టు వాయిదాలకు హాజరు కాకాకపోవడం, ఒక టర్మ్ మొత్తం బెయిల్ మీదనే రాష్ట్రాన్ని పాలించడంలో  ఇప్పటికే అనితర సాధ్యమైన రికార్డులు సృష్టించిన సీఎం జగన్.. ఇప్పుడు మరో  యునీక్ రికార్డు సాధించారు.  ఒక ప్రభుత్వం ఆర్ధిక అవకతవకలకు పాల్పడుతుందన్న అభియోగంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుండి నోటీసులు అందుకున్న తొలి సీఎంగా నిలవడమే ఆ రికార్డు. అయితే ఈ నోటీసులు తాను ఒక్కడే కాకుండా  ఆయన కేబినెట్ మంత్రులు కూడా అందుకోవడం కొసమెరుపు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఈ నాలుగున్నరేళల్లో ప్రజా ధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని, సీబీఐతో విచారణ జరిపి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టి ముఖ్యమంత్రి జగన్‌ , పలువురు మంత్రులు, అధికారులు  సహా మొత్తం 41 మందికి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.  రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, ఇసుక తవ్వకాలు, మద్యం అమ్మకాల మాటున తీవ్రమైన ఆర్థిక అవకతవలు జరుగుతున్నాయని చాలా కాలంగా ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలున్నాయి. ప్రతిపక్షాలు ఈ ఆరోపణలపై ఎన్నిసార్లు ప్రశ్నించినా వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారే  తప్ప  సమాధానం చెప్పింది లేదు. దీంతో సీబీఐతో విచారణ జరిపించాలని రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.  ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత ఉద్దేశంతో పిటిషన్‌ వేశారని.. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని వాదించారు. మరోవైపు పిటిషనర్ తరపు న్యాయవాది ఎందుకు విచారణ చేయాలో కోర్టుకు వివరించారు. అంతేకాదు, కోర్టులో పిటిషన్ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్ విచారణకు స్వీకరించి  41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. కేసు విచారణకు డిసెంబర్ 14కి  వాయిదా వేసింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీఎంకు, మంత్రులకు, ప్రభుత్వంలో కీలకమైన అధికారులకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు  సంచలనంగా మారింది.  ఈ నోటీసులపై  ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో  పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తొలిసారి ఇలా  పాలనపై కోర్టు నోటీసులు అందుకోవడం ఇదే తొలిసారి.  పాల‌న‌లో ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి సీఎం జ‌గ‌న్‌కే కాకుండా.. ప‌లువురు మంత్రుల‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయడం పాలనా వర్గాలలో హీట్ పుట్టిస్తున్నది.   స్కీంల పేరిట, ఇసుక, మద్యం టెండర్ల పేరిట భారీ స్థాయిలో నగదు చేతులు మారిందనే ఆరోపణలపై న్యాయస్థానాలు కలగజేసుకునే స్థాయికి  జగన్ పాలన దిగజారిందనే చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతోంది. కాగా ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత రికార్డులు ధ్వంసం చేసినట్లుగా రఘురామ తరపు లాయర్ చెప్పడం కూడా రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టిస్తోంది. ఇసుక తవ్వకాలకు సంబంధించిన రికార్డులను ఇటీవలి కాలంలో తగులబెట్టిన ఘటన వెలుగు చూసింది. దీంతో ఇప్పుడు హైకోర్టులో లాయర్ రికార్డుల ధ్వంసం ప్రస్తావనకు బలం చేకూరినట్లైంది. ఎంపీ రఘురామ ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దేశ అత్యున్నత న్యాయస్థానం సీబీఐని వివరణ కోరింది.  ఇప్పుడు ఇలా జగన్ పాలనలో అవకతవకలు చేశారని, పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోచుకుతిన్నారని పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ పై కూడా విచారణ మొదలైంది. గతంలో జగన్ అక్రమాస్తుల కేసు కూడా కాంగ్రెస్ నాయకుడు శంకర్ రావు  పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై సీబీఐ విచారణ చేపట్టి ప్రాథమిక ఆధారాలున్నాయంటూ జగన్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు రఘురామకృష్ణం రాజు కూడా అన్ని ఆధారాలతో ప్రభుత్వ అవకతవకలపై పిటిషన్ వేశారు. ఇది కూడా జగన్ మెడకి చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.  అదే జరిగితే జగన్ తో పాటు ఆయన కేబినెట్ లోని పలువురు మంత్రులకు కూడా ఇబ్బందులు తప్పవు.

తెలంగాణ ఎన్నికలు.. బీఆర్ఎస్ ను మించి వైసీపీకే ఎక్కువ టెన్షన్?!

తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో చిత్ర విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయిన ఈ తొమ్మిదేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. రాజకీయంగా ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రానికి ఎలాంటి అనుబంధం లేకపోగా.. రాజకీయ పార్టీలకు కూడా ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు ఏపీలో  కనీసం పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా లేవు. ఏపీలో వీటి ఉనికి నామమాత్రం కంటే కూడా తక్కువ అనే చెప్పాలి.  అలాగే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఎప్పుడో తెలంగాణలో తన జెండా పీకేసింది.  ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీలోనే లేదు. కానీ ఆ తెలుగుదేశం పార్టీయే ఇప్పుడు  తెలంగాణలో గెలుపు ఓటములను శాశించే పరిస్థితిలో ఉంది. అలాగే ఏపీలో తెలుగుదేశం వైసీపీకి అధికార పీఠాన్ని దూరం చేసే స్థితికి చేరింది.  దీంతో రెండు రాష్ట్రాలలో ఉన్న అధికార పార్టీలూ తెలుగుదేశం పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితిలో ఉన్నాయి.  ఆంధ్రా రాజకీయాల ప్రభావం తెలంగాణపై ఎలా ఉండబోతోందా అన్నది టీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది.  అయితే అంతకు మించి తెలంగాణలో ఫలితాలు ఎలా ఉంటాయా అని ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పార్టీ వర్రీ చెందుతోంది.     దీనికి కారణం ఈసారి తెలంగాణ ఫలితాలు  ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి అధికారం దక్కించుకుంటే ఏపీ రాజకీయాలు ఒకలా ఉండనున్నాయి.. అదే కాంగ్రెస్ అక్కడ అధికారం దక్కించుకుంటే ఇక్కడ రాజకీయాలు మరోలా ఉంటాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ మీద  ప్రభావం  చూపాయి. తెలంగాణలో గత ఎన్నికలలో ఏపీలో  అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లగా ఓటమి ఎదురైంది. దీంతో ఆ ప్రభావం ఏపీ ఎన్నికలలో  తెలుగుదేశంపై పడింది. అప్పటి టీఆర్ఎస్ కూడా ఏపీలో  అప్పటికి విపక్షంగా ఉన్న వైసీపీకి మద్దతుగా పని చేసింది.  అయితే ఈసారి తెలంగాణలో  తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది. దీంతో ఆ రాష్ట్రంలో తెలుగుదేశం శ్రేణులు పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన కూడా తెలంగాణ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నది. అయితే ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యనే ప్రధాన పోటీ కనిపిస్తున్నదన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇంకా చెప్పాలంటే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకునే అవకాశం ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి.ఒకవేళ ఆ సర్వేలే నిజమైతే ఏపీలో అధికార  వైసీపీకి చిక్కులు తప్పవనే అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. తెలంగాణ ఫలితాలతో ఏపీ కాంగ్రెస్  ఓకింత పుంజుకునే అవకాశం ఉంది.  అలాగే ఏపీ సీఎం సోదరి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణలో  ఎన్నికల బరి నుంచి తప్పుకుని కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే షర్మిల తన రాజకీయ కార్యక్షేత్రాన్ని ఏపీకి మార్చు అవకాశం ఉంది. రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ మేరకు షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే  ఏపీలో అధికార పార్టీకి తేరుకోలేని నష్టం జరుగుతుందన్నది పరిశీలకుల విశ్లేషణ.  అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంటే ఏపీ ఎన్నికలలో  తెలుగుదేశం పార్టీకి బలం చేకూరనుంది.  తెలంగాణలో  తెలగుదేశం శ్రేణులు కాంగ్రెస్ కు మద్దతిచ్చినందుకు బదులుగా  ఏపీ ఎన్నికల సమయంలో  ఆ పార్టీ  తెలుగుదేశం పార్టీకి సహకరించడం గ్యారంటీ. అలాగే కేసీఆర్ ఓటమి అంటే దాని ప్రభావం మిత్రుడైన జగన్ మీద కూడా  పడుతుంది. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. తెలంగాణను కూడా హస్తం చేజిక్కించుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి మార్గం సుగమమౌతుంది. ఇప్పటికే ఇండియా కూటమి జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగిందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు సమాధానంగా నిలుస్తుంది. అదే జరిగితే ఏపీలో జగన్ సర్కార్ కు, పార్టీకీ కూడా పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని పరిశీలకులు అంటున్నారు.  ఇవి కాకుండా పాలనా తీరును బట్టి చూసినా  తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ఏపీలో వైసీపీకి  శరాఘాతమే అవుతుంది. రైతు బంధు, రైతులకు ఉచిత విద్యుత్, ఐకెపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మిషన్ భగీరథ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో ఒకవైపు సంక్షేమం, మరోవైపు పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపనతో తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ ఏదో మేరకు పురోగతి సాధించింది.  అందుకు భిన్నంగా ఏపీలో  జగన్ సర్కార్ అరకొర సంక్షేమం పథకాలను గొప్పగా ప్రచారం చేసుకుంటూ, అభివృద్ధిని గాలికి వదిలేసింది. దీంతో ఏపీలో  వైసీపీపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని ఆ పార్టీ కార్యక్రమాలకు వస్తున్న స్పందనే నిదర్శనంగా నిలుస్తున్నది.   అదే అక్కడ బీఆర్ఎస్ గెలిస్తే అసంతృప్తి ఉన్నా అది ఓటమి స్థాయిలో లేదన్న లెక్కలో వైసీపీకి ఏదో మేరకు ఊరట లభించే అవకాశం ఉంది.  అదే అక్కడ బీఆర్ఎస్ పరాజయం  అయితే ఎంతో కొంత అభివృద్ధి చేసిన, సంక్షేమం అందించిన బీఆర్ఎస్ పైనే అంత అసంతృప్తి ఉంటే.. ఏపీ చేయని జగన్ సర్కార్ పై  ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉంటుందన్నది ఇట్లు అర్ధమైపోతుంది. ఈ కారణంతోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయంపై  ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పార్టీ తీవ్ర టెన్షన్ పడుతోంది. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంటే ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై వైసీపీకే ఎక్కువ టెన్షన్ పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

జగన్ కుర్చీలో టిక్ టాక్ స్టార్ దుర్గారావు! నెట్టింట రచ్చ చేస్తున్న వీడియో

సీఎం కార్యాలయం అంటే రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను పాలించే , కోట్లాది మంది  సమస్యలను తీర్చే ఆలయం లాంటి కార్యాలయం. అందులో సీఎం కుర్చీకి ఉండే ప్రత్యేకత  అంతా ఇంతా కాదు.  అలాంటి సీఎం కార్యాలయాన్ని జగన్ సర్కార్ సోషల్ మీడియా వీడియోల షూటింగులకు వేదికగా మార్చేసింది.   సీఎం చెయిర్  సోషల్ మీడియా నటులకు ఆసనంగా మార్చేసింది.  సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొనేందుకు వీడియోలు షూట్ చేసుకొనేందుకు సీఎం కార్యాలయం, సీఎం  చెయిర్  సెట్ ప్రాపర్టీగా మార్చేసింది.    సీఎం కార్యాలయం గౌరవం, సీఎం చెయిర్ గౌరవం ఒక టిక్ టాక్ స్టార్ తన ప్రమోషన్ కోసం వాడుకునేందుకు అప్పనంగా అప్పగించేశారు సీఎంవో అధికారులు. ప్రభుత్వం అంటే ఏమిటో, ముఖ్యమంత్రికి ఉండాల్సిన హుందాతనం ఏమిటో ఏ మాత్రం తెలియని ఏపీ ముఖ్యమంత్రి జగన్  రాష్ట్ర ప్రతిష్టను ఒక టిక్ టాక్ స్టార్ కోసం మంటగలిపేశారు.   పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొనేందుకు, సిల్లీ సిల్లీ వీడియోలు చేసుకొనేందుకు ఆరు కోట్ల ప్రజల మంచి చెడ్డలను, రాష్ట్ర ప్రగతి, ఉన్నతికి ప్రణాళికలు రూపొందించేందుకు తాను కూర్చుని పని చేయాల్సిన కూర్చుని  ఒక టిక్ టాక్ స్టార్ కు ఆసనంగా మార్చేశారు సీఎం జగన్. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాష్ట్ర ప్రజలు ప్రతిష్టాత్మకంగా భావించే సీఎం కార్యాలయంలో సోషల్ మీడియా వీడియోలను షూట్ చేసుకొనేందుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చేసింది.    తనను తాను సోషల్ మీడియా స్టార్ గా చెప్పుకొనే  దుర్గారావు అనే కమేడియన్ లాంటి వ్యక్తి   ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చొని పోజులిచ్చారు. సీఎం కుర్చీలో కూర్చొని వీడియోలు షూట్ చేసి సోషల్  సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఓ లెవెల్ లో సీఎం జగన్ ను ట్రోల్ చేస్తున్నారు.  సీఎం జగన్ కుర్చీ మరీ ఇంత చీప్ అయిపోయిందా అంటూ రాజకీయ వర్గాలలో   చర్చ జరుగుతున్నది. ముందు ముందు సీఎం ఆఫీసును సినిమా షూటింగులకు కూడా అద్దెకి ఇచ్చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు చేసే నటుడికి పోలీసులు, అధికారులు సీఎంఓలో వీడియోలు చేసుకొనేందుకు అనుమతి ఎలా ఇచ్చారన్నది సమాధానం రాని  ప్రశ్నగా మిగిలిపోయింది. ఏకంగా సోషల్ మీడియా యాక్టర్ సీఎం కుర్చీలో కూర్చొని వీడియోలు చేసుకుంటుంటే క్యాంప్ కార్యాలయం అధికారులు ఎలా  చూస్తూ ఊరుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  టిక్ టాక్ అనే యాప్ ద్వారా రకరకాల టాలెంట్ ను బయటపెట్టి చాలా మంది పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వారిలో దుర్గారావు అనే వ్యక్తి కూడా ఒకరు. దుర్గారావు తన డ్యాన్స్ లతో నెటిజన్లను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ‘పలాస’ సినిమాలో 'మీ బావగారు వచ్చేటి వేళ' అనే పాటకు తనదైన స్టైల్ లో డ్యాన్స్ వేసి  ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత టిక్ టాక్ యాప్ ను   కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. టిక్ టాక్ అయితే పోయింది కానీ.. అందులో పేరు తెచ్చుకున్న వాళ్ళు మాత్రం రకరకాల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లలో వీడియోలు చేస్తూనే ఉన్నారు. నెటిజన్లను ఆకట్టుకునేందుకు రకరకాల వేషాలు వేస్తున్నారు. అందరిలాగానే దుర్గారావు కూడా తన భార్యతో కలిసి డాన్సులు వేస్తూ వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. ఆ మధ్య అడపా దడపా కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు టీవీ షోలలో కూడా కనిపించిన దుర్గారావు..  కొన్నాళ్లపాటు హైదరాబాద్‌లోనే  ఉన్నాడు. అవకాశాలు తగ్గిపోవడంతో తన  ఇప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరిలోని తన సొంత ఊర్లోనే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ డాన్స్ వీడియోలు చేసుకుంటున్నాడు.   కానీ ఇప్పుడు హఠాత్తుగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాంపు ఆఫీసులో ప్రత్యక్షమయ్యాడు. అధికారులు ఎలా అనుమతి ఇచ్చారో కానీ.. ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీసులో, అందులోనూ సీఎం కార్యాలయంలో వీడియో చేశాడు. సీఎం కుర్చీలో కూర్చుని ఫోజులిచ్చాడు. అనుమతి ఇచ్చినందుకు పోలీసులకూ, అధికారులకూ కృతజ్ఞతలు తెలుపుతూ అక్కడే మరో వీడియో కూడా చేసి పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా నెటిజనులు సీఎం జగన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సినిమా షూటింగులకు సీఎం క్యాంప్ ఆఫీస్ అద్దెకిచ్చి రాష్ట్ర ఆదాయం పెంచుకోవాలని జగన్  జగన్ కు సలహాలిస్తున్నారు. క్యాంపు ఆఫీస్ అధికారులు షూటింగ్ చూసేందుకు జనాలకు టికెట్లు అమ్మి అనుమతులిస్తే ఆదాయం మరింత పెరుగుతుందని సూచిస్తున్నారు.  సీఎం జగన్ కూడా సోషల్ మీడియా స్టార్ కావడంతో మరో సోషల్ మీడియా నటుడిని ఎంకరేజ్ చేసేందుకు ఇలా తన ఆఫీసును అద్దెకిచ్చి ఉంటారని సెటైర్లు రువ్వుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా సీఎం అంటూ ఎద్దేవా చేస్తున్నారు.  దుర్గారావు సీఎం క్యాంప్ ఆఫీస్ ను షూటింగ్ స్పాట్ గా మార్చుకుని తీసిన  వీడియోలపై సీఎంఓ అధికారులు  సీఎం జగన్  ఎలా స్పందిస్తారో చూడాలి. 

 ప్రచారం తెలంగాణలో  మకాం ఎపిలో

బిజెపికి స్టార్ క్యాంపెయినర్ల కొరత ఏర్పడింది.  స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పక్క రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన నటి ఖష్బూ ఇటీవల మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. బిజెపి  రాష్ట్ర అధ్యక్షుడైన కిషన్ రెడ్డి కేవలం హైదరాబాద్ లో మాత్రమే ప్రచారం చేయడం క్యాడర్ కు తలనొప్పిగా మారింది. బిజెపిలో స్టార్ క్యాంపెయినర్  ప్రధాని మోదీ కావడంతో  ఈ మూడు రోజుల ప్రచారం మీద అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు.   తెలంగాణలో ప్రచారానికి ఇంకా వారం రోజులే గడువుండటంతో బీజేపీ అగ్రనాయకుల ప్రచార షెడ్యూల్ సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్​ని బీజేపీ ప్రకటించింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మొత్తం ఆరు బహిరంగ సభలు, ఒక్క రోడ్​ షోలో పాల్గోనున్నారు.  ఎన్నికల ప్రచారానికి వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలు ప్రచారం ఉధృతం చేశాయి. ప్రధాన పార్టీలు ముఖ్య నేతలతో బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ.. పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దించుతుంది. ఇప్పటికే పలు ధఫాలుగా రాష్ట్రంలో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మరోసారి తెలంగాణకు రానున్నారు. మూడు పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. కానీ ఈ మూడు రోజులు ప్రధాని ఎపిలో బస చేస్తారని సమాచారం. 

పీకేతో కేసీఆర్ మంతనాలు.. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందమేనా?

కేసీఆర్.. ఆయన మాటే శాసనం.. అవును, బీఆర్ఎస్ లో కేసీఆర్ మాటే శాసనం, కాదన్న ధిక్కార స్వరం వినిపిస్తే అలా వినిపించిన వారు ఎంతటి వారైనా... అంతే సంగతులు. వెంటనే వేటు పడుతుంది. ఎవరికైనా ఆయన సలహాలూ, ఆదేశాలూ ఇవ్వడమే కానీ, ఎదుటి వారి నుంచి స్వీకరించడం ఉండదు. అటు ఉద్యమంలో ఇటు ప్రభుత్వంలో కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్న ఈటల  రాజేందర్   ఉదంతమే అందుకు నిదర్శనం. ఒక సందర్భంలో గులాబీ జెండాకు అసలు ఓనర్లం మేమే  అంటూ బడుగుల తరపున ఆయన చేసిన ఒకే ఒక్క ప్రకటనే కేసీఆర్ ఆగ్రహానికి కారణం ఈటల ఆ ధిక్కార స్వరం వినిపించిన తరువాత  ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.  అటువంటి కేసీఆర్ ఇప్పుడు వ్యూహాల కోసం, సలహాలూ, సూచనల కోసం ఎన్నికల వ్యూహకర్త పీకేను శరణు జొచ్చారు.   ముచ్చటగా మూడో సారి కూడా అధికార అందలం అందుకోవాలని ఆశపడుతున్న కేసీఆర్ ఇప్పుడు మారిన మనిషి అంటున్నారు. తొమ్మిదేళ్ల అధికారం తరువాత ఆయనకు ఇప్పుడు తెలంగాణలో కేక్ వాక్ పరిస్థితి లేదంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, పుంజుకున్న కాంగ్రెస్, గెలుపుపై సర్వేల ద్వారా తెప్పించుకున్న నివేదికలు చేస్తున్న హెచ్చరికలు, పరిశీలకుల విశ్లేషణలు, అన్నిటికీ మించి పార్టీలో పెరుగుతున్న అసమ్మతి, కన్నెర్ర చేస్తే కారు దిగి వెళ్లిపోతున్న నేతలు ఇలా ఎటు చూసినా గతంలోలా తన మాట చెల్లుబాటయ్యే పరిస్థితి లేదన్న వాస్తవం గ్రహించిన కేసీఆర్ తన స్టైల్ మార్చుకున్నారు.   నినమొన్నటి దాకా, ముఖ్య నేతలు, మంత్రులకే  దొరకని ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్  ఇప్పడు అడగకుండానే ద్వితీయశ్రేణి, తృతీయ శ్రేణి నాయకులకు దొరికేస్తోంది. అప్పాయింట్ మెంట్ దొరకడం కాదు.. ప్రగతి భవన్ నుంచే ఆహ్వానాలు అందుతున్నాయి.  ఈ మార్పునకు  రాష్టంలో మారిన రాజకీయ పరిణామాలే ప్రధాన కారణమని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా అదే అంటున్నాయి. ఎన్నికల పబ్బం గడవగానే పరిస్థితి మళ్లీ మామూలైపోవడం ఖాయమని చెబుతున్నాయి.  కాంగ్రెస్ జోరు పెరిగి, కమలం  రేకులు రాలిపోతున్న నేపథ్యంలో కారు పార్టీ అధినేత కేసీఆర్ కు ధీమా స్థానంలో బేజారు మొదలైందని విశ్లేషిస్తున్నారు.  నిజానికి  కాంగ్రెస్ లో జోష్ పెరగడానికి  బీజేపీ, కేసీఆర్ వ్యూహం కారణంగా ఎంత వేగంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అన్న స్థాయికి ఎదిగిందో.. అంత కంటే వేగంగా యథాపూర్వ స్థితికి జారిపోవడమే కారణమని చెబుతున్నారు. బీజేపీ గ్రాఫ్ అంత అకస్మాత్తుగా పతనం కావడానికి బీజేపీ, బీఆర్ఎస్ రహస్య బంధాన్ని జనం అర్ధం చేసుకోవడమేనని అంటున్నారు.  రాష్ట్రంలో  కాంగ్రెస్ ఈ తొమ్మిదేళ్లుగా విజయాలకు మొహం వాచిపోయి ఉండడానికి కారణం క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి కార్యకర్తల బలం, ప్రజాభిమానం, ఆదరణ లేకపోవడం కాదనీ, నేతల సఖ్యత లేమి, గ్రూపు తగాదాలే కారణమని విశ్లేషకులు తొలి నుంచీ చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు అంటే టీపీసీసీ పగ్గాలు రేవంత్ చేపట్టిన తరువాత.. క్రమంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరుకు చుక్క పడింది. పార్టీ అధిష్ఠానం కూడా ప్రత్యేకంగా తెలంగాణపై దృష్టి పెట్టి.. ధిక్కార స్వరాలకు చెక్ పెట్టింది. రేవంత్ కు పరిమితంగానైనా స్వేచ్ఛ నిచ్చింది.  కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత  రెండు దఫాలుగా రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతలలో కూడా తెలంగాణలో అధికారం అందని ద్రాక్ష కాదని అర్ధమైంది. దీంతో సమష్టిగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నది.  ఈ పరిస్థితే అధికార బీఆర్ఎస్ కు ఒకింత ఆందోళన కలిగిస్తున్నది. ఇన్నాళ్లూ తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు కాంగ్రెస్ ను జనం తెలంగాణ ఇచ్చిన పార్టీగా చూడటం ఒకింత ఇబ్బందికరంగానే మారింది.  ఆ ఇబ్బందిని అధిగమించేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా మిగిలిన పార్టీల కంటే ముందుగానే అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ముందుగా ప్రకటించేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకుండానే అభ్యర్థుల జాబితా ప్రకటించి కేసీఆర్ చేసిన ప్రయోగం పెద్దగా ఫలించ లేదు. అసంతృప్తి, అసమ్మతి భగ్గుమన్నాయి. ఆ అసమ్మతి జ్వాలల తీవ్రతే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఎంత థ్రెట్ గా మారిందన్నది ఎత్తి చూపింది. ఇక అప్పటి నుంచీ కేసీఆర్ వ్యూహాలు ఒక్కటొక్కటిగా బెడిసి కొడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కేసీఆర్ అసమ్మతులకు పదవుల పందేరం చేశారనీ, ఏళ్ల తరబడి భర్తీ చేయని పదవులను కూడా యుద్ధ ప్రాతిపదికన అసమ్మతులతో భర్తీ చేసేశారనీ అంటున్నారు.  ఇన్ని చేసినా ఎన్నికల తేదీ రోజుల వ్యవధిలోకి వచ్చిసిన తరువాత కూడా కారు జోరు పెరగలేదని పార్టీ అధినేత భావిస్తున్నారనడానికి ఎన్నికల ప్రచార గడువు ముగింపు దశకు వస్తున్న తరుణంగా గతంలో తాను దగ్గరకు చేర్చి ఆ తరువాత అవసరం లేదు పొమ్మన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకేను శరణుజొచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేసీఆర్ పీకేను ప్రగతి భవన్ కు పిలిపించుకుని గంటల తరబడి చర్చించారన్న సంగతి గురురాజ్ అంజన్ ట్వీట్ తో వెలుగులోనికి వచ్చింది. ఈ  భేటీలో కేసీఆర్, పీకేలు చర్చించిన, చర్చింకున్న విషయాలు ఏమిటన్నది వెల్లడి కాకపోయినప్పటికీ ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుపు బాట పట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనే చర్చ జరిగిందని అంటున్నారు.  అయితే పీకే మాత్రం ఇప్పటికే ఆలస్యం అయ్యిందనీ, ఈ పరిస్థితుల్లో తాను చేయగలిగే సహాయం ఏమీ లేదనీ తన నిస్సహాయతను వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ మాత్రం ఈ ఐదారు రోజులలో పటిష్ట వ్యూహాన్ని అనుసరించి.. వ్యతిరేకతను అధిగమించడానికి అవసరమైన సలహాలూ, సూచనలూ ఇవ్వాలని పీకేను కోరినట్టు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే పోలింగ్ కు ముందు వరకూ బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై పీకే కేసీఆర్ వివరించినట్లు చెబుతున్నారు. పీకే వ్యూహాలంటే కొత్తగా చెప్పుకోవలసిన పనిలేదన్న సంగతి తెలిసిందే. ఇక మిగిలిన కొద్ది రోజుల ప్రచారంలో బీఆర్ఎస్ పీకే ప్రచార వ్యూహాలను అమలులో పెడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.   ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. గతేడాది పీకే సారథ్యంలోని ఐ-ప్యాక్‌ టీమ్‌తో బీఆర్ఎస్  అవగాహన కుదుర్చుకుంది. అయితే ఆ ఓప్పందం నుంచి బీఆర్ఎస్ అర్ధంతరంగా  వైదొలగింది.  కేసీఆర్‌ కంటే పీకే గొప్ప స్ట్రాటజిస్ట్ ఏమీ కాదనీ, అందుకే ఐ ప్యాక్ తో ఒప్పందాన్ని వదులుకున్నామనీ బీఆర్ఎస్ నేతలు అప్పట్లో గొప్పగా చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో కాంగ్రెస్ కోసం కూడా పీకే పని చేయడం రుచించకే కేసీఆర్ పీకేను దూరం పెట్టారని పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. ఇక ఇప్పుడు  వరుసగా పార్టీ సొంతంగా నిర్వహించుకున్న సర్వేలలోనూ, వివిధ సంస్థలు చేసిన సర్వేలలోనూ కూడా బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని తేలడంతో దింపుడు కళ్లెం ఆశగా పీకేను కేసీఆర్ ఆశ్రయించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఆఖరి నిముషంలో పీకే వ్యూహాలు ఫలిస్తాయా అంటే అనుమానమేనని అంటున్నారు.   ఇప్పటికే కేసీఆర్ నోట ఓటమి మాట రావడం, ఈ సారి గెలిపిస్తే.. ఇకపై ప్రతి నెలా మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటానంటూ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల క్యాడర్ కు వీడియో కాన్ఫరెన్స్ లో హామీ ఇవ్వడం.. ప్రజలతో గ్యాప్ వచ్చిందనీ, వారికి దూరమైన మాట వాస్తవమేననీ అంగీకరిస్తూ ఆయన క్యాడర్ తో టెలికాన్ఫరెన్స్ తో మాట్లాడిన మాటలు లీక్ కావడం చూస్తుంటే.. బీఆర్ఎస్ లో ఆల్ ఈజ్ నాట్ వెల్ పరిస్థితి ఉందన్నది అవగతమౌతోందని అంటున్నారు. 

వైసీపీ బస్సుయాత్ర తుస్సు

రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దృశ్యం. అధికార పార్టీ పట్ల జనం వైముఖ్యం. రాష్ట్రంలో అధికార వైసీపీ ఏ కార్యక్రమం చేపట్టినా జనం ముఖం చేటేస్తున్న వైనం. బెదరింపులు, బుజ్జగింపులకు సైతం లొంగని జనం. ఎక్కడ చూసినా ఆదే పునరావృతం. గడపగడపకూ అన్నా, వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ జనంలోకి వచ్చినా, చివరాఖరికి ఇప్పుడు సామాజిక బస్సు యాత్ర అంటూ వచ్చినా ప్రజలు మాత్రం మీ మాటలు వినం.. మీ హామీలను నమ్మం, మీ కార్యక్రమాలకు రాం అనే అంటున్నారు. తాజాగా ఒంగోలులో జరిగిన సామాజిక బస్సు యాత్రలోనే ఇదే దృశ్యం ఆవిష్కృతమైంది. జనం స్పందన కరవైంది. కష్టపడి, బెదరించి జనాలను తీసుకువచ్చినా.. నేతల ప్రసంగం మొదలు కాకుండానే వారు వెనుదిరిగారు. నాయకులు బతిమలాడినా ఫలితం లేకుండా పోయింది. జనాలను బలవంతంగా వాహనాలలో తరలించారు. డ్వాక్రా గ్రూపులను తీసుకువచ్చి బలప్రదర్శన చేయడానికి శతథా ప్రయత్నించిన నేతలకు నిరాశే ఎదురైంది. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే, వైసీపీలోనే రెబల్ గా ఇప్పడిప్పుడే ముద్ర పడుతున్న బాలినేని శ్రీనివాసరావు అయితే పార్టీ అధిష్ఠానానికి మరీ ముఖ్యంగా జగన్ కు తన బలం ప్రదర్శించేందుకు ఒక విధంగా బ్రహ్మ ప్రయత్నమే చేశారు. పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలను బస్సుయాత్ర సభ కోసం తరలించారు. డ్వాక్రా మహిళలు బస్సు యాత్ర కార్యక్రమానికి రావడమే కాకుండా వారి ఆధార్ కార్డుతో ఫొటో దిగి గ్రూపులో పెట్టాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. సరే ఆయన హెచ్చరికలకు భయపడో, మాజీ మంత్రి కదా అన్న మొహమాటంతోనో పెద్ద సంఖ్యలోనే జనాలు వచ్చారు. అయితే అబ్బో జనాన్ని బాగా సమీకరించగలిగామన్నఆనందం వైసీపీ నేతలకు క్షణం కూడా మిగలలేదు. ఇలా నేతల ప్రసంగాలు మొదలయ్యాయో లేదో అలా జనం వెళ్లిపోయారు. దీంతో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి పెద్ద సంఖ్యలో కుర్చీలు వేసి ఆర్భాటం చేసిన నేతలు.. చివరకు ఖాళీ కుర్చిలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పరిస్థితి ఒక్క ఒంగోలుకే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర తుస్సు మంది. జనమే కాదు, పార్టీ కార్యకర్తలు కూడా మొహం చాటేశారు.     ఎస్సీ, ఎస్టీలకు అమల్లో ఉన్న 27 పథకాలను రద్దు చేసి.. ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించిన వైసీపీ సర్కార్ మంత్రులతో   సామాజిక  అంటూ మంత్రులను పంపి బస్సుయాత్రలు నిర్వహిస్తుంటే జనం నవ్వుకుంటున్నారు.  ఒంగోలులో అయితే సొమ్ములిచ్చి మరీ తీసుకువచ్చారని చెబుతున్నారు. వేల కుర్చీలు వేసి ఆర్భాటం చేశారు. తీరా సభ ప్రారంభం అయ్యీ అవ్వకుండానే జనం వెళ్లిపోవడం ప్రారంభించడంతో కంగుతిన్న వైసీపీ నేతలు సభా ప్రాంగణం నుంచి ఎవరూ వెళ్లిపోకుండా తమదైన శైలిలో ప్రయత్నాలు చేశారు. అవీ విఫలమయ్యాయి. ఫ్లెక్సీలను చించుకుని, పడేసి మరీ దారి చేసుకుని సభ నుంచి జనం తరలి వెళ్లిపోయారు.  సభ ఆరంభం అయ్యే సమయానికి నిండుగా జనంతో కనిపించిన ప్రాంగణం.. సభ ఆరంభమైన నిముషాల వ్యవధిలోనే దాదాపు ఖాళీ అయిపోయింది.  విశాఖ దక్షిణ నియోజకవర్గంలోనూ, బనగానపల్లిలోనూ కూడా దాదాపుగా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి.  

సిరిసిల్లలో కేటీఆర్ ఎదురీత?

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ కు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో  ఎదురుగాలి వీస్తోందా? ప్రజావ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇందుకు తార్కానంగా ఆయన మంగళవారం నియోజకవర్గ పార్టీ క్యాడర్ తో మాట్లాడిన వీడియోకాల్ ను ఉదహరిస్తున్నారు. ఆ వీడియోలో కేటీఆర్ ప్రజా వ్యతిరేకత ఉందని అంగీకరించడం,  ప్రజలకు ఎన్ని పనులు చేసినా, ఎంత మంచి చేసినా ఎక్కడో కొంత అసంతృప్తి ఉంటుందని, ప్రజలకు తనకు మధ్య డైరెక్టన్ కనెక్షన్ తెగిపోయిందనే అభిప్రాయాలు కూడా జనం నుంచి నియోజకవర్గంలో వినిపిస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సొంత పార్టీ కేడర్‌లోనే చాలా మందికి తనతో యాక్సెస్ లేదనే అసంతృప్తి ఉన్నదని, ఏ సమస్య ఉన్నా తనతో చెప్పుకోవాలని కోరుకుంటున్నారని, కానీ ఇంతకాలం ఎమ్మెల్యేగా క్యాడర్ కు దగ్గర కాలేదనీ, కానీ మరో సారి అవకాశం ఇస్తే  తప్పకుండా నెలలో రెండు రోజుల పాటు సిరిసిల్లలోనే ఉంటానని,   నేరుగా అందుబాటులో ఉంటానని శ్రేణులకు హామీ ఇచ్చారు. ఇంత చేశాం, అంత చేశాం, హైదరాబాద్ కు ప్రపంచం నలుమూలల నుంచీ పెట్టుబడి దారులు వలస వచ్చేలా చేశాం. తెలంగాణ అభివృద్ధికి బాటలు వేశాం. దేశానికి రాష్గ్రాన్ని ధాన్యాగారంగా మార్చేశాం అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఎన్నికల ముందు కేడర్ తో ఇలా బేలగా మాట్లాడమే ఆయన సిరిసిల్లలో ఎదురీదుతున్నారనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక్కడ నుంచి  ప్రచారం చాలా కీలకమని, ప్రతి ఇంటినీ టచ్ చేసి వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చి వారికి భరోసా కల్పించాలని కేడర్ కు పిలుపునిచ్చారు.  కొత్త రేషను కార్డులు, పింఛన్లు.. వంటి సమస్యల పరిష్కారంపై ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలనీ కేడర్ కు కేటీఆర్ సూచించారు. సరిగ్గా ఎన్నికల వేళ  ప్రజల నమ్మకాన్ని కోల్పోయామన్న అనుమానం రావడమే ఓటమి భయాన్ని సూచిస్తున్నదని అంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో అధికార పార్టీలో ఈ సారి విజయంపై పూర్తి స్థాయి విశ్వాసం కనబడటం లేదని ఆ పార్టీ ప్రచార సరళే తేటతెల్లం చేస్తోందని అంటున్నారు. 

అమెరికాను హడలెత్తిస్తున్న లిస్టీరియా.. పండ్ల ద్వారా వ్యాప్తి!

కరోనాఈ పేరు వింటే చాలు ఇప్పటికీ ప్రపంచ దేశాల ప్రజలు వణికిపోతున్నారు. దీనిలోనే ఎన్నో వేరియంట్లు కూడా పుట్టుకొచ్చి ప్రపంచాన్ని హడలెత్తించిన సంగతి తెలిసిందే. మొత్తంగా కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలను హరించింది. ముఖ్యంగా చైనా, యూఎస్, అమెరికా లాంటి   దేశాలలో ఈ ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. కరోనా మహమ్మరి బారి నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. కానీ, అంతలోనే రకరకాల వైరస్ లు, బ్యాక్టీరియాలు   పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు ఆసుపత్రుల బాట పడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్య నిపుణులు కొత్త వైరస్ లు, బ్యాక్టీరియాలపై  హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు.  ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికాను ఇప్పుడు ఓ కొత్త వైరస్   హడలెత్తిస్తోంది. ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్లలో జీవించే ఈ వైరస్ పండ్ల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.  సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఒక ఘోరమైన లిస్టిరియా అమెరికా దేశంలో వ్యాప్తి చెందుతున్నట్లు హెచ్చరించారు. ఈ లిస్టిరియా అమెరికాలోని పలు ప్రాంతాలలో గల పంట పొలాలలో ఉత్పత్తై.. అక్కడ నుండి పండ్ల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా పీచెస్, ప్లమ్స్ వంటి పండ్ల రకాలతో ఈ లిస్టిరియా వ్యాప్తి చెందుతుందట. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దుకాణాలలో కొన్ని కంపెనీ పండ్లను తిన్న తర్వాత ఒకరు మరణించగా మరో 10 మందిఅస్పత్రి పాలయ్యారు. 10 మందిలో ఒక  గర్భిణీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 2022లో మే 1 నుండి నవంబర్ 15 వరకు, ఆ తర్వాత ఈ ఏడాది కూడా ఎవరైతే ఆ కంపెనీ పండ్లను కొనుగోలు చేశారో వారు వెంటనే వాటిని విసిరివేసిన, నిల్వ చేసిన  ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్ సహా ఆప్రాంతాలన్నిటినీ  శుభ్రం చేయాలని సూచించినట్లు సీడీసీ తెలిపింది.  ఎల్లో పీచ్ 4044, 4038, వైట్ పీచ్ 4401, ఎల్లో నెక్టరైన్ 4036, 4378, తెలుపు నెక్టరైన్ 3035, రెడ్ ప్లమ్ 4042, బ్లాక్ ప్లమ్ 4040 పండ్ల ద్వారా లిస్టిరియా వ్యాప్తి చెందినట్లు గుర్థించారు లిస్టిరియా బాధితులు ఇప్పటి వరకు కాలిఫోర్నియా, కొలరాడో, కాన్సాస్, ఇల్లినాయిస్, మిచిగాన్, ఒహియో, ఫ్లోరిడా   రాష్ట్రాల్లో ఉన్నట్లు సీడీసీ తెలిపింది. కాగా ఈ బ్యాక్టీరియా అతి తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉండగా..  వ్యాధి సోకిన వారు పూర్తిగా కోలుకునేందుకు  నాలుగు వారాల సమయం పడుతుందని తెలిపారు. కాబట్టి ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సీడీసీ తాజాగా పేర్కొంది.  ఈ లిస్టిరియా పండ్లతో కలిసి రిఫ్రిజిరేటర్‌లో జీవించడంతో పాటు ఇతర ఆహార పదార్ధాలు, వాటి ఉపరితలాలకు సులభంగా వ్యాపిస్తుందని సీడీసీ పేర్కొంది. కాగా, లిస్టిరియా అనేది అరుదైన బ్యాక్టీరియా కాగా ఇది ఆహార పదార్ధాల ద్వారా గర్భిణీలు, నవజాత శిశువులతో పాటు రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు సోకితే ప్రమాదమని సీడీసీ తెలిపింది. ఇది సోకితే లిస్టెరియోసిస్‌కు కారణమవుతుందని.. ఇది జ్వరం, కండరాల నొప్పులు, అలసటతో పాటు కొన్ని తీవ్రమైన సందర్భాల్లో సెప్సిస్ లేదా మెనింజైటిస్‌కు కారణమవుతుందని తెలిపారు. దీంతో దాదాపు 20-30% మరణాల రేటుతో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు కారణమవుతుందని తెలిపారు. సీడీసీ నివేదిక ప్రకారం, జూన్ 30, 2022న ఫ్లోరిడాలో మొదట లిస్టెరియాను గుర్తించారు.  

ఛత్తీస్ ఘడ్ భారీ నక్సల్స్ దాడి కేసు.. ఎన్ఐఏని తోసిపుచ్చిన సుప్రీం!

ఛత్తీస్ ఘడ్ లోని ఝీరమ్ లోయలో 29 మంది మృ తికి కారణమైన నక్సల్స్ దాడి ఘటనలో విస్తృత కుట్ర కోణంపై దర్యాప్తును తమకు అప్పగించేలా రాష్ట్ర పోలీసులను ఆదేశించాలని కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. ఈ అంశంలో తాము జోక్యం చేసుకోదలచుకోలేదని చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో మూడేళ్లుగా ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తు చేసేందుకు చేసిన న్యాయ పోరాటం ఫలించలేదు.  తెలుగు రాష్ట్రాలకు సరిహద్దులో ఉండే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమన్న సంగతి తెలిసిందే.  2009 నుండి ఛత్తీస్ ఘడ్ లో నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికి డజనుకు పైగా భారీ దాడులు చేసి వందల మందికి నక్సలైట్లు కారణమయ్యారు. నక్సల్స్ దాడులలో మరణించిన వారిలో  రాజకీయ నేతలతో పాటు ఆర్మీ జవాన్లు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బంది, భద్రతా సిబ్బంది, పోలీసు అధికారులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. నక్సల్స్ దాడులలో అన్నిటి కంటే దారుణమైనది 010లో దంతేవాడ  మెరుపుదాడిలో 75 మంది జవాన్లు మరణించిన ఘటన ఒకటైతే, ఆ తరువాత 2013లో ఝీరమ్ లోయలో మావోయిస్టుల దాడిలో 29 మంది చనిపోయిన  ఎవరూ మరచిపోలేవి. 2013 నాటి దాడిలో రాష్ట్ర మాజీ మంత్రి మహేంద్ర కర్మ, అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నంద్ కుమార్ పటేల్, ఆయన కుమారుడు,   సహా 29 మంది మరణించారు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల కోసం  ప్రచారం జరుగుతున్నప్పుడు బస్తర్ జిల్లాలో పరివర్తన్ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ నాయకులు తిరిగి వస్తుండగా నక్సల్స్ ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడి కేసు విచారణ అంశంపై చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థల మధ్య పోరాటం జరుగుతుంది.  ఈ కేసును ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు జరపగా.. తాజాగా రాష్ట్ర పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. నక్సల్స్ దాడి వెనక విస్తృత కుట్ర కోణం ఉందంటూ ఓ వ్యక్తి 2020లో ఫిర్యాదు చేయగా రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. దీనిపై ఎన్ఐఏ స్థానిక కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా అనుకూల తీర్పు దక్కలేదు. ఈ కేసును రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయకుండా తమకి అప్పగించాలని కోర్టులను కోరినా తోసిపుచ్చారు. ఝీరమ్ లోయలో 29 మంది మృతికి కారణమైన నక్సల్స్ దాడి ఘటనలో విస్తృత కుట్ర కోణంపై దర్యాప్తును తమకు అప్పగించేలా రాష్ట్ర పోలీసులను ఆదేశించాలని కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తొలుత ట్రయిల్ కోర్టును ఆశ్రయించింది. అక్కడ చుక్కెదురు కావడంతో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా వ్యతిరేక తీర్పు రావడంతో సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది.  ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం కూడా ఎన్ఐఏ అభ్యర్ధనను తోసిపుచ్చింది. ఈ అంశంలో తాము జోక్యం చేసుకోదలచుకోలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు పోలీస్ విచారణకు మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు.xవేదికగా  స్పందించిన భూపేష్.. సుప్రీం తీర్పు ఛత్తీస్‌గఢ్‌కు న్యాయం తలుపు తెరిచినట్లే అన్నారు. ప్రపంచ ప్రజాస్వామ్యంలో జీరామ్ ఘటనను అతిపెద్ద రాజకీయ మారణకాండగా అభివర్ణించిన ఆయన ఈ దాడిలో   సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు సహా 32 మందిని కోల్పోయామని  పేర్కొన్నారు. ఈ కేసును ఎన్‌ఐఏతో పాటు మరో కమిషన్ కూడా దర్యాప్తు చేసినా.. ఈ ఘటన వెనుక ఉన్న విస్తృత రాజకీయ కుట్రను ఎవరూ విచారించలేదని సీఎం అన్నారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులు దర్యాప్తు చేస్తుంటే ఎన్‌ఐఎ దానిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని.. ఈ రోజు అది భగ్నమవడంతో ఇక పోలీస్ దర్యాప్తునకు మార్గం సుగమమైనట్లే అన్నారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తారు. ఎవరు ఎవరితో ఏమి కుట్ర పన్నారో అంతా తేలిపోతుందని పేర్కొన్నారు.

ఆయారాం గయారాంలతో పార్టీలకే కాదు.. ప్రజలకూ కన్ఫ్యూజనే!

ఐదు రాష్ట్రాల ఎన్నికల సంరంభం ఆరంభమైపోయింది. ఛత్తీస్ గఢ్, మిజోరం, రాజస్థాన్న, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలన్నీ తమతమ అభ్యర్థులను ప్రకటించి ప్రచార యుద్ధం మొదలెట్టేశాయి. అయితే అన్ని పార్టీలనూ ఫిరాయింపుల బెడద వెన్నాడుతూనే ఉంది. నిన్నటి వరకూ ఈ పార్టీలో  ఉన్న వ్యక్తి ఇప్పుడు మరో పార్టీ అభ్యర్థిగా దర్శనమిస్తున్న వైచిత్రి దాదాపు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలోనూ నెలకొని ఉంది. పార్టీ టికెట్ రాలేదనో, కోరిన స్థానం దక్కలేదనో.. కారణం ఏదైతేనేం.. పార్టీలలో కప్పదాట్లు తారస్థాయిలో జరుగుతున్నాయి. సరే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, నోటిఫికేషన్ విడుదల, అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలు ఇవి ఎటూ తప్పవు. దీంతో అసమ్మతులను బుజ్జగించే పనికి చుక్క పెట్టి పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. కానీ తాము ఏ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నామో, ఆ వ్యక్తే నిన్న మొన్నటి వరకూ ప్రత్యర్థి పార్టీలో కీలకనేతగా ఉండి తనను విమర్శించిన సంగతిని విస్మరించలేక పలు పార్టీల నేతలు ప్రచారంలో తడబడుతున్నారు.  మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం ఈ పరిస్థితి చాలా చాలా అధికంగా ఉంది. మరీ ముఖ్యంగా జంపింగుల బెడదతో అధికార బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలకు ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంది.  అవును అన్ని పార్టీలలోనూ ఇదే పరిస్థితి. ఇలా అభ్యర్థుల ప్రకటన పూర్తయ్యిందో లేదో అలా పార్టీలలో ఫిరాయింపుల పర్వానికి తెరలేచింది.  పార్టీ సిద్ధాంతాలకు నిబద్ధులుగా ఉండే వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసే సంప్రదాయానికి పార్టీలు ఎప్పుడో తిలోదకాలిచ్చేశాయి.  కేవలం పార్టీ అగ్రనాయకత్వం ఇష్టాయిష్టాల మీద, వారి ప్రాపకం మీదా, అలాగే ఖర్చుచేయగలిగే  స్తోమత మీదా ఆధారపడి పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి.  అందుకే ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ ఇచ్చే పార్టీలోకి జంప్ చేయడానికి అన్ని పార్టీల నేతలూ రెడీగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.   ఈ కారణంగానే తెలంగాణ లో ఎన్నికలు రోజుల వ్యవధిలోకి వచ్చిన తరువాత కూడా ఫిరాయింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. పోటీకి అవకాశం లేకపోయినా.. ఎన్నికల తరువాత ఏదో విధంగా లబ్ధి చేకూర్చేలా ఒప్పందాలు కుదుర్చుకుని మరీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తున్నది.   ఇటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మేలు కాదు. ప్రజలే రాజకీయ కప్పదాట్లను అడ్డుకోవాలి. ఫిరాయింపు దారులను ఎన్నికలలో తిరస్కరించడం ద్వారానే నిబద్ధత ఉన్న రాజకీయ వాతావరణం ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు.  జనం ఫిరాయింపుదారుల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.