ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు.. ఎప్పుడంటే?
posted on Nov 24, 2023 @ 9:54AM
అధికారంలో ఉన్నామా? విపక్షంలో ఉన్నామా? అన్న ధ్యాసే లేకుండా నిత్యం రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమమే లక్ష్యం ఏడు పదుల వయస్సులోనూ యువనాయకుల కంటే ఎక్కువగా క్షేత్ర స్థాయిలో పర్యటలు చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం పై సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సైతం సిద్ధమయ్యే చంద్రబాబు దాదాపు రెండు నెలలుగా ప్రజాక్షేత్రంలో కనిపించడం లేదు. స్కిల్ కేసు పేరిట జగన్ ప్రభుత్వం చంద్రబాబును ఆయన నంద్యాల పర్యటనలో ఉండగా అరెస్టు చేయడం తదననంతర పరిణామాలు తెలిసినవే.
స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బైలు వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఆయన పై కేసుల మీద కేసులు వేస్తూ ఏదో ఒక కేసులో మళ్ళీ బాబుని అరెస్టు చేసి ప్రజా జీవితానికి దూరం చేయాలనే దుర్మార్గపు ఆలోచనతో ఉంది. జగన్ ప్రభుత్వం బాబు చుట్టూ అల్లిన కేసులను ఛేదించుకుని ప్రజల మధ్యకు రావడానికి ఆయన న్యాయపోరాటాన్నే నమ్ముకుంది. న్యాయపోరాటాలతో కేసుల నుండి ఊరట పొందిన తరువాతనే చంద్రబాబు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి రావాలని భావిస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. జగన్ సర్కార్ చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులన్నీ దూరిపింజెల్లా ఎగిరిపోవడం ఖాయమని న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు. నేడో, రేపో సుప్రీంలో క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడితే చంద్రబాబు పులు కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటపడినట్లేనని అంటున్నారు. అయితే చంద్రబాబుపై వరుసగా కేసులు బనాయిస్తూ ఆయనను ప్రజాక్షేత్రంలోకి రానీయకుండా చేయడానికి జగన్ సర్కార్ ఎందుకు తహతహలాడుతోందంటే ఆయన జనంలో ఉంటే.. ఇప్పటికే దిగజారిపోయిన జగన్ గ్రాఫ్ మరింత పాతాళానికి పడిపోతుందని అందరికంటే బాగా జగన్ కే తెలుయడమే.
ఆయన గొంతు జనానికి వినపడకుండా చేయగలిగితే.. తన సర్కార్ పై ప్రజా వ్యతిరేకత మరింత పెరగకుండా ఉంటుందన్న అభిప్రాయంతో కక్షగట్టి ఇలా చంద్రబాబుపై వరుస కేసులు నమోదు చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ చేస్తున్న ఈ కుట్ర రాజకీయాలకు తనదైన శైలిలో చెక్ పెట్టి బాబు తిరిగి తెలుగు దేశం పార్టీని, ఆ పార్టీ నేతలను ప్రభుత్వం పై యుద్దానికి సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ ప్రభుత్వం పై పోరాటానికి బాబు రంగం సిద్ధం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ లోగా క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు వెలువడుతుందనీ, కచ్చితంగా సర్వోన్నత న్యాయస్థానం తన క్వాష్ పిటిషన్ కు అనుకూలంగానే తీర్పు ఇస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారంటున్నారు.
హైకోర్టు రెగ్యులర్ బెయిలు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు స్కిల్ కేసులో ఏపీ సీఐడీ విచారణ ఎంత లోపభూయిష్టమో తేలిపోయిందనీ, సుప్రీం కోర్టులో కూడా అదే జరుగుతుందనీ పార్టీ శ్రేణులు కూడా బలంగా నమ్ముతున్నాయి. సో.. డిసెంబర్ మొదటి వారం నుంచీ చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వచ్చి జగన్ సర్కార్ అక్రమాలు, అవినీతి పాలనపై చండ్ర నిప్పులు చెరుగుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.